"ఎలా ?"
"అంతగా కాదు కూడదని నీవు పట్టుపడితే ట్యూషన్స్ చెపుతాను. ఏదైనా ట్యుటోరియల్ కాలేజీల్లో పార్ట్ టైం చేస్తాను. గైడ్స్ రాసి సంపాదిస్తాను. మా నాన్నకి మాత్రం రాయొద్దు." అంది వారుణి. "మీకింత డబ్బు వ్యామోహం వుందని అనుకోలేదు రధీ! నా చేతనైనంత రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి యిస్తాను...ప్లీజ్. వ్రాయకండి!" బేలగా వెలువడిన ఆమె మాటలకి నిర్వీణ్ణుడయ్యాడు సారధి.
"చిన్నా !"
వారుణి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఏం మగవాళ్ళో! మమతలకీ అనురాగాలకీ అర్థం తెలుసా వీళ్ళకి? వేదిక లెక్కి లెక్కలేకుండా మాట్లాడతారు. ప్రేమించిన స్త్రీతో పెళ్ళికాక ముందు ఒకలా మాట్లాడతారు. పరాయి స్త్రీతో ఎంతో మర్యాదగా, మన్ననగా మెలుగుతారు. తమతో సమానస్థాయిలో వున్న భార్యని గౌరవించలేరు. భార్య కాగానే ఆమెకున్న ప్రత్యేకతలన్నీ పోతాయా? మగవాళ్ళ యీ కాంప్లెక్స్ ని ఏమనాలి?
వారుణి గుండెలు బరువెక్కాయి. మదిలోని భావాలు ముఖంపై ప్రస్ఫుటంగా ప్రకటిత మవుతున్నాయి.
ఎదురుగా నిలబడలేక చప్పున బయటికి వెళ్ళిపోయాడు సారధి.
నిర్లిప్తంగా వుండిపోయింది వారుణి.
9
నెలలో ఆఖరి వర్కింగ్ డే. జీతాలు వచ్చాయి.
సారధి తన జీతం తీసుకువచ్చి తండ్రి చేతికి యిచ్చాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ అదే అలవాటు. తన చేతి ఖర్చులకి మాత్రం వుంచుకుని మిగిలిందంతా యిచ్చేస్తాడు. తన పుట్టినరోజుకి మాత్రం గుడ్డలు తనే కొంటాడు సారధి. మిగిలిన సమయాల్లో అందరికీ సుబ్బరత్నమ్మ, పెద్ద కోడలు సావిత్రి తెస్తారు.
సారధి యిచ్చిన డబ్బు లెక్కపెట్టుకున్నాడు నారాయణ.
మామూలుగా యిచ్చేకంటే తక్కువగా వుంది.
కొడుకు వైపు ప్రశ్నార్థకంగా చూశారాయన.
సారధి ఏమీ అనలేదు.
"ఇంతే యిచ్చావేమిటి?"
"మిగతా మాకోసం దాస్తున్నాను"
"ఎందుకట?"
తండ్రి వైపు అదోలా చూచాడు సారధి.
"వారుణి జీతం తీసుకోలేదా?" నారాయణ ప్రశ్నించాడు.
తల ఆడించాడు సారధి.
"మరి యివ్వలేదేం? తనే తెచ్చియిస్తుందా?"
తండ్రి ఆరా తీస్తున్న వైనం సారధికి యిబ్బందిగా వుంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ముందే వూహించాడు. అయినా వారుణి దగ్గర ప్రసక్తి తేవడానికి అతని మనసొప్పలేదు. అంతకుముందు డబ్బు కోసం తామిద్దరి మధ్యా జరిగిన గొడవ అతని చెవుల్లో రొదపెడుతూనే వుంది.
"ఇవ్వదేమో నాన్నగారూ! ఇన్నాళ్ళ మా పరిచయంలో ఏనాడూ మామధ్య డబ్బు ప్రసక్తి రాలేదు. ఇప్పుడు రాదు."
ఆశ్చర్యపోయారాయన ఆ మాటలకి. ఆనవాయితీకి గండి పడినట్టనిపించింది. భార్య దగ్గర డబ్బు ప్రసక్తి తేలేనంటున్న కొడుకుతో ఏమి చెప్పాలో తోచలేదాయనకి.
ఒక్క క్షణం ఆలోచించారు.
"సారధీ_ఇన్నాళ్లూ లేదు. ఇంతకు ముందు మీరు ఫ్రెండ్స్_ప్రేమికులూ. డబ్బు రసక్తి మీ మధ్యరాకపోవటంలో ఆశ్చర్యంలేదు. కానీ ఇప్పుడలా కాదు. భార్యాభర్తలు మీరు. ఒక ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తులు. కుటుంబ బాధ్యతని పంచుకోవడంలో కొడుకుగా నీకు_ కోడలిగా వారుణికి భాగం వుంది. దాన్ని కాదనలేరు కదా."
తలూపేడు సారధి.
"కోడలిగా యీ యింట్లో అడుగుపెట్టిన క్షణం నుండీ కుటుంబ ఖర్చుకీ, ఆదాకీ కూడా ఆమె భాగస్తురాలే. తన సంపాదన కూడా యింట్లో యివ్వడం ఆమెకి ధర్మం_న్యాయం. ఏమంటావ్?"
