Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 20

 

    ఇంకా ఆడు దగ్గిరి కొత్తన్నాడు.
    సీతమ్మ మరీ వుండ సుట్టుకు పోయింది.
    రాట మీద సేయ్యేశాడు.
    దాని గుండిలి మీదే ఎసినట్టయినాది.
    గిలగిల్లాడినాది. నోటంట మాట ముందే పోడంతో అరుపు అంతకంటా అణిగి పోయింది.
    ఆడికంతకంటా, మాటల్తో అసలు పన్లేదు.
    సీతమ్మ కాళ్ళు పట్లు తప్పినాయి. మెడ వొలిపోయింది. వోన జల్లుకి తడిసి ఉక్కిరిబిక్కిరయిన ముద్దా సెవంతి పువ్వు సొగుసు దాన్లో కనిపించినా దాడికి. సుతారంగా లేగదీశాడు.
    సీతమ్మ వొళ్ళు అంతకి ముందే సచ్చిపోయినాది!
    ఎన్ని పొగడర్లూ సున్నోవులూ కోటా కొట్టుకున్నా, లైలాను సిలుకు సీరలు ముచ్చటగా కట్టుకున్నా, సిణేవా ఆడోళ్ళలా వొయ్యారంగా దరికి సెరినా, సేత్తో సారా గళాసు తీసుకొచ్చి పెదాలకి అందిచ్చినా , మెత్తని బూరుగుదూది పరుపులు మీద కూకోబెట్టి మల్లి పువ్వుల వోసన్ల లో ముంచేసినా , ఆనాడు తెలివి తప్పి పడున్న -- అని ఆడి బుర్రకి తెలుసుకునీ సత్తువు సచ్చి పోయినా -- సీతమ్మ ముందల ఎయ్యి మంది రావులమ్మలూ, పదేల మంది సేందరకాంతాలూ బలాదూరే అనిపించినా దాడికి!
    ఊగుతా వుగుతా , వుయ్యాల్లు వుగుతా కొండెక్కడానికి మొదట మెట్టు మీదున్న దీపబ్బుడ్డి ఎంపు నవ్వుతా సూసి, సీతమ్మ వొళ్ళంతా నిండు కళ్ళతో సూసుకుని, సొగసుగా వొళ్లిరుసుకున్నాడు.
    తోలాట యిడిసి యిళ్ళకి పోతావున్న జనానికి గోదారోడ్డు కాడ పడవోల రేవులో ఏంటో గోడవినిపించినాది. కొబ్బరి కాయిల బత్తాలు ఎనక్కి యీడిసిలాగి, యిద్దరు మనుసులు ఎవుడ్నో సితకా, బొతకా బాత్తా వుంటే, ఆడి ఏడుపులూ, మూలుగులూ గట్టిగా యినిపించినాయి. దాంతో  సుట్టుతా జనం పోగయి, లగేత్తుకేల్లారు. ఇంతలోకే కొట్టివో ల్లిద్దరూ మాయవయ్యారు. ఆదరాబాదరా ముందరి కొచ్చి, వొచ్చినోళ్ళలో యిద్దరు దెబ్బతిన్నోడ్నీ లేగదీసుకుని సక్క కెల్లి పోయారు. పోతావుంటే , ఓడు మీసం తడుం కోడవూ, మరోడు వొంకరగా నవ్వడవూ అక్కడున్నోళ్ళకి సరిగ్గా కనిపించలేదు. గోదారంతా మల్లా వొడ్డు తో కలిసి అమావోసి రేతిరిలో ములిగి పోయినాది.
    కోడికూతేలకే లెగిసి పదాలు పాడుకుంటా వున్న ముసలయ్య తూరుపు కొండ మీద ఎర్రటి ఎలుగులు ముసురుతా పరుసుకు రాడంతో పందుప్పుల్ల తీసి మొగం కడుక్కుని , గోసీ పెట్టుకొని, సంకకర్రా సంచి గుడ్డా గట్టు మీదెట్టి గోదాల్లోకి దిగాడు. ఉతకలాడతన్నంత సేపూ ఎప్పుడూ ఆడి బుర్రలో ఏయో పరిగేడతానే వుంటాయి.
    అంతకి ముందరా దాకా, నిద్దర కొట్లో ముడుసుకు పోయిన మనుసులికీ, యిన్నేసి ఎలుగులు యిసరతావున్న సూరీడికి వున్న సుట్టరికవేంటి? మనసుల్లో మురిగి పోతన్న వోరవలేని తనవూ, కుతి లేని దాగవూ , దొంగబుద్దీ , మాట దగా -- అన్నీ రేతిరి ఎల ఎలపలికి లెగిసోచ్చి, దొంగ సాకుల్తో మనిషిని సుట్టేసి మాయ వోలలు పన్ని, ఎదటోళ్ళ మాట లినకుండా సెవులు గళ్ళడేసి, ఏ ఎంపుకి తప్పించుకు పోదావన్న ఆడికి సంది య్య కుండా సేసి, ఎయేయో ఎదవ పన్లు ఎందుకెందుకో సేయిత్తా వుంటాయి! అయి సేత్తా వున్నంత కాలవూ, అటి మంచి సేడ్డలు తెలుసుకుని బుర్ర ఆడి తల్లోంచి తీసి దాసేత్తాయి. అయినా కూడా అప్పుడు గుండి గోలేడతానె వుంటాది పాపం! సోడాకాయి పోర్సు లా ఆడి జోరు సల్లబడ్డంతోటే, ఎనకటి ఎగలో సేసిన పనులన్నీ జాయిగా ఎలపలి కొచ్చి, యీడ్ని నిలదీసి సవుజాయిషీ అడుగుతాయి. అంతకి ముందు ఎంత మంది కళ్ళల్లో కారావు కొట్టివోడయినా యీటికి జవాబు సేప్పుకోలేక కొట్టుమిట్టాడిపోతాడు. ఏదో వొంకేట్టుకున్నా , తనకి తను సరిపెట్టుకోడవె అవుతాది. పాపం, యీ గొడవంతా తనకి తప్ప రొండో కంటోడి కెవుడికి తెలీదనుకుంటాడు. అల్లా ఎవుడి కాడే అనుకొడవు లో వున్నాది సిత్రవంతా.
    ఎప్పటికో వొళ్ళు మరిసి నిదరోతాడు అదప్పుడు సచ్చినోళ్ళల్లోనే జవ! అల్లా కొన్ని జావులు పోగాపోగా ఎప్పటికో తెల్లవోరతాది. అది ఆడికి తెలీనే తెలీదు. సూరీడు సూదులు కాలిసి ఎర్రగా కళ్ళల్లోకి గుచ్చుడవుతో మొగాని కున్న మాసికలు సటుక్కుని తుడిసేసుకుని కొత్త పుంత ఎసుగుంటాడు. మల్లా అదో జనవ! మల్లీ రితిరయితే మల్లా మల్లా అదే.
    రోజురోజుకీ కొత్త ఆశలు పుట్టించి, కొత్త ఎలుగులు యీరజిమ్మి సూరీడికి, బూమ్మీదుండీ మనిసికి వున్న సుట్టరికం -- సొగసుగా యిడిసి పువ్వుకీ, ఆ వోసన్లు మింగిన గాలికీ వున్న పేగు సమ్మందవేవో!
    అనుకుంటానే ముసలోడు తాణవు సేసి గట్టు మీద కొచ్చాడు. పెదాల్లో ఏటేటో గోనుగుతా రొండు సేతులూ పైకెత్తి , పై నున్నోడికి  దంణా లెట్టాడు. కింది కొంగి బూదేవమ్మకి పెట్టాడు. ఒళ్ళు తుడుసుకుని కర్ర సంకల్లోకి దూర్సుకుని ముంగటికి నడిసి పోయాడు.
    అయేల కప్పుడే మొగం కడుక్కుని, కడవ సంక లో బెట్టుకుని నీళ్ల కోసం వొచ్చీ సీతమ్మ యింకా తలుపు తెరిసిన అలికిడే కాలేదు. రేతిరి సరింగా నిదరట్టలేదోవో! పాపం , సిన్న పిల్ల!
    "అటు సూరీ డిటు పోడిసినా వొంటి సుకవంటే ఎరగని సిన్నది యీయె లింత పొద్దెక్కి దాకా మగతగానే వుండడం ఏంటో?" అనీ అనుకున్నాడు. అనుకుంటానే గుడి సింపుకి ఎల్లాడు. లోనకి నడిశాడు. ఎల్లి మల్లీ తలుపు సేరేసేడు. సీతమ్మ యింకా నిదర లేగలేదు. గోడమీద బల్లిలా మంచాన్ని కరుసుకున్నాది. తల పక్కకి వొలి, జుట్టు పీసులా రేగి, సీర సెల్లా సెదరయి, నలిగున్నది.
    'ఏంటో?' అనుకున్నాడు ముసలయ్య. పిన్న అనువానవూ పొరుసుకు వొచ్చినాది.
    "లేపుదారా? అయినా ఎందుకో?' అనుకుంటా మంచం కాడ కెల్లాడు. వొళ్ళు మరిసి నిదరోతన్న పిల్లని లేపడానికి మనసొప్పక ఎనక్కి తిరిగాడు. గోదాట్లో తడువు కొచ్చిన పంచి గుడ్డయి నీళ్ళు పిడిసి , దండెం మీద ఆరేశాడు. బొత్తావుల బనీనేసుకుని కర్ర టకటక లాడించుకుంటా గుమ్మం కాడి కెల్లి తలుపు లాగాడు.
    "తాతా!" అంటా గావుకే కేట్టినాది సీతమ్మ. ఉలిక్కిపడి ఎనక్కి తిరిగాడు. ఆ కేకే ఆడి గుండిల్లోకి పొడుసు కెల్లి ఎయ్యిసార్లు తిరిగి పలికింది. బయం, బాద, జాలి, ఏడుపు!
    తలుపు సేరేసి మల్లా మంచం కాడి కొచ్చాడు.
    "ఏం అమ్మా?"
    మాట నోటంట రాకండానే, బుర్ర వోలుసుకున్నాది.
    "ఏం కావాలమ్మా?"
    పలకలేదు. తల గుండిల్లో దాసుకున్నాది.
    "వొంట్లో బాగోలేదా తల్లీ? పెసాదం దొరగాడి కెల్లి వుపాపతీమాతర్లు తెమ్మన్నావా? రెతీరీ, పొగలూ యింటో పనితో, పాపం నీ వొళ్లు వూనవయిపోతన్నాది. నీ యీడు పిల్లలింకా అమ్మకాడే వుండవొలిసినోళ్ళు! ఏం సేత్తాం! దేవుడు నీకీ కట్టాలు పెట్టాడు. జబ్బు సేసి బాదపడ్డం నీ వొంతు, సూళ్ళీక బాదపడ్డం నా వొంతూ! అంతా ఆ బగవంతుడి మాయ! పోనీ, దరవాసు పత్తిరి లో అరుకు తెమ్మన్నావా? సేప్పమ్మా!మాయమ్మవు కాదా?"
    మంచం దరికెల్లి వొంటి మీద సేయ్యేశాడు.
    "ఒద్దు తాతా! వొద్దు . నన్ను ముట్టుకొద్దు!" అంటా ఎక్కెక్కి ఎడిసినాది.
    ముసలయ్య కంతా అమోమయవయిపోయినా అలోసనగా పైకి సూశాడు.
    "అమ్మా! ఆడు కాని ---"
    "తాతా!"
    బొడ్డు లోంచి లెగిసినా దా అరుపు. లోన రగిలిన బాధ పొగిలి పొగిలి ఎల్లు కొచ్చినాది.
    "ఆళ్ల వూసేత్తకు తాతా! ఆళ్ళదెం తప్పు లేదు. నేనే పనికి మాలినదాన్ని! నారాతల్లా కాలినాది!"
    ముసలయ్య కి వొళ్లు మండిపోయినాది. కంటబడితే సాలు ఆడి రగతం తాగేసీవోడిలా వురివాడు.
    ఇంతట్లో తలుపు తోసుకుని ఆడు రానే వొచ్చాడు. వొచ్చి ముసలయ్య మొకం లోని కోపం సూసి, ఎంటనే ఎల్లి పోబోయాడు. కాలు టకటక లాడించుగుంటా నడిసేల్లి ముసలయ్య ఆడి జబ్బట్టుగున్నాడు. బయంగా ఎనక్కి తిరిగాడాడు. సేతుల్తో బుజాలు అదిం పట్టి , ఆడి కళ్ళలోకి సూటిగా సూశాడు. బిక్క సచ్చిపోయాడాడు. కొంచెం దయిర్నేం సిక్క బట్టుకుని నోరు మెదపబోతావుంటే స్సేళ్ళుని లెంపకాయ కొట్టాడు ముసలయ్య. అదిరిపోయాడు.
    "ఏంరా! ఎదవా! బతికుండాలని లేదేంట్రా? దానొంటి మీద సేయ్యేశాక నిన్ను పెనల్తో వోదుల్తానన్నా ననుకున్నావట్రా? ఆ ఏల దీని జిగునీ గొలుసు తీసుకున్న నాడు నాకిచ్చిన మాట మరిసి పోయావంట్రా? మాటాడవేం?"
    సేత్తో , వోసిన బుగ్గ రాసుకుంటా సూశాడాడు.
    "నాకేం తెల్దు."
    "ఉహు!"
    "నోరుముయ్!"
    "నిన్ననే నసలు గుడిసిలోకి రాలేదు."
    "నువ్వు రాపోతే వోల్లకాట్తోవోడు యింకేవుడోత్తాడురా?"
    
                           *    *    *    *
    "సెరబయ్యగాదా?"
    "ఏవో!"
    "ఎంకన్న గాడా?"
    "ఏవో!"
    "ఏవో వంటావంట్రా ? నాకాడ దాసదానికి నీ కెన్ని గుండిలున్నాయి? మరియాదగా సెప్పు. లేపోతే నీ గుడ్లు పీకేత్తా ! రగతం తాగేత్తా!"
    సిన్న నవ్వు నవ్వాడాడు.
    "ఎన్ని తిడతన్నా సిగ్గు లేదంట్రా?"
    "నాకెందుకో?"
    "మరేవురో సెప్పు. ఊ!"
    "నేను కాదు."
    ఆ మాటతో ముసలయ్య కి సిర్రేత్తుకోచ్చినాది.
    "దొంగదవలందేర్నీ సేరదీసి, దిక్కులేని ఆడకూతురు బతుక్కి నిప్పెడతావంట్రా?"
    "నే కాదంటే నన్నంటావెం?"
    "అన్నో?"
    మల్లా నవ్వాడాడు.
    ముసలోడు కాగడాలా లేగిశాడు. సంకలో వున్న కర్ర ఎత్తి ఆడి నెత్తినెడతా---
    "సచ్చావురా ఎదవా!" అంటా అరిశాడు.
    "తాతా!" అని గట్టిగా అరిసి, గబుక్కుని మంచం మీంచి లెగిసి , సీతమ్మోచ్చి అడ్డు పడినాది.
    "తప్పు తాతా! యీడ్ని కొట్టకు. యీడి దేం తప్పులేదు. అదంతా నా కరవ! ఎవుళ్లనని ఏం లాబం! సిన్నతనం లోనే అయ్య సచ్చి పోయాడు. అమ్మా, ఆడూ గోదాట్టి కొట్టుకు పోయారు. సావలేక నేను బతికాను. బతికుండగానే సచ్చిందాన్ని తాతా! దేవుడు రాసిన రాత ఎవుడ్ని కొడితే మారతాది?"
    అది ముసలయ్య కాళ్ళ మీద పడినాది. యిదిలించుకున్నాడు.
    "నీకు తెల్దు సీతమ్మా! సూత్తా వూరుకుంటే యీళ్ళ దుండగం పెచ్చు పెరుగుతన్నాది. అవుసర వొచ్చినప్పుడు కాళ్ళీరాగ్గోట్టా పొతే యీడి బుద్ది దారికి రాదు!"
    "ఒద్దు తాతా! ఒద్దు!" అంటా తాతని సుట్టేసుకు పోయినాది సీతమ్మ.
    సీతమ్మని లేగదీసి గుండిలి కొత్తుకున్నాడు ముసలయ్య.
    ఆడి కళ్ళంట పడ్డ వుడుకు నీళ్ళు సీతమ్మ తల మీద అవిసేకాలు సేశాయి!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS