"నువ్వు రోజూ రానక్కర్లేదు. పని వున్న రోజున చిదానందం పిలుస్తాడు. వచ్చి చేస్తే చాలు!" అంది భార్గవి రోజు.....సోము ప్రతి రోజూ రావటం వెళ్ళటం చూసి అందామె.
"వ్యవసాయం అంటే రోజూ చూసి చేసుకుంటేనే అవుతుందమ్మా!"
నవ్వింది భార్గవి "సోమూ! అదంతా ఆయనతో పోయింది వరిపొలం అంతా కౌలు కిచ్చేశాను. తోటలు కోరు కిచ్చాను. యింకేం పనివుంది?"
"కౌలు కిచ్చారా? ఏం గిడుతుందమ్మగారూ! అయినా గుత్త సరిగ్గా యిచ్చి ఛస్తారా వీళ్ళు? పెట్టుబళ్ళు పెట్టి చేసుకోలేరు. పంటరాదు. మీ కౌలు యివ్వరు. మామిడితోట నిమ్మతోట బత్తాయితోట- యివెందుకిచ్చారమ్మా కోరు పనితక్కువ ఫలితం ఎక్కువ కదా?"
భార్గవి ఏం మాట్లాళ్ళేదు.
"కౌలు తీరినవి, కోరు తీరినవి పొలాలు లేవామ్మా.
"ఉన్నాయి - మళ్ళీ సాగుచేయించాలి," నిస్పృహతో అంది.
"నా మాట వినండమ్మా - ఈ సారి సొంత వ్యవసాయం చేయిద్దాం!" వుత్సాహంగా అన్నాడు సోము.
నవ్వింది పేలవంగా, "డబ్బు వుంది పొలంవుంది. కానీ చేయించే దక్షత లేదు - ఏం చేయగలం?"
"నేను చేయిస్తానమ్మా" ఆవేశంగా అన్నాడు సోము.
"నువ్వు యీ ఏడాది చేయిస్తావు, తర్వాతో!"
"అమ్మా! మాకుండేది ఎకరం మాగాణి. గట్టిగా పని చేస్తే ఇరు సాలు దుక్కే నాలుగు రోజుల పని- ఓ రోజు చదును, మరురోజు పిట్టు-గట్లుపని తర్వాత నాటు-అలా అలా వెళ్ళి వస్తూవుంటే నెలకోసారి కలుపులు తీయించుకోవచ్చు ఎరువులు వేస్తే పండిపోతుంది."
"నీ కుండే పొలం అంతేనా?"
"ఓ ఎకరం మెట్టవుంది. అంతగా అయితే మనాయన, అమ్మ చూసుకుంటారు." నెమ్మదిగా అన్నాడు.
ఒక్క క్షణం మాటాళ్ళేదు భార్గవి. "అయితే నావ్యవసాయం మొత్తం చేయిస్తానంటావు"
ఆ ప్రశ్నకి తడబడ్డాడు అతను. కొద్దిసేపు మాటాళ్ళేదు. మళ్ళీ ఆమె పాదాలవైపు నిశ్చలంగా చూస్తూ "అమ్మా మాకు ఆశ తక్కువ. తిండి గడిస్తే చాలు, ఇంత తల దాచుకోవడానికి వుంది, మాకు భోగభాగ్యాలు అక్కర్లేదు. మాకు దురాశ లేదు. మీరు ఆడవాళ్ళు. మీకు ఒక్కడే కొడుకు ఆ చిన్నబ్బాయిగారు పెరిగేసరికి ఆస్తి పెరగాలి. నన్ను పనుముట్టుగా వాడుకోండమ్మా. నేను మీ చాటున బ్రతికిపోతాను" అన్నాడు.
