Previous Page Next Page 
రాగోదయం పేజి 28


    "అయిదుగురికీ వాటాలు కదా!" అన్నాడు చౌదరీ.
    "అల్లాగా!" గంభీరంగా అన్నాడు రాయుడు.
    'అప్పుడే వాటాలూ అదీ పోక్కద్దు. జరగనీ కొన్నాళ్ళు. ఎక్కడికి పోతుంది ? అదనీ ఇదనీ లాగుదాం. లోనులో నూటికి రూపాయి బ్యాంకు ఖర్చందాం. మరో రూపాయి మన ఖర్చందాం. యింకో రూపాయికి ఏదో చెబుదాం."
    "మరి రెండు రూపాయలకి ఖర్చు చూపిస్తే సరి."
    "అట్లాగే కాని"
    "ఇంతకూ వీళ్ళు రేపు డబ్బు కడతారా!"
    "సరుకమ్ముకుని, తిండి గింజలమ్ముకుని అయినా కడతారు గవర్నమెంటు బాకీ అంటే తేరగా వస్తుందనుకుంటారు అంతా. తొందరగా తీర్చకున్నా ఫర్లేదనుకుంటారు.
    "నిజమే కదా!" అన్నాడు రెడ్డి.
    "నిజమే, అయితే గవర్నమెంటు కళ్ళు తెరచిన రోజున గూళ్ళుడకోట్టి అణా పైసలతో సహా వసూలు చేస్తుంది.
    "ఆ దేప్పటి మాటోలే!"
    "జనార్ధన్ ని కాస్త మెళకువగా వుండమను. ఆ జయన్న కాలాంతకుడు."
    "ఆ వ్యవహారాలన్నీ వారిద్దరే చూడాల!"
    చౌదరి మాటలకి తలూపాడు శేషయ్య.
    తర్వాత లోకాభిరామాయణంలో పడ్డారు ముగ్గురూ!

 

                                       12


    సొసైటీ విషయాలు మాటాడటానికి జయన్న, సోము చౌదరి యింటికి వెళ్ళేరు. ఆ సమయానికి జనార్ధన్ యింట్లో లేడు. చౌదరి వరండాలో కుర్చుని తన లెక్కలు చూసుకుంటున్నాడు. ఏయే బాండ్లు కాలం తీరేందుకు వస్తున్నాయో ఏయే బాండ్లు చెల్లులు పడుతున్నాయో ఎవరెవరు ఎంతెంత యిస్తున్నారో అదంతా ఓ పెద్ద లెక్క- చిత్రగుప్తుడు లెక్క అది చౌదరికి తప్ప యితర్లకి తెలియదు.
    ఇద్దరూ నమస్కారం చేసి కూర్చున్నారు.
    "జనార్ధన్ కోసం వచ్చారా?" అడిగాడు.
    "జనార్ధన్ కోసం వచ్చారా?" అడిగాడు.
    "అవునండీ! వినయంగా జవాబు చెప్పారు.
    "అలా బయటికి వెళ్ళాడు . ఓ అరగంటలో వస్తాడు. కూర్చుని వుంటారా? మళ్ళీ వస్తారా?" తన లెక్కలు చూసుకుంటునే అడిగాడు.
    "ఉంటాంలెండి." అన్నాడు.
    "ఊ" ఎంతదాకా వసూలు అయింది?"
    "అందరూ నూటికి అరుంబావలా వంతున కట్టేరండి. ఖర్చులకు బర్తీగా మిగతా పదిరూపాయలు వసూలు చేశాం"
    "ఎంతమంది చేరినారు?" కుతూహలంగా అడిగాడు.
    "ఊరి మొత్తం మీద నాలుగొందలు ఇరవై మంది చేరినారండి."
    "మీ వాళ్ళెంతమంది?" ఆత్రుత అణుచుకుంటూ అడిగాడు.
    "తొంభై యిద్దరండీ."
    "ఫర్వాలేదు"
    జయన్న సమాధానం యివ్వలేదు.
    తన లెక్క చూసుకుంటున్న చౌదరి ఆశ్చర్యంగా "అరె!" అన్నాడు.
    వాళ్ళెం అన్లేదు.
    "ఎలా జరిగిందబ్బా!" ఆశ్చర్యమంతా నిండుకున్న ముఖంతో చూశాడు చౌదరి.
    ప్రశ్నార్ధకంగా కూడా చూళ్ళేదు వాళ్ళు. అదేమిటో వాళ్ళేమీ తెలుసుకో దలుచుకోలేదు.
    "జయన్నా! ఓ విషయం చెబుతా విను. ధర్మాధర్మాలు చూడు అంతే! నాకు న్యాయం కావాలి, చాలు. నువ్వేమనుకున్నా సరే యిది యధార్ధం. "ఏదో అలోచించి అన్నాడు.
    "ఏమిటండీ?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "నేను చాలా జాగ్రత్త మనిషిని లెక్కా డొక్కా జాగ్రత్తగా చూసుకుంటాను. అయినా పొరపాటు జరిగిపోయిందేట్టాగో! అలా అంటే నమ్మేదెవరు? అయినా యధార్ధం కళ్ళెదురుగా వుంది చూడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS