"సరే _ నీ ఇష్టం....నీ ముద్దులమరిది ఇష్టం. నేను రేపు తెల్లవారకుండా పొలానికి పోతున్నాను. ఏమి చెప్పి ఎలా తిరిగి పంపుతావో నువ్వే చూసుకో" అంటూ పక్కమీద ఒరిగిపోయాడు శివయ్య.
* * *
వెలుగురేఖలు చీకటిని చీల్చుకొంటూ వస్తున్నాయి. పొంగుతున్న పాలమీద నీళ్లు చిలకరిస్తూ, "ఇంకా పడుకొన్నావా, వరదం? లే....లేచి ముఖం కడుక్కో. కాస్త వేడివేడి పాలు తాగుదువు గాని" అంటూ కేక వేసింది మీనాక్షి.
"ఇంకా తెల్లవారలేదు కదా, వదినా! కొంచెంసేపు పడుకొని లేచి పోతాను." బద్ధకంగా ఆ మాట అని దుప్పటి ముసుగుతన్నేడు వరదరాజు.
"లేచి స్నానం చేసి ఇంత పెరుగూ అన్నం తిని పట్నం పోవాలి. మళ్ళా కాలేజీకి ఆలస్యం అయిపోతుంది. లే....లే...." అంది రాజుముఖం మీది ముసుగు లాగుతూ మీనాక్షి.
"నేను ఇంక కాలేజీకి పోను, వదినా!" కళ్ళు తెరవకుండానే జవాబు చెప్పేడు రాజు.
"అదేం అలాగ?" ఆ విషయం అప్పుడే విన్నట్లు ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి.
"నేనింక ఆ పట్నంలో ఒంటరిగా ఉండి చదువుకోబోవడం లేదు." తన నిర్ణయం జరిగిపోయిందన్నట్లు దృఢంగా జవాబు చెప్పేడు రాజు.
"చదువుకోకపోతే సంతకి కావిళ్లు వెయ్యి. నాకేం పోయింది. కుక్కని తెచ్చి బంగారపు సింహాసనం మీద కూర్చోపెట్టినట్లు నిన్ను కాలేజీలో చేర్పించడం నాదే తప్పు. 'నేనింక చదువుకోబోవడం లేదు' అంటూ ఎంత ఖచ్చితంగా జవాబు చెప్పేవు?
"ఈమాట ఇంత గట్టిగా కాలేజీలో చేర్చే ముందు చెప్పలేకపోయేవా? మెడలో వున్న ఒక్క గొలుసూ ఆడపిల్ల పూర్ణకైనా మిగల్చకుండా కుదువపెట్టి, నీ కాలేజీ ఫీజుకి, హాస్టలు ఖర్చులకు సొమ్ము ఇస్తున్నప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు! నీ తాత అప్పగించిన ఖజానా లోంచి నీ అన్న పాతర తవ్వి తీసేరనుకున్నావా? ఇంత సొమ్ము గంగపాలుచేసి ఇప్పుడు చదవబోవడం లేదని చల్లగా చెబుతున్నావా?
"వద్దులే నాయనా? నీకు చదువూ సంధ్యా వద్దు. హాయిగా గ్రామంలో అరక తోలుకొంటూ, ఆవుల్ని మేపుకొంటూ బ్రతుకు. ఆ రాత నీ ముఖాన మూడు పంక్తులా బ్రహ్మ రాసిఉన్నప్పుడు నేను మార్చాలనుకుంటే మాత్రం మారుతుందా?"
వడివడిగా పెరటిలోకి పోయి ఆవుల తొట్టెలో మిగిలిఉన్న కుడితి కలపసాగింది మీనాక్షి.
వదిన మాటలతో వరదరాజు నిద్రమత్తు పూర్తిగా వదిలి పోయింది. వడగాలి సోకినట్లు క్షణకాలం మతిపోయినవాడిలా మంచంమీద కూర్చున్నాడు. వదిన పెరట్లోకి వెళ్లగానే అదురుతున్న పై పెదవిని అదిమి పట్టుకొని, ముందురోజు వదిలిన బట్టల్ని తొడుక్కొన్నాడు. రాత్రి కట్టుకొన్న బట్టల్ని చేతిసంచిలో కుక్కివేసేడు.
"నేను వెళుతున్నాను వదినా!" పాచిముఖమైనా కడగకుండా పట్నానికి ప్రయాణమయ్యేడు వరదరాజు.
"ముఖం కడుక్కొని పాలు తాగి మరీ వెళ్ళు." పెరటిలోంచి మీనాక్షి ముందు వరండాలోకి వచ్చేసరికి వరదరాజు చరచరా రోడ్డుమీద నడిచిపోతున్నాడు. వదిన పిలుపు వినిపించినా వెనుతిరిగి చూడలేదు.
'పరీక్షలన్నీ పాసైతేకాని ఈ ఇంటికి తిరిగి రాబోవడం లేదు వదిన చేతి పచ్చి మంచినీళ్ళయినా తాగబోవడం లేదు. వదినకి కావలిసింది నా సుఖంకాదు. నా సంతోషంకాదు. నేను ఉద్యోగంచేసి గడించబోయే డబ్బు. అందుకోసమే నన్ను చదువుకోమని మొదట్లో అంతగా బతిమాలింది. ఇప్పుడు ఇంత నిష్ఠూరంగా మాట్లాడు తున్నది.' వరదరాజు మనసు కోపంతో కుతకుతలాడింది.
రాజు పొలాలవెంట పోతూంటే వంగమొక్కలకి పాదులుచేస్తున్న శివయ్య కనిపించేడు. రాజు ఇటు ముఖం తిప్పుకొన్నాడు.
"ఏమిరా రాజూ. ఇంత ముందుగా పోతున్నావు? ఏమైనా తిని పోతున్నావా లేదా?" అంటూ కేకవేసేడు శివయ్య.
వరదరాజు ఒకసారి వెనుదిరిగి చూసి, జవాబు చెప్పకుండా ముందుకి చరచరా నడిచిపోయేడు.
* * *
వరదరాజు తిరిగి హాస్టలుకి వచ్చేక పిల్లలు ఏ విధమైన అల్లరీ పెట్టలేదు. కొంతమంది స్నేహంగా మాట్లాడరుకూడా. కాని వారి చర్యలతో హడలిపోయిన రాజు సాధ్యమైనంత వరకూ వారితో కలియకుండా వేరుగా ఉండేందుకే ప్రయత్నించేవాడు. రోజులో చాలాకాలం కాలేజీలోను, లైబ్రరీలోను గడిపివేసేవాడు. మెలకువగా ఉన్నంతవరకూ ఇంటి సంగతులు మనసులో మెదలకుండా ఉండేందుకు ఏదో పనిలో మునిగి వుండడం నేర్చుకొన్నాడు.
నెలరోజులు తిరిగేసరికి టీచర్లకు వరదరాజుపట్ల 'తెలివైన పిల్లడు, నెమ్మదస్థుడు' అన్న అభిప్రాయం ఏర్పడింది. లెక్కల టీచరు కూడా ఒకసారి రాజు హోమ్ వర్కు చూస్తూ, "బుద్ధిగా చదువుకొంటే అభివృద్ధిలోకి వచ్చి బాగుపడుతావు. లేకపోతే మీ పల్లెలో అరక తోలుకోవలిసిందే" అన్నాడు.
ఒకరోజు వరదరాజు కాలేజీనుంచి తిరిగివస్తూంటే సత్తిబాబు ఎదురయ్యేడు. పదిగజాల దూరం నుండి అతడిని చూసి పక్కవీథిలోకి పరుగుతీసేడు రాజు.
"ఒరేయ్, వరదం!....ఒరే, వరదరాజూ!" అంటూ సత్తిబాబు పిలుపు చెవిలో పడుతున్నా రాజు లెక్కచేయలేదు.
వదిన ఏదో కబురు పంపివుంటుంది. ఆ కబురు జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఆవిడికే అప్పగించనీ అనుకొన్నాడు.
