Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 22


    స్నానంచేసి, తను నిత్యమూ ధూప దీపనైవేద్యాలతో అర్చించే శ్రీరామచంద్రమూర్తి వారిముందు సాగిలపడ్డాడాయన. ఆయనయేమని ప్రార్ధించారో ఆ స్వామి ఏమి విన్నాడో ఆ ఇద్దరికే తెలుసు.

    పూజామందిరం నుండి బయటికి వచ్చిన శాస్త్రిగారి మనసు తేలిగ్గా వుంది. ముఖం ప్రశాంతంగా వుంది.

    గంభీరంగా అలాగే హాల్లోకి వచ్చి "అమ్మాయ్! స్వాతీ!" అని పిలిచారు.

    మామగారి పిలుపు విని బయటికి వచ్చింది స్వాతి.

    "కాగితాలూ కలం తీసుకుని రామ్మా"

    ప్రభువు ఆజ్ఞలాగా ధ్వనించాయా పలుకులు.

    వేళకాని వేళలో స్నానం, ఈ సమయంలో రచన చేయాలనుకోవటం ఆశ్చర్యపోయిందామె. మౌనంగా వెళ్ళి పుస్తకం కలం తీసుకుని వచ్చింది. కొద్దిక్షణాలు కళ్ళుమూసుకుని, ఆశుధారావేగంతో చెప్పసాగారు శాస్త్రిగారు చకచకా రాయసాగింది స్వాతి.

    సాయంకాలం నాలుగు గంటలకి హఠాత్తుగా ఆపేశారు చెప్పటం.

    తలెత్తి చూసిన స్వాతికి మామగారి ముఖంలో ఏదో మార్పు కనిపించింది, కానీ మరుక్షణమే ఆయన ముఖం వివర్ణమవటం గమనించి "అయ్యో!" అంటూ పుస్తకం పక్కకిపెట్టి ఆయనవద్దకు వెళ్ళింది.

    అప్పటికే ఆయన బరువుగా శ్వాస పీల్చుకుంటూ కళ్ళు మూసుకుని గోడకి చెరగిల బడ్డారు.

    "మామయ్యా!" అంది గాబరాగా.

    శాస్త్రిగారు పలుకలేదు. కోడలి పిలుపు వినిపిస్తున్నా సమాధానం ఇవ్వటానికి శక్తి చాల్లేదు. గుండెమీద ఎవరో వేయి టన్నుల భారం పెట్టి నొక్కేస్తున్నట్టు గుండెని ఇనుప పిడికిలో బిగించి చిదుముతున్నట్లు అనిపించసాగింది.

    "అత్తయ్యా" కంగారుగా కేకేసింది స్వాతి.

    వంటింటి గడపమీద తలపెట్టుకుని విచారంగా పడుకున్న పార్వతి కోడలి ఆర్తనాదంలాంటి పిలుపుకి గాబరాగా లేచి వచ్చింది. వచ్చీరాగానే భర్తని చూసి "అయ్యో!" అంది.

    తల్లి పిలుపు వినగానే గదిలో కూర్చుని చదువుకుంటున్న కోసలరాం బయటికి వచ్చాడు. తండ్రినీ, తల్లినీ వదిననీ ఆ స్థితిలో చూసి బెంబేలు పడిపోయాడు.

    దగ్గరగా వెళ్ళి "నాన్నా! నాన్నా!" అని పిలిచాడు.

    శాస్త్రిగారు సమాధానం ఇవ్వలేదు. బరువుగా శ్వాస పీలుస్తున్నారు. 

    "కొద్దిగా తప్పుకోండి" అని తండ్రిని చాపమీద పడుకోబెట్టాడు. "వదినా! కొద్దిగా గాలి వచ్చేట్లు విసురునే వెళ్ళి డాక్టర్నీ పిలుచుకొస్తాను." అని వెళ్ళిపోయాడు.

    ఆందోళనగా భర్త పాదాలవద్ద కూర్చుండిపోయింది పార్వతి. ఆమె మనసు మనసులో లేదు.

    "ఇన్నేళ్ళ సంసారంలో తన మనస్సు కష్టపెట్టుకున్న ఘడియలేదు. ఈరోజు తనూ బాధపడింది. ఆ బాధ ఫలితమా? ఇది" అనుకుంది.

    మామగారికి విసురుతూ కూర్చుంది స్వాతి.

    మరో అయిదు నిమిషాలకి డాక్టరుని వెంటబెట్టుకొచ్చాడు కోసలరాం.

    డాక్టరు వస్తూనే వాళ్ళని తప్పుకోమని శాస్త్రిగారిని పరీక్షించాడు. మంచం తెమ్మని, కిటికీకి పక్కగా వేయించి మెత్తని పరుపుపై పడుకోబెట్టాడు. ఇంజక్షనిచ్చాడు. "ఏం పర్వాలేదు. కొంచెం విశ్రాంతి తీసుకోనివ్వండి. బాగా పడుకొనివ్వండిప్పుడు. ఓ వారంరోజులు స్కూలుకి సెలవుపెట్టమనండి.

    "ఈ వారం రోజులూ ఆందోళన పడకుండా, ఆవేశపడకుండా హాయిగా మంచంమీదే విశ్రాంతి తీసుకోనివ్వండి. మళ్ళీ ఆదివారానికల్లా మామూలుగా తయారవుతారు" అన్నాడు.

    డాక్టరు అలా చెప్పేసరికి పార్వతి గాభరాపడింది.

    "ఏమయింది పార్ధూ?" అని ఆందోళనగా అడిగింది. ఆ డాక్టర్ పార్ధసారధి శాస్త్రిగారి దగ్గర చదువుకున్నవాడే. చిన్నప్పట్నుంచీ ఆ ఇంట్లో చనువుగా తిరిగినవాడే. కోదండరామంతోటివాడు. అతని క్లాస్ మేటు.

    'ఏం లేదత్తయ్యా! కొద్దిగా బి.పి. వుంది. మైల్డ్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. మానసికంగా చాలా బాధపడ్డారు కాబోలు. ఏం భయంలేదులే!"

    "మనసు బాగా గాయపడింది పార్ధూ... కొడుకులు పెద్దవాళ్ళయిన తరువాత ఆయనకి మనశ్శాంతి ప్రసాదించాల్సింది పోయి. మనఃక్లేశాన్నిస్తున్నారు" బాధగా అన్నాడు కోసలరాం.

    "ఇక మాత్రం ఆయన మనసు బాధపడనివ్వకండి. ఇదిగో ఈ మాత్రలు సాయంకాలం ఒకటి, రాత్రికొకటి రేపు ఒకటి ఇవ్వు. ఇప్పుడప్పుడే నిద్దర్లేవరు. ఏడు ఎనిమిది ప్రాంతంలో నిద్రలేస్తే వేడివేడిగా ఓగ్లాసు పాలివ్వండి. హాయిగా నిద్రపడుతుంది. ఆయన్నేం ప్రశ్నించకండి. తన గురించి అడిగినా చెప్పకండి."

    అతనంతగా చెప్పేసరికి పార్వతి గుండె దడదడలాడింది. కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి.

    "ఏం భయపడకండత్తయ్య! ఏంకాదు. ఓ వారంరోజులు విశ్రాంతి తీసుకుంటే మామయ్య మళ్ళీ మునుపటిలా తయారౌతారు." అని నేవస్తా కోసలరాం అంటూ వెళ్ళిపోయాడు.

    అతన్ని గేటుదాకా సాగనంపి వచ్చాడు కోసలరాం. అతను మళ్ళీ ఏకాంతంగా, ప్రత్యేకంగా అడిగినా ఏం ప్రమాదం లేదనే చెప్పాడు పార్ధు.

    అతను తిరిగి వచ్చేసరికి దిగాలు పడిన ముఖంతో నీళ్ళు నిండిన కళ్ళతో భర్తపక్కనే కూర్చుని మెల్లగా విసురుతూ ఆయన ఛాతీమీద మృదువుగా రాస్తోంది పార్వతి.

    స్వాతి ఆయన పాదాలు వత్తుతోంది.

    కుర్చీ తెచ్చుకుని తండ్రి మంచం పక్కనే వేసుకుని కూర్చున్నాడు కోసలరాం. అతని మనస్సు అన్నగారి ప్రవర్తనా ఫలితము బేరీజు వేసుకుంటోంది. ఆలోచించేకొద్దీ అతనికి వాళ్ళపై ఒక విధమైన కోపం ప్రబలం కాసాగింది.

    సాయంకాలం ట్యూషన్ నుంచి తిరిగొచ్చిన శ్రీవిద్య ఇంట్లోని పరిస్థితిని చూసి కంగారుపడిపోయింది.

    "అమ్మా! అమ్మా! ఏమిటమ్మా? నాన్నగారికేమైంది?" ఆదుర్దాగా అడిగింది. తుఫానుముందు ఆకాశంలా అయిందామె ముఖం.

    కూతుర్ని చూడగానే అంతవరకూ నిగ్రహించుకున్నపార్వతి దుఃఖం కట్టలు తెంచుకుంది. "మీ నాన్నకి గుండెపోటు వచ్చిందమ్మా!" అతికష్టంమీద అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS