Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 20


    "ఏమిటత్తయ్య అలా అంటారు? ఇదంతా ఈరోజుల్లో చాలాసహజం. పెద్దవాళ్ళు మీరు. మీ అండదండలు, ఆశీస్సులు పోయాయి వాళ్లకి _ వాళ్లే దురదృష్టవంతులు ...

    "ఎందుకులేమ్మా అంత మాటలు! వాళ్లు ఎక్కడున్నా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అదే మనం కోరుకునేది" అన్నారాయన.

    స్వాతికి అప్పడుగానీ తను చేసిన పొరబాటేవిటో అర్ధంకాలేదు.

    "వాడొక యోగ్యుడయ్యాడు. వాడి గురించిహ దిగులు లేదులే అని సంతోషించాము. ఆ సంతోషం ఓ గంట కూడా అనుభవించకుండానే ఈ దెబ్బ! ఓ కంట ఆనంద భాష్పాలు, మరో కంట కన్నీరు. ఏం చిత్రం! భగవంతుడు దయామయుడు"

    మామగారి నిర్వేదం పట్టించుకోలేదు స్వాతి.

    "రండత్తయ్యా!"

    "పదమ్మా! పద! బ్రతకాలికదా!" అంటూ లేవపోయింది పార్వతి.

    సరిగ్గా అదేసమయంలో ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగింది.

    అయోధ్యా రాం సైకిల్ బ్రేక్ వేసి దిగి లోపలికి వచ్చాడు.

    అతని వెంటే వచ్చింది అహల్య.

    మోటార్ సైకిల్ ని, సైకిల్ పై వాళ్ళిద్దరినీ చూసిన ఇరుగుపొరుగు వాళ్ళు పిల్లలూ బిల బిలమంటూ గుంపుగా వచ్చారు.

    వాళ్ళిద్దరూ లోపలికి రాగానే ఎదురుగానే వున్న శాస్త్రిగారికి పార్వతికి పాదాభివందనం చేశారు....

    చామనచాయ, కుదురైన గుండ్రని ముఖం చందమామలో కొలువు తీరిన కలువరేకుల్లా సోగకన్నులు... గులాబీ రంగు పెదవులు, నున్నగా మెరుస్తున్న చెంపలు_ అందమైన జడ, తీర్చిదిద్దిన అవయవాలు, కళ్ళల్లో బెదురు__ ఆ బెదురు దాచుకోవాలన్న ప్రయత్నంలో తలవాల్చేసుకు నిలబడింది.

    "ఫరవాలేదు. అయోధ్యది రాంగ్ సెలక్షన్ కాదు. ఏకులమైతేనేం?" అనుకుంది స్వాతి.

    కోసలరాం కూడా మనుషుల కలకలం విని బయటికి వచ్చాడు. నోటమాట లేక అపరాధిలా నిలుచున్నా సోదరుడ్ని, ఆమెని, మౌనంగా నిలబడ్డ తల్లిదండ్రుల్ని చూశాడు.

    "వెళ్ళండి! వెళ్ళండి. ఏం సినిమా చూడాలని వచ్చారా? పదండి ఏం లేదు. వాడు మా అన్నయ్య, ఆమె మా వదిన. ఇప్పుడే తిరుపతి నుంచి వస్తున్నారు. కాస్త విశ్రాంతి తీసుకోనివ్వండి. సాయంత్రం రండి. పేరంటం చేస్తాం చూద్దురుగాని" అని అందర్నీ కేకలేసి పంపించాడు. మోటార్ బైక్ తెచ్చి లోపలపెట్టాడు.

    "ఒరేయ్ అయోధ్యా మంచి సెలక్షన్ రా. సైకిలే కాదు వదినమ్మ కూడా బావుందిరా - నేను నీతోబాటే పుట్టాను. నీతోనే పెరిగాను. అక్షరాభ్యాసం మొదలుకుని డిగ్రీ వరకూ వచ్చాను. అయినా ఏనాడూ నువ్వు ప్రేమలో పడ్డట్లు గమనించలేదురా__ 

    అయోధ్యరాం తమ్ముడిని వారించబోయాడు. అతడు వినిపించుకోలేదు.

    "నాది మట్టిబుర్ర! నిజంగా! కవలల్లో ఒకడు ఇంటి లిజెంట్ అయితే మరొకడు కాస్త మొద్దవుతాడట్రా..."

    అయోధ్యాకి నవ్వక తప్పలేదు.

    "స్వాతీ భోజనాలు వడ్డించమ్మా" అన్నారు శాస్త్రి.

    "మేం భోజనాలు చేసివచ్చాం నాన్నా! మీరింకా భోజనం చేయలేదా?" ఏదో పలకరించాలన్నట్లు ఎబ్బెట్టుగా అన్నాడు అయోధ్య.

    "కొడుకుల ఘనకార్యాలు చూస్తూవుంటే మాకూ కడుపులు నిండిపోతున్నాయి నాయనా" అంది పార్వతి.

    అయోధ్యరాం పలకలేదు.

    "పార్వతీ! నీ కొడుకులందరూ పెద్దాళ్ళయిపోయారే! ఎవరికి వాడే స్వతంత్రుడై స్వేచ్చగా బ్రతకాలనుకుంటున్నారు."

    "నాన్నా" ఆవేదనగా పిలిచాడు.

    "అవున్రా అబ్బాయ్! నీ మనసులో వుద్దేశం నాన్నగారితో చెప్పి ఆయనతో అవుననో, కాదనో అనిపించుకుని ఆ తర్వాత ఈ పెళ్ళిచేసుకుని వుంటే నిన్నేవరేమనేవారు. అదేం లేకుండా నీ యిష్టం వచ్చినట్లు చేశావు. నీకు తల్లిదండ్రులంటే ఏమాత్రమైనా అభిమానంవుందా? గౌరవం అక్కర్లేదులే ప్రేమయినా కోరవద్దా యేం"

    "అదికాదమ్మా! నేను అహల్యను పెళ్ళిచేసుకోవటానికి మీరు అంగీకరించరని భయపడ్డాను" అన్నాడు బెదురుతూ__

    "పెళ్ళి చేసుకోవటానికి అంగీకరించని వాళ్ళు కలసి కాపురం చేయనిస్తారట్రా."

    "అమ్మా! మీకు తెలియదు. ఆమె పూర్తిగా శాఖాహారి. చూడమ్మా చూడు_ ఆమెముఖం చూడు. చెప్పందే ఆమె ఏం కులం పిల్లో తెలుస్తుందా? మనతో కలసి పోతుందమ్మా. ఆమెకి మీరన్నా, నాన్నగారన్నా చాలా అభిమానం! గౌరవం! మీవంటి వాళ్ళసేవచేయగల్గగటం తన అదృష్టం అంది"  

    "చాలునాయనా! మా అదృష్టం అక్కడికి ఆగితే చాలు పూర్వీకులనుంచీ తరతరాల నుంచీ వస్తున్న సంప్రదాయాల్నీ ఆచారాల్నీ కాపాడలేం. మమ్మల్నిలా మా బ్రతుకులు బ్రతకనీ.

    "ఏది సంప్రదాయం నాన్నా! అంత కడివెడు పాలపై ఒక్కింత మీగడ తీరినట్లుగ మనకు మిగులును. గతములో పలి మంచి అదియే సంప్రదాయం అన్నారు. పెద్దలు వేదవేదాంగాలు చదువుకుంటూ శుద్ధశ్రోత్రియంగా బ్రతికే బ్రాహ్మణులు ఈ రోజు బ్రతుకు తెరువు కోసం చేయని వుద్యోగం వుందా?

    "హోటల్స్ లో వంటవాళ్లుగా, సర్వర్ లుగా, లాడ్జింగ్ లో బాయిస్ గా, ప్యూనుగా బ్రతకటం లేదా?

    "చెప్పండి ఎక్కడుంది కులం?"

    "మీ నాన్నగారినే ఎదిరించి మాట్లాడతావురా?" పార్వతి ఆవేదనగా అడ్డుపడింది.

    "ఎదిరించటం లేదమ్మా! వున్నవిషయం చెపుతున్నాను.

    "మీరు అభిమానించి పారాయణం చేసి, అనువదిస్తున్న రామాయణం హీరో రాముడు బోయ శబరి ఎంగిలి తినలేదా? అక్కడేమైంది కులం?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS