Previous Page Next Page 
వారుణి పేజి 25


    ఆమె వెంట ఒక సోఫా, రెండు కుషన్ కుర్చీలూ పట్టుకొచ్చారు కూలీలు. హాల్లో మధ్యన సోఫా వేయించి ఎదురుగా కొత్త కుర్చీలు సర్దించింది వారుణి. కూలీ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.
    "అత్తయ్యా! మామయ్య! మీరిద్దరూ ముందుగా ఆ సోఫాలో కూర్చోండి! మన యింటికి నలుగురొస్తే సమంగా కుర్చీలు లేవు కదూ మామయ్య! హోం నీడ్స్ లో తెచ్చాను. ఈజీ ఇన్ స్టాల్ మెంట్సు. పెద్ద బరువుగా వుండదు.
    గ్యాస్ స్టవ్ కి కూడా అప్లయి చేశానత్తయ్యా! ఎన్నేళ్ళని ఆ కిరోసిన్ స్టౌతో, బొగ్గుల కుంపటితో సతమత మవుతారు? గ్యాస్ వంట సులభం. పాత్రలకి మసీ అదీకూడా అంటదు. సుఖంగా వుంటుంది. ఈ వయసులో మీకు వంట చేయడమే శ్రమ. అందులో వీలైనంత సుఖంగా వుండడం చూచుకోవటం మంచిది కదత్తయ్యా!
    బాత్ రూంలోకి గీజర్ ఆర్డరిచ్చాను. కనెక్షనివ్వటానికీ, కన్ స్ట్రక్షనుకీ మనుషులు రేపొస్తారు."
    వారుణి గడగడా మాట్లాడుతూంటే నోట మాట రాలేదు. సుబ్బరత్నమ్మకి దిక్కుతోచని దానిలా వుండిపోయింది. నారాయణ భార్యవైపు అదోలా చూశాడు.
    ఆయనకి వారుణి క్రమక్రమంగా అర్థమవుతోంది. లేచి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఆయన వెంట తనూ కూర్చోక తప్పలేదు సుబ్బరత్నమ్మకి.
    కోడల్ని, ఆమె మాటల్నీ చూస్తే ఏమిటోగా వుందామెకి.
    "ఇలా కూర్చోక మీరిద్దరు కబుర్లు చెప్పుకున్నా యింటి విషయాలు చర్చించుకున్నా లక్ష్మీనారాయణుల్లా కనిపిస్తుంటారు" అంది వారుణి చేతులు జోడిస్తూ.
    చిరునవ్వు నవ్వేరు నారాయణ.
    అప్పటికి డబ్బు సమస్య మూలపడి పోయింది.
    పద్మ కాఫీ పట్టుకు వచ్చింది. కబుర్లు చెప్పుకుంటూ నలుగురూ తాగేశారు. హాల్లో కొత్త టీపాయ్ అవసరం తెలిసి వచ్చింది. దాన్ని గురించీ, ఫర్నిచర్ గురించీ మాట్లాడుకున్నారు.
    వంటింట్లోంచి అంతా గమనించింది సావిత్రి. వారిని చూస్తే మహా ఉడుకుమోతుతనంగా వుందామెకి.
    ఆ రాత్రి భర్తరాగానే పోట్లాట వేసుకోవటానికి తయారవసాగింది. లెక్చరర్ భార్య అయిన వారుణికే అంత హోదా అయితే డాక్టర్ భార్య అయిన తన హోదా ఏమిటి? రేపటికల్లా ఆ యింట్లో తన స్థానమేమిటో తెల్చుకోవాలనుకుందామె.


                                            10


    ఆ రాత్రి ఆ యింట్లో మూడు జతలూ ఘర్షణ పడ్డారు.
    ఫణి ఆ రాత్రి ఎక్కడికో డిన్నరుకి వెళ్ళి వచ్చాడు. అది అతనికి మామూలే. కో డాక్టరో, కాస్ట్ లీ పేషెంటో ఫ్రెండో ఎవరో ఒకరు అతన్ని నెలలో మొదటివారంలో డిన్నర్ కి పిలుస్తారు. అప్పుడే కాస్త గొంతు తడుపుకొస్తాడు. ఆ అలవాటు చాలా ఏళ్ళుగా వున్నా యింత దాకా యింట్లో వాళ్ళకి తెలీదు.
    మొదట్లో భార్యతో కారా కిళ్ళీ వేసుకున్నానని చెప్పాడు. ఫారెన్ సరుకు వాసన తెలియని సావిత్రి నమ్మేసింది. నిజంగానే వేసుకున్న కిళ్ళీ రంగు, ఆ ప్లేవర్ అతన్ని కాపాడాయి.
    బాగా పదకొండు దాటాక యింటికి వచ్చే అతన్ని నారాయణ కానీ, సుబ్బరత్నమ్మ కానీ గుర్తించే అవకాశమే లేదు.
    ఆ రోజు భర్త రాగానే నిలవేసింది సావిత్రి.
    శ్లాక్ తీసి హేంగర్ కి వేస్తున్న ఫణిని సూటిగా అడిగేసింది.
    "చెప్పండి! నేను యీ యింటి కోడలనా? దాసీ దాన్నా?"
    ఫణికి యిదేమీ పట్టలేదు. మన ధోరణిలో లేడతను. "ఊఁ" అన్నాడతను తిరిగి చూడకుండా హేంగర్ కి తగిలిస్తూ.
    ఈ రోజు మందు పుచ్చుకోవడమే కాకుండా పేక కూడా ఆడాడు. ఎవరో పేషెంట్ బక్షీస్ గా యిచ్చిన మూడొందలూ మొదటి మూడు రౌండ్లలోనే పోయాయి. దాన్ని రాబట్టుకుందామని మరో నాలుగువందలు అప్పుచేశాడు. లాభం లేదు. హేండ్ రైజ్ కాలేదు. నాలుగొందలు కృష్ణార్పణం అయ్యాయి. మరో మూడు వందల గాత్రం పాడాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS