తల గొక్కున్నాడు అతను "నాకదంతా తెలీదమ్మా"
నవ్వింది మళ్ళీ "ఫర్వాలేదులే! ఈ దోపిడికీ మీరూ మేమూ కూడా అలవాటు పడ్డాం. అయినా నేను అన్యాయం చెయ్యను. పండిన పంటలో పదో భాగం నీ కిచ్చేస్తాను. నీ కూలీ కాక.
సాగిల పడ్డాడు సోము. అతనికి ఆమె దేవతలా కన్పించింది.
"సోమూ! లే! ఈ తత్త్వం మారాలి."
అతనేం అన్లేదు.
"మనుషులంతా ఒక్కటే! శరీర నిర్మాణంలో తేడా లేదు. తెలివితేతల్తో, పెంపకంతో, చదువుతో వస్తాయి. డబ్బు సృష్టించిన వర్గబెధంలో నాకు నమ్మకం లేదు. రేపు నువ్వు పదెకరాల ఆసామివై ఎలక్షనుల్లో నుంచుని ఎమ్మెల్యే వై అదృష్టం కలిసివస్తే మంత్రి వైతే మేమంతా నీకు పడి పడి దండాలు పెడతాం. అప్పుడేమౌతుంది. నీ బలహీనత. ఎప్పుడో అనాది కాలంలో సృష్టించిన ఆర్ధిక వ్యత్యాసాలు చాలా ప్రమాదకరమైనవి."
"అమ్మగారూ! నేను నమస్కరించింది మీ కులం గొప్పతనానికి మీ ఆస్తి తెచ్చిన గొప్పతనానికి కాదు. మీ గొప్ప మనసుకి.'
భార్గవి కళ్ళు చెమ్మగిల్లాయ్.
అతను చూడకుండా అటు తిరిగి కళ్ళు తుడుచుకుంది.
"అమ్మగారూ! మీ వంటి వాళ్ళు అయ్యగారి లాంటి వాళ్ళు వూరి కొక్కరుంటే దేశం యిలా గుండెదా! రామరాజ్యం కాకున్నా గాంధీగారు ఆశించిన గ్రామ రాజ్యం వచ్చుండేది . ప్చ్"
భార్గవి ఏం అన్లేదు.
ఇద్దరి మనసులూ కృతజ్ఞతా భావంతో వున్నాయి.
10
"దేశం మారిపోతోండయ్యోయ్"
"దేశమా! ఊరా!"
"ఊరు మారితే దేశం మారుతున్నట్టే!"
"ఏంటో ఆ మార్పు"
"చౌదరీ, నాయడూ! మీరిద్దరూ అలా పేక ముక్కలు విసురుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటూ వెళితే మాకేం తెలుస్తుందోయ్" అన్నాడు మునసబు.
షో చేశాడు శేఖర్.
అందరూ డబ్బు లిచ్చేశాక శేషయ్య మళ్ళీ దస్సు కలిపేడు. ముక్కలు పంచుతూ "మీరు ముగ్గురూ ఎన్ని మల్లగుల్లాలు పడ్డా భార్గవి ముందు చిత్తే! మాలపేట మాదిగ పేట ఆమెకి దాసాను దాసంగా ఉంటున్నాయి! రేపు ముఖ్యమంత్రి సడన్ గా మనసు మార్చుకుని పంచాయితీ ఎన్నికలు జరిపితే భార్గవి నుంచుంటే మీ కేవరికీ డిపాజిట్ కూడా రాదు. ఆమె సర్పంచి అయి తీరుతుంది. అన్నాడు.
"ఏమా గ్యారెంటీ!"
"కృతజ్ఞత చాలా బరువైంది!"
"మనం మేలు చేద్దాం!" అన్నాడు చౌదరి.
"ఎట్లాగా! అప్పులిచ్చా?"
కారణం ఎద్దేవా చౌదరి నషాళాని కంటింది. అంతా "నా వడ్డీ వ్యాపారాన్ని అనేవాళ్ళే. మీ రాలోచించి వూరిని గుప్పెట్లో పెట్టుకోకూడదూ?"
నవ్వేడు కరణం.
"బంజరు పట్టలిప్పిస్తామా!" అన్నాడు రెడ్డి.
ముక్కు మీద వేలేసుకున్నాడు శేషయ్య.
"అయ్యో అది ఆయనకి నిత్య పాడికి కల్పవృక్షం, కామధేనువు ఎండిపోతాయేమో గాని అది ఎండిపోదు ." చురక వేశాడు శేఖర్.
"నువ్వు నోర్ముయ్యరా!" కసురుకున్నాడాయన.
"మరేం చేద్దాం!"
"కరణం బుర్రే ఆలోచన చెప్పాలి!"
"నాయుడూ! ఆఖరికి నిందలు నాకే గదా"
"అదేంటి లేవయ్యా! మనమంతా ఒక్కటే!"
"ఇట్లాటి దాంట్లో నేనా!"
"నిన్ను దేన్లో కాదన్నాను మామా!"
"చౌదరీ! మీ జనార్ధన్ రికామిగా వున్నాడు కదా"
