"పేరు మార్చుకోనా?"
అమాయకంగా తిరిగి అదేప్రశ్న వేశాడు.
"మార్చుకుందువుగాని అని చెప్పాగా, ఉదయ్ జైలు కెందుకెళ్ళాడో చెబితే నీ పేరు మార్చుకునే సంగతి నేను చూస్తాను."
పదేళ్ళబాబు చెప్పుకుపోతున్నాడు.
పరమశివం అతను చెప్పేది శ్రద్దగా వింటూ మధ్యమధ్యలో చాక్ లెట్స్ అందిస్తున్నాడు.
బాబు చెప్పేది వింటుంటే పరమశివానికి ఏడుపుతోపాటు పిచ్చి ఆవేశం పెరిగిపోతోంది.
_________________________________________________________
మనసుని ఫోటో తీయగలిగిన యంత్రాన్ని ఏ శాస్త్రజ్ఞుడూ కనిపెట్టకపోవడం ఈ వ్యవస్థ అదృష్టం.
ఆ యంత్రమేవుంటే చరిత్రలో సంస్కర్తలనిపించుకున్నవాళ్ళు సైతం నేరస్తులుగా కనీసం ఓసారన్నా దొరికిపోతారు"
_________________________________________________________
"రోజూ స్కూల్ కి వెళ్ళే టైముకి ఓ సన్నగావున్న అంకుల్ వచ్చి మీరు నిల్చున్నచోటే నించునేవాడు ఉదయ్ ని పిలిచి ఏదో మాట్లాడేవాడు."
బాబు పరమశివం ఇచే చాక్ లెట్స్ ఆత్రంగా తీసుకుని జేబులో కుక్కుకుంటూ చెప్పుకుపోతున్నాడు.
"ఆ అంకుల్ పేరేంటి?"
పరమశివం ఆత్రత పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ అడిగాడు.
"పేరు తెలియదు"
"చూస్తే గుర్తుపడతావా?"
"గుర్తుపడతాను. ఇంకెన్ని చాక్ లెట్స్ వున్నాయ్ మీ దగ్గర?"
"బోల్డున్నాయి వూఁ ఆ తరువాత?"
"ఉదయ్ ని స్కూల్ కి వెళ్ళకుండా తీసుకెళ్ళేవాడు"
"ఎక్కడికి?"
"సినిమాకి"
"సినిమాకా?"
"అవును ఎంచక్కా రోజుకు రెండు సినిమాలు చూపించేవాడట. అవునంకుల్ సినిమాలో చిరంజీవి కత్తిపెట్టి దొంగల్ని పొడుస్తాడు. ఐనా జైల్లో వేయరుగదా? మరి ఉదయ్ ని ఎందుకేశారు?"
బాబు అమాయకమైన మోములో ఆశ్చర్యం తొంగి చూసింది.
"మరి ఉదయ్ రోజూ స్కూల్ కి వెళ్ళకుండా సినిమాకి వెళితే అటెండెన్స్ రిపోర్టులో రోజూ స్కూల్ కి వచ్చినట్లు వుందేం?" బాబు తలను ఆప్యాయంగా నిమురుతూ అడిగాడు పరమశివం.
"ఉత్త అబద్ధం అంకుల్! ఉదయ్ రోజూ సాయంత్రం మామిడితోటలో మాకు సినిమా కథలు చెబుతుండేవాడు"
పరమశివానికి ఒక్కో విషయమే క్రమంగా అర్ధమవసాగింది.
"ఇంకేం చెప్పేవాడు?"
జరిగింది తెలుసుకోవాలంటే ఉదయ్ హత్యచేయటానికి ముందున్న మానసికస్థితి తెలుసుకోవాలి.
"జనాన్ని కొడితే.... అంటే ఫైటింగ్ చేయాలి! కొడితే సెకండ్ హీరో! చంపితే హీరో అవుతామని చెప్పేవాడు. సినిమాల్లో అలాగే చేస్తారట - ఉదయ్ చెప్పేవాడు"
ఆ పసిపిల్లవాడి మోములో ఆ వయస్సుకే ఏదో అర్ధంలేని కసి....ఏదో చేసి హీరో అనిపించుకోవాలనే ఆరాటం....
జాలేసింది పరమశివానికి ఆ బాబు మీద.
పసిపిల్లలు దేముళ్ళని చెప్పిన శాంతారాం సినిమాలు ఈ వ్యవస్థలో ఆడుతున్నాయ్.
పసిపిల్లల మనస్సులో విషబీజాలు నాటే చౌకబారు సినిమాలూ ఈ వ్యవస్థలో రజతోత్సవాలు జరుపుకొంటున్నాయ్.
పరమశివం నిట్టూర్చాడు.
"ఇదిగో ఇలా చూడుబాబూ! ఈ ఫోటోల్లో నీవు చెప్పిక అంకుల్ వున్నాడేమో చూసి చెప్పు" అంటూ జేబులోంచి రెండు ఫోటోలు తీసి బాబుకి చూపించాడు.
బాబు ఆ రెండు ఫోటోల్ని అటూఇటూ త్రిప్పి చూసి తల అడ్డంగా ఊపాడు లేరన్నట్లు.
విషయం కొంత అర్ధం కాగానే చేతిలోవున్న చాక్లెట్స్ అన్నీ బాబు చేతిలోపెట్టి వస్తానన్నట్లు సైగచేసి ముందుకు సాగిపోయాడు.
"నా పేరు మార్చుకోనా అంకుల్?"
వెనుకనుంచి వినిపిస్తున్న బాబు మాటల్ని పట్టించుకోనట్లు వడివడిగా అడుగులేశాడు పరమశివం.
"సరిగ్గా పదిహేను రోజులక్రితం మీ ధియేటర్ లో ఏ సినిమా ఆడింది?"
పరమశివం టూరింగ్ టాకీస్ గేట్ మేన్ ని అడిగాడు.
అతను చిరాకుగా చూశాడు.
వెంటనే పరమశివం జేబులోంచి ఎస్ బీడీ కట్టతీసి అందించాడు.
అతని మొఖం ప్రసన్నంగా మారింది.
వెంటనే ఆరునెలలనుంచి తమ థియేటర్ లో ఆడిన సినిమాల పేర్లన్నీ చెప్పేశాడు గుక్క త్రిప్పుకోకుండా.
పరమశివం అక్కడి నుంచి బయలుదేరాడు.
పరమశివం కిడ్డీబ్యాంకు బొమ్మను తదేకంగా చూస్తూ నాలుగయిదు చోట్ల తాను సేకరించిన వివరాల్ని మనసులో పొందికగా పేర్చుకుంటూ వెళుతున్నాడు.
మధుమూర్తి, పట్టాభి, పరమశివం ఒకప్పుడు వ్యాపార భాగస్వాములు.
మధుమూర్తి, పట్టాభి ఏ దారయినా సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు.
పరమశివం ఒకింత పాపభీతి, పాపపుణ్యాల లెక్కల్ని చూసుకునేవాడు.
