Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 24


    "ఇదిగో పార్వతీ... అమ్మాయి పెళ్ళి చేయాలి... అంతదాకా ఆ యమధర్మరాజే స్వయంగా నాకోసం వచ్చినా అడ్డి, ఆ గడప అవతలే నిలబెడతాను తెలుసా?" ఆయన కళ్ళల్లో వింతవెలుగు కనిపించింది.

    "మామయ్యా! మీరు విశ్రాంతి తీసుకోండి. పార్థు ఈ మాత్రలు ఇచ్చాడు. హాయిగా నిద్రపడుతుందట! వేసుకోండి" అంది స్వాతి.

    కోడలి ముఖంవంక పరిశీలనగా చూశారాయన. ఆ ముఖంలో ఎంత ఆందోళన? ఆ కళ్ళల్లో ఎంత భయం? ఆ పలుకుల్లో ఎంత ఆప్యాయత? ఈమె గతేంకావాలి? తానిలా అర్ధాంతరంగాపోతే? ఊహు! తను చావుని ఇప్పుడే ఆశ్రయించకూడదు? దాన్ని అల్లంత దూరంలో నిలబెట్టేయాలి అనుకున్నారు.

    మాట్లాడకుండా మామగారికి టాబ్లెట్ ఇచ్చి మంచినీళ్ళందించింది. అవి అమృతంలా అనిపించింది ఆయనకి.

    టాబ్లెట్ వేసుకున్నాక మరో పదినిమిషాలకు ఆయన కళ్ళు బరువుగా వాలిపోయాయి.

    మరో అరగంట తర్వాత ప్రశాంతంగా నిదురిస్తున్న ఆయన్ని చూసి "పదండత్తయ్యా! కొద్దిగా ఎంగిలి పడుదురుగానీ! ఉదయంనుంచి ఏమీ తినలేదు. నిండు ఇంట్లో ఆ భోజనం ఉండరాదు. పదండి. పద విద్యా! నువ్వులే ముందు" అంది స్వాతి.

    పార్వతికి తిండిధ్యాసేలేదు. కానీ కోడలు చెప్పింది విన్నాక నాలుగు మెతుకులు నోటిలో వేసుకుని లేచింది. కోసలరాం, శ్రీవిద్య వాళ్ళని అనుసరించారు. భోజనం ఎలాగో అయిందనిపించారు.

    భోజనాలు చేసివచ్చాక మరోసారి శాస్త్రిగారిని చూసి ఎవరి గదుల్లో వారు పడుకున్నారు. పార్వతి, శ్రీవిద్య ఇద్దరూ శాస్త్రిగారి మంచంవద్దే పడుకున్నారు. పార్వతికి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు. పిచ్చిపిచ్చి ఆలోచనలు! భవిష్యత్తును గురించి... భయంకరమైన వూహలు...

    బాగా పొద్దుపోయాక అలసిన శరీరం విశ్రాంతిని కోరింది. ఉదయంనుంచి భోజనం లేకపోవటం, అప్పుడు తినటంతో నిద్ర కళ్ళపైకి వచ్చింది.

    శ్రీవిద్య మాత్రం చాలా పొద్దుపోయేదాకా పడుకోలేకపోయింది.



                              *    *    *


    "నిప్పులాంటి వంశానికి చెదలు పట్టినట్లు శాస్త్రిగారి అబ్బాయికిదేంపోయే కాలం? కులం, గోత్రం మంట కలిపి ఆ నాయుడమ్మ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు." గుళ్లోకి వెళ్ళబోతున్న పార్వతి ఆ కంఠం విని చటుక్కున ఆగిపోయింది.

    నలుగైదుగురు వ్యక్తులు దేవాలయం అరుగుమీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

    "అసలు వీళ్ళిద్దరికీ లంకె ఎలా కుదిరిందిరా?" మరో కంఠం కుతూహలం ప్రదర్శించింది.

    "ఏమోలే! మనకెందుకొచ్చిన గోల? రేపు వాళ్ళిద్దరికీ పిల్లలు పుడితే అప్పుడుంటుందిమజా?" మొదటిగొంతు ఉత్సాహంగా పలికింది.

    పార్వతికి నవనాడులూ క్రుంగిపోతున్నట్లు, తల నేలమీదకు వాలిపోతున్నట్లు అనిపించసాగింది.

    "శాస్త్రిగారి మనవడ్నని చెప్పుకుంటాడో, నాయుడమ్మ మనవరాల్నని చెప్పుకుంటదో...?"

    నాలుగు కంఠాలు ఒక్కసారిగా "ఆహ్హహా!" అని నవ్వేశాయి.

    "అమ్మాయిగారు చేపలకూర తింటుంటే__అబ్బాయిగారు పప్పు, అన్నం తింటారు కాబోలు...!"

    "మరి ఆ పుట్టిన పిల్లలు...!?"

    "రెండూ కలిపి కొట్టేస్తారు!"

    మళ్ళీ నవ్వులు.

    "ఒరే__గురూ! పేర్లెలా పెట్టుకుంటార్రా_"

    "ఆవాళ్ళ ఏడుపు వాళ్ళేడుస్తారు మనకెందుకు. శాస్త్రి నాయుడమ్మో, నాయుడమ్మ శాస్త్రి, ఏదో ఒకటి అన్నీ కలిపి పెట్టుకుంటారు."

    బ్రాహ్మల పిల్లాడు బాగా ప్లానేశాడు గురూ_ బోలెడు ఆస్తి. చుక్కలాంటి పిల్లా... కులం పోతేనేం అనుకున్నాడు."

    "ఈ రోజుల్లో కులం ఎవడిక్కవాలయ్యా డబ్బు! డబ్బులోనే వుంది మహత్యం__ ఆ శాస్త్రిగారు నాలుగు రోజులు కోపంతో బిగుసుకుపోతాడుగానీ_ తర్వాత కొడుకుని పిల్చుకోడాయేం" మరో గొంతు ధీమాగా పలికింది.

    "అంతే! అంతే! అది మామూలే! కన్నకొడుకుని కాదనుకుంటారా ఎవరైనా?" ఒక పెద్దమనిషి కంఠం సమర్ధించింది.

    పార్వతికి తల తిరిగిపోతున్నట్లనిపించి అక్కడే కుప్పలా కూర్చుండిపోయింది.

    అంతలో మరో దృశ్యం కనులముందు మెదిలింది.

    శ్రీవిద్యని చూడటానికి పెళ్ళివారొచ్చారు. అబ్బాయి డాక్టరు, బాగున్నాడు__అందరికీ ఇష్టమైంది. అన్నీ కుదిరాయి. మనసులు కలిశాయి ముహూర్తాలు పెట్టుకోవటమే తరువాయి_

    హటాత్తుగా ఎవరో అయోధ్యరాం సంగతి పెళ్ళికొడుకు తండ్రి చెవిని వేశాడు.

    ఆయన అగ్గిరాముడే అయిపోయాడు. శాస్త్రిగారిని అనరాని మాటలన్నాడు.

    "సాంప్రదాయమంటే ప్రాణమిచ్చే కుటుంబం మీది అనుకున్నాంగానీ__ఇలా వర్ణ సంకరం చేసుకుని దాచుకుంటారనుకోలేదు. ఇంకానయం_ చూసి చూసి గోతిలో పడ్డాం కాదు."

    విసురుగా లేచాడాయన.

    అంతటిదాకా చిరునవ్వులు చిందులేస్తున్న పెళ్ళివారి ముఖాలు చిటపటలాడాయి ఆ చీత్కారాలతో లేచి నిలుచున్నారు.

    శ్రీవిద్య కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. వరుడు శ్రీవిద్య వంక బాధగా చూస్తూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న వాళ్ళ అడుగులు తన గుండెమీదే పడుతున్నట్లు విలవిల్లాడి పోయిందా మాతృ హృదయం.

    పార్వతికి హటాత్తుగా మెలకువొచ్చింది. చటుక్కున లేచి కూర్చుంది. పక్కనే శ్రీవిద్య ఇంకా నిద్రపోతోంది. "అమ్మయ్య! ఇదంతా కలా? ఆమె గుండెలమీద చేతులు వేసుకుని నిట్టూర్చింది. ప్రేమగా కూతురి తల నిమిరి భగవాన్! ఈ పసిదాని జీవితం అన్యాయం చేయకు అని మనసులోనే భగవంతుని ప్రార్ధించింది.

    మామూలుగా అయిదు గంటలకే మెలకువొచ్చింది శాస్త్రిగారికి. అలవాటుప్రకారం రామచంద్రాష్టకం చదువుకుని లేవబోయారు. కానీ శరీరం సహకరించలేదు. నిస్సత్తువా, నీరసం పూర్తిగా ఆక్రమించుకున్నాయి_


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS