Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 21


    "కులాల విషయం నీకు తెలీదు నాన్నా! అవి అవసరం కోసం టీచింగ్ సబ్జెట్స్ డివైడ్ చేసినట్టుగా చేసిన విభాగాలు. ఒక రెక్కువా, మరొకరుతక్కువా కాదు. అందరూ ఒక్కటే."

    "అయోధ్యా! నేను నీతో వాదించలేను. నువ్వనట్లు కులాలు ఏదో ఉద్దేశంతో ఏర్పడ్డవే కావచ్చు. కులాల్లో ప్రత్యేకత లేకపోవచ్చు. కానీకులసంకరం, వర్ణసంకరం నేను అంగీకరించలేను."

    "వర్ణసంకరంతో పుట్టిన వ్యాసుడినే ఆరాధించి పూజిస్తున్నారు. ఆ విషయం మర్చిపోకండి. ఒక మహర్షి మనసులో ఒక్క క్షణం జనించిన వలపు ఫలితంగా ఎంత గొప్ప కావ్య సృష్టి జరిగిందో... ఒక్కసారి వెనుదిగిరి చూసుకోండి. ఆ గాధల్ని మీరు కాదనలేరుగా."

    "వాళ్ళు కారణజన్ములు, మహాపురుషులు, వాళ్ళకీ మనకి పోలికా!"

    "ఎందుకుండకూడదూ?"

    "ఏమో నాయనా! అది నా రక్తంలోలేదు. నా రక్తంలో లేని ఈ భావం నీ రక్తంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నీ ఉద్దేశ్యం ప్రకారం యింక కొన్నాళ్ళకి కులాలు మతాలు అన్నీ నశించి అంతా ఒక్కరే అనే సమాజం రావచ్చు."

    "తప్పకుండా వస్తుంది నాన్నా! రాబోయే ఆ సునందస్వప్నానికి మేమే మార్గదర్శకులం" స్థిరంగా అన్నాడు.

    "అప్పటిదాకా నేను బ్రతుకుతానో లేదో కానీ యిప్పుడు మాత్రం మీతో ఏకీభవించలేను."

    నిర్మొహమాటంగా ఆయన అనేసరికి, తండ్రి నిర్ణయమేమిటో అర్ధమైపోయింది అయోధ్యరాంకి.

    "సరే నాన్నా మేం వెళ్ళిపోతున్నాం! మేం ఎక్కడున్నా మీ కొడుకులు కోడళ్ళమే. మా సహాయం మీకెప్పుడూ వుంటుంది. మీ ఆశ్సీసులు మాకెప్పుడూ వుంటాయనే ఆశిస్తున్నాం. సెలవు. పద వెళదాం."

    ఆమె చప్పున వంగి అత్తమామలకి నమస్కరించింది. తను కారణంగా తల్లిదండ్రులకు దూరమైపోతున్న భర్తని చూస్తుంటే మనసంతా ఆర్ద్రమయిపోయింది. అడుగులు తడబడుతున్నా ముందుకి నడవక తప్పలేదు.

    "మీరుండండి__ వెళ్ళిపోవద్దు" అని ఎవరైనా అంటారేమోనని ఎదురుచూస్తోందామె మనసు.

    శ్రీవిద్య రివ్వున వచ్చింది_

    "వదినా మీరు వెళ్ళిపోవద్దు. మీకూ ఈ యింట్లో హక్కువుంది..." అంది తీవ్రంగా.

    అంతవరకూ మ్రాన్పడి నిలుచుండిపోయిన శాస్త్రి దంపతులు నిర్విణ్నులై చూశారు కూతురివంక.

    "ఏవిటి నాన్నా ఈ అన్యాయం! కొత్తగా పెళ్ళి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇదేనా మనం చేసే సత్కారం? వాళ్ళేం తప్పు చేశారని యింటిలో నుంచి గెంటివేస్తున్నారు" ఆవేశంగా అడిగింది.

    ఆకులమాటున పిందెలా వున్న పిల్లి యిలా హఠాత్తుగా ఎదురు తిరిగి మాట్లాడటంతో పార్వతి తల్లడిల్లిపోయింది.

    "విద్యా! నీకేం తెలీదు నువ్వు లోపలికెళ్ళమ్మా!" అంది నెమ్మదిగా.

    "ఎందుకమ్మా వాళ్ళమీద అంత నిర్దయ! వాళ్ళేం పాపం చేశారని! కానిపని చేయలేదుకదా! అందరూ హర్షించేలా పెళ్ళిచేసుకున్నారు. నిన్ను కాదని వెళ్ళిపోయిన ఆ యిద్దరి కోడళ్ళకన్నా... మీకు సేవచేయాలనే ఉత్సాహంతో భవిష్యత్తుమీద కోటికోరికలతో వచ్చిన అహల్య మేలుకదా! కులంలో ఏముందమ్మా! గుణం కావాలికానీ..."

    అయోధ్యరాం చెల్లిలి వంక ప్రశంసా పూర్వకంగా చూశాడు. అహల్య కళ్ళు ఆనందంతో తృప్తితో మెరిశాయి ఒక్కక్షణం...

    "రా వదినా ఇంటిలోకి పోదాం" చనువుగా అహల్య చేయిపట్టుకుని ముందుకి లాగింది శ్రీవిద్య.

    అహల్య మామగారి అనుజ్ఞకోసం ఆయన ముఖంలోకి చూసింది. ఆయన ముఖం మరోవైపుకి తిప్పుకున్నారు. పార్వతి కూతురివంక ఎర్రగా చూసింది.

    పరిస్థితిలో మార్పుండదని అర్ధమైపోయిందా జంటకి.

    శ్రీవిద్య మాటలు ఎవరూ పట్టించుకోలేదు.

    ఇద్దరూ జంటగా వెళ్ళిపోతుంటే చూస్తుండిపోయారు.

    శ్రీవిద్యకి రోషంతో, అవమానంతో దుఃఖం ముంచుకొచ్చింది.

    శాస్త్రిగారి మనస్సు క్షీరసాగర మధనంలా అయింది.


                                *    *    *


    ఆ రోజు ఆ ఇంటిలో ఎవరూ భోజనం చేయలేదు. స్వాతి ఎంత బలవంతం చేసినా పార్వతి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. శాస్త్రిగారు సరేసరి! ఆయన దైనందిన కార్యక్రమం స్తంభించిపోయినట్లయింది.

    దొడ్లోకి వెళ్ళి పొగడ చెట్టుని పరామర్శించలేదు. పొన్నాగ పూలుపాడే సన్నాయి పాట వినలేదు. ఆయనకెంతో ప్రియమయిన పారిజాతం మొక్కకి నీళ్ళుపోయలేదు. మల్లెల గుబురుని ఆప్యాయంగా నిమిరి ఆదరించలేదు. 

    ఆయన మనసులో ఏ సముద్రాలు ఘోషపెడుతున్నాయో_ ఎన్ని అగ్ని పర్వతాలుపెఠీలుమని పగులుతున్నాయో ఎవరికీ తెలియలేదు.

    నిండువేసవిలో మిట్టమధ్యాహ్నం పూటగాలి ఆడకుండా స్తంభించినట్లువుంది వాతావరణం.

    అయోధ్యరాం అహల్య వెళ్ళిన గమట, గంటన్నరకి శాస్త్రిగారు పెరటిలోకి వెళ్ళి సచేల స్నానం చేశారు. తల తుడుచుకుంటూ వస్తున్న భర్తని చూసిన పార్వతికి ఆయన మనస్సు అర్ధమై విలవిల్లాడిపోయింది.

    "భగవంతుడా! ఏమిటిది? వెన్నవంటి ఆయన మనసు కూడా ఇంతగా విరిగిపోయిందా? శాస్త్రజ్ఞులు పండితులు సర్వమూ తెలిసినవారు. ఆయనకి కూడా కులాలంటే ఇంత పట్టింపా? అయనలో కూడా క్షమ లేదా? పరాయి వాళ్ళని కూడా మన్నించే శక్తి వుందాయనకి.

    "అలాంటిది కన్నకొడుకుని మన్నించలేక పోయారా? ఎక్కడికి వెళ్ళినా ఎలా బ్రతికినా వాళ్ళు క్షేమంగా వుంటే మా పిల్లలు కాకపోతారా? ఏం మనిషి ఈయన" ఆ మాతృహృదయం ఆవేదనతో అలమటించిపోయింది.

    మొట్టమొదటిసారిగా ఆమె మనసులో భర్తంటే కొంతకోపం వచ్చింది. కొడుకుని క్షమించలేక పోయిన భర్తని క్షమించలేకపోయింది పార్వతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS