Previous Page Next Page 
వారధి పేజి 26


    గ్రామం నుంచి  తిరిగివచ్చిన  మొదటిరోజుల్లో  తీరికగా  ఉండే సాయంసమయాల్లో ఏటిగట్టుకిపోయి  కూర్చునేవాడు  వరదరాజు. ఏటికి  ఆవలిగట్టున  ఉన్న గ్రామాన్ని, అందులోని  మిద్దెయింటి  వసారాలో  పూర్ణకి  కబుర్లు చెబుతూ  అన్నం తినిపిస్తున్న  వదిన్ని  ఊహించు కొనేవాడు. వదిన  తనని అంత అభిమానంగా  చూసినరోజులు  గుర్తుకు  తెచ్చుకొనేవాడు. వదిన  ఇలా ఎందుకు  మారిపోయింది! రాత్రి, పగలు  వరదరాజు  కళ్ళముందు  నిలిచి  వేధిస్తూండేది  ఆ ప్రశ్న.

    దానికి జవాబు చెప్పుకోగల  శక్తి వరదరాజు దగ్గిర లేదు. అందువల్లనే  దానిని  మరిచిపోవాలనుకొన్నాడు. 'వదిన మారిపోతే నేనూ మారిపోగలను. ఆమెని గూర్చి  ఆలోచించవలసిన  అవసరం నాకు లేదు.' ఆ నిర్ణయానికి వచ్చిన తరవాత  ఏటివొడ్డుకి  పోవడం  మానుకొన్నాడు  రాజు.

    ఏటిగట్టు  తప్పితే  వరదరాజు  సాయంకాలాలు  గడిపే  ప్రదేశం ఇంకొకటి ఉంది. ఆది జీవితంలో  ఏదో తమ  సాధించాలనే  కోర్కెని  రేపిన మేడ. క్రమం తప్పకుండా  రోజూ  అక్కడికి  పోయేవాడు. గంటో, రెండు గంటలో _ అవకాశాన్నిబట్టి _ ఎదురింటి  గడపలో  కూర్చుని  ఆ మేడ చూసేవాడు.

    ఇప్పుడు మేడ చూస్తుంటే  వరదరాజుకి  ముందులాంటి  ఆలోచనలు రావడం మానివేసేయి. అందమైన ఆ మేడలో  ఎక్కువగా  తను మసలుతున్నట్లే  ఊహించు కొనేవాడు. వదినకోసం అంత మంచి గది కట్టనక్కరలేదు. ఆ వెనకగా  వున్న ఇంటిలో  ఏదో గదిలో ఉంటుంది. పూర్ణకు మాత్రం మరికాస్త  అందంగానే గదిని  అలంకరించాలి. పూర్ణ తనలా  హాస్టల్లో ఉండి చదువుకోనక్కరలేదు. చిన్నాన్న  ఇంటిలో  ఉండి  చదువుకొంటుంది. పూర్ణకి  చిన్నాన్న అంటే ఎంతో ఇష్టం. నాన్న  పిప్పెరమెంట్లు  ఇస్తే చిన్నాన్నకి  వంతు  పెడుతుంది. అమ్మ  కసిరితే  చిన్నాన్నని  ఊరుకో  పెట్టమంటూ  దగ్గిరికి  వస్తుంది.

    అందుకే  పూర్ణ అంటే  తనకి కూడా  చాలా ఇష్టం. తను  వదినకోసం చదువుకోవడం లేదు. పూర్ణకోసం  చదువుతున్నాడు. తను ఉద్యోగంచేసి  పూర్ణని  చదివించాలి. ఇంకా  పెళ్ళి చేయాలి.

    ప్రతిరోజూ  ఇవే ఆలోచనలు  మరికొంచెం  వన్నెలు, చిన్నెలు దిద్దుకొని  వరదరాజు  మనసులో  తిరుగుతూండేవి. ఆ రోజు  రాజు  తన ఆలోచనలమధ్య  ఉండగానే  కనుచీకటి  పడింది. మేడలోని  ఎలెక్ట్రిక్ దీపాలు  గుత్తులు  గుత్తులుగా  అందంగా  వెలుగుతున్నాయి. గేటుముందు లైటుకూడా వెలగడంతో  తోట బాగా కన్పిస్తున్నది. ఈ దీపాలముందు  ఈ మేడా, తోటా  ఎంత బాగున్నాయనుకున్నాడు  రాజు. మరి కాస్తసేపు  అక్కడే  కూర్చుని  అతడు కదలబోతూంటే  గేటు  కాపలావాడు  ముందుకి వచ్చేడు.

    "ఏయ్....అబ్బాయి?" అంటూ పిలిచేడు.

    'ఏమిటి? ఎందుకు?' అన్నట్లు చూసేడు  రాజు.

    "నీ పేరేమిటి? రోజూ  ఆ ఇంటి  గడపలో  ఎందుకలా  కూర్చుంటావు ?

    "నా పేరు  వరదరాజు. నేనిక్కడ  కూర్చుంటే  నీకేమయినా  చికాకుగా ఉందా?"

    "నాకేం  చికాకులేదు. వేళాపాళా  లేకుండా  అలా కూర్చుంటే  నీకే చికాకు  చేస్తుందని  చెబుతున్నాను. ఆ ఇంట్లో  దెయ్యం  ఉంది. తెలుసా ?"

    "దెయ్యమా? ఎక్కడ?" వీథి  వరండాలో  వేలాడుతున్న  బూజుల్లోకి  భయంగా  చూసేడు.

    "అవును. దెయ్యమే. ఈ ఇంటికోడలు  కాలిపోయి  చచ్చిపోయింది. దెయ్యమై  ఈ ఇంటిని  పట్టుకొంది. అందుకే  ఎవరూ  ఈ ఇంట్లో  అద్దెకి ఉండేందుకు  రావడంలేదు."

    "దెయ్యాలంటే  నాకేం భయంలేదు. మా ఊరిలో  చింత తోటలో  చాలా దెయ్యాలు   ఉన్నాయంటారు. నేను  ఒక్కడినే  చింత  దొప్పలకోసం  అక్కడికి  వెళ్లేవాడిని."

    "ఏమో, మీ ఊరి  దెయ్యాలు  ఎటువంటివో  కాని, పట్నంలోని  దెయ్యాలు  చాలా అల్లరి చేస్తాయి."

    ఒకసారి  దెయ్యమంటే  తనకి  భయంలేదని  గొప్పలు  చెప్పి  ఇంక అప్పుడు  జడుసుకొనడం  వల్ల  ప్రయోజనం లేదని  తెలుసుకొన్నాడు.

    "రానీ, మీ పట్నం  దెయ్యాలు  ఏం చేస్తాయో నేను చూస్తాను" అన్నాడు పళ్ళ బిగువుతో.

    "ఇంతకీ  నువ్వు ఇక్కడ  ఎందుకు  కూర్చుంటున్నావు? నీకు ఇల్లూ వాకిలీ లేదా?"

    మొదట్లో  కాపలావాడితో  తన గురించి  ఏమీ చెప్ప  కూడదనుకొన్నాడు  రాజు. కాని వాడితో  స్నేహంచేస్తే  ఒకసారి  లోపలికి  వెళ్ళనిస్తాడేమో  అన్న  ఆశతో  తన గురించి  చెప్పేడు.

    "ఏటికి  అవతలి  ఒడ్డునవున్న  ఊరే  మాది. అక్కడ  మాకు భూములు, ఇల్లు వున్నాయి. అన్న, వదిన, ఇంకా పూర్ణ  వున్నారు. నేను ఇక్కడ హాస్టల్లో  వుంటూ  కాలేజీలో  చదువుకొంటున్నాను."

    "కాలేజీలో  చదువుకొంటుంటే  సాయంకాలంపూట  హాయిగా  బంతి ఆటలూ అవీ ఆడుకోక  ఇక్కడ  కూచుంటావేం?" అంటూ ప్రశ్నించేడు  కాపలావాడు.

    "ఏమీలేదు, ఊరికేనే" అన్నాడు  వరదరాజు.

    ఆ సమాధానంతో  అంతవరకూ   స్నేహంగా  మాట్లాడుతున్న  కాపలావాడికి  ఆ పిల్లడిమీద  ఏదో అనుమానం  రేగింది. కన్ను  చాటయితే  లోపలికి  దూరి పువ్వో, కాయో కాజెయ్యాలని  చూస్తున్నాడేమో  అనిపించింది.

    "ఎల్లెళ్లు ! మా అయ్యగారు  చూస్తే  కేకలేత్తారు" అన్నాడు.

    "మీ అయ్యగారు  ఎవరేమిటి? ఈ ఇల్లుకూడా  వారిదేనా!"

    "నీ....ఈ పాడుకొంప  ఆరికెందుకు ? ఇంకా ఈ పట్నంలో  మేడలు, మిల్లులు, బట్టలకొట్లు  సాలా  వున్నాయి మా అయ్యగారికి."

    "చాలా గొప్పవారన్నమాట."   
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS