Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 21

                   

    ఇంటి దరికెల్లి సూశాడు. సూర్లోంచి దీపం కనిపిత్తా వున్నాది. తలుపు తోశాడు . లోన గడుంది. గలగలా గొల్లేవు కదిపాడు. ఎవరూ లేగలేదు. అప్పుడింక పిలిశాడు. పెరెట్టి పిలిశాడు. తలుపు తెరుసుకుని లోగానే మల్లా పిలిశాడు.
    ముందు తనోడే అనుకున్నాది. గొంతుకు మారినట్టూ పసిగట్టింది. సెప్పలేనంత బయవయినాది.
    'నేనే రావులమ్మ! సేరబయ్యని."
    సేరబయ్యంటే దీనికి వొళ్ళు మంటే. దొంగ సచ్చినోడు! కాని, తన మొగుడు కూడా వున్నాడు గందా! తియ్యాపోతే ఎల్లాగో?
    వోరవోకి లెట్టినాది. సెరబయ్య తోసుకుని లోన కొచ్చాడు. ఆ డొక్కడే వొచ్చాడు! వొచ్చి లోన గడేట్టాడు. దాంతో దానికి దుడు కేక్కువయినాది.
    "అరిజెంటు పనోటుండి, ఆడు పొద్దున్నే ఎల్లిపోయాడు. సల్దికూడేలికి రాయినండీ పేరుకు మంటాడు 'ఆడోలకం నిన్నే కనిపెట్టావుగా! పిచ్చి కోపం లో ఏటేటంటోడో ఆడికే తెల్దు. నిన్నన్నమాట్లికి ఆడే సిగ్గు పడి -- నేనూ సివోట్లే ట్టాలే! ఎల్లాగయినా నిన్ను బతిమాలి పట్నావు తీసుకు రమ్మని నన్ను పంపించాడు!"
    "ఎందుకు పంపిచ్చాడో?"
    "నీకోసం"
    "నే పట్నం రాను!"
    "ఏం?"
    "నా కిట్టవులేదు. ముట్టేత్తుకునయినా వున్నా వూళ్ళోనే బతుకుతా!"
    "ఆడా వూరోదల్నంటాడు. నువ్వేవో రానంటావు. ఎల్లాగ సేప్పు రావులమ్మా."
    "మీ యాసాలన్నీ నాకు తెలుసు. అక్కడికి సత్తే రాను!"
    "ఈపాటిదానికి సావడ వెండుకో?  మొగుడుతో నీవు కాపరం సెయ్యవా?"
    "అడగడానికి నువ్వెవరవ్? నా యిట్టం . ఆడికి నే కావాలంటే యిక్కడికే రమ్మను!"
    "మరి యాపారవో?"
    "యాపారవా? సేందరకాంతం తో యవ్వారవా?"
    "రామ రామ, అల్లాంటోడు కాడు రావే!"
    "నాకంతా తెలుసు . ఒచ్చిన దార్నే తిరిగేల్లు."
    "నువు కూడా రాకోడదో?"
    "నీతోనా? స్సీ!"
    నవ్వాడు సెరబయ్య. "ఏం? తప్పా?"
    "తప్పో ఒప్పో నాకు తెలుసు. నువ్విం కెల్లు!"
    "ఎల్లడాని కేం రావులమ్మా! సిటికిలో ఎల్లోచ్చు. నువు లేకుండానే నెల్లా గెల్లను సెప్పు. పట్నవు లో మజాలన్నీ నీకు తెలీవు."
    "ఏంటీ?"    
    మల్లా మావ్వాడాడు.
    బీడీ పీకి యిసిరేసి యింకా దగ్గిరి కేల్లాడు.
    "నీకేం బయవు లేదు. నిన్ను తీసికెల్లి నీ వొడి కప్పగిత్తాను. అంతగా ఆడి కిట్టవులేపోతే నేనెల్లాగా ఉండనే వున్నా! ఇంతలెసి మొగోళ్ళని, నువ్వంటే మనసు పడీ వొళ్ళని పట్నవు లో పెట్టుకుని, ఒయిసులో వున్నదానివి, నువ్వొక్కత్తీ యిక్కడుండవు బాగోలేదు రావే!"
    "అట్టె వోక్కు , పళ్ళు రాల్తాయి."
    "ఏం?"
    "నోర్మూయ్!"
    "మనసిప్పి మాటాడతా వుంటే వోగుడంటా వెంటే ఎర్రిమొగవా? ఎయ్యి జనవాలికయినా నాలాటోడు దొరుకుతాడా? నీ సరాసలింక సాలించి సింగుమంటా రాకోడదో?"
    "నీలా టేదవల్తో రాడానికి నేనేం సెంద్రకాంతా న్ననుకున్నావా?"
    "రావులమ్మ సేందరకాంత నెల్లాగవుతాదే? సిలక సిలకే, మాల కాకి మాల కాకే!"
    ఆడింటికీ రానీ, నీ రోగవు కుదురత్తా!" పగలబడి నవ్వాడు.    
    "నా ముందల అడేవుడే? ఏం సేత్తా డెంటి ? నీకోసం నన్ను పంపిచ్చింది అడుకాడో?"
    "స్సీ! ఎదవా! ముందు ఎలపలికి నడుత్తావా? నలుగుర్ని పిలిసి గెంటించమంటావా?"
    మల్లా నవ్వాడు. సొగసుగా నవ్వాడు.
    "నీ కోపవు లో సిత్రవయినా ఎలుగున్నాదేరావే!"
    "ఎల్తావా ఎల్లవా?"
    "ఇంతదూర వచ్చింది ఎనక్కి ఎల్లిపోడానికా? ఓ సెర్రిదానా! నీ సెరసింగు లో కులక్కుండా ఎల్తాననే?"
    "ఆ వోగుడే మానమంటన్నాను!"
    "ఒరబ్బో! నీ సూపుల్లోంచి సిత్రాలు సూడగల్నే! నీ రాత బాగోక ఆడు కట్టుకున్నాడు కానీ, అసలు నువ్వు రాణి వొసం సెయదగ్గ దానివి కాదంటే? నీ ముచ్చట్లు తీరసడానికే నేనోచ్చా! రా, రాయిసంద్రం పోదారి."
    "బుద్ది లేదో?"
    "నా బుద్ది నీ మొగుడి కెరువిచ్చానే!"
    "సచ్చేవు."
    "మాటల్తో ఏల మించిపోతన్నాది. బండోడు కాసుక్కూకున్నాడు. నీ కోసం వుకుంసెట్లో పెద్ద బంగాలా తీసుకున్నా. పదిమంది నవుకరోళ్ళున్నారు. సేతినిండా డబ్బు! ఇంకేం కావాలె?"
    "కాల్లిరగ్గోడతాను."
    "ఓసోస్! ఇన్ని నీతులు సేప్పీదానియి, ఆయేల ఎన్నెట్లో తెల్లసీర కట్టుకుని, తల్లో మల్లి పూలేట్టుకుని, ముత్తాబుగా తయ్యారయింది. ఆ రవణయగాడి కోసం కాదంటే?"
    ఊసి పుచ్చుకు లెంపకాయ కొట్టిందది. కొట్టిన సెయ్యే సట్టుని పట్టుకు లాగాడు. సెరబయ్య. ఇదిలించుకొబోయింది. లాబవు లేదు. సివాలేత్తింది. ఆడూ రెచ్చిపోయాడు. అది రక్కినాది. కరిసినాది. ఆడి రగతం కళ్ళ సూసినాది. అది కాలికామ్మ వోరే అయినాది!
    ఆడు మొగోడు. మొగోడితనం సూబించాడు. సేతు లేనక్కి యిరగ్గట్టాడు. నోట్లో గుడ్డలు కుక్కాడు.
    బండోడు లోనకోచ్చాడు. ఇద్దరూ కలిసి సాయవుపట్టి రావులమ్మని బండిలో కుదేశారు. రెండెంపులా తెర్లు కట్టారు. సెరబయ్య కూడా లోన కూకున్నాడు. బండి మేలు బండిలా నడుత్తా వున్నాది.
    తగ్గినట్టే తగ్గి రవణయ్య కొడిక్కి జరం మల్లా ఎక్కువయినాది. "ఆవాసం" కూడా ఎక్కువయినాది. గొంతుకు గురుగురులాడతన్నాది. ఆడోళ్ళంతా వోతం కమ్మేసినాది. ఆ సంటీ గుడ్డు సావు బతుకులు నడవ కొట్టు మిట్టాడతన్నాడు.
    రవణయ్య కేం తోసలేదు. ఆడ్ని బుజాన్నేసుకు, కాలు కాలిన పిల్లిలా తిరిగాడు.ఏం అంతుబట్టలేదు.ఎంటనే పక్కింటి ఎంకట్రాజని లేగ్గొట్టుకొచ్చాడు. నాడి సూబించాడు. ఎంకట్రాజు పెళ్లావూ లేగిసొచ్చినాది. సిటికి లో మొగుడు కుపాయవు సెప్పినాది. రవణయ్యనీ, పిల్లల్నీ వోకిట్లోకి పోమ్మన్నాది. ఎంకట్రాజు పిల్లోడ్నీ తీసుకుని తలకిందలగా తిప్పి నాలుగు సార్లు ఎగరేసి పట్టుకున్నాడు. సంటోడు కెరుమన్నాడు. వూపిరందినాది. సటుక్కుని రవణయ్య లోన కొచ్చాడు. సంటోడ్ని తీసుకుని ఎత్తుకున్నాడు. ఎంకట్రాజు సుట్టంటించి నుదురు మీద వోతెట్టాదు. గోల్లుని ఎడిసాడు సంటోడు.
    అప్పటిక్కాని రవణయ్య గుండి కుదురుకో లేదు. ఆ రేతిరంతా ఎవురేనా సాయం వుంటే బాగుంటాదని , రావులమ్మ కాల్లట్టుకునయినా తీసుగోద్డారనుకున్నాడు. ఆడోళ్ళకి తెలిసినట్టు , యీ జబ్బులు తనకేం తెలుసు మరి? పిల్లల్ని ఎంకట్రాజుకి , పెళ్లానికి అప్పసేప్పి రావులమ్మ కోసం బయలెల్లాడు.
    ఇల్లు బార్లా తెరుసుకునున్నాది. లోన అది లేదు. ఆడికి దడ పుట్టినాది. ఇరిగిన గాజు పెంకులూ, కాల్సి పారేసిన బీడీ పీకీ, తెగిపడిన ఎంట్రుకులూ కనిపించినాయి! సుట్టూతా నలుగుర్ని లేగ్గొట్టి అడిగాడు. ఆళ్ళు నిదర్లో వున్నారేవోమాకేం తెల్దు అన్నారు. ఏదో బండి సప్పుడయితే యిన్నావన్నారు. నలుగురూ నాలుగు కర్ర లుచ్చుకుని లెగి సోచ్చారు.
    వూరేలపల బండి కనిపించినాది. లగేత్తుకెల్లి సుట్టేశారు. సప్పుడు మింగిన సీకట్లో ఆళ్ల కర్రలు బరబరలాడినాయి. బండిలో వొళ్ళని ఎలపలికి లాగి కొట్టారు. బండోడ్నీ సీతక బోడిచారు. సెరబయ్య ఎనక పాపం రావులమ్మ కీ తగిల్నాయి. ఆడు కాలికి బుద్ది సెప్పి పొలాల కడ్డబడ్డాడు. మిగిలినోళ్లు ఎనక తరవబోతావుంటే రవణయ్య వోద్దన్నాడు. అందరూ కలిసి రావులమ్మని ఆ బండిలోనే ఎక్కించి వూళ్ళోకొచ్చారు. సాపంతా రగతం తో తడిసి ముద్దయినాది.
    డాట్టరు సేలపతి గారు నిదర లో వుంటే లేగ్గోట్టారు. రగతవంతా దూదితో తుడిసి కట్టుకట్టారు. సూదితో మందు లెక్కించారు.
    "పెనాని కేవీ ముప్పు రాదు గందాండీ?..." రవణయ్య అడిగాడు.
    "ఫరవాలేదు! ఇంజక్షనిచ్చాగా! అయినా ఎక్స్ రే తియ్యడానికి నా దగ్గరేం సామాను లేదు. తెల్లారే లోగా రాజమండ్రి తీసుకెళ్లి, దీన్ని ముందు గవర్నమెంటు హాస్పిటల్ లో చేర్పించండి. డాక్టరు గారికి నేను వుత్తరం యిస్తాను."        ఉత్తరం ముక్క తీసుకున్నాడు రవణయ్య . రొండ్రోజులు దాకా కొంచెం పిల్లల్ని సూత్తా వుండమని ఎంకట్రాజుకి కవూరు సేసి, నారాయిడు బండిలోనే ఎక్కించి రావులమ్మ ని రాయసంద్రానికి తీసికెళ్ళాడు.
    మండపెటోతేనే కాడ కొచ్చీ తలికి ఏదో లారీ కాలీగా ఎల్తా వుండడం కనిపించినాది. రవణయ్య అపమన్నాడు. రొండు రూపాయిలు ఆడి సేతులో పెట్టి, ఆళ్ళని రాయసంద్రం సేరేసి పున్నెం కట్టుకోమన్నాడు . లారీ సర్ర్రుని సాగిపోయింది.

                                    14

    ఆ యేల సీరావ నవిమి. బద్రాసేలవులో యిసకేత్తే రాలకుండా వుంటారు జనం. పై దేసేవు నించి కూడా ఎంతమందో పతకవూ, పచ్చాల పతకవూ యింకా ఏయేయో పెట్టి సక్కగా దేవుళ్ళని ముత్తాబు సేత్తారు. అయేల్తి తీరతవు సూడ్డానికి కళ్ళు కాయలు కాసీలా కూకుంటారు. తిరపతి ఎంకన్నా, బద్రాద్ది రావయ్యా తెలుగోళ్ళ పెద్ద దేవుళ్ళు!
    ఏటేటా ముసలోడు బద్రసేలం తీరతాని కేడతావుండీవోడు. కానీ యిప్పుడు వొంటో సత్తువు తగ్గి అయేడు ఎల్లడం మానుకున్నాడు. ఎల్లినా ఎల్లా పోయినా ఆ రావయతండే యీడ్నీ ఎతుక్కుంటా వోత్తాడు. ఆడే యీడూ యీడే ఆడు!
    కాతో కూతో రాయిసంద్రవోల్లి క్కూడా రావుడి మీద బత్తి వున్నాదంట! అందుకే ఏడాదేడాదీ రావులోరి పెళ్లి సేయిత్తా వుంటారు. వూరు మొత్తవు మీద పది పదేను పందిల్లు లేగుత్తా వుంటాయి. రోజు రోజూ బజిన్లూ, బాగోతాలూ సేయిత్తా వుంటారు. ఆ ఏడు రోజులూ , అరికతలూ, పురానాలూ, పాటకసేరీలు, తోలు బొమ్మలాట్లూ వొకటేంటి, రకరకాలయి పెట్టిత్తారు. వూరు వూరంతా బాకాలెట్టి అరుత్తా వుంటారు. దీపాల్తో తోరనాలు కడతారు. మొత్తవు మీద కన్నులు వోయికుంటవుగానే సెయ్యాలని సుత్తారు.
    పందిల్లల్లో ఎప్పుడూ జనవు కిటకోట్లాడతా వుంటారు. రంగు రంగుల దీపాలు సూత్తా మురిసిపోయీ గుంటోళ్ళూ, మేళవులో సొగుసు కత్తెలను సూత్తా వుండే మీసాల మొగోళ్ళూ, ఆడంగుల్లో కూకుని ఎదటున్న బాగోతపు మరిసిపోయి, నచ్చినోడెంపు సూత్తావున్న పడుసు పిల్లలూ, ఒకరేంటి? ఎన్నోరకాల మనుసులోత్తారు పాపం! ఆళ్లలో వొకరికీ దేవుడు సంగతి గురుతుండదు. పల్లెవు లో డబ్బుల్లేక్కేట్టుకునే పూజారోడికి , దేవుడి దగ్గర దీపం కొడెక్కి పోడం కనిపించదు. బాగోతాలూ, మేళాలూ కట్టే వొళ్లు పొట్ట కూటి కొసవోత్తారు. ఏరే యవలేని మొగోళ్ళు జనాన్ని సూడ్డానికొత్తారు. ఆటిడుపు కోసం ఆడోల్లు వోత్తారు! అక్కడున్నంతసేపూ ఆళ్లవొల్లు అల్లే మరిసిపోతారు. రూపాయి రూపాయి సందా ఏసీనోళ్ళ కన్న, తవరేం ఎయ్యక పోయిన, పోగు సేసిన డబ్బుల్లో కరుసులు పోను, మిగిలింది పంచుకు తినీవొళ్ళు పెద్ద బత్తులు! దరవదబ్బీ తాలవు మొల్లో పెట్టుకున్న వోడు ఆళ్లకి నాయుకుడు. ఏ మురవండోళ్ళ మేళవేనా పెట్టించిన్నాడు, సిలుకు సోక్కాలు తొడుక్కుని ఎరువుంగారాలేట్టుకుని, కారా కిల్లీలు నవుల్తా యిటూ అటూ అడాయిడిగా తిరుగుతా నలుగుర్ని గదవాయిత్తా వున్నారంటే ఆళ్లు సేసే పెజాసేవ సూసి వొచ్చే ఎలచ్చన్లలో వొడగల్లల్లా, వోట్లేయరో? ఆళ్లకి ఆళ్లమ్మలు అయిద్దెలన్నీ వుగ్గుతో కలిపి పెట్టారు కనకే ఆళ్లిత గొప్పోళ్ళయి పోయారు. లేపోతే, రావయగాడు ఒక్క బిగిని వూల్లో రెండు వోటేళ్ళు లేపగాల్డ? కంటోలు సరుకులు దొంగసాటుని అమ్మి డబ్బు సేసుకున్న వోడోడూ , సరకారు పన్లో పెద్ద నౌకరీ సేత్తా బల్ల కింద సేయ్యేట్టే అలవోటున్న వోడోడూ, యింకా కాటాక్ట్టు పని సేసీవొళ్ళూ , దొంగవోకీల్లూ , నీళ్ళ మందులిచ్చేడాకటర్లూ -- యింకా సేప్పుగుంటే సిగ్గు గానీ! -- యిలాంటోళ్ళు కూడా వోరవోకం ఎలగబెడతావుంటారు. ఇంకో తవసా ఏంటంటే -- పెద్ద బత్తుడున్నాడెం ఎవోడు? -- ఆ వోటేలోడు! ఆడు సందాలిచ్చిన పందిల్ల కాడే, వొచ్చీ పోయీ వొళ్లకోసవనీ కాఫీ దుకానాలు పెడతాడు. అడ ఎడ్రోజులు మొత్తవూ  కలిపితే, దరవ డిబ్బీ ల్లో పడే డబ్బులు కంటే ఆడి గల్లా పెట్టిలోకే ఎక్కువ పడతాయి. యింకా సేప్పుకు పొతే! పాపావు నా ఎదాన్ని పడేడుత్తారు నాకెందుకు బాబో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS