Previous Page Next Page 
రాగోదయం పేజి 23

 

    రక్త నిష్టమైన గుణాలు కొన్ని వుంటాయి. అవి మానవుల బలహీనతకి ఔన్యత్యానికి కారణ భూతాలు అవుతాయి. శౌర్యం ,దానం ధర్మ లాగే నీతి నిజాయితీల్లాగే సేవా భావం కూడా.
    అతని మాటలకి ఆశ్చర్యపోయింది భార్గవి.
    నిజాయితీతో నిర్మల చిత్తంతో అతనన్న మాటల్ని నమ్మింది.
    "సోమూ! ఒకేసారి బరువంతా తలపైకి ఎట్టుకోవద్దు మోయలేం . ఈ కారుకి తీరిపోయిన కౌలు భూములు మనం చేసి చూదాం. తోటలు అంతే. ఈ కారు గడిస్తే నాకు నువ్వు , నీకు నేనూ అర్ధమవుతాం. మా చిదా ఒట్టి అమాయకుడు. వాడికేం తెలియదు. ఎవరేం చెబితే అది నమ్ముతాడు. నష్టపోతాం మేము. ఏమంటావు చెప్పు ! ఒకసారి ఏమయిందో తెలుసా!"
    "ఏంటమ్మా గారూ!"
    "భూషయ్య మా మాగాణి కౌలుకి చేశాడు. మీ అయ్యగారు పోయిన సంవత్సరం. అయిదెకరాల చెక్క అది తెలుసుగా కాల్వ కింద చేను, పొలం నాటించాడు దగ్గరుండి. నేలపైరు బ్రహ్మాండంగా పెరిగింది కలుపు తీయించాడు. మళ్ళీ రసాయనిక ఎరువులు వేయాలిగా, పది బస్తాల ఎరువులు బండిపై వేసుకుని వెళ్ళారు యిద్దరు. పది గంటల దాకా ఎరువులు చల్లారు నాలుగు బస్తాలు! తర్వాత మాకు భోజనానికి టైం అయింది. మీరు యీ ఎండలో ఎందుకుండాలి. నే చల్లించి వస్తా మీరు వెళ్ళండి అన్నాడట భూషయ్య. ఇంటికి వచ్చి ఆ మాట చెప్పాడు. భోజనం చేశాక నేను కేక వేస్తె వెంటనే బయలుదేరి వెళ్ళాడు. వీడు పొలం వెళ్ళేసరికి భూషయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమిటని అడిగితే ఎవరో నలుగురు అటుగా వస్తే అంతా గబగబా చల్లించి వచ్చానన్నాడట . అది జరిగిన మూడో రోజే అయిదు బస్తాల ఎరువులు అమ్మేసుకున్నాడు భూషయ్య. ఏం చేస్తాం! ఏమని అడుగుతాం!"
    నివ్వెర పోయాడు సోము "అంత మోసమా ?" అన్నాడు.
    "సోమూ దగాపడ్డ వాళ్ళకి అన్నీ చరిత్రలే. లక్ష్మయ్య కూడా మాకు కౌలుకి చేశాడు. మా పెద్ద చేను అతని పొలాన్ని అనుకునే వుంది కదా! కూలికి మనుషుల్ని పిలిచే వాడు మావాడు కొద్ది సేపు వుండి యింటికి వచ్చేవాడు. కూలీలతో పాటే ఆఖరి దాకా వుండలేకపోయేవాడు వాడిటు యింటివైపు తిరగ్గానే కొందరి కూలీల్ని తీసి తన పొలం కలుపు తీయించేవాడు యేమని అడగ్గలం!
    సోము మనస్సు జాలితో కరిగిపోయింది . వాడికి భార్గవి కష్టపడింది వింటుంటే అంతా దగాకోరులే అనిపించింది.
    "అందుకే వాళ్ళిచ్చింది వచ్చింది చాల్లే అనుకున్నాను.
    "అమ్మగారూ!"
    "ఊ"
    "ఓ సారి బాలి రెడ్డి కళ్ళం నుంచి గింజలు తాలూకు బండి తనింటికి తోలుకెళ్ళాడట కదా!'
    "నీ కేలా తెలుసు?"
    "మా నాయన మా అమ్మతో చెపుతూ వుంటే విన్నానులే! మా అమ్మ తిట్టిపోసింది ఆరోజు"
    నిట్టూర్చింది భార్గవి. "సోమూ! అలా నెమరు వేసుకుంటే అన్నీ కధలే, గాధలే! తలుచుకున్న కొద్ది బాధ అంతే!"
    "అమ్మగారూ! చిన్నబ్బాయి పద్దయ్యేదాకానే పని చేస్తా" నవ్వింది భార్గవి ఆ మాటలకి.
    "ఏమ్మా నవ్వుతారు?"
    "జీతం కోసం అంత కష్టపడతావా!"
    "చాలమ్మా!"
    "అది మాత్రం దోపిడీ కాదూ?"
    "ఎలాగమ్మా!"
    "నీ శ్రమతో వేలకి వేలు జత చేసుకుంటూ, నీకు కూలీ పేర పది రూకలిస్తే అది దోపిడీ కాక యింకేమిటి!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS