Previous Page Next Page 
వారధి పేజి 27


    "మరేటనుకొన్నావు? మహారాజులన్నమాట" అన్నాడు గేటు కాపలావాడు  గర్వంగా.

    తను చూసిన  ఏదో సినీమాలో రాజుగారి  కోట గుర్తుకు వచ్చింది రాజుకి. ఈ మేడ  అలా లేకపోయినా  చాలా  అందంగా  వుంది. 'బాగా గొప్పవాళ్లే  అయివుంటారు  ఈ ఇంటివాళ్లు' అనుకొన్నాడు రాజు.

    కాపలాదారు  నిరాకరించినమీదట కూడా అవకాశం  కలిగినప్పుడల్లా  అటు పోవడం మానుకోలేదు  రాజు. రోజూవచ్చి కూర్చుంటున్నా  ఏదీ పాడుపనికి  ప్రయత్నించక పోవడంతో  కాపలావాడికి  రాజుపై  కలిగిన  అనుమానం నివృత్తి అయింది. తిరిగి  రాజుతో  మాటలు  మొదలుపెట్టేడు.

    "ఒకసారి  లోపలికి  రానిస్తావా?" అన్నాడు రాజు.

    "అయ్య బాబోయి! టైగరు  కొరికి  కుప్ప  పెడుతుంది."

    "టైగరేమిటి ?"

    "అదే....ఆ పెద్దకుక్క."

    "ఎవరిని  కరుస్తుంది? నిన్నా....నన్నా?"

    "నన్ను కరుస్తుందా? దానిని  ఇంత  పిల్లప్పటినుంచి  ఎరుగుదురు. కొత్తవాళ్ళకే  కండలు  ఎక్కగొడుతుంది" అన్నాడు  కాపలావాడు.

    వరదరాజు  నిరుత్సాహంగా  తల  వేలవేసేడు.

    "పోనీ, ఒక పని చెయ్యి.  అయ్యగారితో  టైగరు  షికారుకి  పోయినప్పుడు  పిలుస్తాను. అంతవరకూ  అక్కడ  కూర్చో" అన్నాడు.

    చీకటి  పడబోతుంటే  సూటూ బూటూ  వేసుకొన్న  ఒక పెద్ద  మనిషి ఒక చేతిలో  చేతికర్ర, ఇంకోచేతిలో  కుక్కగొలుసు  పట్టుకొని  బయటికి వచ్చేడు, అతడు  వీధి  మలుపు  తిరగగానే  "ఇంక  రా" అన్నాడు  కాపలావాడు.

    ఆ మసకచీకట్లో  తోట అందం అంతగా  కనిపించలేదు. 

    "ఇదిగో, ఇవన్నీ  గులాబీ  మొక్కలు, చాలా రంగులవి  వున్నాయి. మా అయ్యగారు  దేశదేశాలనించి  తెప్పించివేసేరు. ఇంట్లో  మీటవేస్తే  ఆ చిల్లుగొట్టాల్లోంచి  నీళ్లు  చిమ్ముకొంటూ  వస్తాయి.

    "ఇదిగో, ఇవన్నీ  క్రోటన్సులు, వీటికి  పువ్వులు పుయ్యవు. ఆకులే పువ్వుల్లా  రంగురంగుల్లో  వుంటాయి. ఇవి చేమంతులు, అవి కనకాంబరాలు. ఇంకా మూలన ఎన్నోరకాల  ఇంగ్లీషు పువ్వులున్నాయి. వాటి పేర్లు మా తోటమాలి అసిరిగాడికి   తెలుసు. ఆటికి  జబ్బులుచేస్తే  వాడు  మందులు వేస్తాడు కూడా.

    "మేడకి  వెనకవేపు  పళ్ళమొక్కలున్నాయి. అంటుమామిడి, సపోటా, నారింజ, దానిమ్మ...." ఆ తోటంతా  తనదే  అయినట్లు, దాని సర్వాధికారి  తనే అయినట్లు  గొప్పగా  చెప్పుకుపోతున్నాడు కాపలావాడు.

    ఒక్కసారిగా పోర్టికోలోవున్న  పెద్దలైట్లు  వెలిగింది. గేటు  వరకూ  వున్న  రోడ్డంతా  వెలుతురుతో  నిండిపోయింది. గేటుముందు  యజమాని, కుక్క  తలుపు తెరుచుకు  తిరిగివస్తున్నాడు. కాపలావాడి  ప్రాణాలు  పైపైకి లేచిపోయేయి. "ఆ మందార  మొక్క  చాటుకిపోయి  దాక్కో. అయ్యగారు లోపలికి  వెళ్ళిపోయేక  సన్నగా జారుకొందువు గాని."

    జరిగిందేమిటో  వరదరాజు  గ్రహించేసరికి  ఇంక  దాక్కొనేందుకు  వ్యవధి  మిగలలేదు.

    "ఎవరు నువ్వు?" చేతికర్ర  గాలిలో  ఊగిస్తూ  గద్దించేడు  అతడు. పక్కనే వున్న కుక్క గురగురమంది. రాజు కాళ్లు గడగడ  లాడేయి.

    "నేనాండి....నేనాండి....వరదరాజునండి. ఇక్కడ  కాలేజీలో  చదువుకొంటున్నానండి...." తడబడుతూ  సమాధానం  చెప్పేడు  వరదరాజు.

    "కాలేజీలో  చదువుకొంటూంటే....ఈ వేళప్పుడు  ఇక్కడి కెందుకు వచ్చేవు? ఏమిటా ఎర్రయ్యా, ఈ పిల్లడిని  లోపలికి  ఎందుకు  రానిచ్చేవు?"

    "చిత్తం....చిత్తం....తోట చూడాలని  వుందంటే...."

    "నిజమా" అన్నట్లు  వరదరాజు వైపు  చూసేడు  అతడు."

    "నాకు మీ మేడ, మీ తోట  అంటే చాలా ఇష్టమండి. అందుకే  రోజూ  అక్కడ  అరుగుమీద  కూర్చుని  చూస్తానండి."

    'నువ్వింతవాడివి, నీ భార్య అంత గొప్పది, నీ యిల్లూ, నీ వాహనం, నీ ఆభరణాలు చెప్ప నలవికానంత  గొప్పవి' అని పొగిడితే  దేవుడువంటి వాడే  వుప్పొంగి  వరాలిస్తాడట. అటువంటిది  షుగర్ ఫ్యాక్టరీ ప్రొప్రయిటరు, ఆ పట్నంలో  అనేక వర్తక  సంస్థలలో  వాటాదారుడు  అయిన రాఘవయ్య మాత్రం తన ఇంటినీ, తోటనీ అంతగా  మెచ్చుకొంటున్న  వాడి మీద  కోపం  తెచ్చుకోగలడా?

    "మేడా, ఇల్లూ  బాగున్నాయని  వీధిలో  కూర్చుని  జపం చేస్తే  ఏమిలాభం  అబ్బాయి, అడిగి లోపలికి వచ్చి చూసి ఆనందించాలి  కాని" అన్నాడు.

    తోటలో  మాటలు విని అంతకు పూర్వం  కారు దిగుతూండగా  వరదరాజు  చూసిన పిల్ల  బయటికి వచ్చింది.

    "నాన్నా, వాకింగ్ కి పోలేదా?" అంది తండ్రిని  సమీపిస్తూ.

    "కాస్తదూరం పోయేసరికి  నువ్వు ఏదో సినిమా  అన్నావు కదూ? ఆ మాట జ్ఞాపకం  వచ్చి తిరిగి  వచ్చేసేను. చూడమ్మా. అనూ! ఈ కుర్రాడికి  మన మేడ ఎంతో  బాగా వుందిట. కాస్త లోపల  ఇటూ అటూ  తిప్పితీసుకురా."

    "అవును, నాన్నా! ఈ కుర్రాడు  నాకు తెలుసు."

    "ఎలా తెలుసు? ఎక్కడ  కలుసుకొన్నావు?"

    "రోజూ  ఈ కుర్రాడు  ఆ పాడు ఇంటి  గుమ్మంలో  కూర్చుని  మన ఇంటివైపే  చూస్తూంటాడు. అమ్మతో  చెబితే 'ఎవరో లేవే' అంది.

    "మీరు సినిమాకి  పోవాలనుకొంటున్నారు లాగుంది. నేను  రేపు  వస్తాను లెండి."

    వెలుగులో  ఆ తోటని, ఇంటిని  తాపీగా  చూడాలన్న  కోరికతో  అలా అన్నాడు రాజు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS