నేను సహజంగా చాలా ధైర్యస్థురాలిని. కాని ఇప్పుడు చాలా భయమేస్తోంది. కాళ్ళలోని వణుకు తగ్గటం లేదు.
మంజరి. ఆమె రూపమే కళ్ళముందు మెదుల్తోంది.
"నువ్వో అపురూపమైన వ్యక్తివి. ఈసరికే కొన్ని పరిచయాలయి ఉంటాయి. అదెంత స్వార్థపూరితమయినదో చవి చూసి ఉంటావు. పెళ్ళయింది. అదెంత చక్కగా ఇమిడిందో అనుభవించావు. పోనీ మళ్లీ పెళ్లి చేసుకుంటావు. ఏ గుమస్తానో, పనికిరాని వ్యాపారం చేసే చవటసన్నాసో, పైకి రావటం చేతగాక డంబాలు పలికే మురికి వెధవో మొగుడి వేషంలో వస్తాడు. ఇహ అక్కణ్ణుంచీ అంట్లు తోమటం, వంటలు వండుకుని తింటూ ఉండటం, చాలీచాలని సంపాదనలతో రోజూ నరకం, ఇంతకు ముందు పడుకోటం చేతకాని అసమర్థపు వెధవ మొగుడయితే, ఈసారి పడుకోటం తప్ప ఇంకోటి చేతకాని అంట్ల వెధవ మొగుడు, ఆ తర్వాత జీవితాంతం శత్రువుల్లా ఏడుస్తూ, పీల్చి పిప్పి చేస్తూ, కాల్చుకు తినే పిల్లలు.... ఏ కోణం నుంచి చూసినా నీ అర్హతకు తగ్గ జీవితం నీకు లభించదు."
ఆ ప్రకంపనలో నాలో అనేక భావాలు చెలరేగుతున్నాయి.
మనిషి బతకాలంటే, ఈ ప్రపంచంలో తనకో నివాసమేర్పాటు చేసుకోవాలంటే ఇన్ని కష్టాలు పడాలా? ఇన్ని రకాల ఆలోచనలు కలిగి ఉండాలా? హాయిగా, సూటిగా ఉండే జీవితం లభించదా?
"అక్రమ సంబంధం, అక్రమ సంబంధం" అనే మాట నా వీనుల్లో ప్రతిధ్వనిస్తోంది.
ఒక్కోపదం ఈ అసభ్య సమాజంతో ఎంత లోతుగా పెనవేసుకుపోయి ఉంటుంది.
శమంతకమణి కళ్ళలోకి చూశాను. ఓ రకం గీరతో నిండి ఉన్న కళ్ళతో నావైపే చూస్తోంది. ఇద్దరి చూపులూ కలుసుకుంటున్నాయి. స్త్రీ పురుషుల చూపులు కలుసుకుంటే అదో రకం. ఇద్దరు స్త్రీల చూపులు కలుసుకుంటే ఇంకో రకం.
మళ్ళీ ఆమే మాట్లాడింది. "నిన్ను వేశ్యగా మారమని ఎవరన్నారు? నా ఆలోచన్లు అంత తక్కువగా అంచనా వెయ్యకు. నేను అందుకోని స్థాయి నిన్ను అందుకునేలా చేస్తాను. అదే రూపంలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. నెంబర్ వన్ స్థానాన్ని పొందే సినిమా నటిని చేయవచ్చు. మిస్ ఇండియాను చేయవచ్చు. మిస్ యూనివర్స్ ని చేయవచ్చు. అదంత అసాధ్యమైన విషయమేం కాదు. ఆ మాటకొస్తే టెక్నికల్ గా కొన్ని కొలమానాలుండటం తప్పిస్తే వాళ్ళంత అద్భుతమైన సుందరీమణులేం కాదు. లేక సమాజంలో ఈ రాష్ట్రంలో, దేశంలోనే ప్రముఖ పాత్ర వహించే విశిష్ట వ్యక్తిగా రూపొందించవచ్చు. నీ గుప్పిట్లో ఈ దేశ రహస్యాలు ఇమిడి ఉండే శక్తివంతమైన పొజిషన్ లోకి నిన్ను తీసుకెళ్ళవచ్చు."
"దానివల్ల సాధించేదేమిటి?"
"ఇతరులకు సాధ్యం కాని గుర్తింపు, డబ్బు, పవర్ ఇవే అయితే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి. ఇవి లేని జీవితం వృధా."
".... మీరు చెప్పే సాధనలో మనల్ని మనం పోగొట్టుకుంటే...."
"యు మీన్ క్యారెక్టర్ అని మనషుల్తో పిలవబడేది."
"అవునదే. మనుషుల్తో పిలవబడేది కాదు. దాని పేరు క్యారెక్టర్. చాలా విలువైనది."
"క్యారెక్టర్. క్యారెక్టర్, క్యారెక్టర్" అంటూ విరగబడి నవ్వింది.
ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తున్నాను.
గ్లాసులో మరికొంత విస్కీ వొంపుకుని గడగడ త్రాగేసింది.
"నువ్వు చెబుతున్నావే క్యారెక్టర్. దానికన్నా మనిషి అతని విజయాలు గొప్పవైనప్పుడు, వాటిముందు అది.... ఆ క్యారెక్టర్, దానికి సామాన్యులు ఇచ్చే ప్రాముఖ్యతా వెలా వెలాపోతాయి. ఆ గొప్పతనం ముందు అది అన్ని నిర్వచనాలనూ పోగొట్టుకుని అచేతనమై పోతుంది. మనిషిలో ఇంకే ప్రత్యేకతలూ లేక, ఏ అర్హతలూ, ఆకర్షణలూ లేక అది ఒక్కటే పదిలంగా ఉంచుకున్నామనుకుని దాన్ని గురించి పదే పదే చెప్పుకుని మురిసిపోతూంటారే, ఆ తృప్తితో మనుగడ సాగిస్తూంటారే.... వాళ్ళకు, వాళ్ళకు మాత్రం చెప్పుకోటానికి మిగుల్తుంది. ఈ విశాలమైన, విస్తృతమైన జీవితంలో, ఓ సుదీర్ఘ చరిత్రలో, ఆ ఒడిదుడుకులో, పోరాటంలో, అన్వేషణలో, సుడిగాలివంటి ప్రభావాలలో, ప్రభంజనాలు వంటి అనుభూతులలో, వొత్తిడులలో, డిప్రెషన్ లలో, ఆకలి, దాహం వంటిదే తీవ్రమైన ఈ శారీరక ప్రకంపనలలో ఏవో కొన్ని జరిగిపోతూంటాయి. ఆ మాటకొస్తే పరాశరుడికి క్యారెక్టర్ లేదు, సత్యవతికి లేదు, వ్యాసుడికి లేదు, అహల్యకి లేదు, విశ్వామిత్రుడికీ లేదు, ఇలా ఎందరికో లేదు.... వాళ్ళు వాళ్ళు గురయిన సంఘటన వల్ల. కాని.... వాళ్ళంతా వీటికి అతీతులైపోయి మహావ్యక్తులు కాలేదా? అసలు క్యారెక్టరంటే ఏమిటి? శరీరంలో ఇంకా ఎన్ని భాగాలు మలినపడినా, ఆ ఒక్క అవయవాన్నీ కాపాడుకోవటమా? నగ్నంగా స్నానం చేసేటప్పుడు ఎంతో మంది చూసినా, ముద్దులూ, కౌగిలింతలూ జరిగినా ఆ ఒక్క వ్యవహారం పూర్తవనంత మాత్రాన శీలం పోగొట్టుకోని పతివ్రతలయి పోయారా? అసలు శీలమంటే ఏమిటి? ఆ ఒక్క అవయావాన్నీ పదిలంగా కాపాడుకోవటమేనా? రాక్షసత్వం, పరపీడనత్వం, గయ్యాళితనం, ముచ్చుతనం, నంగనాచితనం, చాడీకోరుతనం, ద్వేషం ఇవన్నే లేకుండా మంచి మనసు అంటే అర్థం తెలీకుండా ఛండాలంగా బతకటం శీలమవుతుందా? ఈ పతివ్రతలమని చెప్పుకునే వాళ్ళలో ఎంతమంది శీలంమీది గౌరవంతో దాన్ని, అదే ఆ అవయవాన్ని కాపాడుకున్న వాళ్లున్నారు? అవకాశాలు రాక, కడుపొస్తుందనే భయంతో, పెద్దవాళ్ళు తంతారన్న భయంతో, అల్లరవుతామన్న భయంతో గప్ చుప్ గా ఉన్నవారెంతమంది? రోమాలు పెరిగి, రెడ్ డిశ్చార్జ్ తో మకిలిగా తయారై, వైట్ డిశ్చార్జ్ తో వెజైనైటిస్ తో మగ్గిపోతుంటే దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చేతకాదు కాని, పర పురుషుడితో ఆ ఒక్కటీ జరక్కపోవటం శీలం. కొన్ని నిజాలెంత భయంకరంగా ఉంటాయి.
