Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 28

   
    "మనోవర్తికి దావాచేస్తే, వీడికి వీడి నాన్నకూ తెలిసొస్తుంది. ఏమనుకున్నారో!"

    "ఛీ!" అనుకుంది తొలిసారిగా జానకి. తల్లి నెదిరించలేక పిల్లలిద్దర్నీ గుండెల కదుముకుని నిలబడిపోయింది.


                                                                             *    *    *


    శాస్త్రిగారికి గుండెజబ్బు వచ్చిన మూడో రోజు వచ్చాడు పట్టాభి. అతను నాయకత్వం వహించిన జట్టు మూడు మాచెస్ లో గెలిచింది, అతను మూడు ఇన్నింగ్స్ లోనూ మూడు సెంచరీలు చేశాడు. అతనికి మరో మూడు ఇన్నింగ్స్ లో యాభైకి పైనే రన్సు చేశాడు. అతనికి ఎంతో ఆనందంగా గర్వంగా వుంది.

    కానీ ఇంటికి వచ్చేసరికి తమ్ముడు కులాంతర వివాహం చేసుకుని వెళ్ళటం, జానకిరాం వేరే కాపురం పెట్టటం, దాశరధి కాపురం అలా అయిపోయి, అతను పాఠశాల పెట్టుకోవటం విని అతను నిర్ఘాంతపోయాడు.

    ఈ కాస్త కాలంలో ఎన్ని మార్పులు? అనుకున్నాడు.

    ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు.

    "తను చదువుకున్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచిపేరు వుంది! అందంగానూ వుంటాడు. అయినా తనకి సరైన సంబంధాలు రాలేదని పెళ్ళి చేయటం లేదు. ఒకవిధంగా అదీ మంచిదే అయింది. అయితే తన మనస్సులో వేరే వుంది. అదెంతవరకూ ఫలిస్తుందో తనకే తెలియదు.

    తను అభిమానిస్తూ ప్రేమిస్తూ వున్న ఆ వ్యక్తి తనని ప్రేమిస్తుందో లేదో కూడా తెలీదు. తెలుసుకోవాలని చేసిన ఒకటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి.

    ఆలోచనలో వున్నా పనిమాత్రం చకచకా సాగిపోతూనే వుంది. మధ్యాహ్నం బ్యాంక్ మూసేవేళకి అతనో నిశ్చయానికొచ్చాడు. ఈ రోజు ఎలాగయినా ఆమెతో మాట్లాడాలి. తన మనస్సు విప్పి చెప్పాలి. అవునో, కాదో అనిపించుకోవాలి.

    ఆలోచనలలో వున్నా పనిమాత్రం చకచకా సాగిపోతూనే వుంది. మధ్యాహ్నం బ్యాంక్ మూసేవేళకి అతనో నిశ్చయానికొచ్చాడు. ఈరోజు ఎలాగయినా ఆమెతో మాట్లాడాలి. తన మనస్సు విప్పి చెప్పాలి. అవునో, కాదో అనిపించుకోవాలి.

    మధ్యాహ్నం రెండింటికి కౌంటర్ మూసేసి క్యాంటిన్ లోకి వెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగే సమయంలో కొలీగ్స్ అందరూ మాచెస్ లో గెలిచినందుకు అభినందనలు చెప్పారు. అందరికీ కాఫీ యిప్పించాడతను.

    "ఏనాటికైనా నేషనల్ ప్లేయర్ వి కావాలి" అని ఆశీర్వదించారు.

    మళ్ళీ సీటులోకొచ్చి కూర్చుని కేష్ బేలన్స్ ఎకౌంట్స్ టాలీ చేసుకోసాగాడు. ఎంత ప్రయత్నించినా ట్యాలీ కాలేదు. మూడువేల ఆరొందలు షార్టేజీ వస్తుంది. అతనికి చెమటలు పట్టసాగాయి.

    ఎలా జరిగింది? అని పదే పదే వెరిఫై చేయసాగాడు. చూసేకొద్దీ చిరాకు ఎక్కువైంది. మళ్లీచూస్తే ఇంకా ఎక్కువ తేడా కనిపించింది. మరోసారి చూశాడు. మళ్లీ మొదటి సంఖ్యే రూఢి అయింది. ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఏ ఎంట్రీ తప్పుగా వేసిందీ కనుక్కోలేకపోయాడు.

    ఆఖరికి అతని అవస్థ గమనించిన కొలీగ్ రాధాశ్యాం వచ్చాడు. అతనూ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనికి పట్టాభి అంటే చాలా గౌరవం.

    "ఏంటి గురూ చాలా అవస్థపడుతున్నావ్?"

    కలుస్తున్న సిగరెట్ ని విసిరేసి "ఇవి కాస్త చూడు శ్యామ్!" అన్నాడు షర్టుగుండీలు విప్పి గాలి పీల్చుకుంటూ.

    "టాలీ కావటం లేదా?"

    "ఊహూఁ"

    "ఎంత?"

    "మూడువేల ఆరొందలు"

    మరుక్షణంలో ఎకౌంట్స్ పై పడ్డాడతను.

    చకచకా రిసీట్సు పేమెంట్స్ చూడసాగాడు. అయిదు నిమిషాలు భారంగా దొర్లిపోయాయి. ఫ్యాన్ తిరుగుతున్నా గాలి వేడిగా వీస్తూనే వుంది.

    "ఇదిగో బ్రదర్! దొంగా దొరికాడు" అన్నాడు శ్యామ్.

    పట్టాభి ముఖం వికసించింది. "ట్యాలీ అయిందా! ధాంక్స్! ఎక్కడ పొరబడ్డాను"

    "పొరబాటు కాదు బ్రదర్! రాంగ్ పేమెంట్! నాలుగొందల చెక్కుకి నాలుగు వేలిచ్చావు. అందుకే టాలి కాలేదు."

    ఆ మాటవినగానే అతని ముఖం వివర్ణమైంది. మరోసారి ఆ చెక్, ఆ స్లిప్ సరిగా చూశాడు. "అవును! ఇతను రామేశ్వరి అండ్ కోలో క్లర్క్. జస్టెమినిట్. ఫోన్ చేద్దాం వుండు."

    "బ్రదర్ ఆగు! నా అనుభవం చెబుతాను విను" అన్నాడు శ్యామ్.

    ఫోన్ చేయబోయిన పట్టాభి ఆగిపోయాడు.

    "నేను నంద్యాల్లో పనిచేసే రోజులలో ఇలాగే ఓసారి ఓ ఫ్రెండ్ మూడొందలకి మూడు వేలిచ్చాడు ఓ ఆసామికి. ఆ ఆసామి శుభ్రంగా తీసికెళ్ళాడు."

    "ఏ ఆలోచనలో వుండి యిచ్చాడో?" అన్నాడు తన అనుభవం లాంటిదే అనుకుని. 

    "ఆఖరికి యిలాగే కనుక్కుని అడిగితే నాకు మూడు వేలివ్వలేదు. మూడువందలే యిచ్చావు అన్నాడు. ఎంత ప్రయత్నించినా, ఎంతవాదించినా నేరం రుజువుకాలేదు. పాపం ఆ మొత్తం మా ఫ్రెండే కట్టేశాడు."

    "ఎలా కట్టాడు అప్పటికప్పుడు?" కుతూహలంగా ప్రశ్నించాడు తనకూ ఏదైనా దారి దొరుకుతుందని...

    "అప్పటికప్పుడు యూనియన్ ఫండ్ నుంచి కొంతా, తలాకొంతా సరిచేసి ఎమౌంట్ యిచ్చేశాం. మేనేజర్ గారు బయటికి వెళ్ళకుండానే కేస్ ని మాఫ్ చేశాడు. పాపం అతనికి మాత్రం సొమ్ము చేతినుంచి పోయింది."

    పట్టాభికేం చేయటానికి పాలుపోలేదు.

    "శ్యాం ముందు ఆ కంపెనీకి ఫోన్ చేద్దాం!"

    "నీ యిష్టం!"

    బయటికెళ్ళి ఫోన్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తి ఫోన్ లో దొరికాడు. అడిగితే_ "భలేవారే సార్! కరెక్టుగా నాలుగొందలే యిచ్చారు. తమాషా చేస్తున్నారా?"

    "తమాషా కాదయ్యా! ఇప్పుడు నా ప్రాణాలమీద కొచ్చింది. ప్లీజ్! నిజం చెప్పు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS