హాయిగా అన్నయ్య పట్నంలో ఉంటే తనకీ హాస్టలు బాధ తప్పును. వదిన చక్కగా తినేందుకు అన్నీ చేసి పెట్టును. కాని ఎలా? అన్నయ్య అట్టే చదువుకోలేదు. గ్రామంలో ఉండకపోతే వ్యవసాయం ఎవరు చూస్తారు? లేకపోతే తినేందుకు తిండి ఎలాగ వస్తుంది?
అన్నయ్యా, వదినా, పూర్ణా పట్నం వచ్చి ఉండే మార్గం ఏదైనా ఉందా? ఆలోచనలని అటు ఇటు పరుగులెత్తించేడు వరదరాజు. చివరికి చిక్కిందో చక్కని ఊహ. తను బాగా చదువుకొని ఉద్యోగం చేస్తాడు. అప్పుడు సత్తిబాబులా తను పొలాలను కౌలు కిచ్చి అన్నయ్య, వదిన, పూర్ణ వచ్చి తనతో ఉంటారు. పూర్ణ హాయిగా ఇంటిదగ్గర ఉండే కాలేజీలో చదువుకొంటుంది.
ఈ ఆలోచన రాగానే ఆ రోజు తను కాలేజీకి పోలేదనీ, ఆవిధంగా చదివితే తను పరీక్ష పాసు కాలేననీ తోచింది వరదరాజుకి. 'ఇక నుంచి ఏమైనా కాలేజీ మానివేయకూడదు, రోజూ విధిగా వెళ్ళాలి, అనుకొన్నాడు.
తను చేయబోయే ఉద్యోగం, కట్టబోయే మేడ గురించి ఆలోచిస్తూనే నడక సాగించేడు రాజు. నీటిమీద నుంచి వచ్చిన చల్లని గాలి అతని ముఖానికి కొట్టింది. పరిసరాలు చూసి తను ఎక్కడ ఉన్నదీ గ్రహించుకొనేసరికి తను హాస్టలు దిక్కుగాకాక గ్రామంవైపు నడుస్తున్నట్లు తెలుసుకొన్నాడు.
అప్పటికే బాగా చీకటి పడింది. వంతెన మొదటి నుండి హాస్టలు రెండుమైళ్ళు పైగా ఉంటుంది. బస్సుమీద పోవాలంటే జేబులో డబ్బులు లేవు. ఏ బస్సు ఎటు పోతుందో కూడా తనకు తెలియదు. కాస్త త్వరగా నడిస్తే సరి. కాలికి బుద్ధి చెప్పేడు.
వరదరాజు హాస్టలు చేరేసరికి మెయిన్ గేటుని తాళం వేసి ఉంది. సాధారణంగా ఆ గేటు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ అర్ధరాత్రికో తాళం వేస్తారు. రెండో ఆట సినిమాకి వెళ్ళి వచ్చిన పిల్లలు అట్టే ఎత్తులేని ఆ పక్కగోడమీదికి ఎక్కి ఆవరణలోకి గెంతివేస్తారు. ముందురోజు రాత్రి నిద్ర రాక, గది కిటికీలో నించి బయటికి చూస్తుంటే ఎవరో కాంపౌండ్ గోడ ఎక్కినట్లు అనిపించింది వరదరాజుకి. దొంగలు కారు కదా అని ఊపిరి బిగపట్టి అటే చూసేడు.
ఒకరి తరవాత ఒకరుగా నలుగురు పిల్లలు గోడ దూకి లోపలికి వచ్చేరు. నవ్వుతూ, తుళ్ళుతూ, మాట్లాడుకొంటూ రాజు గది పక్కనుంచి వెళ్ళిపోయేరు, దగ్గిరగా వారిని చూసి పోల్చుకున్నాడు రాజు. వాళ్ళు హాస్టల్లో ఉంటున్న పిల్లలే.
గేటు పదకొండు గంటలకి ముందుగా తాళం వెయ్యరు. అప్పుడే అంత రాత్రి అయిపోయిందా? తను మతి లేకుండా ఆ వీథి, ఈ వీథి తిరుగుతూ ఉండిపోయేడు. ఇప్పుడు ఏమిటి మార్గం? వెనక్కి తిరిగి వెళ్లిపోతే ఎక్కడ పడుకోడం? రాత్రి గదిలో లేవని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని జవాబు చెప్పడం?
ముందురోజు తను చూసిన దృశ్యం వరదరాజుకి గుర్తుకు వచ్చింది. 'అవలీలగా మామిడిచెట్లు చింతచెట్లు ఎక్కిపోగలిగిన నేను ఈపాటి గోడ ఎక్కలేనా? గప్ చిప్ గా గోడ దూకడమే మంచిది' అనుకున్నాడు. నెమ్మదిగా గోడ ఎక్కి ఒక కాలు ఆవరణవైపుకి వేసేడు. అంతలో ఏదో మెరుపులాంటిది మెరిసింది. వెంటనే నాలుగైదు కంఠాలు పకపకమన్నాయి. అదురుపాటుతో నేలమీద బోర్లా పడ్డాడు వరదరాజు. నోటినిండా, ముక్కునిండా బుగ్గి కూరుకు పోయింది.
"ఓహో, వరదరాజులుంగారు రాత్రి షికార్లు మొదలు పెట్టేరా? గోడలు గెంతడంకూడా నేర్చుకొన్నారా?" గట్టిగా అరుస్తూ వెళ్లిపోయేరు ఆ పిల్లలు.
మరునాడు సాయంకాలం వరదరాజు తన గదిలో కూర్చుని ఉండగా తలుపు తోసుకొని పదిమంది పిల్లలు గదిలోకి జొరబడ్డారు. వారిలో ఒకరు ముందుకు వచ్చి "నీ పేరు వరదరాజేనా?" అంటూ ప్రశ్నించేడు.
"అవును" అన్నాడు రాజు.
"ఈ ఫోటో నీదేనా ?"
రాత్రి గోడ దూకుతుండగా తీసిన ఫోటో ఆది. ఫోటోల గురించి వరదరాజుకి తెలిసింది అతి స్వల్పం. ఒకసారి పంచాయితి బోర్డు ప్రెసిడెంటుగారింట పెళ్ళిలో పెళ్ళివారంతా కలిసి ఒక ఫోటో తీయించుకొన్నారు. ఆది తిన్నగా రాకపోతే ఎండ తగినంత లేదని, అందువల్ల అలా వచ్చిందని అనుకొన్నారు. మరి రాత్రి పూట ఈ ఫోటో ఎలా తీసేరు ?
"అవును, నాదే" అన్నాడు గొంతు సవరించుకొంటూ.
"రాత్రి పూట హాస్టలు వదిలి బయట తిరగడం, పైగా గోడ దూకి రావడం తప్పుపని అని నీకు తెలుసా?"
'తెలుసు' అన్నట్లు తల ఊపేడు వరదరాజు.
"మరి కావాలనే రూల్సు ఉల్లంఘిస్తున్నావన్నమాట! ఈ ఫోటో ఇప్పుడు వార్డెనుగారికి చూపిస్తున్నాను. తోటివిద్యార్ధివి ముందుగా నీకు తెలియజెయ్యడం మంచిదని వచ్చి చెప్పేను."
ఒక నిందితుడికి జడ్జి 'పదేళ్ళు ఖైదుశిక్ష విధిస్తున్నాను' అని చెప్పినట్లు గంభీరంగా ముఖం పెట్టి అన్నాడు ఆ విద్యార్ధి.
అంతమంది ముందు బావురుమన్నాడు రాజు. "ఇంకెప్పుడూ ఇలా చెయ్యను" అన్నాడు ఏడుపు ఆపుకొంటూ.
"పది గుంజీలు తీసి చెంపలు వేసుకో. అప్పుడు నీ మాట నమ్ముతాను" అన్నాడు ఆ పిల్లడు.
ఎప్పుడో చిన్నప్పుడు వీథిబడిలో రామప్పంతుల ముందు గుంజీలు తీసేడు వరదరాజు! అటు తరవాత ఎప్పుడూ ఇటువంటి శిక్షకు గురికాలేదు. కంట నీరు కారుస్తూ పది గుంజీలు తీసేడు.
