Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 26

    "వింటున్నారా? "అన్నట్లు చూసింది పార్వతి."

    "వూఁ ఇంకేం వారంరోజులు సెలవు పెట్టానుగా ఏ వంటలు, పిండి వంటలు చేసిపెడతావో ఏమో? నేను మాత్రం మంచందిగితే కుర్చీ దిగితే మంచం అంతే"...

    "మీకంతా నవ్వులాటే! అరవయ్యో పడిలో పడబోతున్నా హాస్యాలే" అంది తృప్తిగా నవ్వుతూ.

    ఆయన దానికేం సమాధానం యివ్వలేదు. ఆమె వంటింట్లో కెళ్ళిపోయింది.

    స్వాతి వచ్చింది ఆయన దగ్గరకి.

    "ఏమ్మా వ్రాస్తావా ?"

    "ఊఁహు ఈ రోజంతా విశ్రాంతి తీసుకోండి. రేపటి నుంచి చెబుదురుగాని. అరణ్యకాండ ఎలాగూ సగమైపోయింది. కిష్కింధ కూడా మొదలెట్టొచ్చు"

    "నీ యిష్టం" అన్నారు.

    "మొత్తం అంతా ఒకసారి చదివి వినిపిస్తాను. వింటారా?"

    "చదువమ్మా"

    లేచి వెళ్ళి వ్రాత ప్రతి తీసుకొచ్చి చదవసాగింది స్వాతి.

    తను వ్రాసింది మరలా కోడలి నోటి వెంట వింటుంటే ఆయనకి చిత్రమైన అనుభూతి కలగసాగింది. తనేనా రాసింది అనిపించింది. ఆ రామచంద్రమూర్తి ఆవహించి అలా రాయించుకుంటున్నాడు. లేకపోతే అంత చక్కని రచన తన వల్ల అవుతుందా! అనిపించిందాయనకు.

    ఏ మందులూ టానిక్కులూ యివ్వలేని బలాన్నీ ఉత్సాహాన్నీ ఆ కావ్య పఠనం ప్రసాదించిందాయనకు. మానసిక శాంతిని మించిన మందు మరేదీ యీ సృష్టిలో లేదేమో?


                                                                           *    *    *


    ఓ రోజు పాఠశాల ముగిశాక అసిస్టెంటు చేతికి తాళాలిచ్చి "నేను వూరు వెళుతున్నాను. వస్తే రాత్రికే తిరిగి వస్తాను. లేదా రేపు ఉదయానికి వచ్చేస్తాను. నువ్వు మామూలుగా స్కూలు తెరువు" అన్నాడు దశరధరాం.

    వైదేహి "అలాగే" నంటూ తాళాలు తీసుకుంది.

    దశరధరాం అత్తవారింటికి చేరేసరికి దాదాపు ఏడు గంటలైంది. అతన్ని చూడగానే కూతురూ, కొడుకూ ఆనందంతో ఎదురొచ్చారు. అతని హృదయం ఒక్కసారిగా ఎగిరొచ్చి గొంతులో ఇరుక్కొంది.

    ఇద్దర్నీ చెరోవైపుకి తీసుకుని ముందుకి కదిలాడు.

    మరో రెండడుగులు వేయగానే బావమరిది యెదురు వచ్చాడు.

    "ఇప్పుడేనా బావా రావటం? మెయిలుకొచ్చావా?"

    "ఊ!"

    "అక్కయ్యా! బావవచ్చారు" ఆనందంతో పిలిచాడతను.

    లోపల వంటగదిలో కూర్చున్న జానకి వళ్ళు జల్లుమంది. కూతురి ముఖం చూసింది చారుకేశి. తల వంచుకుంది జానకి. పొయ్యిపని అప్పగించి బయటకు వచ్చింది ఆమె.

    అత్తగారిని చూడగానే అతని ముఖం ముడుచుకుపోయింది. బావమరిదిని చూస్తూ "సుధాకర్! మావయ్య లేరా?" అని అడిగాడు.

    "లేరు" కఠినంగా జవాబిచ్చింది చారుకేశి.

    "మీ అక్కయ్యనిలా పిలువు"

    "సుధాకర్! నువ్వు బజారుకెళ్ళిరా! సుబ్బయ్యకొట్లో పప్పులు, కొబ్బరి తీసుకురా" డబ్బు అందించి కొడుకును పంపేసిందామె.

    మనవడినీ, మనవరాలినీ పిలిచింది. వాళ్ళు భయపడుతూ దగ్గరగా వచ్చారు. "వెళ్ళండి. మీ అమ్మ అట్లు పోస్తోంది" అంది.

    ఇద్దరూ లోపలికి తుర్రుమన్నారు.

    యుద్ధానికి సిద్ధమయ్యేదానిలా వున్న అత్తగారిని చూసి దశరధరాం గొంతు తడారిపోయింది. పిల్లల్ని, సుధాకర్ ని పంపేయటంతో ఆమె ఆంతర్యం అర్ధమౌతూనేవుంది. భార్య బయటకు రాకపోవటంతో వాళ్ళ ఉద్దేశ్యమూ తెలిసిపోతూనే ఉంది.

    అతనికి ముళ్ళమీద నిల్చున్నట్లుగా ఉంది. ఐనా ఏం జరుగుతుందో చూద్దాం లెమ్మని ధైర్యంగానే నిలబడ్డాడు.

    "ఏం వచ్చావ్?" కటినంగా తనే ప్రశ్నించి కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగింది.

    మండిపోతోంది దశరధరాంకి. నీతో నాకేమిటన్నట్టుగా "జానకీ!" అని పిలిచాడు.

    వంటింట్లోవున్న జానకి ఆ పిలుపువిని ఉలిక్కిపడింది. ఆ పిలుపు సప్తసముద్రాల అవతలవున్నా ఆకర్షించి లాక్కెళ్ళేటట్టుగా వుంది అనుకుంది.

    "జానకి రాదు. మీ మావయ్య ఊరెళ్ళాడు. చెప్పు. ఎందుకొచ్చావు?" ఉరిమిచూస్తూ అడిగింది.

    "భార్య దగ్గరకు భర్త ఎందుకొస్తాడు?" విసుగ్గా ప్రశ్నించాడు.

    "భార్య... భర్త..." వెటకారంగా నవ్విందామె.

    "లాయర్ నోటీసు ఇప్పించావే? కోర్టుకెక్కరాదూ? ఇక్కడికి ఉద్యోగం వేయిస్తే రాజీనామా ఇస్తావా?"

    "అది నా ఇష్టం. మీరెవరు చెప్పటానికి?" దూకుడుగా అనేశాడు.

    "మేమెవరమో తెలియటం లేదా? ఏం అంత చేదయ్యామా? మేం చేదయ్యాక మా అమ్మాయి మాత్రం చేదుకాదూ?"

    "చూడండీ! నేనిప్పుడు పోట్లాడటానికి రాలేదు"

    "మరెందుకొచ్చావు?"

    అత్తవారింటికి వచ్చిన అల్లుణ్ని అలా కటినంగా ప్రశ్నిస్తున్న ఆమె గయ్యాళి తనానికి అతను నొచ్చుకున్నాడు. ఛీ అనుకున్నాడు.

    "నేను జానకి కోసం వచ్చాను"

    "ఎందుకు?"

    "మళ్ళీ అదే ప్రశ్నా! తీసికెళ్ళటానికి"

    "అదేం బజారులో దొరికే సరుకనుకున్నావా"

    "జాగ్రత్తగా మాట్టాడండి"

    "అదే నువ్వూ నేర్చుకో. అక్కర్లేదనుకున్నప్పుడు రాకుండా ఉండటానికీ, రమ్మని పిలిచినపుడు వచ్చేయటానికి అది బొమ్మకాదు. దానికీ మనసుంది"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS