"ఏంటి సంగతి? మరిదికి పిండివంటలు ఏంటి చేసి పంపుతున్నావు?" అన్నాడు అప్పన్న దాకంత నోరు వెళ్ళబెట్టి నవ్వుతూ.
"ఈ ఉత్తరం కాస్త వరదుడి హాస్టల్లో ఇచ్చివస్తారేమో అని."
"అట్టాగా? అమ్మాయి చేతులో పెట్టు. ఎవరైనా పోయే వారుంటే పంపిస్తాను. మా ఇంటినుంచి రేపటెల్లుళ్ళ ఎవరూ పోబోవడం లేదు. అయినా ఫరవాలేదు. ఊళ్ళో కనుక్కొంటాను. నీ మరిదికి ఆ ఉత్తరం చేరేలా చూస్తాను" అన్నాడు అప్పన్న.
ఉత్తరం అప్పన్న కూతురి చేతిలో పెట్టి ఇంటికి తిరిగి వచ్చింది మీనాక్షి. శివయ్య అట్టే సేపు రామభజన మండపంలో కూర్చోలేదు. ఇంటికి వచ్చేసరికి వీధి తలుపు గొళ్ళెం పెట్టిఉంది. భార్య నిప్పుకోసమో, అప్పు కోసమో ఇరుగింటికో పోయి ఉంటుందనుకొని వీధి అరుగు మీదె కూర్చున్నాడు.
అల్లంత దూరం నుంచే తండ్రిని చూసి "నాన్న....నాన్న" అంటూ చేతులు చాచింది పూర్ణ.
"ఎక్కడికి పోయేవు?" అన్నాడు శివయ్య.
"అప్పన్నగారింటికి. పట్నం సంగతులు ఏమైనా తెలిసే యేమో అని...."
తను వరదరాజుకి ఉత్తరం వ్రాసినట్లు మీనాక్షి భర్తతో చెప్పలేదు. ఇంటిని గుర్తు చెయ్యకపోతే రాజు అక్కడ అలవాటు పడతాడని శివయ్య అభిప్రాయం. అయితే, ఇంటి వార్తలు, అన్నా వదినలు ధైర్య వచనాలు, బుజ్జగింపులు అప్పటప్పట అందుతుంటూనే వరదుడు బ్రతుకులో ముందుకు పోయే బలం సంపాదించుకొంటాడని మీనాక్షి నమ్మకం. ఉత్తరం వ్రాసినట్లు తను చెబితే'వాడికన్న నీకేఎక్కువ దిగులుగా ఉన్నట్లు వుంది. నువ్వింతగా గింజుకుంటావని తెలిస్తే ఒకసారి పోయివచ్చే వాడినే' అని భర్త అంటాడని మీనాక్షికి తెలుసు.
"ఏమిటి సంగతులు? రాజు సరిగా వున్నాడా?"
"ఈ రోజు పట్నం ఎవరూ పోలేదుట." తలుపు తీసి దీపం వెలిగిస్తూ అంది మీనాక్షి.
* * *
ఆ రోజు వరదరాజు కాలేజీకి పోలేదు. ముందురోజు అన్నయ్య రాలేకపోయిన కారణాన్ని ఊహించుకొంటున్నాడు. వుదయం నిర్జీవంగా పడివున్న బేరర్ తాత రూపాన్ని గుర్తుకు తెచ్చుకొంటున్నాడు.
పాపం. తను భోజనం చెయ్యలేదని తనకోసం ప్రత్యేకం భోజనం తెచ్చిపెట్టేడు. 'భయం లేదు బాబూ!' అంటూ ధైర్యం చెప్పేడు. ఆ ముసలి బేరర్ ని మొదటిసారి చూడగానే మంచివాడు అన్న అభిప్రాయం కలిగింది తనకు. మంచివారినే దేవుడు త్వరగా తన దగ్గిరికి పిలిపించు కొంటాడు. అమ్మా, నాన్నా మంచివాళ్ళే అయివుంటారు. అందుకే అంత త్వరగా దేవుడి దగ్గిరికి వెళ్ళిపోయేరు. అన్నయ్యా, వదినా, పూర్ణా కూడా మంచివాళ్ళే.
ఆ ఆలోచన వచ్చినందుకే వరదరాజు ఒంటిమీద వెంట్రుకలు భయంతో నిక్కపొడుచుకొన్నాయి. కాళ్ళూ, చేతులూ గడగడ లాడేయి.
అన్నయ్య ఆదివారంనాడు వస్తానని ఎందుకు రాలేదు? పూర్ణకి జ్వరం ఇంకా తగ్గలేదా? ఎక్కువ జబ్బుగా వుందా? అందువల్లే అన్నయ్య రాలేదా?
ఎంతో ఆందోళనగా కలవరపడింది వరదరాజు మనసు. గదిలో కూర్చో బుద్ధికాలేదు. క్లాసుకి వెళ్ళాలనిపించలేదు. పిచ్చివాడిలా రోడ్లన్నీ తిరిగేడు. పొద్దు అటు వాలేసరికి కడుపులో ఆకలి కరకర మన్నది. అద్దాల బండివాడిదగ్గర రెండణాల మరమరాలు కొనుక్కుతిన్నాడు. పక్కనే వున్న పంపులోనించి ఇన్ని నీళ్ళు తాగేడు. కాళ్ళు పీకుతుంటే తలుపులు మూసివున్న ఒక ఇంటి అరుగుమీద కూర్చున్నాడు.
ఆ ఇంటికి ఎదురుగా పెద్ద మేడ ఉంది. మేడకు ముందు మంచి పువ్వులతోట, ఇనుపగజాలగేటు. గేటుముందు కాపలావాడు. ఇంటి ఆవరణలో హుందాగా తోకాడిస్తూ తిరుగుతున్న పెద్ద కుక్క.
'ఈ ఇల్లు చాలా బాగుంది. నేను పెద్దవాడినై చాలా డబ్బు గడించి ఇటువంటి మేడ కట్టాలి. ఇంటిముందు ఇంతకన్నా చాలా పువ్వుల మొక్కలు వెయ్యాలి' అనుకొన్నాడు. అటువంటి మేడ కట్టాలని నిర్ణయించుకొన్నాక ఎవరు ఏ ప్రదేశం వాడుకోవాలి అన్న ఆలోచనలో పడ్డాడు రాజు.
అదిగో ఆ కుడివైపు గది అన్నయ్యకి. దానికి పక్కగా ఉన్నది వదినకి. ఆ పచ్చపరదాలు ఉన్న గది పూర్ణకి. ఆ ముందు హాలులో ఇంటికి వచ్చినవాళ్ళు కూర్చుంటారు. మేడమీద ఉన్న గదుల్లో ఒక మంచి గది తను చదువుకోవడానికి. ఇంకొకటి తను పడుకొనేందుకు ఎంచుకొంటాడు. మిగిలినవన్నీ ఎవరైనా తమ ఊరునుండి వస్తే ఉండేందుకు ఇస్తాడు.
వరదరాజు అటువంటి మేడ ఎప్పుడూ చూడలేదు. లోపల అలంకరణ ఎలా ఉంటుందో అతనికి తెలియదు. అయినా ఎలా ఉండాలో ఊహించుకొంటున్నాడు. తన ఊహల ప్రకారం ఎక్కడ ఏ వస్తువు ఉండాలో నిర్ణయించి సర్దుతున్నాడు. రెండు గంటలపాటు శ్రమించి ఆ మేడ తమకు నివాసయోగ్యంగా ఉండేలా మార్పులు చేసేడు. అంతా సరిగా ఉందని చూసుకునే సమయంలో "బొయ్....బొయ్" మంటూ ఒక నల్ల ఎంబాసిడర్ కారు వచ్చి గేటుముందు ఆగింది. కాపలావాడు గేటు తెరచి పక్కకి తప్పుకొని నిలబడ్డాడు. పోర్టికోలో కారు ఆగడంతోటే ఒక చక్కని అమ్మాయి చేతిలో పుస్తకాలు పట్టుకొని దిగింది. అంతలో ఒక నడివయసు స్త్రీ__ఆ పిల్ల తల్లి అయి ఉంటుంది__ఇంటిలోంచి వచ్చి ఆమెను ఎదురుకొంది. ఆ స్త్రీ చేతులు పట్టుకొని ఊగుతూ ఉత్సాహంగా ఏదో చెప్పుకుపోతున్నది ఆ పిల్ల.
'ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలు!' అనుకొన్నాడు వరదరాజు. తనలా చదువుకోసం ఇల్లు వదలి పై ఊరికి పోనక్కర లేదు. తనలా హాస్టల్లో కోతిమూకవంటి పిల్లలమధ్య ఉండనక్కరలేదు. వాళ్ళు చేసే వెక్కిరింపులకు జడిసి అర్ధాకలితో భోజనం ముందునుంచి లేచిపోనక్కర లేదు. కంటిమీద కునుకు లేకుండా రాత్రి అంతా డబ్బాడొక్కులమోత విననక్కరలేదు. చేయని తప్పుకి టీచరుచేత తల వాచేటట్లు చీవాట్లు తిననక్కరలేదు. ఎంత అదృష్టం చేసుకుని పుట్టింది ఈ అమ్మాయి! మనసుతీరా మరొకసారి అనుకొన్నాడు రాజు.
