Previous Page Next Page 
వారుణి పేజి 20


    ఆమె నిష్టూరత్వానికి నొచ్చుకుని తనూ టేబుల్ వద్దకు వెళ్ళింది. పళ్ళాలు తీసెయ్యాలని చేయి చాచింది.
    "నీకెందుకులే_నేనే తీసేస్తా!" వారించింది సావిత్రి చిటపట లాడుతూనే.
    అంతలో సుబ్బరత్నమ్మ వచ్చింది.
    "మొదటిరోజే యింటి పనికి వస్తున్నావా?"
    ఆ మాటలకి వారుణి సమాధానం యివ్వలేదు. మౌనంగా వుండిపోయింది.
    "నేను వద్దంటూనే వున్నానత్తయ్యా! తనే_" అర్దోక్తిలో వదిలేసింది సావిత్రి.
    "సరే_సరే_" మాటలు విసిరింది సుబ్బరత్నమ్మ.
    స్థాణువులా నించుండిపోయింది వారుణి.
    "వీళ్ళకి మర్యాద తెలియదా? మన్నన తెలియదా? కనీసం తను కొత్త పెళ్ళికూతురనీ_యీ రోజే అత్తారింట్లో అడుగుపెట్టాననీ కూడా ఆలోచించరేం? ఉదయం గడపలో అడుగు పెట్టీపెట్టగానే అత్తగారలా అంది. ఇప్పుడేమో యీవిడిలా అంది. దానికి అత్తగారూ వత్తాసిస్తోంది." తాము ఒకరోజు యిలా వచ్చిన వాళ్ళే అనుకోరేం?" ఈ లోకంలో ఆడదాని మొదటి శత్రువు ఆడదే అని ఎవరో అన్నమాట గుర్తుకొచ్చిందామెకి.
    ఉవ్వెత్తుగా గుండెల్లోంచి తన్నుకొస్తోన్న నిట్టూర్పుని అణుచుకుంటూ మెల్లిగా అక్కడినుంచి కదలి వెళ్ళింది.


                                          8


    "ఏమిటి చదువుతున్నావ్ ?"
    ఆ ప్రశ్నకి ఉలిక్కిపడింది వారుణి. ఆ ఆలోచన నుంచి తెప్పరిల్లి చూసింది.
    సారధి!
    మౌనంగా ఉత్తరం అందించింది.
    "చదవనా? నీ పర్సనల్ లెటర్ కదా?"
    "ఇప్పటి నుంచీ మన మధ్య దాపరికాలు లేవు కదా! ఏదయినా అది మన యిద్దరికీ సంబంధించింది. నాన్నగారు రాశారు"
    సారధి ఉత్తరం చదివాడు.
    అది చదవగానే అతని ముఖంలో ఏదో ఉత్సాహం కనిపించింది.
    "చిన్నా !"
    "ఊఁ"
    "మీ నాన్నగారు నీ పేర పదివేలు వేశార్ట!
    "ఊఁ" నిర్లిప్తతతో అంది.
    "ఈ విషయం మా అమ్మకి చెబుదాం" ఉత్సాహంగా అన్నాడతను.
    "ఎందుకు?" ఆశ్చర్యపోయింది వారుణి.
    "చిన్నా! నువ్వు కట్నమేమీ తేలేదని నలుగురిలో తనకి ఎలాగో వుందని అందామె. పైగా పద్మ పెళ్ళి విషయం కూడా ప్రస్తావనకి వచ్చింది."
    "పద్మకి పెళ్ళా?" వింతగా వెర్రిగా చూసింది.
    "అవును_తనకేమో యింకా చదవాలనే వుంది. కానీ నాన్నగారు యింకో రెండేళ్ళలో రిటైరయిపోతారు. ఈ లోగానే పెళ్ళి చేసెయ్యాలని ఆయన అనుకుంటున్నారు. గవర్నమెంటు జాబ్ చేసేవాళ్ళు పొజిషన్ లో వుండగానే పెళ్ళి చేసెయ్యాలి. రిటైరయిపోతే పెళ్ళికి ఎవరూ రారు. ప్రజంటేషన్స్ ఎలా వుంచి యిన్విటేషన్స్ కూడా వృధా అవుతాయి" నవ్వుతూ అన్నాడు సారధి.
    "ఇట్స్ టూ బాడ్ రధీ_పద్మ ఏమంటోంది?"
    "పద్మేమంటుంది? తనకి పర్టికులర్ గా ఒక ఊహ అంటూ లేదు. ఆమెదేముంది చిన్న పిల్ల. షి ఈజ్ హర్ ఓన్లీ ఎయిటీన్_"  
    వారుణి జవాబివ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆమె ముఖం గంభీరంగా అయిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS