ముసలోడికి గెంజి పోసిచ్చి, తనింత తాగినాది సీతమ్మ. బద్రయ గాడు ఆ యేలల్లా కూడు తిండానికే రాలేదు. ముసలయ్య బల్ల మీద కూకుని కాలు గోక్కుంటా వుంటే , యిల్లు సరుదుకొని సెయి తుడుసుకొచ్చినాది.
ఈసారి బద్రాసేలావెల్లలేక పోయినందుకు ముసలయ్య సానా బాదపడ్డాడు. అంత'దూరనెల్ల లేకపోయినా , పక్క బారిట్తో వున్న పందిల్లెనా సూద్దావనుకున్నాడు. ఈ ఏల సీతమ్మని కూడా తీసికెల్లి సూబించాల! బల్ల మీంచి లెగిసి, సీతమ్మ ని పిలిసి, తలుపు గొల్లెనెట్టి ఎలపలి కొచ్చాడు.
బద్రయ కాయేల పెద్ద పండుగ. ఎడ్రోజులు దాకా ఆడి యాపారావు మా జోరుగా సాగుతాది. కాసులూ, వోరాలూ కలిసి పడ్డట్టు! ఇక్కడేపారం ఎంకన్న సూసుగుంటాడు. ఎలపల్ది తను పురవాయించుకోవాల. ఎందుకేనా మంచిది పదిమందిని మట్టుక్కి తన సేతులో వుంచుకోవాలి. ఏవో, ఎప్పుడేం అవసరవోత్తాదో ఏం సేప్పగలం? అందులోకే ఆడిది దిన దినగండం ఎయ్యేల్లావిస్సూ! అదురుట్టవు కలిసొచ్చిందంటే సిటికి లో రోజు మారిపోదో?
"ఇంకా సెరబయ్య రాలేదేవో?"
సరిగా ఆ రేతిరే , పెద్ద జవీందారుడు సొమ్ముల్తో సావల్లకొటేడతన్నాడంట! ఇత్తడి దుకానం మారువోడి వోడు కూడా అయాలే బేంకు నించి యిరవయ్యేలు యిడిపించుకు తెచ్చుకున్నాడంట. బట్టల కొట్టు సావుకార్లు అందరికీ పంపాలని సరిగా అప్పుడే సరుకేక్కిత్తున్నారంట. సీరావనవమి ఎగట్రా పోగ్రావు మూడో అట సిణావాకి సుట్టు పక్కలూళ్ళ నించి సానా మంది ఆడోల్లె వోత్తరంట! తోల్రోజు కనక, పందిల్లలో కూడా జనవు ఎల్లాగా కిక్కిరిసే వుంటారు గందా! ఇంక సూసుకో నాసావిరంగా , యియ్యన్నీ ఆడిసాన్స్! రొండు సేతుల్తో టీ ఏరుకోవాలె కానీ. బుర్రలో సురుకున్న వోడికి సేయ్యని సేదానికి సెరువంత పంట కాదో?
ఇంతకీ ఎంకన్న గాడి పెళ్లావు యీ రేతిరికే రాడవు కూడా గొప్ప సాన్సే! రావులమ్మ వొంటి బిగుతు సేంద్రకాంతాని కొత్తాదనే?
అల్లా గనుకుంటా వుండగానే బంగరమోచ్చాడు. కొబ్బరి కాయల బత్తాల కేనక్కెల్లి , యిద్దరూ గుసగుస లాడుకుంటున్నారు. బద్రయ్యో సిగోరొట్టు అంటించు'కొని బంగారయ్య కొటిచ్చాడు. గుప్పుని పోగోదిలి అప్పుడడిగాడు.
"పందిల్లలోకి ఎవుర్ని మాట్లాడావ్?"
"రావుడి గాడి జట్టుళ్ళని."
"వూరెలపల జవీందారు కారడ్డగొట్టడానికి?"
"ఎంకట్రాయిడు ముటా!"
"గుండోరి యీదికో?"
"సూరయగాడు."
"బట్టల మూటల బల్ల మీదకి?"
"సువాని సాయెబు లేదో?"
"సెబాస్ బంగారు! నువ్వు యిట్లరుగాడి అయ్యమ్మ మొగుడువు!"
అంటా బంగారయ్య యీపు సరిసి ఏడవ సేత్తో పదినోటు తీసి బంగారయ సేతిలో పెట్టాడు.
"ఇప్పుడే ఎందుకు బద్రయ్యా?"
"ఇదేం కవీషను కాడులేవో! తోలి బగుమతీ!"
"నీకాడే వండియిరాదో?"
"పరవాలేదేహె! ఎందుకేనా అవుసరవోత్తాది వుంచుకో."
బంగారయ్య నవ్వుకున్నాడు.
"ఆళ్ళంతా ఎన్నింటికొత్తానన్నారు?"
"కూడు తినగానే ముందు నీ కాళ్ళ కాడ వోల్రో? యీ పాటికి దరిదాపుల్లో వుంటారు."
"ఓరి వొడి తస్సాదియ్యా! అయితే యీయేల మన పంట పండిందన్నమాటే! సూడు బంగారయ్యా! ఆళ్లు తెచ్చిన సోమ్ముల్లో సెరి సగవు ఆళ్లకే ఇచ్చేద్దారి. మిగిలిందాంటో నీది పావలా వోటా! అది కూడా నాకే వొదిలావంటే అడిగినంత కవీషనిత్తా!"
బంగారయ్య మళ్ళా నవ్వుకున్నాడు. "నీ సిత్తవొచ్చినట్టే కానియి గురో! నీకాడ బేరవాడతానా?"
బద్రయ్య, పెదాలేనకెనకే నవ్వుకున్నాడు.
బత్తాల్లాట్లు తప్పించుకుని సుట్టు తిరిగి యిద్దరూ వోటేలెంపుకి వోత్తా వున్నారు.
"సేందరకాంతవింకా రాలేదేం బద్రయ్యా?"
"ఏంరో? నా కంట నీకే వుసారుగా వున్నాదే! యీయేల కాంతంమ్మీద మనుసయిందెంటిరా?"
"సెబితే నువు సంపేయవో?"
"హహ్హహ్హహ్హ ! ఎర్రి మొగవా! ఉట్టి కాంతవె అన్న మాటేంటీ? యీయేల నువ్వేం అడిగితె అదల్లా యియ్యనంట్రా? మనకందరికీ పండుక్కాదో?"
"ఆ కొత్త పిల్ల యీయేల దిగుతున్నాదేంటి గురో?"
"నువ్వే సూత్తావుగా!"
ఇద్దరూ సెయ్యీ సెయ్యీ పట్టుకుని వోటేల్లోకి ఎల్లి పోయారు.
ముసలోడు, సీతమ్మ గబగబా నడుసుకొత్తన్నారు. ఆడంత వొడిగా నడుత్తా వుంటే సీతమ్మ కాళ్ళు తెలిపోతున్నాయి. సంకలో కర్ర అంది పట్టుకుని వూతంగా అడుగు తీసి అడుగేత్తా వుంటే -- ఆ నడక లో సురుకూ వున్నాది, అంగ సాచడవు లో కోపవూ కనిపిత్తన్నాది! గుప్పిడి తో కర్ర బిగిచడవులో పట్టుదలా వున్నాది!
తాత బేగె బేగే నడిసిపోతన్నాడు. సీతమ్మ ఉన్నట్టే మరిసి ఏదో అలోసిత్తన్నాడు. ఇద్దరూ సిన్నాంజినేయిసావి గుడి కాడి కొచ్చారు. మొన్న వోరదలికి కొట్టుకొచ్చిన సివలింగానికి కట్టిన పందిరి వున్నాది. పందిరి పక్కనే యిద్దరు పోలీసోళ్లు సిమెంటు కట్ట కానుకుని బీడీలు కాలుత్తా వూసులాడుకుంటున్నారు. ముసలయ్య ఎనకాతల సీతమ్మని సూడ్డవుతోనే ఎకిలిగా నవ్వాలని పించిం దాళ్ళకి. నవ్వారు. ఆ నవ్వులు సీతమ్మ కాల్లో ముల్లుల్లా గుచ్చుకున్నాయి. ముసలయ్య నీ బాధ పెట్టినాయి. ఆళ్ల దగ్గిరి కేల్లాడు. కల్లల్లో కల్లెట్టి గుచ్చాడు. దాంతో ఆళ్లు నీళ్లు కారిపోయారు.
"దారిని పోయీవొళ్లని సూత్తా ఎక్కిరించడవు తప్ప మీకేరే పనేం లేదా బాబుల్లారా?"
"లేకేం తాతా! సచ్చినంతున్నాది!" ఓడన్నాడు. రొండో వోడు అందుకున్నాడప్పుడు. "సీరావ నవమి పందిల్ల దరవవాని సేతుల్నిండా పనే తాతా!" అంటా సీతమ్మ పయిట లోకి గుచ్చి గుచ్చి సూశాడు.
"ఏటేటా సీరాం నయిమికి పట్నవులో ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి? ఎన్నిల్లు దోసుకుంటన్నారు? ఆళ్లల్లో నొక్కేదవనన్నా పట్టగలిగారంట్రా? పైగా పందిల్లలో నిరవొక వెలగబెడతావంటా సేప్పుకోడానికి సిగ్గులేదో?"
ఓడు యిరగబడి నవ్వాడు. రొండో వోడు కూడా నవ్వబోయి, తాత మొగవు సూసి దడుసుకుని ఆగిపోయాడు.
"దొంగోళ్ళలో వోకోడికి మమ్మల్ని మించిన సురుకుంటాది. కన్ను మూసి తెరిసీలోగా అల్లంత దూరంలో మాయిమయిపోతారు. అనుకున్న ఎంటనే అల్లాంటోళ్ళాని పట్టుకోడానికి మాకు మట్టుక్కు యీలవుతాదా సెప్పు? మేవెం దేవుల్లవా? ఎవుడి రోజు మూడితే అడేల్లాగా దొరికి పోతాడు. ఈపాటి దానికి మమ్మల్ని తిట్టుకోవడవెందుకో? అంతా మా సేతుల్లో వున్నాది కనకనా?"
"అందుకని సేతులు కట్టుక్కూకుంటారంట్రా?"
"మొదటోడు మల్లా నవ్వాడు.
"అలా గెందు కూరుకుంటాం తాతా? మా డూటీ మేం సేయవో? మొన్నీ మద్దె మా యాపీసుకి కొత్త సర్కిలొచ్చాడు. అడిపేరు సేబుతే ఎలాటి గజదొంగోడికయినా గజగజే! నాసావిరంగా ఆడు యిజిలేత్తే పది మైల్లదాకా యినిపిత్తాది. ఊరెలపల దార్లు కాసీవొళ్ళున్నారు. పందిల్లలో మెళ్ళు కత్తిరించీవొళ్ళున్నారు. రేతిరికి రేతికి యినప్పేట్టెలు బద్దలు కొట్టీవొళ్లున్నారు. ఆళ్లలో యీయేల ఎంతమంది బోన్లో పడతారో నువ్వే సూద్దూ గాని! ఈదీదికి జోడు పోలీసు లున్నారు. ఊరుకి నాలుగు పక్కలా మావోళ్ల లారీలు పారా వున్నాయి. పందిరి పందిరికీ పదేసి మంది మారేసాల్లో వున్నారు. ఈ ఎడ్రోజూలూ సబిన్సిపెట్టర్లూ, సర్కిల్లూ మోటారు సైకిల్ల మీద సెకింగు సేత్తా వుంటారు. అప్పుడప్పుడు డిఎస్సీ కార్లో తిరుగుతా వుంటాడు. ఇల్లాంటి బందోబత్తుండగా ఆళ్లు తప్పించుకో గల్రనే?"
"ఏం తాతో! నోటికొచ్చినట్టు వోగుతన్నావే. యా ఎవ్వారం ముదరకండానే, మరి మరి యాదగా ముందుకి నడూ!" అన్నాడు బక్క పలాసటోడు.
"నీకున్న సావ నాకు తెలీదంట్రా? తిండిలో తిమ్మరాజువే మల్లీ!"
"నోర్మూయ్!"
"ముసలోడి మీదిరుసుకు పడతావెంటిరా ముకుందవ్?"
"ఈడిల్లా మాటాడోచ్చెంట మరి?"
ముసలయ్య పగలబడి నవ్వాడు.
బక్కటోడు గుడ్లురివెట్టు సూశాడు.
"పోన్లే ముకుందవ్౧ యీడన్నంతలోకే మన పరువు పోతాదేంటి? ఆ పిల్ల దాని మొకవు సూసయినా యీఎల్టి కూరుకో!"
సీతమ్మ సురసురా సూసినాది. పళ్ళు పటపట్లాడించినాది.
ఇద్దరూ కలిసి సేరాసేరా నడుసుకుంటూ ఎల్లిపోయారు. పోలీసోళ్లు బీడీలంటించుకొని, సొగసుగా నవ్వుకుంటా యీల పాట పాడతా సైకి లేక్కేళ్లిపోయారు.
