అంతకంటే క్రింది స్థాయికి దాన్ని దిగజార్చకూడదు అన్న భావం ప్రకటించింది ఆమె చర్య.
ఉసూరుమన్నాడు సారధి.
అతనికి తల్లిదండ్రులపై తొలిసారిగా కోపం వచ్చింది.
12
"వాడేం! పసివాడా! మందలించటానికి. చెట్టంత కొడుకుని పట్టుకుని ఏమనాలి? వాళ్ళకే తెలియాలి. లేదా చూసి నేర్చుకోవాలి. చిన్నా చితకా అయితే కొట్టి బుద్ధి చెప్పొచ్చు.చిన్నతనంలోనే ఒక దెబ్బ వెయ్యలేదు." అన్నాడు నారాయణ.
"కొట్టి తిట్టమన్నానా? ఈ రోజు వూరికే వుంటే రేపట్నుంచి వాడి జీతం కూడా అసలివ్వడు యింట్లో"
"పిల్లలకు అర్థం అయ్యేవరకు చెప్పడమే మన పని. మరీ కానప్పుడు చూద్దాం!"
"మీ సిద్ధాంతాలు మీవి. ఇలా అయితే యిల్లు గుల్లవుతుంది."
"ఏం చేయాలిట ?"
"రేపు నిలేసి అడగండి! వాడికి బాధ్యత లేదూ! చెల్లి పెళ్ళికుందని తెలీదూ!"
"ఛ ఛ_నా కూతురి పెళ్ళికి డబ్బు కావాలి. నెల నేలా యింతని దాస్తున్నాను. ఇప్పుడు మీరిద్దరూ ఎర్నింగ్ మెంబర్స్. మీ ఆవిడ జీతం కూడా నా చేతికివ్వాలి అని అడగనా? ఇదిగో రత్నం! అది ఆత్మహత్య కంటే హీనమే."
భార్య మాటలు చెవిన పెట్టుకోకపోగా తన మనస్సుని విప్పి చెప్పాడు నారాయణ.
భర్తవైపు అదోలా చూసిందామె.
"బావుంది మీ మాట! కొడుకుని డబ్బు అడగటం నామోషీయా! ఆత్మహత్యా సదృశమా? యిదెక్కడి విపరీతమండీ!"
"విపరీతం కాక మరేమిటి? నువ్వడిగేది కొడుకు జీతం కాదు. కోడలి జీతం. కొడుకు మనవాడైతే కోడలు మనదవుతుందా?"
"ఎందుకు కాదు ?"
"రత్నం! తెలిస్తే చెప్పొచ్చు. తెలియకపోతే చెప్పొచ్చు. తెలిసీ తెలియనట్టుగా వుండే వాళ్ళకి చెప్పటం బ్రహ్మతరం కూడా కాదు. అందులో నీలా నటించే వాళ్ళతో మరీ కష్టం." నిష్ఠూరంగా అన్నాడు నారాయణ.
"ఆహాఁ నాది నటన! మీరు ఘటన పడినందుకు అనుకోవాలి! మీవన్నీ పాలసీలు_ సిద్ధాంతాలు_ మీతో వేగటం కష్టం."
"ఇన్నేళ్ళ కాపురం తర్వాత గ్రహించావన్నమాట. భేష్!" ముఖం ఆవైపుకి త్రిప్పుకున్నాడతను.
సుబ్బరత్నం భర్త వీపుమీద చేయివేసింది. లాలనగా నిమిరింది. ఆ స్పర్శ మృదువుగా అమృతకిరణంలా వుంది. దాదాపు ముప్ఫై సంవత్సరాలు కలిసి కాపురం చేసిన అనుకూలవతి అయిన భార్య ప్రేమగా నిమిరినట్టనిపించింది. మనసు తేలిక పడింది.
ఆందోళన సమయంలో ఆత్మీయుల సాన్నిహిత్యానికి, స్పర్శకు ఆ మహిమ వుంది.
నారాయణ భార్యవైపు తిరిగాడు.
"అది కాదండీ!"
"రత్నం! ఇప్పుడు వాదించొద్దు. పద్మ పెళ్ళి విషయమై దిగులు పడొద్దు! మన స్థాయికి తగినట్టు చేస్తాం!" దృఢంగా అన్నాడతను.
ఎగతన్నుకొస్తూన్న నిట్టూర్పుని బలవంతంగా ఆపిందామె. భర్త మాటకి మారు మాట్లాడకుండా పడుకుంది.
భార్యని తాత్కాలికంగానైనా శాంతింప జేసినందుకు తృప్తి పడ్డాడు నారాయణ.
* * * *
మొత్తానికి వారుణి అసాధ్యురాలని ఆ యింట్లో నిర్లయం జరిగిపోయింది. అందరూ అదే అభిప్రాయానికి వచ్చారు.
ఆమెకి మంచో చెడో కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయి. తన అభిప్రాయాన్ని గౌరవించని వాళ్ళని ఆమెని లెక్కచేయదు. తను సంకల్పించినది చేసినదాకా నిద్రపోదు.
