ఏమీ అనలేదు సారధి.
"సరే ఆమె జీతం యివ్వకపోగా - నీ జీతంలోనూ తక్కువిచ్చావేమిటి?" అన్నారు నారాయణ.
ఇక జవాబివ్వక తప్పలేదు సారధికి.
"తనని నేను డబ్బు అడగను నాన్నగారూ! ఒకరికి యిద్దరం అయినందువల్ల నెలసరి పాకెట్ ఖర్చులకి ఎక్కువ కావలసి వస్తుంది."
నారాయణకి అతని మాటలు అర్థంకాలేదు.
ఇదేమిటి? అనుకున్నారు. హక్కుల కోసం సరదాల కోసం డబ్బు మిగుల్చుకోటం బావుంది. కానీ బాధ్యతల్ని పంచుకోకపోతే ఎలా? అసలే మధ్యతరగతి కుటుంబం.
ఒకరోజు యిద్దరు గెస్ట్ లు వస్తే మజ్జిగ పలుచన అయిపోతాయి. నెయ్యి తరిగిపోతుంది. ఒక పూట టిఫిన్ కోతపడుతుంది.
రెండోసారి కాఫీ యివ్వడం వుండదు సరికదా మొదటిసారే క్వాంటిటీ కాస్త తగ్గుతుంది. ఈ విషయాల్లో యిన్నాళ్లు యీ యింట్లో తిరిగేవాడికి తెలియవని ఎలా అనుకోవాలి? భార్యని డబ్బు అడగటం నామోషీ అన్నట్టుగా వుంటే ఎలా? "అడగను నాన్నగారూ!" అనటంలో నామోషీ లేదు అనుకున్నారాయన. కానీ ఆ మాటలు పైకి అనలేదు.
తండ్రి మౌనాన్ని రెండు నిమిషాలు గమనించి సారధి బయటికి వెళ్ళాడు.
మరో అయిదు నిమిషాలకి సుబ్బరత్నమ్మ వచ్చింది.
ఏమీ అనకుండా డబ్బు చేతిలో పెట్టారాయన.
లెక్క పెట్టుకుని ప్రశ్నార్థకంగా భర్తవైపు చూసిందామె.
ఆయన జవాబివ్వలేదు. ఎటో చూశారు.
"ఈ నెల నుంచి కొత్తకోడల సభ్యత్వం వచ్చింది. మరచిపోయారా? ఒక వ్యక్తికి నెలకి కనీసం మూడొందలవుతుంది. దానికితోడు కోడలు వచ్చిందని చూసిపోయేవారు వస్తారు. వాళ్ళకి కాఫీలు వీలయితే టిఫిన్లు, మరికొందరికి రవికె ముక్కలు యివ్వాలి. ఇవన్నీ అదనపు ఖర్చులు. కనీసం నాలుగొందలయినా ఎక్కువ యివ్వాలి యిప్పట్నుంచీ." అందామె.
"పర్స్ ఖాళీ అయింది. అదనంగా ఎక్కడి నుంచి తెచ్చివ్వను ?"
"ఏం ?"
కనుబొమలు ముడివేసిందామె.
"సారధి తగ్గించి యిచ్చాడు."
సుబ్బరత్నమ్మ విచిత్రాన్ని వింటున్నట్టు ముఖం పెట్టింది. సారధి నుంచి యీ నెల అదనంగా వస్తుందనుకున్న ఆమె ఆశ నిరాశ అయ్యేప్పటికి ఆమె ముఖ కవళికలు మారిపోయాయి.
"ఎందుకట?"
"భార్యతో కలిసి సినిమాలకి వెళ్ళేందుకు, హోటళ్ళకి వెళ్ళేందుకు, సిటీ బస్సు ఛార్జీలకని తీసుకున్నట్టుంది."
"ఉద్యోగం చేసే దొరసానిని చేసుకున్నాడుగా. ఆవిడ జీతం ఏమయింది? పైగా వీడిచ్చేదాంట్లో కోత ఎందుకని?"
జవాబు చెప్పలేక పెదవి విరిచారాయన.
"అధికారం ఒక్కటే చాలదు. అదుపుచేసే శక్తి వుండాలి. ఐక్యరాజ్యసమితిలో లాగా ఒక్కొక్కరు వీటో చేస్తూపోతే సంసారం ఎలా నడుస్తుందట? కంట్రోల్ చేయలేని లీడర్ షిప్ ఎందుకట?"
ఆమె మాటల్లో వ్యంగ్యం బాగా ధ్వనించింది. చాలా ఏళ్ల సాహచర్యం. వారిద్దరి మధ్యా వున్న అన్యోన్యత వల్ల ఆమె మాటలు వింతగా అనిపించలేదు నారాయణకి. కాకపోతే కాస్త విసుగనిపించింది.
"నాకీ పదవీ వద్దు, ఈ బాధ్యతా వద్దు. ఈ రోజు నుండి నీవే తీసుకో" ఆమెకి తగినంత హేళనగా తనూ అన్నారాయన.
"బావుంది. ఏదయినా చిక్కొచ్చినప్పుడు వదిలేసి వెళతానంటే ఎవరొప్పుకుంటారు? కోడల్ని పిలవండి. డబ్బు అడగండి. ఆ మాత్రం అడగడానికి మనకి అధికారం లేదా యేం?" తీవ్రంగా అంది సుబ్బరత్నమ్మ.
"రత్నం! అమ్మాయి కాపురానికొచ్చి పక్షం రోజులు దాటలేదు. మనం కొంత సభ్యతా, కొంత సఖ్యతా కనబరచాలి."
ఆయన మాటలు యింకా పూర్తికాలేదు. అంతలోనే వారుణి వచ్చిందక్కడికి. ఆయన మాటలు ఆమె చెవిన పడినట్టు లేదు.
