గ్లాసులోకి వంపుకుని 'ఇఫ్ యూ డోంట్ మైండ్. డ్రింక్ చేస్తూ మాట్లాడతాను" అంది.
"తీసుకోండి."
రెండు మూడు సిప్స్ చేసేదాకా సైలెంటుగా ఉంది. అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టింది.
"జీవితం మీద నాకెంతో ఆశ ఉండేది. ప్రేమ ఉండేది. నిర్మలంగా జీవించాలన్న ఆరాటముండేది. రకరకాల రంగులతో మెరిసిపోయే కలలు కళ్ళముందు మెదిలేవి. నిజం చెబుతున్నాను. ఎవరి ప్రమేయం లేకుండా, ఏ ప్రభావమూ నామీద పడకుండా నా దార్న నేను మనుగడ సాగిద్దామనుకున్నాను. కాని ఈ మనుషులు నన్ను వేటాడటం మొదలుపెట్టారు. అడుగుతీసి అడుగు వేస్తే ఈ వేట ఒక్కోసారి చాలా ఊహాత్మకంగా, ఒక్కోసారి క్రూరంగా, తెలివిగా ఉండేది. ఎంత తప్పించుకుందామన్నా సాధ్యపడేది కాదు. అప్పుడు తెలుసుకున్నాను. బయటి ప్రపంచంలో విచ్చలవిడిగా సంచరించే మగాడికి ఎన్నో అనుభవాలున్నట్లే, నాలుగు గోడల మధ్యా బిగించబడి ఉన్న ఆడదానిక్కూడా కొన్ని అనుభవాలుంటాయి. సంఖ్యలో సమానం కాకపోవచ్చు. కాని లోతులో ఓ రహస్య వలయం లాంటిది.
"మొత్తానికి నన్ను చెడగొట్టే దాకా ఈ సమాజం నిద్రపోలేదు."
"అవున్నేను చెడిపోయాను."
కాని ఈ చెడిపోవటం గురించి విడమర్చి చెప్పుకునేటంతటి దారుణంగా అప్పుడు నాకనిపించలేదు. ఎన్నాళ్ళబట్టి ఎదురు చూస్తోన్నదీ జరిగినట్లుగా, జీవితంలో అంతర్భాగమైన ఓ అసహ్యమైన సహజత్వం తన నిజ స్వరూపం ప్రదర్శించినట్లుగా అనిపించింది.
"ఈ చెడిపోవటమన్నది అన్ని యుగాల్లోనూ ఉన్నది. కొన్నివేల సంవత్సరాల క్రితమూ ఉన్నది. ఇప్పుడూ ఉన్నది. అయితే యుగధర్మాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, నాగరికతను బట్టి దాని స్వరూపం ఎప్పటికప్పుడు మారిపోతూ వచ్చింది."
చట్టాలు దాన్ని నియంత్రించిన కొద్ది అదీ రకరకాలుగా దాగుడుమూతలాడటం నేర్చుకుంది. ఈ సమాజంలో బుద్ధిమంతులుగా చెలామణి అవుతున్నవారెలా ఆత్మవంచన చేసుకుంటున్నారో, చెడిపోయినవారు కూడా అలాంటి ఆత్మవంచనకే గురవుతున్నారు. మంచి.... చెడుల రంగుల కలయికతో మార్పులున్నాయేమోగాని ఆత్మవంచనలో మార్పులేదు.
"ఓ పధ్ధతి ప్రకారం జీవించాలనుకున్న ఆశ పటాపంచలైపోయింది. ఆ దశలో మోసాలకు గురయ్యాను. గ్యాంగ్ రేప్ లు చెయ్యబడ్డాను. అమానుషంగా అనుభవించబడ్డాను. మగ ప్రపంచం ఆకలికి నా శరీరం నలిగిపోయింది. ముద్దయి పోయింది. పీల్చి పిప్పి చెయ్యబడింది."
"ఓ రాత్రి.... నగ్నంగా ఒంటరిగా పడుకుని ఉన్నదశలో చాలా తీవ్రంగా నన్ను గురించి ఆలోచించుకున్నాను. ఇలా శిధిలమవుతూ, మొగవెధవల కామానికి ఆహుతవుతూ జీవితం కొనసాగించటమేనా? లేక వాళ్ళ బలహీనతలను ఆధారంగా చేసుకుని శరీరం గురించి ఆలోచించకుండా నా జీవితానికి ప్రాధాన్యతనిచ్చి ఓ మలుపు త్రిప్పుకోగలనా?"
ఈ ఆలోచన నాకు నచ్చింది. పోయిందేదో పోయింది. కాని పోగొట్టుకున్న దాన్ని మరో రూపంలో పొందగలగాలి.
"అంతే. అప్పట్నుంచి విజృంభించటం ప్రారంభించాను. ఆడది అమాయకత్వంగా ఉన్నంతకాలం మగాడిలో దుర్మార్గం ప్రబలుతూ ఉంటుంది. ఆడది గడుసుగా, రాక్షసిగా మారగలిగినప్పుడు, మగాడి దుర్మార్గం నిస్సహాయస్థితిలో పడిపోయి, బలహీనతగా మారిపోతుంది."
"ఈ కిటుకు బాగా ఆకళింపు చేసుకుని నా మాయాజాలాన్ని ప్రదర్శించసాగాను."
"ఆశ్చర్యంగా జీవితం తిరిగి నా చేతుల్లో కొచ్చింది. ఎందరో ప్రముఖులు నాకు బానిసలైనారు. ఎన్నో యంత్రాంగాలు నా చేతుల్లో కొచ్చాయి. ఎందరి సామర్థ్యాన్నో శాసించసాగాను. కోట్లకొద్ది సంపదకు అధిపతి రాలినైనాను. ఎందరో ప్రముఖులవి, పరిపాలకులవి.... భయంకర రహస్యాలు నా గుప్పెట్లో పెట్టుకున్నాను."
నాకు మంజరి గుర్తొస్తోంది.
ఈ ఇద్దరి మాటలూ.... గుండె ఝల్లుమంది. ఎంత ధైర్యంగా ఉందామన్నా కాళ్ళలో చిన్న ఒణుకు ప్రవేశించింది.
శమంతకమణి కళ్ళు ఎంత వజ్రాల్లా మెరుస్తున్నాయి. ఆమె మేనిరంగు పరిసరాల్ని అనుభవంలోకి తీసుకుంటున్నట్లుగా తేజోవంతంగా వెలిగిపోతోంది.
ఆమెలోంచి ఓ విశ్వరూపం దర్శనమిస్తోంది.
గ్లాసు పూర్తయింది. మళ్ళీ విస్కీ కలుపుకుని కొంచెం గబగబా త్రాగింది.
ముఖంలోకి ఎర్రని కాంతి చోటు చేసుకుంటోంది.
"కాని.... నేనాలస్యంగా మేల్కొన్నాను. నేను నాదైన పంథాలో మేల్కొనటం జరిగేసరికి నా యవ్వనంలోని అమూల్యమైన సంవత్సరాలు చాలా వృధా అయిపోయినాయి. నేననుకొన్నది సాధించటానికి నా వయసు సరిపోలేదు. మనిషికి ఇతరుల్ని క్రమ్మేసే ప్రభావం ఒక్కటే ఉంటే సరిపోదు. దానితో సరితూగే శక్తి కూడా ఉండాలి. ఆ శక్తిని నా నుంచి వయసు దూరం చేసింది. అందుకే కొన్నాళ్ళుగా నాకు సమవుజ్జికాగల వారసురాలి కోసం అన్వేషిస్తున్నాను. నువ్వు మెరుపు మెరిసినట్లు సాక్షాత్కరించావు. నీ గురించి వాకబు చేశాను. ఎందుకు పనికిరాని నిస్సారమైన చరిత్ర నన్ను చుట్టేస్తోంది. నిన్ను ఊబిలోంచి బయటకు లాగాలి. ఓ అద్భుతమైన స్త్రీగా నిన్ను రూపొందించాలి."
నాకు ఉక్రోషమొచ్చింది. "అంటే నన్నేం చెయ్యమంటారు? ఓ వేశ్యగా మారమంటారా?"
"అలా అని నేను చెప్పటం లేదు. అంటూ ఓ క్షణమాగి "వేశ్య వేశ్య వేశ్య ఎవరీ వేశ్య? పొట్టకోసం పడుపువృత్తి చేపట్టి రోడ్డుప్రక్కన వూరి గుడిసెల్లోనో, పోలీసులు అండదండలతో లాడ్జింగుల్లోనో, పెళ్లాలలా నటిస్తూ మగాళ్లతో పెద్ద పెద్ద హోటళ్లలో గడిపే ఆడవాళ్ళ గురించా నువ్వంటున్నావు? ఈ లోకంలో, పోనీ పవిత్రమైన పుణ్యభూమిగా పేరొందిన ఈ దేశంలో అర్థం లేకుండా, అర్థం కాకుండా, కారణం ఉండి, కారణం లేకుండా, జీవితాంతం బయట పడకుండా కళ్లు చీకట్లతో మూసుకుపోయేలా చేసే పరమ రహస్యంలా, ప్రేమ పేరుతో, ఆకర్షణ పేరుతో, తాను అన్యాయానికి గురయ్యామన్న ఆత్మవంచనతో, స్నేహంలో విషం చిమ్ముతూ, కాటేస్తూ, బంధుత్వాలలోని చొరవను దుర్వినియోగం చేస్తూ, ఎన్నో అక్రమసంబంధాలు మానవ బలహీనతలకు చిహ్నంగా విలసిల్లిపోతున్నాయో నీకు తెలీదు. నీకే కాదు. ఎవరికీ తెలీదు. అలనాటి ఋషిపత్నుల దగ్గర్నుంచీ ఈనాటి ఉత్తమ ఇల్లాలివరకూ ఎన్ని రహస్యాలు నిక్షిప్తంగా ఉండిపోయాయో నీకే కాదు. ఎవరికీ తెలీదు. తెలిస్తే, ఈ నిజాలు బయటికొస్తే భరించేశక్తి ప్రస్తుతమున్న ప్రపంచానికి లేదు."
