Previous Page Next Page 
వారధి పేజి 24


    "ఇక నుంచి బుద్ధిగా మసులుకో. ఏదైనా  నీకు తెలియకపోతే  నన్ను అడుగు" శిక్ష విధించిన అబ్బాయి హుందాగా ఆ మాట అని ఆ ఫోటోని  అక్కడే చింపి  పారవేసి  వెనుదిరిగేడు. మిగిలినవాళ్లు  అతన్ని  అనుసరించేరు.



                           *    *    *


    నీళ్ళబిందె  తిన్నెమీద పెట్టి  వెనుదిరిగిన  మీనాక్షి. వరదరాజుని చూసి ఆశ్చర్యపోయింది.

    "వరదం, నువ్వెప్పుడు  వచ్చేవు?" అంది.

    "నీ వెనకనే వచ్చేను. వదినా!"

    "ఎలా వచ్చేవు ?"

    "నడిచి వచ్చేను."

    "ఆది కాదయ్యా నేను అడుగుతున్నది! ఇప్పుడు సెలవులు  లేవు కదా _ వారం మధ్యలో  ఎలా వచ్చేవని?"

    "నేనక్కడ  ఉండి  చదువుకోలేను, వదినా!"

    "సలక్షణంగా  హాస్టల్లో  ఉండి  చదువుకోమంటే  ఏమయిందయ్యా నీకు?" కాస్త కటువుగానే ఆ మాట అంది మీనాక్షి.

    తను తిరిగి వచ్చినందుకు  సంతోషిస్తుందనుకొన్న  వదిన  ఆ విధంగా మాట్లాడడం  చూసిన వరదరాజు కళ్ళలో నీళ్ళు నిలిచేయి. ముఖం  వాల్చుకొని  కాలితో  నేలను  రాస్తూ  నిలబడిపోయేడు.

    అప్పుడే  కూరమడిదగ్గర నుంచి  వచ్చిన శివయ్య  "రాజూ, నువ్వెప్పుడు వచ్చేవు ?" అంటూ పలకరించేడు.

    "ఇప్పుడే వస్తున్నాడు. మీ తమ్ముడికి  బంగారు తండ్రిలా పట్నంలో ఉండి  చదువుకోమంటే  కాలిలో  పురుగు  దొలిచిందిట" అంది  మీనాక్షి  వరదరాజు వంక  చురచుర చూస్తూ.

    "నువ్వు ఊరుకో, మీనాక్షీ! వాడు అంతదూరం  నుంచి అలసిపోయి ఇంటికి వస్తే కాస్త పాలో, నీళ్ళో ఇచ్చి  కూర్చోమనడం  లేక తగువుకి  సిద్ధపడ్డావేమిటి ?" అన్నాడు శివయ్య.

      'అన్నయ్య ఎంత  మంచివాడు!' అనుకున్నాడు  రాజు.

    "అన్నయ్యా!" అంటూ కౌగిలించుకొని, అంతవరకూ  ఆపుకొన్న దుఃఖాన్ని  ధారాళంగా  వదలిపెట్టేడు.

    "లే రాజూ, లేచి కాళ్లు చేతులు  కడుక్కురా, మీ వదిన  ఆవుపాలు వేడిచేసి  ఇస్తుంది." అంటూ  అతడిచేతుల్ని  తప్పించేడు  శివయ్య. కళ్ళు తుడుచుకొంటూ  రాజు  ఇంట్లోకి వెళ్లేడు.

    "వాడిని ఇంటికి రాగానే  అలా హడలకొట్టేస్తే  లాభం  లేదు మీనాక్షీ! మెల్లిగా  సంగతి సందర్భాలు  తెలుసుకోవాలి" అన్నాడు  శివయ్య.

    రాత్రి భోజనాలు అయేక  వరదరాజు దగ్గిరినుంచి  రాగలిగినంత  సమాచారం  రాబట్టింది మీనాక్షి. అతడు చెప్పిన  మాటల్నిబట్టి  ఆ లేత హృదయం ఎంతగా గాయపడిందో  అర్ధం చేసుకొంది. 'కాని, అతడి భయానికి  నేను వంతపాడితే  ఇంక వరదరాజు గ్రామం  పొలిమేర  దాటడు. ఈ సమయంలోనే  అతనిలో ధైర్యం  పాదుకొనేలా  చేయాలి' అనుకొంది.

    "చూడు, వరదం! ఏ కొత్తపని  చేయబోయినా  మొదట్లో  ఏవో సాధక బాధకాలు  ఉండనే ఉంటాయి. అంతమాత్రం చేత ఆ పని జోలికి పోకపోతే  కొత్త విషయాలు  నేర్చుకోడం  ఎలా సాధ్యపడుతుంది? కాస్త ఓపికపడితే  నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి.

    "నీ తోడివిద్యార్ధులకి  నీమీద  కక్షకాని, నిన్ను చదువుకోనీయకుండా  వెడలగొట్టాలన్న  కాంక్షకాని  ఎందుకుంటుంది? కేవలం  తమాషా  కోసం  ఏదో ఒకటి  చేసివుంటారు. అంతమాత్రంతో  హడలిపోయి  నువ్వు ఇలా  ఇంటికి  పరుగులు  తీస్తుంటే  వాళ్లు మరీ హేళన  చేస్తారు. నువ్వు  ధైర్యంగా  నిలబడి, ఏదైనా  జరిగినా  తేలిగ్గా  నవ్వి  ఊరుకుంటే  వాళ్ళు అల్లటి మానుకొంటారు. ఏడుస్తున్నవాణ్ణి  ఇంకా  ఏడిపించాలానే  సరదా  ఉంటుంది  కొందరికి" అంటూ  నచ్చజెప్పింది  మీనాక్షి.

    "నీకు  హాస్టలు గురించి  ఏమీ తెలియదు,వదినా! వాళ్ళు  నన్ను తిండి తిననీయరు. నిద్రపోనీయారు. క్లాసులో  కూర్చొని శ్రద్ధగా చదువుకోనీయరు. ఒక రోజు  ఏమయిందో  తెలుసా, వదినా...." చెప్పుజోడు  ఉదంతం  అంతా కళ్ళనీళ్ళతో  చెప్పేడు  రాజు.

    "మొదటిరోజున  నేనంటే  ఎంతో  అభిమానంగా మాట్లాడిన  ఆ టీచరు అందరిముందరా  తిట్టిపోసేడు. ఇప్పుడు నేను ఎక్కడ  కనిపించినా  పురుగును చూసినట్లు  చూస్తాడు."

    "దానికేం ఫరవాలేదు, వరదం! కొంచెం కాలం  గడిచి  నీ ప్రవర్తన, నీ తెలివితేటలు చూస్తే  అతడే తిరిగి  తన అభిప్రాయాన్ని  మార్చుకొంటాడు. బాగా చదువుకొనే  పిల్లలంటే  మాస్టర్లకి ఎంతో అభిమానంగా  ఉంటుందిట. నిన్నెవరూ  అసహ్యించుకోలేరు."

    రాత్రి వరదరాజు కన్ను  మూసేవరకూ  ఏదో ఒకటి చెబుతూనే ఉంది  మీనాక్షి. అతడు నిద్రపోయేడని  తెలుసుకొన్నాక  కంఠం వరకూ  దుప్పటి కప్పి  తన పక్కమీదికి  చేరుకుంది.

    "మరిదిగారికి  హితోపదేశం చెయ్యడం పూర్తయిందా?"__శివయ్య ప్రశ్నించేడు.

    "ఏం హితోపదేశమో....ఏం గోలో....పిల్లడు  ఇంతలా  హడలిపోయేలా  అక్కడివాళ్ళు  ఏం చేసేరో?" అంది నిట్టూరుస్తూ  మీనాక్షి.

    "చేసింది వాళ్ళు కారు _ నువ్వు. పట్నంలో  చదువుకొంటున్న  పిల్లాడిని చిన్ననాటినుంచి  నలుగురితో  కలిసి ఇటు, అటు తిరగనిస్తే  ఈనాడు ఇంతలా  పిరికిమాత్రలు  చప్పరించేవాడు కాడు. హాస్టలునిండా  కొన్ని వందల మంది  కొంచెం అటూ ఇటూగా  నీ మరిది వయస్సులో  ఉన్నపిల్లలే ఉంటారు. వారంతా ఎలా తిని, ఎలా చదువుకొంటున్నారు? బహుశా వాళ్ళకి  ఇంటి దగ్గర నీవంటి  వదినగార్లు  ఉండి ఉండరు."

    "మీరు అనవసరంగా నామీద  నిందలు  వేస్తున్నారు. నేను మాత్రం  వరదుణ్ణి మిగిలిన పిల్లలతో కలిసి తిరగవద్దన్నానా? బాగా చీకటి పడితే ఆ ముళ్ళదారంట  పురుగో, పుట్రో ఉంటుంది. కాస్త  వెలుగు ఉండగానే  ఇంటికి  వచ్చేయి అనేదాన్ని. ఆది కారణంగా  వరదుడు పిరికివాడు అయిపోతాడా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS