లేవలేకపోయారాయన.
"ఈ దేహం ఇంత బలహీనమైందే. దీనికి ఒక్కరోజు తిండి నిద్ర విశ్రాంతి కరువయితే మరుసటిరోజుకే ఇలా నీరసం పడిపోతుందే! ఈ దేహం కోసమా ఇంత తాపత్రయం! ఆస్తి ఐశ్వర్యం ఇల్లు, దొడ్లూ ఇవన్నీ ఈ దేహానికేం మేలుచేస్తాయి?
"ఈ భోగభాగ్యాలు, ఈ సుఖాలు అవేం ఉపకరిస్తాయి? ఒక్క ఆరోగ్యం లోపిస్తే అన్నీ వృధాయేకదా! అది తెలిసీ మనుషులెంత మూర్ఖులుగా వుంటారు? డబ్బన్, ప్రేమనీ, హోదా అనీ అధికారం అనే ఆరాట పడతారేం?"
ఉవ్వెత్తుగా వస్తున్న ఆలోచనా పరంపరల్ని ఆపుకుని పార్వతీ! అని పిలిచారాయన, ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమె మొదటిపిలుపుకే పలకలేదు.
"పార్వతీ" మళ్ళీ పిలిచారు.
ఆ పిలుపుకీ లేవలేదు. విద్య చటుక్కున మేలుకుని లేచి కూర్చుంది.
"ఏం నాన్నగారూ!"
"మీ అమ్మని లేపమ్మా! బయటికి వెళ్ళాలి. కాస్త తోడుగా వస్తుంది అంతదాకా!"
"అమ్మా! అమ్మా"
ఉలికిపడి లేచిందామె.
"ఏమ్మా! ఏమ్మా! ఏమైందండి" అంది గాబరాగా.
"యేం లేదులే పార్వతి! అలా లెట్రిను దాకాచేయి పట్టుకో అన్నాడు లేవబోతూ.
భర్తకి ఆసరాగా నడుస్తూ ఆయన్ని తీసికెళ్ళింది.
కాలకృత్యాలు తీర్చుకుని, స్నానంచేసి జపానికి కూర్చున్నారు. భార్య యిచ్చిన వేడి వేడి కాఫీ పుచ్చుకున్నారు. ఆయన మామూలుగా వుండటం చూసి అందరూ సంతోషించారు.
దాదాపు ఎనిమిది గంటల ప్రాంతంలో డాక్టర్ పార్ధు వచ్చేసరికి కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నారాయన.
"హలో! మామయ్యా! ఎలా వున్నారు?" చిరునవ్వు నవ్వుతూ అడిగాడు.
బదులుగా నవ్వారాయన.
'నీలాంటి డాక్టరు ఉంటే జబ్బులు రమ్మన్నా వస్తాయా? వచ్చినా ఈ ప్రాంతంలో నిలబడతాయా?"
కుర్చీ లాక్కుని దగ్గరగా కూర్చుని ఆయన్ని పరీక్ష చేసి "పరవాలేదు! ఒక పూటకే ఇంప్రూవ్ మెంటు కనిపిస్తుంది. బాగా విశ్రాంతి తీసుకోండి. ఏవీ ఆలోచించకండి. మామూలుగా అయిపోతారు."
"వారంరోజులు సెలవా? హెడ్మాష్టరు ఏడ్చిపోతాడు. టెన్తు క్లాసు వాళ్ళ పాఠాలు దెబ్బతింటాయి."
"పోనివ్వండి మీ ఆరోగ్యం కంటేనా? తర్వాత చెబుదురుగాని పాఠాలు. లీవ్ లెటర్ రాయండి. నేను మెడికల్ సర్టిఫికెట్ యిస్తాను. రెండూ జతచేసి పంపండి. అంతగా అయితే ఎం.ఎల్. శాంక్షన్ చేస్తాడు."
"అక్కర్లేదులే కాజువల్ లీవ్ చాలా వుంది."
పార్వతి పార్ధుకి కాఫీ యిస్తూ "మీ మామయ్య ఏనాడయినా సెలవు పెట్టారా! పార్దూ. తల్లిదండ్రులు తిధి వస్తే కూడా మధ్యాహ్నం బడికి వెళతారు. ఎలావుంది ఆయనకి" అంది.
కాఫీ అందుకుని "చెప్పానుగా అత్తయ్య! రెస్టు అవసరం. వారంరోజులు సెలవు పెట్టెయ్యమంటున్నాను" అన్నాడు.
"సెలవు పెట్టండి" అంది పార్వతి.
అదోలా చూశారు శాస్త్రిగారు. "ఏమేవ్! పార్ధుని అలా వెళ్ళనీ! మరీ అతనెదురుగానే సెలవుచీటీ రాసెయ్యమనకు. భార్యా విధేయుడనుకుంటారు. కొత్తగా పెళ్ళయిన కుర్రాడు చెడిపోతాడు" అన్నారు నవ్వుతూ.
పార్ధుకి ఆమాటలు నవ్వు తెప్పించాయి.
"అదేవిటి మామయ్య అలాగంటారు. మంచి అన్నది ఎవరు చెప్పినా వినాల్సిందే! భార్యా, భర్తా తారతమ్యం లేదు. కొందరికి భార్యా విధేయులుగా ఉండడంలో ఆనందంవుంది. అదో క్వాలిఫికేషన్ అనుకుంటారు. మరికొందరు భార్యని తన చెప్పుచేతుల్లో అధికారంలో బంధించాలని చూస్తారు.
"ఇంతకీ తమరే తరగతి కిందకొస్తారో" అప్పుడే వచ్చిన శ్రీవిద్య తమాషాగా అడిగింది_.
"భార్య భర్తలు స్నేహితుల్లా కలసిపోవాలి. ప్రేమకి ప్రతిరూపాల్లా జీవించాలి. అనురాగానికి ఆలయాల్లాగా ఆనందంగా అపురూపంగా వుండాలి. ఒకప్పుడు ఆమె మాటనే విన్నా, మరొకసారి, నామాట ఆమె మన్నించినా పరస్పరం అన్యోన్యంగానే నిర్ణయాలు తీసుకుంటాం"_ గర్వంగా ఫీలవుతూ అన్నాడు డాక్టరు పార్ధు.
'అన్యోన్య ఆదర్శ దాంపత్యమన్నమాట' శ్రీవిద్య ప్రశంసా పూర్వకంగా చూసింది.
"అలాగే వుండాలి నాయనా! మా పెద్దవాడు చూశావుగా_ ఆమేమో పుట్టింట్లో, వీడేమో ఆ స్కూలు పట్టుకుని"
తల్లి మాట పూర్తి కాకుండానే కోసలరాం తల్లికి మాట్లాడవద్దని సైగ చేశాడు. పెద్దకొడుకు మాటరాగానే శాస్త్రిగారి ముఖం కళావిహీనమై పోయింది.
శ్రీవిద్య లీవ్ లెటరు తీసుకొచ్చింది.
"నన్ను మరీ... చాదస్తుణ్ణీ చేస్తున్నారమ్మా. ఇంతమండి చెపుతుంటే సెలవు పెట్టనా?" అని సంతకం చేసి "ఇదిగోనయ్య మీ యిష్టం. యీ వారం రోజులూ మీరు చెప్పినట్లుగానే వింటాను. ఏం పెడతారో, ఎలా చూసుకుంటారో పందానికి వెళ్ళే పహిల్వాన్ లా తయారు కావాలి" అన్నారు తాత్కాలికంగా తన విచారం మరచిపోతూ_
భర్త ఆరోగ్యంగా ఉండటం మామూలుగా ఉండటం ఆమెకెంతో తృప్తిగా వుంది. మధ్యలో కొడుకు మాట గుర్తుచేసి, ఆయన మనసు నొప్పించానే అనుకుంది.
పార్థు ఇంజెక్షన్ చేసి "చెప్పినట్లల్లా వినే పేషంటు వుంటే నూటికి తొంభై రోగాలు మాయమౌతాయి మామయ్యా! చిక్కల్లా ఎక్కడోస్తుందంటే ఎవరూ వినరు!"
"ఎలా వింటారు డాక్టరుగారూ! రిక్షావాడిని బాగా రెస్టు తీసుకుని, యాపిల్ జ్యూస్ లు, పళ్ళ రసాలు తాగమంటే ఎలా తాగుతాడు. వాడికి రెక్కాడితే గానీ డొక్కాడదే. వాడికంత ఖరీదైన సలహాలు చెపుతుంటారు మీ డాక్టర్లు"...
పార్థు నవ్వేశాడు. "అదీ నిజమేకానీ ... మాకేం సరదానా? లేనిపోనివి కల్పించి చెపుతామా? విన్నట్లే నటిస్తారు కానీ ఒక్కరూ మామాట వినరు. అలాంటి పేషంట్లతోనే చిక్కంతా... "అని" యిదిగో యీ టాబ్లెట్స్ వేసుకోండి మూడు పూటలా. మళ్ళి నేను రేపు వుదయం యీ వేళకే వస్తాను... అని వెళ్ళిపోయాడు.
