అతను భార్యవైపు జాలిగా చూశాడు.
"ఏం ?"
"అలా కుదరదు ?"
"ఎందుకని ?"
"అన్నయ్యా, నేనూ, నాన్నగారు నెలనెలా జీతాలు యింట్లో యిచ్చెయ్యాలి. నాన్నగారు కొంత యింట్లో అమ్మకి యిచ్చి మిగతాది బ్యాంక్ లో వేస్తారు. కుటుంబ ఖర్చులన్నీ అమ్మా, వదినా బడ్జెట్ వేసుకొని చూసుకుంటారు."
తెల్లబోయింది వారుణి.
సారధి మెల్లిగా ఆమె దగ్గరికొచ్చాడు. దగ్గర కూర్చుంటూ.
"అందుకే చిన్నా యీ పదివేలూ_" అన్నాడు.
"రధీ_దయచేసి ఆ విషయం మరచిపో. అది నాన్నగారికే యిచ్చేద్దాం. ఆయనకి వయసయింది. వృద్ధాప్యంలో ఆయన డబ్బుకోసం కష్టపడటం నాకిష్టం లేదు. నేను చూడలేను. కూతురుగా చూస్తూ వూరుకోలేను."
సారధి చప్పున లేచాడు.
భర్త చేయి పట్టుకొని లాగింది వారుణి. మంచంపై బలవంతంగా కూర్చోబెట్టింది.
"రధీ_ఎందుకీ పట్టుదల? ఇలా చూడు. ఇన్నాళ్ళు నా యీ హృదయంలో నీవొక ప్రేమ మూర్తివి, రసజ్ఞుడివి, విద్యావంతుడివి. ముఖ్యంగా ఆదర్శ యువకుడివి. ఇంతవరకు అలాగే నిన్ను చూస్తున్నాను. ఈ స్వరూపం కలలో కూడా ఎరుగను."
సారధి ముఖంలో ఎలాంటి భావమూ కనపడలేదు. నిర్లిప్తంగా భార్యవైపు చూస్తూ వుండిపోయాడు.
"రథీ! నాన్నగారు నాకో గొలుసు చేయించారు. దాన్ని పద్మ పెళ్ళికి యిచ్చేద్దాం...కానీ"
"చూశావా? పట్టుదల ఎవరిదిప్పుడు? గొలుసు యివ్వడానికి సిద్ధపడిన దానివి డబ్బు దగ్గరికొచ్చేసరికి...
"ఎందుకు వద్దంటున్నానో యింతకు ముందే చెప్పాను."
"అంతేకాని, దాన్ని మాత్రం ముట్టొద్దు అంటావ్! అంతేనా" సారధి ముఖంలో కోపం బాగా కనిపించింది.
"నీకు కోపం కూడా వస్తుందే" అంది వారుణి.
"ఏం నేను మనిషిని కానా"
నవ్వింది వారుణి "నీలో సౌమ్యతని చూసిన కళ్ళతో కోపాన్ని చూడలేకుండా వున్నాను"
"మాటలు మాత్రం బాగా నేర్చావు"
"రధీ! వాదనలు వద్దు. ఏనాడు మన మధ్య విభేదాలు రాకూడదు. దేనికీ మనం పశ్చాత్తాప పడకూడదు. అయ్యో అనుకునే సంఘటన జరగకూడదు. అలా కలిసిపోవాలి మనం"
"మొత్తానికి నీ దారికి లాక్కుపోవటానికి యింత ఉపోద్ఘాతమెందుకు! మీ ఆడవాళ్ళే అంత_ఏ విషయాన్నైనా తమ పాయింట్ కే డ్రైవ్ చేసుకుంటారు. అది మీకు వెన్నతో పెట్టిన విద్య."
వారుణికి కోపం నసాళానికి అంటింది. అయినా తొందర పడలేదు. తమాయించుకుంది.
"అధికారం చెలాయించటం, ఆధిక్యత ప్రదర్శించటం, మీ మాట వినేట్టుగా చెయ్యటం మీ మగవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కాదా యేం?" నవ్వుతూనే అంది వారుణి.
ఊహించని జవాబుకి ఖంగుతిన్నాడు సారధి. పెద్దగా నిట్టూరుస్తూ అసహనంగా చూశాడు.
"రధీ_ నువ్విప్పుడు మూడ్స్ లో లేవు. ఆ విషయం వదిలెయ్." అంది వారుణి విషయ తీవ్రతను తేలిక పరచడానికి ప్రయత్నిస్తూ.
"ఎప్పుడో కానీ, ఆ పదివేలూ నువ్వడగవు. అవునా?"
వారుణి సమాధానం చెప్పలేదు. ఆమె జవాబేమిటో ఆమె ముఖ కవళికలే వ్యక్త పరుస్తున్నాయి.
"సరే! నువ్వడగొద్దు. నేనే మామగారికి జాబు వ్రాస్తాను."
దృఢంగా అన్నాడు సారధి.
దెబ్బతిన్నట్టు చూసిందామె.
"వద్దు సారధీ! వద్దు. నా మీద ఒట్టు. అలా ఎప్పుడూ వ్రాయకండి. కావాలంటే అదనంగా సంపాదించి మీ కాళ్ళ ముందు పోస్తాను..."
వారుణి గొంతు గాద్గదికమైంది.
