"చిన్నా! నీకు ఆ డబ్బు మీద ఆశ వుందా?" కుతూహలంగా అడిగాడు సారధి నవ్వుతూనే.
"ఊహూఁ" నిర్లిప్తంగా అంది వారుణి.
"మరి పద్మ పెళ్ళి కోసం యిచ్చేద్దాం_ఊఁ" సంతోషంగా అన్నాడతను.
వారుణి జవాబివ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆమె ముఖం అరుణిని దాల్చింది.
"పలకవేం? నీకిష్టంలేదా?" కొంచెం నిష్ఠూరంగానే దబాయించినట్టుగా అడిగాడతను. రెండుసార్లు ప్రశ్నించినా ఆమె సమాధానం యివ్వకపోయేసరికి అతనికి అదోలా అనిపించింది.
"రధీ!" ఎందుకో వారుణి గొంతుకలో విషాదం పలికింది. ఆమె గొంతు కొద్దిగా జీరపోయింది. "మనం ఎన్నైనా చెప్పొచ్చు. ఎన్ని నీతులయినా పలకవచ్చు. కానీ డబ్బు వద్దకి వచ్చేసరికి బయటపడిపోతాం. నువ్వు ఏవీ కట్న కానుకలు వద్దన్నావు. నేనే ఓ కట్నం అనీ, నా అందమే విలువైన కానుక అనీ అన్నావు. కానీ యిప్పుడేమయింది. డబ్బు ప్రస్తావన వచ్చేసరికి అది కావాలంటున్నావు."
"చిన్నా!" ఖంగుతిన్నట్టుగా పిలిచేడతను.
"నన్ను చెప్పనీ రధీ_"
నాన్నగారేం అంతగా వున్నవారు కాదు. నీకు తెలియనిదేముంది? ఆయనకి ఆ ఉద్యోగం తప్ప మరో ఆస్తిలేదు. ఇంకో మూడు నాలుగేళ్లలో రిటైరయి పోతారు. ఆడపిల్ల పెళ్ళిళ్ళతో ఆయన దివాలా తీశారు. మమ్మల్ని బాగా చదివించారు. అన్నయ్యనీ చదివించాలని, వాడిని డాక్టర్నో, ఇంజనీర్నో, లాయర్నో చెయ్యాలనుకుంటే వాడికి చదువు బాగా అబ్బలేదు.
కనీసం పోస్టు గ్రాడ్యుయేషన్ అయినా, నాన్నగారి పలుకుబడితో ఆ కాలేజిలోనే లెక్చరర్ పోస్టు వచ్చేది. అత్తెసరు మార్కులతో డిగ్రీ తెచ్చుకునేసరికే వాడికి గగనమైపోయింది. ఏదో ఉద్యోగం దొరికింది.
గుట్టుగా బ్రతుకు లాక్కొస్తున్నాడు.
విజయవాడలాంటి పట్టణంలో ఒక గుమాస్తా, భార్యా నలుగురు పిల్లలతో బ్రతకటం ఎంత కష్టమో నీకు తెలీదూ?
వాడికి నాన్నే అప్పుడప్పుడూ అంతో యింతో పంపుతూ వుంటారు. రేపు రిటైర్ అయ్యాక అమ్మ నాన్నలకి ఆధారం ఏమిటి?"
సారధి మాట్లాడలేదు.
మౌనం వహించాడు.
"రధీ! నేను ముందే చెప్పాను. మన మధ్య డబ్బు విషయమై అపార్థాలు రాకూడదని. డబ్బు స్నేహితుల మధ్య, తండ్రీ కొడుకుల మధ్య, చివరకు భార్యాభర్తల మధ్యకూడా చిచ్చుపెట్టే మహమ్మారి. దయచేసి ఆ ప్రసక్తి మన మధ్య తేకు. నేను డబ్బు విచ్చలవిడిగా ఖర్చుపెట్టను. పొదుపుగా బ్రతకటం, గౌరవంగా జీవించటం అమ్మా నాన్నా నేర్పారు. మన జీవితాలకి మన జీతాలు చాలు. ఇక యీ డబ్బు విషయం మర్చిపో" నచ్చచెప్పాలని ప్రయత్నించింది వారుణి.
వారుణి మాటలకి చప్పున జవాబు చెప్పటానికి మాటలు దొరకలేదు సారధికి. ఓ నిమిషం ఆగి అన్నాడు_
"ఎంతైనా ఆడవారికి పుట్టింటిపైన అభిమానం"
"ఎత్తిపొడవటానికి మీకింకేం దొరకదు కదా!" అంది వారుణి.
"ఎత్తిపొడుపు కాదు...అసలు ఏమిటంటే_"
"ఇహ చెప్పకు సారథి. రీసర్చి చేసి కొత్త విషయం కనుక్కున్నావు. థాంక్స్! అలాగే అనుకో" అంది వారుణి నిరాసక్తిగా.
కొద్ది క్షణాలు యిద్దరి మధ్య నిశ్శబ్దం.
"చిన్నా! ఈ ఒక్కసారీ నా మాట విను. నాకు డబ్బు మీద ఆశలేదు. కానీ యీ డబ్బు యిస్తే అమ్మ కొంతయినా సంతోషిస్తుంది. వదిన ముందు నీ కోడలి తనం నిలబడుతుంది. పద్మకి కూడా నీవంటే గౌరవం ఏర్పడుతుంది."
"అయితే యింటి కోడలిగా గౌరవాన్ని డబ్బుపెట్టి కొనమంటావా?" కనుబొమ్మలు ముడివడి వారుణి అసహనాన్ని తెలియజేశాయి.
"అబ్బా! చిన్నా! నీకెలా తెలియచెప్పాలి?" తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు సారధి.
"రధీ!" చప్పున అందుకుంది వారుణి. నీ మాటే ఒప్పుకుందాం. మీ వాళ్ళందరినీ తృప్తి పరుద్దాం. పద్మ పెళ్ళి భారం మనం తీసుకుందాం. ఇద్దరి జీతాలు ఒక ఏడాదిపాటు బ్యాంక్ లో వేస్తూపోతే ఆమె పెళ్ళి ప్రాబ్లం తీరిపోతుంది."
