Previous Page Next Page 
వారధి పేజి 28


    "సరే, నీ ఇష్టం" అన్నాడు  రాఘవయ్య.

    "నా పేరు అనూరాధ. మరి నీ పేరో?" అంది రాధ  వరదరాజు తిరిగివచ్చేస్తూంటే.

    "నాపేరు రాజు....వరదరాజు" అన్నాడు  రాజు. మొదటిసారిగా  తన పేరు  సున్నితంగా  లేదన్న  ఆలోచన  రాజు మనసులోకి  వచ్చింది.

    ఎర్రయ్య  వరదరాజుని  సాగనంపి  గేటువేస్తూ "చూసేవా, మా అయ్యగారు  ఎంత మంచివారో!" అన్నాడు.

    "అవును" అన్నాడు రాజు, మరునాడు  తను ఆ ఇల్లంతా  చూడబోతున్నానన్న  ఆనందంతో.

    "రేపు  తప్పకుండా  రా. కాస్త  మంచి బట్టలు  వేసుకురా. పెద్దవారి  ఇళ్ళలోకి  ఇల్లాంటి  బట్టలతో  రాకూడదు." ఎర్రయ్య  హెచ్చరించేడు.


                          *    *    *


    వరదరాజు గదికి  చేరేసరికి, "నీకోసం ఎవరో వచ్చేరు. ఆఫీసు రూమ్ లో నీకోసం  కూర్చున్నారు" అన్నాడు దారిన  పోతున్న  విద్యార్ధి.

    తనకోసం  ఎవరు వస్తారు ? పట్నంలో  తనకి  తెలిసినవాళ్ళు  ఎవరూ  లేరు. గ్రామం నుండి ఎవరూ రాత్రిపూట  రారు. ఆ కుర్రాడు  పొరపడి వుంటాడు. లేక ఎవరో అతడితో  తప్పుగా  చెప్పివుంటారు. బహుశా ఆ వచ్చిన వ్యక్తి  కావలసినవారిని  కలుసుకొని  ఈసరికి  తిరిగి  వెళ్ళిపోయి వుంటాడు. అనవసరంగా  ఇప్పుడు  తను కాళ్ళీడ్చుకొంటూ అంతదూరం పోవడంలో  అర్ధంలేదు.

    గదికి  తాళంవేసి భోజనాల గదివైపు  నడక  సాగించేడు  వరదరాజు. చాలావరకు  భోజనాలగది  ఖాళీగానే  వుంది. రాజులాగే  ఇక్కడా  అక్కడా తిరిగి ఆలస్యంగా  వచ్చిన పది, పదిహేనుగురు మాత్రం  భోజనాల చేస్తున్నారు.

    పొట్లకాయ కూర, కాకరకాయ పచ్చడి, ఇంగువ చారు _ వంటకాలన్నీ  వరదరాజుకి  ఇష్టం లేనివే. అన్నం ముందుకి  తీసుకొని  "మజ్జిగ" అన్నాడు. బేరర్  మజ్జిగ  వడ్డించి  అప్పడం వేసేడు. అప్పడం చల్లారిపోయి  తొక్కలా  వేలాడుతున్నది. బేరరు తాత  జ్ఞాపకం  వచ్చేడు  రాజుకి. తను ఎంత వెనకగా  వచ్చినా  కరకరలాడుతున్న  అప్పడాలు  వేసేవాడు.  

    "అందరిలా  నువ్వు  అన్ని పదార్ధాలూ  తినవు. కాస్త  అప్పడం నంజుకొని  మజ్జిగన్నం  అయినా తిను" అనేవాడు.

    అతడు  వరదరాజుపట్ల  భోజన  సమయాల్లో  చూపే  ప్రత్యేక  శ్రద్ధ చూసి  బంధువో, తెలిసినవాడో  అయివుంటాడనుకొనేవారు  అక్కడ  మిగలినవాళ్ళు.

    పుల్లటి  మజ్జిగనీళ్ళతో  బిరుసుగా, మేకుల్లా  ఉన్న ఆ మెతుకులు  మింగుడుపడలేదు. ఇటూ అటూ కలిపి  రెండుముద్దలు  నోట్లో  పెట్టుకొని  ఇంక  తినలేక  లేచిపోయేడు.

    తియ్యటి  పెరుగుతో, మువ్వ వంకాయ కూరతో  ఆప్యాయంగా  దగ్గిర కూర్చుని 'మరి నాలుగు ముద్దలు తిను వరదం' అని బ్రతిమాలే  వదిన  రూపం  కళ్ళముందు  కదలాడింది. బలంగా  ఆ రూపు కళ్ళలోంచి  చెరుపుకున్నాడు. కసిగా  ఆ జ్ఞాపకాన్ని  కాళ్ల కింద  నలగకొట్టేడు.

    హాలు విడిచి  బయటికి  వచ్చేసరికి, ఆ రోజు గేటు తలుపుకి తాళం వేసి, వరదరాజుని  హడలగొట్టి  గుంజీలు తీయించిన  విద్యార్ధి  ఎదురుపడ్డాడు. ఆ పిల్లడిని ఎప్పుడు చూసినా  పులికి ఎదురుబోయే  మేకలా కంగారుపడి పక్కకి తప్పుకొంటాడు  రాజు. ఒకటి  రెండుసార్లు  అతడు  స్నేహం కలపాలని చేసిన  ప్రయత్నాలు  వరదరాజు కలిసిరాకపోవడంవల్ల  ఫలించలేదు.

    "రాజూ, మీ అన్నయ్య  నీ గది దగ్గిర  నీకోసం  వెతుకుతున్నాడు" అంటూ ఆ పిల్లడు  ముందుకి సాగిపోయేడు.

    'అన్నయ్య' అన్నమాట  వినగానే  వరదరాజు  ముఖం  ఇంతలా  విప్పారింది. ఒకే పరుగుతో  గది చేరుకున్నాడు. శివయ్య  వరండాలో నిలబడి  పక్కగది పిల్లడితో  మాట్లాడుతున్నాడు. రాజుని  చూస్తూనే  కొంచెం ముందుకు వచ్చి, "రాజూ, నీకోసం  ఆరుగంటలనించీ  చూస్తున్నాను. ఎక్కడికి  పోయేవు?" అంటూ ప్రశ్నించేడు.

    "అలా బజార్లో  తిరిగి వచ్చేను. అన్నయ్యా! అన్నాడు రాజు గది తలుపు తాళం తీస్తూ.

    లైటుస్విచ్  వేసి కుర్చీ ముందుకి  జరుపుతూ  "రా అన్నయ్యా  కూర్చో" అన్నాడు రాజు.

    మూడు నెలల క్రిందట  తను వంగమొక్కలకు పాదులు  చేస్తూంటే, పిలుస్తున్నా  పలకకుండా  తలవంచుకొని  వెళ్ళిపోయిన  తమ్ముడి రూపం కళ్ళల్లో  కదిలింది  శివయ్యకి. రాజు ఆ విధంగా ప్రవర్తించిన  కారణం ఇంటికి పోయేక  భార్యవల్ల  తెలుసుకొన్నాడు.

    మరిదిలో పౌరుషాన్ని రెచ్చగొట్టి  అతని పిరికితనాన్ని  సడలగొట్టాలనే  ఉద్దేశంతో  పరగడుపునే  పరుషంగా  అన్ని మాటలు అన్న  మీనాక్షి, పాలైనా తాగకుండా  పాచిముఖంతో  రాజు  పట్నానికి  పోతూంటే మనసులో  బాధపడింది. 'తను చేసిన పనివల్ల  విపరీత ఫలితాలు  రావు కదా?' అని భయపడింది.

    'భగవంతుడా! మంచి మనసుతో చేసిన  ఈ పనివల్ల  సత్ఫలితం కలిగించి వరదుడు జీవితంలో  కాలు నిలదొక్కుకొనేలా  చేయి  తండ్రీ' అంటూ  దేవుణ్ణి  ప్రార్ధించింది.

    "అంతగా ముద్దు చేసింది నువ్వే. ఇంతగా తూలనాడింది నువ్వే. ఈ పనితో రాజుకి  నీపై ఉన్న  అభిమానం  కరిగిపోవచ్చు. నిన్నొక  మోసకత్తెగా, నువ్వు చూపుతూండే  ప్రేమాభిమానాలు  బూటకాలుగా  తలవవచ్చు" అన్నాడు శివయ్య అంతా విని.

    "నాగురించి  వరదుడు  ఎలా అనుకొన్నా  నాకు బాధలేదు. తన శక్తిలో  వాడికి నమ్మకం కుదిరితే  చాలు. నలుగురు పిల్లల్లాగా  ప్రపంచంలో  బ్రతకగలిగితే  చాలు" అంది మీనాక్షి.

    పూర్వంలా  వరదరాజు  అన్నని చూడగానే  కళ్ళ నీళ్లు  పెట్టుకోలేదు. ఆత్రంగా  వదినగురించిన  వివరాలు  అడగలేదు. లాల్చీ విప్పి  వంకెకి తగిలిస్తూ  "ఇంట్లో  అంతా బాగున్నారా, అన్నయ్యా!" అని మాత్రం అడిగేడు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS