Previous Page Next Page 
వారధి  పేజి 21


    తాత  నీకు  చుట్టమా?" ఎవరో  ప్రశ్నించేరు.

    "కాదు....అవును" అంటూ  వెనుతిరిగి  వచ్చేసేడు  వరదరాజు.



                           *    *    *


    ఆ రోజు  ఆదివారం. ఉదయం లేచినదగ్గిరనుంచి  వరదరాజే  జ్ఞాపకం  వస్తున్నాడు మీనాక్షికి. 'అన్నయ్యా, ఆదివారం  నాడు  తప్పక  వస్తావు కదూ?' బండి  రాములుచేత  రాజు  పంపిన  చీటి  నడవగూటిలో  గాలికి  రెపరెప  లాడుతున్నది.

    "మీకోసం  ఎదురుచూస్తుంటాడేమో, వెళ్ళి  రాకూడదూ?" అంది భర్తకి భోజనం  వడ్డిస్తూ  మీనాక్షి.

    "అన్ని ఏర్పాట్లూ  చేసివచ్చేనని  సత్తిబాబు  చెప్పేడు. నేను  పోయి చేసేదేముంది?" అన్నాడు  శివయ్య.

    "ఏమీ చెయ్యాలని  కాదు, ఒకసారి  చూసివస్తే మనకీ, వాడికీ  కూడా తృప్తిగా  ఉంటుంది. 'పిల్లడు ఎలాగున్నాడో? ఏం తిన్నాడో, ఏం మానేడో అన్న బెంగ  నాకు తీరుతుంది. వరదుడు  అందరు పిల్లల మాదిరి పిల్లడయితే  ఇంతగా  అనుకొనేందుకు  ఏమీ లేదు. వాడు  వట్టి బెదురుపోతు. ఇల్లు  విడిచి బయట ఎప్పుడూ  ఉండనివాడు. నలుగురితో కలిసి  తిరగడం  కూడా  వాడికి  తెలియదు. తోడిపిల్లలు  ఎటువంటివారో? అనవసరంగా  వరదుణ్ణి  బాధపెడుతూంటే...."

    "ఇంటికి పిలుచుకు  వస్తావా?"

    "అలాగేం లేదు."  

    "అలాగేం లేకపోతే  ఇలాగ  మాటిమాటికి  మనం  వెళ్ళకపోవడమే మంచిది. అక్కడి జీవితానికి  అలవాటుపడుతున్న వాడికి  మళ్ళీ  ఇంటిమీద ధ్యాస  కలిగించినట్లు  అవుతుంది. నా ఉద్దేశంలో  రాజు  నువ్వనుకొంటున్నంత  అమాయకుడు కాడు. బండి రాములు  చెప్పలేదూ, పట్నంలో కాలు పెట్టేసరికి  రాజుబాబుకి మంచి హుషారు వచ్చిందని.

    "ఎల్లకాలం  వాడి మంచిచెడ్డలు  చూసే  ఓపిక  మనకి ఉంటుంది. ఉండకపోతుంది. వాడి బ్రతుకు  వాడు బ్రతికే అలవాటు  చేయడం  మంచిది. ఆది చిన్నతనంలోనే  చెయ్యవలసింది. పోనీ, ఈనాటికైనా  మించిపోయింది లేదు. నేర్చుకోనీ" అన్నాడు  శివయ్య.

    పొద్దు తిరుగుముఖం  పట్టేవరకు  'మాటవరసకి తనముందు  అలా అన్నా, ఏదో సాకు కల్పించుకొని  భర్త పట్నం  వెళ్ళిరాకపోడు' అనుకొంది మీనాక్షి. చీకటి పడబోతున్న  సమయంలో  పొలంనుండి తిరిగి వచ్చి, వంటి మీద ఉడుకునీళ్ళు  పోసుకొని "మీనాక్షి, అలా రామభజన  మండపం వైపు  పోయి వస్తాను" అంటూ  అతడు కాలు కదపడంతో  ఆ కాస్త  ఆశా వీగిపోయింది.

    అన్నపూర్ణ  ఆ ఇంటికి  కోడలుగాకాక  సవతితల్లిగా  రావడం  శివయ్య మనసుకి  అఘాతం కలిగించింది. ఆమె తన మంచి మనస్సుతో  ఆ గాయాన్ని  మానబెట్టింది. కాని, ఆ మచ్చ మాత్రం  మిగిలిపోయింది. ఆది కంట పడినప్పుడల్లా  శివయ్య  మనస్సు  విలవిల్లాడిపోతుంది.

    మీనాక్షికి  ఈ సంగతి  తెలుసు. భర్త  వరదరాజుపట్ల  బాధ్యత నిర్వహించగలడే  కాని ఏనాటికీ  మమత  పెంచుకోలేడని ఆమె గ్రహించింది.  అందువల్ల  భర్తపట్ల  ఆమెకు  కోపం, అలుసుతనం  కలగలేదు. జాలి, సానుభూతి కలిగేయి. తండ్రి  చర్య అంతలా  గర్హిస్తూ కూడా  పినతల్లిని, పిల్లడిని ఆదుకొన్నందుకు  ఆదరభావం  కలిగింది. విధి నిర్వహణకి  అతడిచ్చే  విలువకు  అతనిమీద  ఎనలేని  గౌరవం  కలిగింది.

    భర్త  అటు వెళ్ళగానే  చిన్న కాగితం  తీసుకొని  రాజుకి  ఉత్తరం వ్రాసింది  మీనాక్షి.

    "చిరంజీవి  వరదుడికి, వదిన  ఆశీర్వదించి  వ్రాయునది.

    నిన్న రోజంతా  అన్నయ్యకోసం  ఎదురుచూసి  అలసిపోయి ఉంటావు. మీ అన్నయ్య రావాలనే అనుకొన్నారు. కాని, కాలులో ముల్లు గుచ్చుకొంది. నిన్న  మన ఊరునుంచి  పట్నానికి బళ్ళు  బయలుదేరలేదు. అన్న  రాలేదని నువ్వేం కంగారుపడలేదు కదూ? నాకు తెలుసు, నువ్వు చాలా  మంచి పిల్లవాడివి. జాగ్రత్తగా  చదువుకొని  వదిన కోరిక  తీరుస్తావు.

    కాలునొప్పి  తగ్గగానే  అన్నయ్య  వస్తారు. పూర్ణ  చిన్నాన్న  దగ్గరికి తనూ వస్తానంటున్నది. దాని జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఆడుకొంటున్నది.

    నువ్వు వెళ్ళిపోయేక  రెండు మూడు రోజుల వరకు ఎర్రావు దూడ నీకోసం 'అంబా' అంటూ  అరుస్తూ  ఇటు అటూ చూసింది. 'పిచ్చిముండా, వరదం పెద్ద చదువు చదివేందుకు పట్నం పోయేడు' అని చెప్పేను. 'అలాగా' అన్నట్లు తల ఆడించి  మరి అరవడం  మానేసింది. చూసేవా, దానికి  కూడా నువ్వు  చదువుకొంటున్నావంటే  ఎంత సరదాగా ఉందో?

    మరి ఉండనా?
                                                                                                                                            ప్రేమతో,
                                                                                                                                             వదిన."
   
    ఉత్తరం  ఒకసారి  పూర్తిగా  చదువుకొని  మడతబెట్టి  రవికలో  పెట్టుకొంది  మీనాక్షి. పూర్ణని  ఎత్తుకొని  అప్పన్నగారింటివైపు  కాలు కదిపింది. అప్పన్న లంకపొగాకు  చుట్ట కొసని  మునిపళ్ళతో కొరికి  ఉమ్మి, కూతురు గరిటతో  తెచ్చిన  నిప్పు  నోటిముందు  పెట్టుకొని  చుట్ట అంటించుకొంటున్నాడు.

    "మీనాక్షమ్మ" అంది అప్పన్న  కూతురు, మెట్ల  మొదట్లో  నిలిచిన మీనాక్షిని చూసి.

    "ఏంటమ్మా  ఈ వేళప్పుడు  వచ్చేవు? శివయ్య  ఇంటికాడ  ఉన్నాడా? పొలం పోయేడా? మరిదిని పట్నం చదువుకి  పంపేవుట  కదా?" అంటూ  కుశలప్రశ్నలు  వేసేడు.

    అన్నిటికి  తగువిధంగా  సమాధానాలు  చెప్పి  "రేపుగాని  మీ ఇంటి నుంచి  ఎవరైనా  పట్నం  పోతున్నారా  బాబాయ్?" అంది మీనాక్షి.

    పల్లెటూర్లలో  పెద్దవాళ్ళని  ఏదో వరసపెట్టి  పిలవడం ఆచారం. ఆడవాళ్ళయితే  అత్తయ్యా, పిన్నీ అనీ, మగవాళ్ళయితే  మామయ్యా, బాబయ్యా అనీ, ఇంకా  ముసలివాళ్ళయితే  తాతగారూ, మామ్మగారూ అనీ _ ఇలా  వయసుల్ని బట్టి  వారి వరసలు  మారుతూంటాయి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS