వెయ్యిరూపాయలు ఒక ఆటలో పోయిన షాక్ అతన్ని వదల్లేదు. నిజానికి నగదుగా పోయిన మూడొందలూ తప్ప మిగతాది తీర్చనక్కరలేదు. ఆటల్లో చెల్లువేస్తారు. కానీ నష్టం నష్టమే.
ఆ కోపంలో వున్నాడతను. ఇంటికి వస్తూనే కనిపించిన భార్య ధోరణి అగ్నికి ఆజ్యంలా తయారైంది. సావిత్రి యిదేమీ గమనించలేదు. తన ధోరణి తనదే.
"నేనూ అంతో యింతో చదువుకున్నాను. నన్ను మీరైనా మరికాస్త చదివించి వుంటే చదువుకోకపోయే దాన్నా? ఉద్యోగం చేయలేకపోయేదాన్నా?
కన్నవాళ్లూ, కట్టుకున్నవాళ్ళూ యిద్దరూ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇలాగే అవుతుంది. ఇంట్లో అందరూ నన్ను దాసీ దానిలా చూసేవరకు వచ్చింది. ఇలా అయితే నేను పడను. నాకేం ఖర్మ ?"
చిర్రున ముక్కు చీదింది.
"ఏమిటీ సొద? అన్నాడు ఫణి చిరాగ్గా.
"ఇది సొదా? కట్టుకున్న భార్య గోడు భర్తకి కాక గోడకి చెప్పుకుంటుందా? అది సొదలా వుందా మీకు? అవున్లెండి. నేను అందరికీ చులకనైపోయాను. ఇంకెందుకిక్కడ? నన్ను పుట్టింటికి పంపెయ్యండి. నా వాళ్ళకి నేను బరువు కాను." సావిత్రి మాటలకి ఫణికి చిరాకు ఎక్కువయింది.
చెళ్ మని చెంపమీద కొట్టేడు.
"వెధవ గోల! పగలంతా ఆ రోగులతో చచ్చీ చెడీ యింటికి వస్తే కాస్తయిన హాయి లేదు."
"ఆఁ! ఇక్కడ నాకు మాత్రం హాయ్ ఎక్కువయి, తెగ సుఖపడి పోతున్నాను"
"ఛీ ఛీ వెధవ కొంప! హాస్పిటల్ లో రెస్టు రూములో పడుకున్నా బాగుండిపోను. నైట్ డ్యూటీ చేసినట్టుగా వుండేది?" సావిత్రి మాటల్ని పట్టించుకోకుండా తనలో తను గొణుక్కునట్టుగా అన్నాడు ఫణి.
"ఏం ఈ రోజు నైట్ డ్యూటీకి చంద్రకళ వచ్చిందా?"
ఉరిమినట్టు చూచాడు ఫణి.
నోర్ముయ్!"
నోట్లో గుడ్డకక్కుకుంది సావిత్రి.
ఫణి చిరాగ్గా బాత్ రూంలో దూరి ముఖం కడుక్కొని వచ్చేసరికి సావిత్రి కూతుర్ని పక్కన వేసుకుని నేలమీద పడుకునుంది. రెండు సార్లు సావిత్రీ సావిత్రీ అని పిలిచాడు. పలక్కపోవడంతో విసుగేసి భార్యని మనసులోనే కసిదీరా తిట్టుకొని మంచంపై వాలిపోయాడు. పరుపు గుచ్చుకున్నట్టుగా వుందతనికి. చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు.
11
"నువ్వు చేసిందేం బాగోలేదు."
"బాగలేనిదేముంది యిందులో ?"
"చేసింది చాలక మళ్ళీ యిదొక ప్రశ్నా ?"
"ఏం చేశాను ?"
"జీతం ఎక్కడ పెట్టావు ?"
లేచి కూర్చుంది వారుణి. ఇలాంటి వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటూనే వుందామె.
"బ్యాంక్ లో వేశాను. నాకు ఎకౌంట్ వుంది కదా? మొత్తంలో నాలుగొందలు డ్రా చేసి ఆర్డరిచ్చిన వాటికి అడ్వాన్సు యిచ్చాను" వివరంగా చెప్పిందామె.
"చిన్నా! చెప్పానుగా. ఈ యింటికి కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని హద్దులున్నాయి. కొన్ని అలవాట్లున్నాయి. కోడలిగా వాటిని నువ్వు గౌరవించాలి. పాటించాలి."
ఇలా చెప్పటం నచ్చలేదు వారుణికి.
"ఇది ఆర్డరా!" అంది.
"ఇదిగో చిన్నా! ఇలా ప్రతిదానికీ విపరీతాలు తియ్యకు. దేనికయినా కొంత హద్దుండాలి." కొంచెం తీవ్రంగా అన్నాడు సారధి.
"హద్దు_హద్దు అంటున్నారు. హద్దు మీరితే ఏమిటట? అయినా హద్దులు_సుద్దులు అంటూ మాటిమాటికీ విసిగించక ఒకే మారు చెప్పెయ్. కోడ్ ఆఫ్ కాండక్ట్ కుని పాటిస్తాను." కోపంగా అంది వారుణి.
"నీ జీతం మీ మామగారికి యివ్వాలట"
తెల్లబోయింది వారుణి.
