Previous Page Next Page 
రాగోదయం పేజి 26


    వేకువన లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా రెక్కలు ముక్కలు చేసుకుంటూ తిండి, శారీరక సుఖం తప్ప మరో సుఖం ఎరుగని జనం వాళ్ళు. అడపా దడపా సారా దుకాణం వేపు వెళ్ళే వాళ్ళయినా ఆ పెత్తందార్ల చేతి కీలు బొమ్మలే!
    ఆ రోజు సాయంకాలం వూళ్ళో వున్న మగవాళ్ళంతా రచ్చబండ దగ్గర గుమిగూడారు. అయితే అసరికి వూళ్ళో వాళ్ళ ఆసాముల ద్వారా విషయం తెలిసిపోయింది.
    పల్లెల్లో ప్రతి కాపు యింటికీ యింటి చాకలి అని, యింటి మంగలి అనీ, యింటి వండ్రంగి అనీ, యింటి మాల, మాదిగ అని వుంటారు. తరతరాలుగా వాళ్ళు బట్టలు ఉతుకుతూ, వ్యవసాయ పనిముట్లు చేస్తూ పొలం పనిముట్లు చేస్తూ ఆశ్రయించుకుని బ్రతుకుతూ వుంటారు.
    పైగా వాళ్ళు మా అయ్యగారూ, మా రెడ్డిగారూ అని అభిమాన పడుతూ వుంటారు. అందులో వీసమయినా వీళ్ళు ప్రతికృతిగా అభిమానించరు. వీళ్ళు చూపే అభిమానమంతా చిరిగిన బట్టలు యివ్వటంలో మిగిలిన కూరా నారా పెట్టడంలో మాత్రమే.
    అయినా తాము దోపిడీకి గురతున్నామని భావించరు వాళ్ళు. అసలా వూహే రాదు వాళ్ళకి. వాళ్ళు అదృష్టవంతులు, పెట్టి పుట్టిన వాళ్ళు, మనం దరిద్రులం. మనం కష్టపడాలి, వాళ్ళు సుఖ పడాల . అంతే! అనుకుంటారు. అదీ వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ వేదాంతం.
    గుమిగూడిన ప్రజల్ని గురించి వుపన్యసించేడు శేషయ్య. ఆ మనవూళ్ళో చాలామంది బీద ప్రజలు, కండ సుఖం తప్ప తిండి సుఖం లేని వాళ్ళు. మీకూ పొలాలు, వున్నాయి స్వంతానికో, కమతానికో బంజరు భూములో! అయితే వాటికి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకునేందుకు మీకు డబ్బు లేదు. వూళ్ళో ఆసాములని అప్పడగాలి.
    అప్పంటే వూరికే యివ్వరు కదా! వడ్డీ యివ్వాలి. వడ్డీ ముందు వడిగల గుర్రం పరిగెత్త లేదని సామెత. బాగా పండి మంచి ధర పలికితేనే మీరు అప్పు తీరుస్తారు, లేదా అంతే సంగతులు. అసలుకు వడ్డీకి కలిపి నోటు రాసేస్తారు. అది పెరుగుతూనే వుంటుంది పావలా.
    ఇది తప్పే మార్గమేమిటి?
    గవర్నమెంటు వాళ్ళు బాగా అలోచించి దీనికో పధకం పెట్టేరు. చిన్న కారు రైతులు, పేదవాళ్ళు అంతా కలిసి ఓ సంఘం లాగా ఏర్పడితే మీకు గవర్నమెంటు అప్పు యిస్తుంది. చాలా తక్కువ వడ్డీ. సంవత్సరానికోసారి వడ్డీ అసలు కట్టేస్తూ వుండాలి."
    "ఏమంటారు!" అడిగాడు నాయుడు.
    "మీ యిష్టం దొరా!" అన్నాడు ఎసయ్య.
    "ఏరా!" అడిగాడు చౌదరి.
    'నువ్ చేస్తే కాదంటామా?" అన్నాడు జానీమియ్యా.
    "నువ్వేమంటావ్!" అడిగాడు రెడ్డి.
    తలూపేడు జానయ్య.
    అలా అలా అందర్నీ విచారించాడు. డబ్బంటే అందరికీ ఆశ కదా!
    "సరే!" అంతా ఒప్పుకున్నట్టేనా?"
    శేషయ్య ప్రశ్నకి కొన్ని కంఠాలు ఊ కొట్టాయి. కొన్ని తలలూగేయి!
    "మరి దీనికి డైరెక్టర్లని కొందరుంటారు. వాళ్ళు మీ వాళ్ళే వుండాలట. జానయ్యా, రహంతుల్లా, రామన్న, రంగన్న, మీరు నలుగురూ డైరెక్టర్లూ, ఒక అడ డైరెక్టరు వుండాలి ఆమె భార్గవి, మిగతా నలుగురూ ......"
    "వాళ్ళెవరు!" అడిగాడు సోము.
    "నువ్వు చెప్పు?"
    "వాళ్ళనీ మా వాళ్ళనే వేసుకుందాం"
    "ఒరే! సోముగా! అది కుదర్దురా! దీనికి వ్యవహారం చాలా వుంటుంది. గవర్నమెంట్ పనికదా బాగా తిరగాల. అందుకని చౌదరి తమ్ముడు జనార్ధన్ ని ఓ డైరెక్టర్ని చేశాం. అతనే ప్రెసిడెంట్."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS