"నాన్నకి గుండెపోటా?" భయపడిపోయిన శ్రీవిద్య తండ్రివైపు దిగాలుగా చూసింది. ఆ కళ్ళల్లో భయం, ఆందోళన ప్రస్ఫుటించాయి. ఆయన మంచంమీదనే పాదాలవద్ద కూర్చుని మెల్లిగా కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
"విద్యా!" మందలింపుగా పిలిచాడు కోసలరాం.
"అన్నయ్యా!"
"నాన్నకేం ఫరవాలేదమ్మా! ఈ వయసులో సామాన్యంగా యిలాంటివి వస్తూనే వుంటాయి. మనం భయపడి ఏడుస్తూ కూర్చుంటే ఎలా?"
"నాన్నకెప్పుడూ యిలా కాలేదు" బేలగా అంది.
"ఏం కాదన్నానుగా ఊరుకో! ఆయనకిప్పుడు మెలకువ వొచ్చి చూస్తే మళ్ళీ గాబరాపడొచ్చు. బి.పి. పెరిగితే మళ్ళీ ఎటాక్ వస్తుందేమో? ఆయన్నొకవారందాకా డిస్టర్బ్ చేయొద్దన్నాడు డాక్టర్. బాగా విశ్రాంతి తీసుకుంటే ఏం ఫరవాలేదట."
శ్రీవిద్యకి ఏం మాట్లాడటానికీ భయం వేసింది. ఆమెకి చప్పున తన పెదనాన్న గుర్తుకి వచ్చాడు. ఆయనా అంతే! కొడుకుతో దో చిన్న తగాదా వచ్చింది. అదేరోజు పాలికాపు ధాన్యం తెచ్చాడు. పంటలు సరిగా పండలేదని కొంత ధాన్యం తగ్గించుకోమన్నాడు.
అసలే కోపంగా వున్న ఆయన మరింత మండిపడ్డాడు. కోపంతో మాటలు జారాడు. ఇద్దరికీ తగాదా వచ్చింది. ఒకర్నొకరు మాటలనుకున్నారు. ఆ ఆవేశంతో రైతుమీద చేయిచేసుకోబోయి పడ్డాడు.
లేవదీసేసరికి మనిషి తేలిపోతున్నాడట. డాక్టర్ని పిలుచుకువచ్చారు వెంటనే. ఆయన వచ్చి హార్ట్ ఎటాక్ అన్నారు. ఆ రోజు మూసినకన్ను మళ్లీ తెరవనేలేదు. అప్పుడప్పుడు స్మృతి వచ్చినా గట్టిగా కేకలు వేసేవాడు. మూడురోజులు అలాగే మంచంలో వుండి అలాగేపోయాడు.
ఆయన గుట్టువిప్పి చెప్పని మనిషి. ఎవరికెంత యివ్వాలో, ఎవరెంత యివ్వాలో కూడా ఎవరికీ తెలీదు. ఆయనపోయాక చాలామంది నోటిగుర్తుతో అప్పుతీసుకున్నవాళ్ళుకూడా ఎగేశారు. ఇవ్వాలని వచ్చినవాళ్ళ సంఖ్యే తక్కువ. నోట్లువున్న వాళ్ళు కూడా వడ్డీ తీసేసి కొందరు, అసల్లో తగ్గించి కొందరు, యిచ్చినా చెల్లువేయలేదని కొందరు రకరకాలుగా ఎగేశారు.
దాంతో మూడుపూవులు ఆరుకాయలుగా వున్న సంసారం తీన్ తేరా అయింది.
ఆ అన్న పోలికే ఈ తమ్ముడికి వచ్చిందా?
భగవాన్! తమ సంసారమూ అలా కాబోతుందా?
ఆమెకి పెదనాన్న కుటుంబ విషయాలు ఒకటొకటే గుర్తుకి రావడంతో దిగాలుపడి భయపడిపోయింది. ఆందోళన చెందింది_ ఆరాటపడింది. అయినా మెల్లిగా ధైర్యం తెచ్చుకుని తనకు తనే స్థయిర్యం తెచ్చుకుంది. గుండె నెమ్మది పరుచుకుంది.
ముఖానలేని చిరునవ్వు పులుముకుంది.
"ఏం భయంలేదమ్మా! నాన్నగారు త్వరలో కోలుకుంటారు. రామాయణం రాస్తున్న పుణ్యం ఊరికే పోతుందా! పైగా రామభక్తుడాయన. తన కొడుకులందర్నీ ఆ ప్రభువు పేరుతో పిలుచుకుంటున్నాడు. నిత్యం సేవించాడు. ఆస్వామి కరుణ వూరికే పోతుందా?" అంది తల్లితో గంభీరంగా.
మేకపోతు గాంభీర్యంతో తల్లిని ఓదార్చాలని శ్రీవిద్య అన్న మాటలు అప్పుడప్పుడే స్మృతిలోకి వస్తున్న శాస్త్రిగారి చెవుల్లో అమృత సోనలా పడ్డాయి. ఆయన మెల్లిగా కళ్ళు తెరిచారు. ఆ సంధ్య వెలుగులో సాక్షాత్ శ్రీవిద్యలా వెలుగుతున్న శ్రీవిద్య ఆయన కళ్ళకి అపరదేవీ మూర్తిగా కనిపించింది.
"అమ్మా" అన్నారు మెల్లిగా.
ఆయన కంఠం సన్నగా ధ్వనించింది.
ఆయన గొంతువినగానే పార్వతి, స్వాతి, శ్రీవిద్య, కోసలరాం చప్పున దగ్గరికి వచ్చారు.
"ఏం నాన్నా?" అంది ఆప్యాయంగా శ్రీవిద్య.
'ఎప్పుడొచ్చావమ్మా?"
"ఇప్పుడే నాన్నా!"
"సాయంకాలం నాకు తలతిప్పి నట్లయిందమ్మా! రామాయణం చెపుతూ చెపుతూ అలాగే వాలిపోయాను. ఏమయిందో నాకు తెలీలేదు."
శ్రీవిద్య ఏం చెపుతుందోనని భయపడ్డ కోసలరాం_ "మీకేం కాలేదు నాన్నా! కొద్దిగా అలసిపోయారు. అందుకే అలా కళ్ళు మూతలు పడ్డాయి" అన్నాడు.
"డాక్టరు వచ్చాడా?" నీరసంగా ప్రశ్నించాడాయన.
"ఆఁ పార్ధు వచ్చి చూసి వెళ్ళాడు. మీకేం ఫరవాలేదు. ఏం భయంలేదన్నాడు" చెప్పింది పార్వతి.
పేలవంగా నవ్వారు శాస్త్రిగారు. "నాకేం భయమే పిచ్చిదానా! నీవు సుమంగళిగా వుండవనే గానీ నాకేం కొదవ!"
"ఛ! అవేం మాటలండీ నేను వినలేను_ _"
"కొడుకులందరూ యోగ్యులయ్యారు. నాతల్లి కూడా బాగా చదువుకుంటోంది. కన్యాదానం చేయలేదనే అసంతృప్తి లేకపోతే నా ప్రాణాలు ఎప్పుడో పోయేవి..."
"నాన్నా! ఏంమాటలు అవి? మీరలా మాట్లాడకండి. నాకు భయమేస్తుంది" శ్రీవిద్య తండ్రి హృదయంమీద చేయి వేసి రాస్తూ గాభరాగా అంది.
"భయమెందుకు తల్లీ! ప్రతి ప్రాణికి ఈ దశ ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. ఇంకో ఏడాదికో, ఏడాదిన్నరకో రిటైర్ అయిపోతాను ఎలాగూ. ఇప్పుడే శాశ్వితంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతే గవర్నమెంటు పదివేలు ఇస్తుంది..."
"ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు నాన్నా! మీరు విశ్రాంతి తీసుకోండి" కోసలరాం అడ్డుకున్నాడు. అయినా ఆయన మానలేదు.
"ఏడాదికిపైగా జీతం వస్తుంది. కొడుక్కో, కూతురుకో ఉద్యోగం ఇస్తుంది. అంతకంటే ఈ జీవికింకేంకావాలి? ఐతే నువ్వు శ్రీవిద్య నన్ను అడ్డుపెట్టేశారు"
"చాల్లెండి! నవ్వులాటకైనా ఆమాట అనకండి. మీరు లక్షణంగా వుంటే అంతేచాలు! డబ్బు ఏంచేసుకుంటామూ? తింటామా? పూసుకుంటామా" అంది గద్గదికంగా పార్వతి.
భర్త అలా అప్పగింతలు పెడుతున్నట్లుగా మాట్లాడుతుంటే ఆమె గుండె ఆర్ద్రమైపోతోంది.
"అప్పుడే అమంగళం జరిగిపోయినట్టుగా బాధపడతావేమే పిచ్చిదానా! ఐనా నీకు పునీస్త్రీ చావే రాసిపెట్టి ఉందిలే! డబ్బులేం చేసుకుంటామని అడిగిన పిచ్చిదాన్ని నిన్నొక్కత్తినే చూశాను"
"ఎన్ని భోగభాగ్యాలైనా ఎంత డబ్బయినా మీ తర్వాతే" స్థిరంగా అందామె.
