Previous Page Next Page 
నేను పేజి 25


    "మీరీవేళ చాలా పాయింట్లు చెబుతున్నారు."


    "చెబుతున్నాను అనే కంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను అనటం కరెక్టుగా ఉంటుంది."


    నిజానికి అతను చెబుతున్న మాటలు గుండెల్లో ఏ స్థావరాన్నో మృదువుగా స్పర్శిస్తున్నాయి. ఆలోచిస్తూ ఉండిపోయాను.


    "ఆ రోజు అద్భుతమైన అలంకరణలో ఎంత గొప్పగా ఉన్నారో, ఈ సామాన్యమైన, సహజమైన దుస్తుల్లో కూడా అంతే గొప్పగా ఉన్నారు సహజత్వం ఒక్కోసారి అసలైన అలంకారంగా ఉంటుంది."


    అతని మాటలకు పులకిస్తూనే, ఒక సంగతి గుర్తొచ్చి అదిరిపడ్డాను. నాలోని మార్పును గమనించినట్లున్నాడు.    


    "ఏమిటలా....?"


    ఆ రోజు ధరించిన దుస్తులు, నగలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఎలా అందచెయ్యాలో తెలీక ఇంట్లోనే ఉంచేశాను. అప్పుడు కార్లో రావటం, గందరగోళంలో తిరిగి పంపించి వెయ్యటం జరగటం వల్ల ఆమె గారిల్లెక్కడో గుర్తులేదు. వెతుక్కుంటూ ప్రయత్నించుట ఇష్టంలేక, అలా ఉండిపోయాను.  


    "శమంతకమణి గారి ఆభరణాలూ, అవి నా దగ్గరే ఉండిపోయాయి. వీటిని నా సామాన్యమైన ఇంట్లో భద్రపర్చలేక సతమతమవుతున్నాను. మీకిస్తాను. తీసుకెళ్లరూ?"


    సుకుమార్ నవ్వాడు. "మేడమ్ ఆభరణాలు తీసుకురమ్మని నన్ను పంపలేదు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు."     


    నాకక్కడికి రావాలని లేదు."


    "మీరు రాకపోతే ఆమే వస్తారు."


    కొంచెం సేపాలోచించుకుని "ఎప్పుడు రమ్మన్నారు?" అనడిగాను.


    "వీలుంటే ఇప్పుడే."


    "ఇప్పుడా? చూశారుగా ఇంకా తెమల్లేదు. అంట్లు తోముకోవటం, ఇల్లు ఊడ్చుకోవటం...."


    "ఇవన్నీ మీరే చేసుకోవాలా?" అతని ముఖంలో వ్యధ స్పష్టంగా కనిపించింది.


    "నేను కాకపోతే ఎవరు చేస్తారు? నాకెవరున్నారు చెప్పండి. పని వాళ్ళను పెట్టుకునే స్థోమత లేదు."       


    "మీరు.... ఏదో చెప్పబోయి గొంతుకేదో అడ్డుపడినట్లాగిపోయి, ముఖం ప్రక్కకి త్రిప్పుకున్నాడు."


    "ఇప్పుడు కాదు. ఉతుక్కోవల్సిన బట్టలు చాలా ఉన్నాయి. సాయంత్రం తప్పకుండా వస్తాను."


    "అయిదు గంటల కల్లా వస్తాను. సిద్ధంగా ఉండండి" అంటూ లేచి నిల్చున్నాడు.


                                       11


    అన్నట్లుగానే అయిదింటికల్లా వచ్చాడు.


    ఓ బ్యాగ్ లో ఆభరణాలు, డ్రెస్సు పెట్టుకొని ఎదురు చూస్తున్నాను.


    కారులో ఎక్కాక ఓ సంగతి గుర్తొచ్చింది.


    "ఆ రాత్రి.... కత్తితో పొడవటం అది.... తర్వాత ఏమయింది? ఆమె చనిపోయిందా?"


    నవ్వాడు. "ఏమీ కాలేదు. ఆమె బతికింది."


    "పోలీసులూ, కేసూ...."


    "అలాంటిదేం లేదు. మేడమ్ తలుచుకుంటే ఆ దరిదాపుల్లోకి పోలీసులెవరూ రారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసే తిరుగుతూ పార్టీలక్కూడా అటెండవుతున్నారు...."


    "వాళ్ళిద్దరి మధ్యా అపార్థాలూ, గొడవలూ...."


    "ఒంట్లో ఏదయినా ఆనారోగ్యముంటే దాన్ని భరిస్తూ మనిషి బతికేస్తున్నట్లే.... ఈ సంసారాల్లో చాలాభాగం భరించబడుతూ ముందుకు నెట్టబడుతూ ఉంటాయి."


                                                        *    *    *


    శమంతకమణి హాల్లోనే విశాలమైన సోఫాలో వెనక్కి వాలి కూర్చుని ఉంది.


    నన్ను చూడగానే ఆమె ముఖం వెలుగుతో నిండిపోయినట్లయింది. ఆదరంగా "రా సతి" అంది.


    సుకుమార్ బయటికెళ్ళి పోయాడు.


    ఆమె కెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను.


    ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పనివాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ ఉండటం కనిపించింది. ఒకరు ఓ గ్లాసులో జ్యూస్ తీసుకొచ్చి నా ముందుపెట్టారు.     


    "తీసుకో సతీ" అంది. ఆమె మాటల్లో సభ్యత తొణికిస లాడుతోంది.  


    "మీ ఆభరణాలు, అవీ...." అన్నాను బ్యాగ్ ఆమె కందిస్తూ.


    "వెనక్కి తీసుకోవాలని నాకేం లేదు. కాని ఇవి నాకు తిరిగి ఇచ్చే సమయం కోసమే నువ్వెదురు చూస్తున్నావని తెలుసు. అందుకని.... అంది ప్రక్కన ఉంచుతూ.   


    "నీకెప్పుడో కబురు చేద్దామనుకున్నాను. కాని ఆ రాత్రి జరిగిన సంఘటన నిన్ను కొంతవరకూ కలచివేసి ఉంటుందని, సెటిలవటానికి టైమ్ కావాలి కదా."     


    "మీరు నన్నెందుకు వెంటాడుతున్నారు? అసలు మీరెవరు నేనెవరు? మీకూ నాకూ సంబంధమేమిటి?" నా అంతరంగంలో చెలరేగుతూన్న సంక్షోభాన్ని అణచుకోలేక, కొంత సౌమ్యతను జోడిస్తూ నిలదీసి అడిగేశాను.


    శమంతకమణి నవ్వింది. "ఈ సమాజంలో ఒకరినొకరు వెంటాడటానికి ఏ సంబంధమూ అక్కర్లేదు. నీతో నాకవసరముంది."


    "ఏమిటా అవసరం?"


    ఆమె ముఖంలో చోటు చేసుకుంటూన్నా చిన్న చిన్న మార్పులు గమనిస్తున్నాను. ఆ మార్పులలో నిజాయితీనే దర్శనమిస్తోంది.


    "సతీ!!" అంది. "నీలాగే నేనూ అందగత్తెను. ఆ వయసులో ఇతరుల్ని మత్తెక్కించే ఆకర్షణలు చాలా ఉండేవి. కాని అప్పుడు నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని. బహుశా ఇప్పుడు నీలో ఉన్న తెలివి తేటలు కూడా నాలో లేవు.    


    "వన్ మినిట్" అంటూ లేచి వెళ్ళి ఓ ప్రక్క వాడ్రోబ్ లో ఉన్న విస్కీ బాటిల్, గ్లాసు వగైరాలు తెచ్చుకుంది. ఫ్రిజ్ లోంచి సోడా తెచ్చుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS