నాకు సెల్ఫ్ సిటీ లేదు. కాని ఏదో అస్పష్టమైన పరిధి. ఎక్కువ భాగం నిద్రతో గడిపేస్తున్నాను. మనసు బావుండకపోతే నిద్రలేక ఎలా బాధపడతామో, ఒక్కోసారి మనసు బావుండకపోతే నీరసమావహించినట్లు ఎక్కువ నిద్ర కూడా వస్తూ వుంటుంది.
ఓ రోజు ఇంటి పక్క వాళ్ళొచ్చి పేరంటానికి పిలిచారు. వాళ్ళ పిల్ల పెద్దమనిషియిందట. పేరంటం, భోజనాలు.... ఈ తతంగమంతా వున్నాయి.
రజస్వలయితే పేరంటం దేనికో అర్థం కాలేదు. అనుక్రూరంగా వస్తోన్న ఆచారం. రజస్వల అయినప్పుడు నక్షత్రం వగైరాలు మంచివి కాకపోతే శాంతి కోసం పూజా కార్యక్రమం. ఈ నక్షత్రాలకూ ముహూర్తాలకి అంత బలమున్నదా? అంటే దివ్యమైన ముహూర్తం అని చెయ్యబడిన పెళ్ళిళ్ళు ఎన్ని దారుణంగా విచ్చిన్నం కావటం లేదు. సమర్తాడినప్పుడు ఎన్ని శాంతులు చేయించినా, ఆ ఆడపిల్లల జీవితాల్లో కొన్ని ఎంత భయంకరంగా తారుమారవలేదు?
ఏమయినా వెళ్ళటానికే నిర్ణయించుకున్నాను. వెళ్ళకపోతే తప్పుగా తీసుకుంటారు కదా.
సింహాసనంలా కనుల పండువుగా ఏర్పాటు చేసిన వేదిక మీద నిండా పదమూడేళ్ళు నిండని ఆ పిల్లని పెళ్ళికూతురిలా అలంకరించి అసీనురాల్ని చేశారు. ఆ అమ్మాయి కొంత సిగ్గు పడుతున్నా. ముఖంలో, కళ్ళలో గొప్ప అనుభూతికి లోనవుతోన్న గర్వం, అనుభూతి తొణికిసలాడుతున్నాయి.
నిజానికి వాళ్ళు చాలా మధ్యతరగతి కుటుంబీకులు. కాని ఎంత అప్పు చేశారో కాని డబ్బు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చుపెడుతున్నారు. పేరంటానికి చాలామంది వచ్చారు. వచ్చినవాళ్ళు ఎంతో కొంత చదివిస్తున్నారు. నేనో పాతిక రూపాయలిచ్చాను. అతిధులందరికి ఏవో పళ్ళాలు, గిన్నెలు పంచిపెడుతున్నారు. తర్వాత భోజనాలు, కొన్ని వందలమందికి, చిత్రమేమంటే చాలామంది మొగవాళ్ళు కూడా వచ్చారు. పొరుగూళ్ళ నుండి కూడా వచ్చారు.
వెనుకటి రోజుల్లో పెళ్ళిళ్లు అయిదురోజులు చేసేవారు, అంత దుబారా చేసేవాళ్ళూ, ఇంత దుబారా చేసేవాళ్ళు, అని విమర్శిస్తారు. కాని ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనేమిటి. ఒక్కరోజు పెళ్లి చేసినా, ఆ అలంకరణా, విద్యుత్ దీపాలు, బ్యాండ్ మేళాలు, మ్యూజిక్ అట్టహాసం.... సరే కట్నం, వేషధారణలు అప్పటికన్నా ఎన్నో వందల రెట్లు ఖర్చు.
అసలు నాగరికత ప్రపంచం ఎటువైపు పరిగిడుతోంది? ఎప్పుడూ పుట్టింరోజులు, మేరేజ్ డేలు.... ఏదో వంక మీద పార్టీలు, మీటింగులు, సన్మానాలు.... ఓ అజ్ఞాన సముద్రం పంచ రంగులు పులుముకుని పరవళ్ళు త్రొక్కుతూ పొంగుతున్నాయి.
ఆ రాత్రి చాలాసేపు ఇలాంటివే. ఆలోచనలు తరిమి తరిమి కొట్టాయి. గుండెల్లో ఏదో బరువు. ప్రతి ఒక్కరూ, అలా చెయ్యనవసరం లేని వారు కూడా తమది కాని జీవితం జీవిస్తున్నారు. ఏదో ముసుగులో, భేషజంలో జీవిస్తున్నారు.
ఆ మర్నాడు చాలా ఆలస్యంగా నిద్రలేచాను.
ముఖం కడుక్కుని కాఫీ త్రాగబోతూండగా బయట కారాగిన చప్పుడయింది. అంతకుముందే ఎవరయినా వస్తే చీటికీమాటికీ లేవాల్సి వస్తుందని తలుపు గడియ తీసే ఉంచాను.
ఓ నిమిషం తర్వాత సుకుమార్ లోపలి కొచ్చాడు.
ఎందుకో, వచ్చింది అతనే అయివుంటాడని ముందే అనిపించింది.
స్నానం అదీ చేసి, నీట్ గా డ్రెస్ చేసుకుని ఉన్నాడు.
'కూర్చోండి' అన్నాను మర్యాదగా.
"ఇప్పుడే నిద్రలేచారా? అందమైన అమ్మాయిలు ఆలస్యంగా నిద్రలేచినా, అందులో ఓ సోయగముంది."
నవ్వి "కాఫీ తీసుకొస్తానుండండి" అని గబగబా కాఫీ కలిపి ఇద్దరికీ రెండు స్టెయిన్ లెస్ స్టీలు గ్లాసుల్లో పోసి తీసుకొచ్చి, ఓ గ్లాసు అతని కందించి ఎదురుగా కూర్చున్నాను.
"కాఫీ చాలా బావుంది. అన్నాడు కొంచెం త్రాగాక."
నేను కాఫీ చాలా బాగా త్రాగుతానని తెలుసు.
"కాఫీ వగైరాల గురించి కొంచెం చెప్పాలని ఉంది. చెప్పమంటారా?"
"చెప్పండి"
"కాఫీ కప్పులో కన్నా గ్లాసులో తాగితే బావుంటుంది. గాజు గ్లాసులో కాదు స్టీలు గ్లాసులో"
నవ్వి ఊరుకున్నాను.
"గ్లాసు నిండా ఇస్తే విసుగ్గా ఉండి మూడ్ పోతుంది. సగం కన్నా తక్కువగా ఇస్తే తాగినట్లుండదు. గ్లాసులో త్రిఫోర్స్.... అంటే మీరిప్పుడు డిచ్చినట్లు.... అప్పుడు దానికో వాతావరణ మేర్పడుతుంది.
అతని పరిశీలన నాకు ముచ్చటగానే ఉంది.
"ఇంకా చెప్పాలంటే చాలా పాయింట్లున్నాయి. టీ గ్లాసులో కన్నా కప్పులో బావుంటుంది. ఆఫ్ కోర్స్ నేను టీ లైక్ చెయ్యననుకోండి. పాలు గాజు గ్లాసులో తాగితే బావుంటుంది. బోర్ కొడుతున్నానా?"
"లేదులెండి"
"అవునూ.... ఇంత పొద్దు పోయినా మీరు స్నానమదీ చేసి ఇంకా ఎందుకు రెడీ కాలేదు."
"అంత అర్జంటుగా రెడీ అయి ఎక్కడకూ వెళ్ళాల్సిన పనిలేదు కాబట్టి. ఇంకోటేమిటంటే ఎవరో వెంటపడి తరుముతున్నట్లు అంత అర్జంటుగా తెమలటం నాకిష్టం లేదు ఇలా తాపీగా కానివ్వటమే సుఖంగా ఉంటుంది.
"మీరేం చేసినా బావుంటుంది."
చాలా యధాలాపంగా అని ఉంటాడు. కాని ఆ మాటలు గుండెల్లోంచి వచ్చినట్లనిపించి కళ్లలోకి చూశాను.
ఇద్దరి కళ్లూ కలుసుకున్నాయి.
కళ్ళూ కళ్ళూ కలుసుకోవటమనేది ఎవరూ నిర్వచించలేని అనుభూతి.
"కొంతమంది అమ్మాయిలు ట్రిమ్ గా డ్రెస్ చేసుకున్నాక ఎంత అందంగా ఉంటారో, అదేమీ లేకుండా పనిలో అలసిపోయి ఉన్నస్థితిలో కూడా ఓ సోయగాన్ని విరజిమ్ముతూ ఉంటారు."
