"మా నాన్నగారికి" అనకుండా "మీ మామగారికి" అంటున్న అతని లౌక్యానికి ఆశ్చర్యపడింది.
"నన్నింతదాన్ని చేసి, చదివించి, ఉద్యోగం వేయించిన నాన్నగారే ఏనాడూ నా జీతం విషయం అడగలేదు. ఈ వూళ్ళో నేనూ మా అత్తయ్య వుంటే అవసరాలకి ఏమయినా కావాలా అని అడిగేవారు."
"అది వేరు_ఇది వేరు. అది పుట్టిల్లు, ఇతి అత్తిల్లు"
"అంటే యిక్కడ నాకు స్వాతంత్ర్యం లేదనేగా. నా భర్త, నా యిల్లు అనుకున్నాను. స్వేచ్చా స్వాతంత్రాలుంటాయనుకున్నాను."
"ఇప్పుడు నీకు పోయిందేమిటి?" రెచ్చిపోతూ అన్నాడు సారధి.
"ఆహాఁ ఏమీపోలేదు. కొత్తగా వచ్చింది మామగారి పెత్తనం, అత్తగారి అజమాయిషీ."
"చిన్నా!" అరిచాడు సారధి.
"వద్దు రధీ! అలా పిలవొద్దు. ఆప్యాయంగా పిలవాల్సిన, పిలిపించుకోవాలనుకున్న పేరుని అలా వికృతంగా అనకు. అయినా నువ్వు తప్పుచేశావేమోననిపిస్తూంది."
"ఏమిటీ ?" అడిగాడతను కోపంగా.
ప్రతి విషయాన్ని వారుణి అలా ఎనలైజ్ చేసి మాట్లాడటం అతనికి యిష్టంలేదు. ఇన్నేళ్ళ స్నేహంలో, స్నేహం ప్రేమగా మారిన యిన్నాళ్ళ పరిచయంలో అతనే నాకూ ఆమె అభిప్రాయాలకి గాయపడలేదు.
"నువ్వు ఓ మామూలు అమ్మాయిని, మీ అమ్మకి అణిగి మణిగి వుండే అప్పలమ్మని చేసుకుని వుంటే బావుండేది. మీ నాన్నగారికి బోలెడంత కట్నం వచ్చేది. మీ వదినగారికి మరో వంటలక్క తోడు వచ్చేది"
వారుణి మాటలకి సారధి మనసు చెడింది. అతని గుండెల్లో గుబులు పుట్టింది.
నిజానికి వారుణి అంత కఠినంగా మాట్లాడి వుండేది కాదు. ఆ మాటలనటానికి ఆమె చాలా బాధపడింది.
ఈ పదిహేను రోజుల్లో ఆ యింటి వాతావరణం అర్థమయ్యింది. ఇంట్లోని మనుషుల ప్రవర్తన, తన భర్తగా సారధి స్థానం, కొడుకుగా యింట్లో అతని స్థాయి ఆమె బాగా అంచనా వేసింది.
ఆమెకి యింట్లో వాళ్ళ వ్యవహారం బొత్తిగా నచ్చలేదు.
"వారుణీ!" బాధగా పిలిచాడు.
ఆ పిలుపు వినగా దెబ్బతిన్నట్లు చూసిందామె. "చిన్నా" అని తను పిలవొద్దు అన్నందుకిలా అంటున్నాడేమో అనుకుంది.
"చిన్నా !" వెంటనే సవరించుకుని అన్నాడతను. "అయాం సారీ! చిన్నా!" అన్నాడు.
అతని ముఖంలో విచారం కనిపిస్తూంది.
"ఈ పూటకి యిక ఏమీ మాట్లాడకండి. పాడైన మనసుతో ఏం మాట్లాడినా అపార్థాలే తోస్తాయి. మనసులో నాటిన మాటని సులువుగా తీసెయ్యలేం." అంది వారుణి.
"గుడ్ నైట్" అన్నాడు సారధి అటుతిరిగి పడుకుంటూ.
"గుడ్ నైట్!" అంది వారుణి దుప్పటి మీదికి లాక్కుంటూ.
విశాలంగా వున్న ఆ డబుల్ కాట్ యీ రోజు యిద్దరికీ యిరుకుగానే అనిపించింది. తొలిరోజు పాత నవ్వారు మంచంపై పడుకొని దోమల్ని, నల్లుల్నీ, ఆ కిట కిటలనీ అనుభవించిన వారుణి మరురోజే భర్తని బెస్ట్ ఫర్నీచర్స్ కి తరిమింది. ఆ డబుల్ కాట్, ఆ బెడ్స్ తెప్పించింది.
సావిత్రికి అదీ కన్నెర్రే!
అయిదు నిమిషాలకి యిటు తిరిగాడు సారధి వారుణిపై చేయి వేశాడు.
మృదువుగా ఆ చేయి తొలగించి మరికాస్త ముడుచుకు పడుకుంది ఆమె.
"రధీ! పాడైన మనసుతో నీ చెంత చేరలేను. దాంపత్యమనేది పరిమళభరితమైన పుష్పం. అది వాడిపోకుండా తాజా తాజాగా వుండేట్లు చూచుకోవాల్సిన బాధ్యత దంపతులది.
పగలల్లా పోట్లాడి సాయంకాలానికి రాజీపడిపోయి మంచం మీద ఒకటైపోవడమంటే నాకసహ్యం.
దాంపత్యం ఒక ప్రణయకళ!
పవిత్ర ఆరాధన!
