Previous Page Next Page 
వారధి పేజి 20


    ఆదివారం సూర్యుడు  ఎంతో అందంగా  కనిపించేడు వరదరాజుకి. ఆ సూర్యుడు తమ ఊరిమీదుగానే  ఇటు వస్తున్నాడు. తమ ఊరికి వెనకగా  ఉన్న కొండల్లోంచి  ఇంకా  రావచ్చునా, కూడదా అన్నట్లు  తొంగి తొంగి చూసి మరీ బయటికి  వస్తాడు. బహుశా అన్నయ్య  పట్నం  వచ్చే  సన్నాహంలో  వుండడం చూసేవుంటాడు. పూర్ణ  తనుకూడా వస్తానని  మారాం చస్తూంటే వదినపెట్టే  ఊరడింపులు  వినేవుంటాడు. అయినా  ఏమీ ఎరగనట్లు ఆకాశంమీద తన దారివెంట  నడిచిపోతున్నాడు. సూర్యుడు  చెప్పకపోయినా  తనకి తెలుసు. అంత మంచివార్త  మోసుకువస్తున్నాడు  కాబట్టే  ఇంత అందంగా  కనిపిస్తున్నాడు  ఈ రోజున  అనుకొన్నాడు రాజు.

    శుభ్రంగా  స్నానంచేసి  బట్టలు  వేసుకొన్నాడు. త్వరగా  టిఫిను తిని తన గదికి  చేరుకొన్నాడు. తను ఊరిలో  తను గడుపబోయే  జీవితాన్ని  తలుచుకొంటూ  కాస్తసేపు  మురిసిపోయేడు. వదినచేతి వంటల్ని  తలుచుకొంటూ  పెదవులు  చప్పరించేడు. తన గదియందున్న  వరండా  చివర నుంచి   ఈ చివరకి నాలుగుసార్లు  పచార్లు చేసేడు.

    ఆదివారం  మూలంగా  హాస్టలంతా  చాలావరకు  కాళీగా  ఉంది. మిగిలి ఉన్న  కొద్దిమంది  కూడా ఇంకా గదులు వదలి  బయటికి  రాలేదు. వరదరాజు అడుగులో  అడుగు వేసుకొంటూ  గేటువరకూ  వెళ్ళి  చూసి  వచ్చేడు.

    తన ఊరు పోయే దారివైపు  చూపు  అందినంతదూరం  దృష్టిసారించి  చూసేడు. కారులు, బస్సులు జోరుగా  తిరుగుతున్నాయి. ఒకటి రెండు ఎడ్లబళ్ళు  కూడా  రోడ్డుమీద  ఉన్నాయి. కాని  అవి తమ ఊరివి కావు. తమ ఊరి బళ్ళని, మనుష్యుల్ని  తను ఎంత దూరం నుంచి  అయినా  ఇట్టే పోల్చుకోగలడు.

    'పట్నంలో పెద్ద  చదువులు  చదివి  పరీక్షలు  పాసవాలని  వచ్చిన అబ్బాయీ, అన్నయ్యకోసం  అంతటా  ఎదురుచూస్తున్నావా?' అంటూ  సూర్యుడు రాజు బుగ్గల్ని, తలని  అభిమానంగా తాకి ముద్దు పెట్టుకొన్నాడు. రాజు ఉంగరాలజుట్టు  ఎండకి  వేడిగా  ఉడికిపోతున్నది. ఎర్రగా  కందిన ముఖంమీద చెమటబిందువులు  అప్పుడే  వికసించిన  ఎర్రకలవమీద  నీటి బొట్లులా  ఉన్నాయి. వరదరాజుని  చూచి  సూర్యుడు  తన ముఖం  కూడా  ఎర్రగా  మార్చుకొన్నాడు.

    నడినెత్తికెక్కి  గ్రామంవంక  ఒకసారి  తొంగిచూసిన  సూర్యుడు అటు  దిగజారుతూ  జాలిగా  వరదరాజుని  చూసేడు. 'మీ అన్నయ్య  వస్తాడు. భయం లేదు. పోయి భోజనం  చేసిరా' అని ఓదార్చేడు.

    'ఆదివారంనాడు  నేను రాకపోయినా  నువ్వేం  కంగారుపడకు.' బండి ఎక్కుతుంటే  అన్నయ్య  అన్నమాట  జ్ఞాపకం  వచ్చింది రాజుకి.

    'కొంపతీసి  అన్నయ్య  రాడా? రాకపోతే  ఎలా? ఎలా? వరదరాజు  గుండెమీదనుంచి  మణుగురాయి  గడగడ  దొర్లినట్లు  అయింది. అతడి కళ్ళలో  శ్రావణమేఘాలు  కదలాడేయి. ఒళ్ళంతా  చలితో  బిగుసుకు పోయింది. కాళ్ళు  తిమ్మెరపోయినట్లు  కదలడం  మానేయి. వాడిన  తోటకూరకాడల్లా వాలిపోయేయి  చేతులు.

    మంచం పక్కగా ఉన్న  కుర్చీలో  కూలబడ్డాడు వరదరాజు. రెండు గంటలవేళ  ముసలి బేరరు కారియరులో  ఇంత అన్నం, కూర, పులుసు పెట్టి తెచ్చేడు.

    "నిన్న రాత్రికూడా  భోజనానికి  రాలేదు. ఈ పూటయినా  వస్తావేమో  అని చూసేను. ఉదయం  టిఫిను తిన్నావో, లేదో నేను చూడలేదు. ఇలా తిండి మానుకుంటే  చదువు  ఎలా చదువుకొంటావు? ఇక్కడ అంతా  కోతిమూక. మొదట్లో  ఎవరు వచ్చినా  ఈ విధంగానే  కాల్చుకు  తింటారు. నువ్వు భోజనానికి రావడం మానకు. నీకు వేరుగా  నేను భోజనం పెడతాను" అన్నాడు ఆప్యాయంగా.

    వరదరాజు  అతని చేతిలోని  కారియరు  అందుకొంటూ  "తాతా!" అన్నాడు. ఆ ముసలిబేరరు  కళ్ళలో నీళ్ళు  తిరిగేయి.

    "నాకు నీ ఈడు  మనమడు  ఉండేవాడు బాబూ! నీలాగే  ఎంతో సిగ్గుగా, మరెంతో  భయంగా  ఉండేవాడు. వాడికి  నేనంటే  ఎంతో అభిమానం."

    "ఇప్పుడెక్కడ  ఉన్నాడు తాతా? ఇక్కడికి రాడా?"

    "రాడు బాబూ! ఈ తాతని  చూసేందుకు  రాడు. ఎప్పటికీ  రాడు....రాలేడు" అని మెల్లిగా  అనుకొంటూ  వెళ్ళిపోయేడు  ఆ ముసలిబేరర్.

    వరదరాజు ఆ రోజు  కడుపు  నిండుగా  భోజనం చేసేడు. రాత్రి  నిద్రలేని కారణంగా  కడుపు నిండిందే  తడవుగా  కళ్ళమీదికి  కునుకు  వచ్చింది. అతనికి  తెలివి వచ్చేసరికి  ఆదివారం  సూర్యుడు వెలవెల  బోతున్నాడు. 'ఆదివారంనాడు అన్నయ్య  రాలేదు' అనుకొన్నాడు  రాజు.

    'రేపు వచ్చేటప్పుడు  కారణం  కనుక్కొని  వస్తాను. భయపడకు  వరదరాజూ!' అని ఓదారుస్తూ  వెళ్ళిపోయేడు  సూర్యుడు.

    ఆ రాత్రి తిరిగి  వరదరాజు  భోజనానికి  పోలేదు. మరునాడు  ఉదయం టిఫిను తింటూంటే  ఎవరో అనుకొంటున్నారు _ ముసలి బేరరు  రాత్రి గుండెల్లో  నొప్పి వచ్చి చచ్చిపోయేడని. వరదరాజుకి  మరి తినబుద్ధి  కాలేదు.

    హాస్టలుకి  వెనకభాగంలో  నౌకర్లకి వేరుగా  గదులున్నాయి. బేరర్ తాత గదికోసం  అడుగుతూ  అటు వెళ్ళేడు రాజు. తాత  గదిముందు  కొందరు నౌకర్లు, బేరర్లు గుమిగూడి  వున్నారు. కొందరు  తాత దేహాన్ని  అంతిమయాత్రకి  సన్నద్ధం చేస్తున్నారు. నిర్జీవంగా  పడివున్న  ఆ ముసలివాడిని  చూసి "తాతా!" అంటూ కళ్ళనీళ్ళు  పెట్టుకొన్నాడు  వరదరాజు. నిన్నకాక  మొన్న వచ్చి, హాస్టల్లో  చేరిన  ఆ కుర్రాడు  ఒక  బేరరుకోసం  ఏడవడం  అక్కడ చేరిన అందరికీ  ఆశ్చర్యం  కలిగింది. బహుశః  ఏదో బంధుత్వం  ఉండి ఉంటుంది  అనుకొన్నాడు.

    "ఈ పిల్లాడికోసం  నిన్న  మధ్యాహ్నం  ప్రత్యేకంగా  భోజనం గదికి తీసుకు పోయేడు. ముందు నుండి  ఒకరి కొకరు  తెలిసి  ఉండాలి" అన్నారు మరికొందరు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS