Previous Page Next Page 
రాగోదయం పేజి 27


    ముఖ ముఖాలు చూసుకున్నారు.
    "ఇంకో లెక్కలు రాసే మనిషి వుండాల. సెక్రటరీ అన్నమాట. అతన్ని పూజారి తమ్ముడు శేఖర్ ని వేసుకున్నాం."
    "ఎందుకు? జయన్న రాసే వాడు కదా!"
    'అతను టీచర్! ఈ పని చెయ్యకూడదు!"
    "పోనీ జానయ్య బదులు సోముని వేసుకోండి అన్నాడు జయన్న.
    "అతని పేర ఆస్థి లేదు. ఆస్థి లేకుంటే డైరెక్టరయ్యెందుకు వీల్లేదు.'
    జయన్న జవాబు చెప్పలేదు.
    "మిగతా ముగ్గురూ ఎవరు?"
    అది ఇన్ స్పెక్టరు నడిగి చెప్తాం. నాయుడు వాళ్ళు వుండొచ్చు. వుంటే వాళ్ళని వుంచుదాం.
    "వద్దులెండి మాకు యీ సొసైటీ" చప్పున అన్నాడు జయన్న.
    "ఏం?" నివ్వెరపోతూ అడిగాడు.
    "అంతా మీ చేతుల్లో వ్యవహారం. మాకేం అందుతుంది."
    శేషయ్య చౌదరి వైపు చూశాడు.
    "ఒరే! బాగు పరుస్తామంటే మీకు రుచించినట్లు లేదు మీ యిష్టం. నువ్వొక్కడివేనా అంటున్నది. అందరూ అంటున్నారా! అయినా ఆ ముగ్గురు డైరక్టర్లు. మీరు కోరుకున్న వాళ్ళనే ఎన్నుకోండి. మా కెందుకు!"
    జయాన్న కొంచెం పక్కకి వెళ్ళాడు. అతన్ని సోము అనుసరించాడు. ఇద్దరూ గుసగుసలు పోయారు. ఆఖరికి టైలర్ సుబ్బారావు , కుమ్మరి రామయ్య, కంసాలి వీరాచారి, ముగ్గురూ డైరెక్టర్లు కావాలని చెప్పేరు.
    "సరే! అలాగే కాని!" చౌదరి సులభంగా అంగీకరించాడు.
    రాయుడు మాట్లాడలేదు.
    రెడ్డి కూడా శేషయ్య వేపు చూశాడు. తల పంకించాడు శేషయ్య.
    "ఇంకేం ! అంతా ఒప్పుకున్నట్టేనా?"
    "ఆ" అన్నాడు జయన్న.
    "అయితే యిందులో మెంబర్లుగా చేరే వాళ్ళెవరో విడిగా కూర్చోండి."
    "దాదాపు వందమంది లేచి విడిగా కూర్చున్నారు."
    "మీకక్కర్లేదా!" అడిగాడు శేషయ్య మిగతా వాళ్ళని.
    "వాళ్ళలో శానామంది మా వాళ్ళే . కొందరికే వద్దంట" అన్నాడు సోము.
    "అట్లాగే కానివ్వు. ఒరే సోమన్నా! మెంబరుగా చేరాలంటే డబ్బు కట్టాల. ఎవరేవరేంతెంత మెంబర్ షిప్పుకు కట్టాల్సింది రాసుకో. తర్వాత ఎవరెవరికి ఎంత అప్పు కావాల్సింది లిస్టు రాసుకో. నూటికి కింత అని షేర్ కాపిటల్ డబ్బు కట్టాల. అదంతా మీరే వసూలు చెయ్యాల."
    తలూపారు జయన్న, సోమన్న.
    "ఒకటి రెండు రోజుల్లో వసూలు చెయ్యాల"
    "అలాగే!"
    "రేపు పుస్తకాలు తెచ్చి తీర్మానాలు రాసుకుందాం."
    "ఏమని?"
    "ఇట్టా యిట్టా సొసైటీ ఏర్పాటయిందని , ఫలానా వాళ్ళు మెంబర్లని, డైరక్టర్లనీ, ప్రెసిడెంటనీ, సెక్రటరీ అని తీర్మానాలు రాసుకోవాలి.'
    "అల్లాగే!"
    చాలా సులభంగా కాకపోయినా అంతా సులభంగా అయిపోయినట్టనిపించింది వాళ్ళకి.
    "సరే! ఇక వెళ్ళండి"
    అంతా వెళ్ళిపోయారు.
    ఆఖరికి వాళ్ళే మిగిలారు.
    మన చేతిలోనే వుంటుందా అధికారం?" అడిగాడు రాయుడు.
    నవ్వాడు శేషయ్య. "జనార్దనే ప్రెసిడెంటు!"
    "ఏమో అంతా వాళ్ళే! రేపు దింపేయొచ్చు."
    "అంతాదాకా రానిస్తానా!" అన్నాడు రెడ్డి.
    "చౌదరికే లాభం మనకే వుంది!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS