Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 27

    "ఆ మనసుని మీరు పూర్తిగా విరిచేశారుగా"

    "ఆహా! బాగా గ్రహించావు! దానికీ మానాభిమానాలున్నాయి. గౌరవం ఉంది. దాని కష్టనిష్టూరాలు చూడటానికి మేంవున్నాం. అదిరాదు. వెళ్ళు" అంది కత్తితో తెగనరికినట్లు.

    "చూడండి! నేనిప్పుడు మా తలిదండ్రులతో లేను. వేరే పాఠశాల నడుపుతున్నాను. మీ అమ్మాయిని తీసుకువెళ్ళాలని వచ్చాను" ఉబికివచ్చే కోపాన్ని దాచుకుంటూ ప్రశాంతంగా అన్నాడు.

    "అబ్బో! వేరే కాపురం పెట్టావా? ఉద్యోగానికి రిజైను చేసి వేరుబడి పెట్టావా? అలాగే ఇంకో పెళ్ళి చేసుకోలేకపోయావూ?" వ్యంగ్యంగా అందామె.

    కారం రాసిన కత్తితో తెగగోసినట్టుగా వుందతనికి. ఐనా కోపాన్ని నిగ్రహించుకున్నాడు.

    "ఒకసారి జానకిని పిలవండి. ఆమె నోటినుండి ఆ మాటవస్తే అలాగేవేరే పెళ్ళి చేసుకుంటాను"

    తన తల్లి అంతక్రూరంగా నిర్ధాక్షిణ్యంగా మాట్టాడుతున్నా, అతనంత శాంతంగా జవాబిస్తుండేసరికి లోపలున్న జానకి నిలవలేకపోయింది. మెల్లగా బయటకు వచ్చింది. భర్తని చూడగానే ఆమె గుండెల్లోని ప్రేమ ఒక్కసారిగా పొంగి వచ్చినట్లయింది.

    "జానకి!" ప్రేమగా పిలిచాడతను.

    ఠక్కున తలతిప్పి చూసింది చారుకేశి.

    కూతురు కనిపించగానే "నువ్వు బయటికి వచ్చావా? అదిగో పిల్లలూ నీవెంట వచ్చారు. వెళ్ళు! లోపలికి! నేను మాట్లాడుతున్నానుగా" అంది కోపంగా.

    "జానకీ!" ఆఖరి ఆశగా పిలిచాడు దశరధరాం.

    "అదిగో! మళ్ళీ పిలవవద్దుదాన్ని. నీకు కావలసింది విడాకులేగా? అవంతసులభంగా రావని నీకు తెలుసు. మీరు మూడేళ్ళు విడివిడిగా కాపరం చేయాలి. అలా చేయండి. అప్పుడు విడాకులు తీసుకో! మళ్ళీ పెళ్ళి చేసుకో!"

    "నేను మా అమ్మాయికి మళ్ళీ పెళ్ళిచేస్తాను."

    నిస్సహాయంగా వెనుదిరగబోయింది జానకి.

    విలవిలాడిపోయాడు దాశరధి. రెండు నిండు హృదయాలని నిర్ధాక్షిణ్యంగా విడదీస్తున్న అత్తగారిని చూస్తుంటే నమిలి మింగేయాలన్నంత కోపం వస్తోంది. అయినా అనువుగాని చోట అని అతి బలవంతాన నిగ్రహించుకున్నాడు.

    ఒక్కక్షణం ఇంటిలోకి వెళ్ళిందామె.

    అత్త వెళ్ళిన ఆ ఒక్కక్షణంలో భార్య ముఖం చూశాడు దాశరధి. ఆమె అతని ముఖం సూటిగా చూళ్ళేక తలదించుకుంది.

    "అంతేనా! అదేనా నీ నిర్ణయం! జానకీ! బాగా ఆలోచించుకో! ఈరోజు ప్రేమగా చూసిన తల్లి దండ్రులు శాశ్వతం కాదు. నీకూ పిల్లలున్నారు. వాళ్ళు పెరిగి పెద్దకావాలి. వాళ్ళని బాగా పెంచాలి. మంచి చదువు చెప్పించాలి."

    జానకి కలవరంగా చూసింది.

    "ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు! నన్ను వదిలేసినందుకు బాధకాదుకానీ తర్వాత నువ్వు అడుగడుగునా బాధపడాలి."

    జానకి సమాధానం చెప్పబోయేలోగా చారుకేశి వచ్చింది.

    "ఇదిగో స్టాంపు దీనిపై సంతకం చేసింది. నువ్వూ సంతకం చెయ్!" అని అందించింది.

    అందులో తనకీ అతనికీ సంసారం చేయటం కష్టంగా వుందని, అతను తనని శారీరకంగా హింసిస్తున్నాడనీ ఆ పరిస్థితులలో తను అతనితో సంసారిక జీవనం గడపడానికి యోగ్యంగా లేనని, తన ఆరోగ్యమే అందుకు కారణమనీ, అంచేత తను అతనితో కాపురం చేయటానికి యిష్టంలేదనీ రాసింది_

    దానికి డాక్టరు ఇచ్చిన సర్టిఫికెట్ కూడా జత పరిచింది_

    అంతా చదివి భార్యవైపు బాధగా చూశాడతను. ఆ చూపుకే శక్తివుంటే జానకి అతని పాదాలపై వాలిపోయేది!

    జానకి వంచిన తల ఎత్తలేదు. చారుకేశి వైపు చూశాడు.

    "చదివావుగా! అది జానకి ఉద్దేశ్యం. మేం బలవంతం చేసి రాయించలేదు. నువ్వు నోటీసు ఇస్తే లాయర్ తో తనే వెళ్ళి మాట్లాడి వచ్చింది. ఆయన చెప్పినట్లుగా చేసింది" అందామె.

    ఒక్కక్షణం!

    ఒక్కక్షణం ఆలోచించాడు దాశరధి.

    అతని మనస్సు నరకానికి స్వర్గానికి, సుఖానికి దుఃఖానికి, పుణ్యానికీ_ పాపానికి మధ్య రేఖ మీద నుంచున్నట్లుగా వుంది. రెండు జీవితాలు విడదీయటానికి, తమ మాట చెల్లించుకోటానికి ఇంత నాటకం ఆడాలా? ఒక పచ్చని జీవితాన్ని నాశనం చేయటానికి ఇంత నేర్పుగా వలపన్నాలా?

    ఇక భార్యా భర్తల అనుబంధానికి అర్ధమేముంది. కూతుర్ని పచ్చగా పదికాలాలపాటు కాపురం చేసుకోమని దీవించాల్సిన తల్లే పగబట్టినట్లుగా కక్ష సాధిస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంటే ఇక దిక్కెవరు?

    భార్య తనవైపు దీనంగా చూసి, ఒక్కమాట అయినా మాటాడితే ఆమె మనసు ఏమాత్రం తెలిసినా అతనా కాగితాలు చించేసి అత్తను చితగ్గొట్టేసి అయినా తన పిల్లల్ని భార్యను తీసికెళ్ళాలనుకున్నాడు. కానీ జానకి భూదేవిలా నిగ్రహంగా నిలబడింది.

    "జానకీ"

    "జానకీ లేదు జనకుడు లేడు. బుద్ధిగా కాగితాలపై సంతకం చేసి వెళ్ళిపో" కఠినంగా అందామె.

    సంతకం పెట్టేసి స్టాంపు కాగితాలు విసిరి భార్యముఖాన కొట్టేసి చకచక వెళ్ళిపోయాడు దాశరధి. వెనక నుంచి పిల్లలు బిక్క ముఖాలు వేసుకుని చూస్తూ వుండటం అతని హృదయాన్ని చీల్చేస్తోంది.

    "ఆమెకి అక్కర్లేని కాపురం తనకేనా కావలసింది? ఇద్దరూ కావాలనుకుంటే సంసారం! లేకపోతే నరకమే! కోరి, క్రొఇ ఆ నరకాన్నే ఎందుకు వరించడం? ఆ భార్య లేకపోతే బ్రతకలేడా?" అతని మనసంతా విషాదమయమైపోయింది.

    విషపునవ్వు నవ్వింది చారుకేశి. జానకి విషదగ్ధలా నిలుచుంది. పిల్లలిద్దరూ తల్లిని చెరోపక్క కుదిపేస్తున్నారు.

    "అమ్మా" నాన్న వెళ్ళిపోతున్నారు పిలు. నేనూ నాన్నతో వెళతా" అంటూ మారాం చేస్తున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS