
12
కడవుచ్చుకుని సీతమ్మ, నీల్లోసుకోడానికి గోదారి కేడతా వుంటే, ఎనకాతలే పిల్లిలా ఎల్లీ వోడు. సాటు నించయినా , తడి గుడ్డల్లో దాన్ని సూడాలని ముచ్చట పడివోడు. నీళ్ళు నింపుకుని గుడిసి లో కేడతా వుంటే, ఏం ఎరగనట్టు అడుగులో అడుగు కలుపుతా ఎల్లీవోడు. మరీయాద కోసవని సీతమ్మ పీటేసి కూకోబెట్టేది. ఏంటెంటో సేప్పుకుపోతావుండీవోడు. పొయ్యి సురుకుంటా , కూర తరుక్కుంటా , గెంజి వోర్సు కుంటా వూకోడతా వుండీదది. ఓ నాడేనయినా దంటే, యీడు సిగోరెట్టు కాలుత్తా కవుర్లు సేబుతా వుంటే మాటల్లో గబుక్కుని నిలేసినాదదీ.
"ఇన్ని వూసులు సేప్పేవోడివి, ఎప్పుడూ నీ పెళ్ళాం సంగతే సెప్పవేంటి ఎంకన్నా?"
ఆ మాట లాడికి సురుక్కుని తగిలాయి. సిరాకూ కలిగినాది. సిర్రేత్తుకోచ్చీది. అయినా దాందగ్గిర ఎర్రోడిలా ఏంటంటే ఏం తడకలు కడతాదో అని, మాట మారిసేశాడు. సీతమ్మ నవ్వినాది. తిరిగి వోటేల్లో కెల్లిపోతా వుంటే మల్లా అడిగింది.
"మొగుడు వయ్యాక ఆపాటి సేప్పడాని క్కూడా సిరాకే?"
ఈసారాడు వుండబట్టలేకపోయాడు. పళ్ళు పటపట లాడించాడు. తుపుక్కుని వూసాడు.
"ఇప్పుడడిగితే అడిగావు కానీ, యింకేప్పుడూ దాని వూసేత్తకు సీతమ్మా!"
ఆ మాటల్లో కోపవూ సూబించాడు. కుదేలయినా దది. మల్లా కొన్నాల్లదాకా దాని కంట బడలేదాడు. ఆడి మనసు మారసక పోడం సరిగందా, తనే ఆళ్ళ కాపరానికి అపకారం సేత్తాన్నా నేవో అనుకున్నాది. ఈసారి గట్టిగా పట్టట్టకపొతే తను పడ్డ కట్టమంతా నీళ్ళు కారిపోదో?
మరుసట్రోజుని ఆడు జీడిపప్పు కాయిళ్ళు బెరవాడతావుంటే, పనిగట్టుకుని ఎలపలి కొచ్చి, 'ఎంకన్నా!' అంటా పిలిసినాది. ఏ ఎగమన్నాడో ఏవో, దాని పిలుపు యినేసరికి నిన్నటి యిసురే మరిసిపోయాడు. ఏదో కాడికి బేరం పైసలా సేసుకుని, సరుకేయించుకుని, సేంగు నొచ్చి సీతమ్మ గుడిసి కాడ వోలినాడు. అప్పటిదాకా గుమ్మం కాడే నిలుసున్నదల్లా, యీడ్ని సూసి సొగసుగా నవ్వుతా లోనికి జరిగినాది. యీడూ ఎల్లాడు. పాక వడాన్నున్న రాటకి సేర్లబడి కూకుందది. ఆడొచ్చి బల్ల మీద సతికిల బడ్డాడు.
"కోప వొచ్చిందా ఎంకన్నా?"
ఆడి గుండిలు పోడిసేత్తన్నట్టు సూసింది. అదంతా తనమీద మోజేమో ననుకుని ముచ్చట పడిపోయాడాడు.
"సేస్సా! నీ మీద కోపమేంటి సీతమ్మా?'
ఈలయినంత సొగసుగా అందారనుకున్నాడు. ఆడి మాటల కూరుపుకి ఆడే పొంగిపోయాడు.
"నామీద కాపోతే మరోరిమీ దున్నదో?" సిగ్గుపడి సిన్నగా నవ్వాడాడు.
"నీ పెళ్ళాం మీదేనా?"
దాంతో ఆడి పెదాలు బిగిసిపోయాయి. సూపులు పదునయాయి.
"మనిద్దరి నాడాన్నీ దాని మాట మల్లా ఎత్తద్దని సేప్పలేదా సీతమ్మా?"
కోపం, సిరాకూ, సనువూ, పరాసకం కూతకూతే కలిసి మరీ అన్నాడు.
సీతమ్మ నవ్వినాది. ఆ నవ్వు లోతెంతో ఆడికి తెలీనే లేదు.
"రావులమ్మ వూసంటే నీ మనసెందు కిరిగింది?"
ఇంక అది తన మాట యినిపించుకునీట్టు లేదని తెలిపోయినాది. అంతల్లా గుచ్చి గుచ్చి అడగడం లో వుద్దేసేవేంటో? తను మాట మారిసినా అదింక తన్ని వోదల్దనీ తెలిసినాది. ఒకేల దాన్ని వోప్పించాలని సూసినా తను నెగ్గలేననీ తెలుసు. అందుకని దాంతో మాట్లాడ్డవే తగ్గించుకుందారని సూశాడు. సివోల్న బల్ల మీంచి లెగిసి ఎలపలికి రాబోయాడు. అడ్డంగా నిలుసుని సీతమ్మ అటకాయించినాది.
"కట్టుకున్న పెళ్ళాన్ని కట్టం పెట్టి నువ్వేం పొంకుంటావు ఎంకన్నా? మనసు పడి నిను పెళ్ళి సేసుకున్నాది. తన సుకాలన్నీ నీతోటియే అనుకున్నాది. తన బతుకంతా నీ కాళ్ళ కాడే నాయేజ్జెం పెట్టినాది. నువ్వే తన దేవుడనుకున్నాది. అల్లాటి ఆడదాని కళ్ళంట నీళ్ళు తెప్పిత్తే నువ్వేం బాగుపడతావు ఎంకన్నా?"
తుపాకీ గుళ్ళు పేల్చినట్టు యింతలేసి మాట లంటా వుంటే ఆడు రాతి బొమ్మలాగే నిలుసుండి పోయాడు.
దీని కంతకీ బలం యిచ్చింది తన అలుసే అనుకున్నాడు ఎంకన్న. యియ్యకుండా వుంటే బాగుంది పోయీది. తన కాపరం గుట్టు మాట్లన్నీ తెలుసుకుని రచ్చ కీడవడానికా? పోనీ గందా , ముచ్చటయిన పిల్లగందా తనంటే యిట్టవుగందా! అని సేప్పేసి మనసిప్పి మాటాడితే యీయేల తన్నిలా టోకాయిత్తాదని ఎప్పుడేనా అనుకున్నాడా?
సీతమ్మ మీద ఆడికి కోప వొచ్చినా మాట నిజవే కాని, వొచ్చినా తను ఎర్రోడయిపోడం తప్ప దాన్నేం సేయలేడని తెలుసు. అందుకే, యిప్పుడయినా మించిపోలేదు కనక, దాని మనసు మారసడం సాలా మంచిదనుకున్నాడు. బద్రయగాడి కెల్లాగా అది లొంగేది కాదు. సెరబయ్యగాడు సరేసరి , సచ్చుగటం! ఇంక తనోక్కడికే ఆయీలు సిక్కినాది. నాసావిరంగా , యీ అదున్లో దానికి సరీగా సక్కిలిగింత పెట్టేడో, మల్లా రావులమ్మ వూసేత్తుతాదా? అంత గొప్ప వుపాయం బుర్రకి తోసినందుకు తన గొప్పతనాన్ని తనే నమ్మలేక పోయాడు. పట్టిందల్లా బంగారవయితే ఎయ్యి దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టడో? మల్లా అలవూరు దారి కూడా తోక్కాలేంటి? మొగమ్మీద సిరాకంతా సేత్తో తుడిసేసుకుని జేబీలోంచి మల్లా బీడీ పీకి తీశాడు. అగ్గిపెట్టె నిండుకున్నాది.
"కూతంత అగ్గే డతావా సీతమ్మా?' నోటి నిండా అడిగాడు.
"ఎవురికీ?"
"నవ్వాడు.
"రావులమ్మకా?" అదీ నవ్వినాది. కళ్ళు వోరగా పెట్టినాది. "ఆగ్గేట్టడానికి నేనేం దాని మొగుణ్ణి కాదుగా!"
"అయితే నేన్దానికి ఆగ్గేడతన్నానంటావా?"
"సేప్పుకోడాని క్కూడా సిగ్గులేదో?"
"సిగ్గు నీది ఆడోళ్ళ సొమ్ము!"
"మొగోళ్ళు యిలాంటోళ్ళు అయితే అంతే మరి! సిగ్గూ పడతారు. ఈలుంటే సావనూ సత్తారు!"
"పీడే యిరగడవుద్ది!"
"నువ్వింత కటికోడి వనుకోలెదెంకన్నా!"
"కటికోడ్నో , మంచోడ్నో నువ్వే సూత్తావుగా!"
"ఏంటీ?"
"ఏంటో యిప్పుడే సెబితే సరసం దెబ్బ తింటాదే ఎర్రిదానా!"దానోంక మల్లా సూడకుండానే సింగుని దాటేశాడు ఎంకన్న.
సూడగా సూడగా ఆడి యవ్వారం బద్రయ్యకి యిడ్డూరవయినాది. ఇన్నాల్లాయి తన పంచని సెరినా, ఎప్పుడూ సీతమ్మ ఎంపు కన్నెత్తి కూడా సూడనోడు, యీ మద్దె దాని గుడిసి లో కంత సొరవగా దూరతన్నాడేవా అనుకున్నాడు. తన్ని సూత్తే సివాలేత్తీ సీతమ్మ ఆణ్ణి దరికెల్లా రావిత్తన్నాదో?-- అనీ అనుకున్నాడు.
తన వొద్దీలో కొచ్చినోడు రోజు రోజుకీ మెరికి లాగయిపోడో? సురుకుపా లేక్కువు కాదో? తన సేగ్గికి తనే మురిసి పోయాడు. నోట్లో ఏలేడితే కోరకలేనివొళ్ళని కూడా వొజ్జిరాల్లా మెరిపించి యిద్దెలు తనకాడున్నందుకు మీసాలు కూడా దువ్వుకున్నాడు.
మరిగంటే, ఆ సురుకే యింకో పాలేక్కువయినాదంటే మొదలుకే మోసం రాదుగందా? ఎర్రెంకన్న గాడే సూసి సూసి తనకే ఎసరెట్టడు గందా? పంజిరవులో సిలకలా గున్న సీతమ్మ ని సూసుకు మురుసుకుపోతున్నందుకు తన కళ్ళల్లో కారం కొట్టి ఎగరేసుకుపోడు గందా?
అయినా బద్రయగాడి సంగతి ఎరగావోళ్ళేవురంట? అవులిత్తే పేగు ల్లెక్కట్టడో? ఆడి కళ్ళేదర రొండోకంటోడు దాన్ని దక్కించుక పోగల్డనే? రగతం తాగేయ్యడో?
అసలు, సెంద్రకాంతం మీంచి సూపు మల్లించాలనే తను ఎంకన్న ని సారా యాపారం లోకి దింపింది. పనేం సేయకుండానే లాబం లో సగ వోటా గుంజుకుంటన్నాడు. ఆ వుపాయం తోనే ఆడికి యింటో గూడా సనువిచ్చాడు. ఆ సందట్టు కుని, ఆడే కనక సీతమ్మ ని ఏసుకుపోదారనే సూసేడో, పెనాల్తో తను యిడుత్తాడనే? తల తెగ్గొట్టి కోట గుమ్మవు కూడ నడి బజార్లో కట్టా పొతే తన పేరు బద్రయ్యేనా అంట?
అల్లా గనుకుంటానే కూతంత తమాయించాడాడు. ఎవ్వారం ముదిరినప్పుడు మాటగందా! ఈలోగా ఎయ్యి కళ్ళతో కని పెట్టిగునుండడో? అవుసరవొత్తే కాళ్ళిరగ్గోట్టడవే కాని, యిప్పుడే తొందరపడితే బెడిసి కొట్టదో? ఏవయినా ముందు సూపు మంచిదేలే! గట్తోళ్ళని నలుగుర్ని ఆడి మీద నిగా పెడితే సరి!
ఇలాగంటా ఎయేయో అలోసన్లు బుర్రలో దొల్లి పోతావుంటే ఎనకేపునించోచ్చిన సెరబయ్య యీపు మీద సేయ్యేశాడు. వులిక్కి పడ్డాడాడు. సెరబయ్య నవ్వాడు.
"ఏంటో ఎత్తు లెత్తన్నావు గురో!"
"అబ్బే! ఏవుందిరా సేరబా! అలమూరోడు లేడూ, ఎవురూ మన ఎంకన్న గాడు--"
"హోరి! ఆణ్ణి గురించి యింతాలోసి నెందుకు గురో?"
"నువ్వూ సూత్తానె వున్నావుగా!"
"సీతమ్మతో సరసాలేనా? పోన్లే గురో! కట్టుకున్న పెల్లాందగ్గిరి లేపోతే , పడుసు పిల్ల కనబడితే ఎంతటోడికయినా ఎటకారవాడా రానిపిత్తాది! పాపం, అపాటేనా యీలియ్యాక పొతే ముమ్మరం లో వున్నోడుగందా, అడింక మనం సెప్పిన మాటింటాడా?
బద్రయ్య సురసురా సూశాడు. సెరబయ్య కూత తగ్గాడు.
"అది కాదు బద్రయ్య! నేనో సంగతి సేప్పనో? సీతమ్మ మీ దాడికి మోజు కలగడం కూడా మన మంచికే అనుకో!"
"ఎల్లాగో?'
"సేబుతా యిను! ఓ మనిసిని మనం గుప్పిట్లో పెట్టుకోవాలంటే , సనువిచ్చి యిచ్చి, టైపు కనిపెట్టి , ఏదో వొంక మీద సటుక్కుని దెబ్బ కొట్టాల . తెలిసిందా? ఇక్కడాడుండగా ఆడు సీతమ్మ ని బుట్టలో ఏసుగున్నాడంటే , దీన్ని మించిన పాంకం లో వున్న ఆడి పెళ్ళాన్ని లాక్కొచ్చి నీ కాళ్ళ కాడ పడెయ్యనో? అందుకు మనం మంచి అదును కోసం సూత్తా వుందారి. ఏ ఎగలో నయినా అడుకాని సీతమ్మ సిగ తడివాడో, సేతులూ కాళ్ళూ యిరగ్గొట్టి కుళ్ళ బోడవనో? అయినా కాని, బద్రయ్యా! సేరబయ్యగాడుండగా సీతమ్మ మీద యీగ వోల్తాదనే?"
అది అలోసన బాగా నచ్చింది. నోరు మేలికిలు తిప్పి, మీసం మెలేసి, సూపులో సగం దాసి, గొప్పోడిలా నవ్వాడు బద్రయ్య. నవ్వుతా సేరబయ్య గాడి యీపు సరిశాడు.
ఇద్దరూ నవ్వుకుంటా లెగిసి ఎల్లి పోయారు.
రేవులో లంగర్లెత్తా పడవోలు దరికి సేరేత్త న్నారు. కొంతమంది పల్లోళ్ళు గెంజి వోరుసు కొడం కోసం సిదుకు లిరుత్తా వున్నారు. ఒకో బుల్లోడు బియ్యం కడుగుతావుంటే , మరోడు సేదేసి నీళ్ళు తోడతావున్నాడు. సంజీ ఎల్తురు సల్లగా పాకిపోయినాది. ఆరోజు అమావోసి! మిణుగురు పురుగుల్లా గున్న పడవోల్లో కిరసనాలు దీపం బుడ్లు తప్ప యిడిత్తే ఎలుగన్నదే సున్న.
గోదారి మీంచి యీదరగాలి జోరుగా కొడతన్నాది. పడవోల్లో దీపం బుడ్లు బయం బయంగా వొనుకుతన్నాయి. అయి అల్లా దడుసు కొడం సూసేనేవో, కెరటాలు మరీ ఎనక్కి లాక్కుపోతన్నాయి.
గుడిసి లో సీతమ్మ ముసలయ్య కి గెంజి పోసి నాది. ఆడు తాగేసి ఎక్కడికో అల్లాగే ఎల్లి పోయాడు. తను కూడా కూతంత తాగి, నులక మంచమ్మీద నడువోల్సినాది. రాటకున్న కిరసనాలు బుడ్డి ఎగురుతా నంటన్నాది.
లోన గేడేట్టడం మరిసిందో ఏవో, యిసురుగా ఎవురో తలుపు తొయ్యడవుతో బళ్ళుని సప్పుడయినాది. ఉలిక్కిపడి సీతమ్మ మంచం మీంచి లేసి నిలుసున్నాది. వొచ్చినోడు ఎనకాతలే గడీ బిగించి , జుట్టేగదోసుకుని, సేతులు రోండూ నడ్డి కెట్టుకుని, ముచ్చటగా నవ్వాడు.
ఆడి కళ్ళు కమ్మరి కొలివిల్లా గున్నాయి. సూపులు సూది మొనల్లాగున్నాయి. ఆడు అలా రాడవే? ఆకల్తో వున్న పడుసు సింవంలాగున్నాడు.
సీతమ్మ దడదల్లాడినాది. సూపులు సెదిరి పోయినాయి. నరాలు అడిరిపోతన్నాయి. ఒళ్ళంతా బయంతో ముడుసుకు పోయినాది. మినుకు మినుకు మంటా వున్న దీపం నీడలో రాటని కరిసి పెట్టుకు పోయినాది. దాని వొనుకు సూత్తే ఆడికి మరీ సార వొచ్చినాది. రోండడుగులు ముందలి కేశాడు. కానీ, సీతమ్మ అంటి పెట్టుకున్న రాట మట్టుక్కు ఎనక్కి ఎల్లనే లేకపోయినాది.
