Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 20

 

    అప్పటిదాకా ఇవతల లాన్ మీద ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గర కూర్చుని బుద్దిగా బిస్కెట్లు అరగిస్తున్న కుక్క పిల్ల మెల్లిగా ఒళ్ళు విరుచుకుంటూ బయలుదేరింది -- భూమికి జానెడు ఎత్తున బొద్దుగా ముద్దుగా వున్న ఆ కుక్క పిల్లతో కతో పాటు శరీరం అంతా కదిలించుకుంటూ గునగున నడిచి వెళ్ళింది తన బుల్లి యజమానుల దగ్గరికి. వాళ్ళు కాస్త ఎడంగా జరిగి ఇద్దరికీ మధ్య చోటిచ్చారు -- అక్కడ నిలబడి దర్జాగా కళ్ళు ఇటూ అటూ తిప్పుతూ సృష్టి సౌందర్యాన్ని పరికిస్తోన్నదాన్ని చూస్తె , ఇంజను డ్రైవర్ కి సరదా పుట్టిందేమో' చెవులు గింగురుమనేలా 'కంయ్' మని కూత పెట్టించాడు. అంతా ఉలిక్కి పడ్డారు. ఒక్కసారి-- కుక్కపిల్ల మరి ఎటూ చూడకుండా పరుగు పుచ్చుకుని యజమానురాలి ఒళ్ళో తలదాచుకుంది -- 'ఎంత ధైర్యమే నీకు -- రేపు నీకు ఇల్లు అప్పచెప్పి వెడితే ఇలాగే కాపలా కాస్తావా.' అంటూ మనుష్యులతో మాట్లాడినట్లే మాట్లాడుతూ దాని మూతి మీద తల మీద ముద్దులు పెట్టేసుకుందావిడ.
    'టామీ ఎంత భయపడిందో.' అంటూ చప్పట్లు కొడుతూ పిల్లలిద్దరూ వచ్చి తల్లికి చెరో ప్రక్క కూర్చున్నారు. 'అందరి లోకి చిన్న దాన్ని నేనే. అమ్మ ఒడిలో స్థానం నాదే' అన్నట్లు వాళ్ళిద్దర్నీ ఇంకా దూరంగా నెట్టి ఆవిడ ఓడంతా ఆక్రమించుకుని పడుకుంది టామీ'-
    టామీ వులిక్కిపడి పరుగు పుచ్చుకోగానే సురేఖ కి కిసుక్కున నవ్వు వచ్చింది -- బాగుండదని కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది.
    'ఏమయింది .' అదేం గమనించని మాధవ్ అడిగాడు -- సురేఖ అటు చూపించింది.
    కదిలి వెళ్ళిపోతున్న గూడ్సు బండి కేసి నిర్భయంగా చూస్తూ ఆవిడ ఒడిలో వున్న టామీని చూసి నవ్వుకున్నారు -- ఇందాకా భారంగా బరువుగా మారిపోయిన వాతావరణం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసినట్లయింది.
    'సరే వినండి' అంటూ అతను మళ్ళీ మొదలు పెట్టాడు.

                                    10
    రెండు సంవత్సరాల పాటు ఎంతో సన్నిహితంగా మెలుగుతూ పది రోజుల్లో భార్యా భర్తలం అయి జీవితంలో మాధుర్యాన్ని చవి చూడాలని కలలు కంటూన్న స్థితిలో ఉష ఇంక లేనేలేదు అనే వూహ నన్ను పిచ్చివాడిని చేసింది -- వారం రోజులు నిద్రా హారాలు మాని ఏడుస్తూ కూర్చున్నా . నా ఫ్రెండ్స్ వరో వ్రాసినట్లున్నారు పెద్ద బావ పరుగెత్తుకు వచ్చాడు. నేనేం చెప్పినా వినకుండా బలవంతాన ఇంటికి తీసుకు పోయాడు.
    అక్కడా అలాగే అయోమయంగా కాలం గడిపే వాడిని. ఓరోజు రిజల్ట్స్ వచ్చాయి. ముందుగానే ప్రొఫెసర్ల ని కలుసుకోవాలి ఫలితాలు తెలుసుకోవాలి అని ఆరాటపడి పోయిన నాకు అవి పేపర్లో పడినా చూసుకో బుద్ది పుట్టలేదు. అనుకున్నట్లుగానే ఉషకి నాకూ కూడా క్లాసు వచ్చిందని బావే చెప్పాడు-- అలా ఎన్నాళ్ళు కూర్చున్నా సాధించేదేమీ లేదనీ జరిగినదాన్ని మరిచి పోటానికయినా ఏ ఉద్యోగంలో నయినా ప్రవేశించమని లేకపోతె రీసెర్చి చెయ్యమని ఇంట్లో అంతా సలహా లిచ్చారు.
    నాకు ఏమీ చేయ్యాలనిపించేది కాదు -- జీవితంలో మరి పూడ్చుకోలేని వెలితి ఎర్పడినట్లూ -- ఈ మహా విశ్వంలో మరో తోడూ లేకుండా నేను ఒంటరిగా నిలబడి పోయినట్లూ అనిపించేది --
    అంతేకాదు అమ్మా అక్కయ్య లూ ఏదో వోదార్చడం బ్రతి మాలుకోటం , నేనేదో తప్పు పని చేస్తున్నట్లు బావలంతా మందలిస్తూ సలహా లివ్వటం నాకు మరీ ఒళ్ళు మండిపోయేది. నాలో ఏ మూలో కాస్త సంస్కారం వుండటం వల్ల వాళ్ళ మాట లన్నింటినీ అలా మౌనంగా భరించే వాడిని కాని లేకపోతె నా ఖర్మకి నన్ను వదిలేయండి మీ సలహాలు నాకేం అక్కర్లేదు అని ఇష్టం వచ్చినట్లు దులిపేద్దాం అనిపించేది -- వాళ్ళందరికీ దూరంగా వెళ్ళి పోవాలనే వూహ అప్పుడే కలిగింది.
    కొంత యాదాలాపంగానూ కొంత పట్టుదల తోటీ కూడా ఓ ఫారిన్ స్కాలర్ షిప్ కి అప్లయి చేశాను-- నా ప్రయత్నాల గురించీ ఎవరికీ చెప్పలేదు -- నేను సెలక్టు అయాను. ఇంక అమెరికా వెళ్ళటం నిశ్చయం అయిపొయింది అన్నప్పుడు చెప్పాను ఇంట్లో -- ఏడవటాలూ కన్నీళ్ళ తో బ్రతి మాలటాలూ మామూలేగా -- ఉన్న ఒక్క వంశాంకురం విరక్తి పెంచుకుని దేశాంతరం వెళ్ళి పోతున్నంత గొడవ చేశారు-- అయినా నా నిర్ణయం మార్చుకోలేదు.
    'ఈ రోజుల్లో ఆడపిల్లలే చదువులకి పై దేశాలకి వెళ్తున్నారు-- మరేం ఫరవాలేదు-- రెండు మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే మరో డిగ్రీ తో తిరిగి వస్తాడు మీ అబ్బాయి.' అని మా నాలుగో బావ అమ్మకి ధైర్యం చెప్పాడు. విశ్వం బావ అంటే నాకు మొదటి నుంచీ అభిమానం ఎక్కువ. అతనికీ అంతే.
    సరే. అక్కడ రీసెర్చి చేసి డాక్టరేటు తెచ్చుకున్నాక కూడా ఇంటికి రావాలనిపించక అక్కడే ఉద్యోగంలో చేరిపోయాను-- నాకంటే ముందు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్న మా ప్రొఫెసరు నేను అమెరికా వెళ్ళగలగటానికి తరువాత విసా అవి మార్పించి నాకు ఉద్యోగం దొరకటానికి చాలా సహాయం చేశాడు.
    'చదువు ఎప్పుడు పూర్తవుతుందా అని ఇన్నాళ్ళ నుంచీ ఎదురుచూశామని, తీరా అది అయిపోయాక కూడా తిరిగి రాకపోవటం బాగుండలేదని' అమ్మ కన్నీళ్ళతోనే వుత్తరాలు కురిపించేది.
    చివరికి అమ్మ చావు బ్రతుకుల మీద వుందనీ, ఒక్కసారి ఆమె కంట బడి ఆమె చివరి కోరిక తీర్చిన తరువాత ఎక్కడికి వెళ్ళినా తమకేం బాధ లేదనీ, కన్నతల్లిని ఆ కోరికకి కూడా దూరం చెయ్యటం న్యాయం కాదనీ, నిష్టూరంగా వుత్తరం వ్రాశాడు బావ. అంతకుముందే మా మూడో బావగారు పోయిన వార్త కూడ అందింది-- ఇంక అక్కడి వుద్యోగానికి రిజైన్ చేసి వచ్చేశాను.
    నన్ను రప్పించటానికని అమ్మ అనారోగ్యం వంకగా పెట్టారేమోననిపించక పోలేదు -- కాని ఇంటికి వచ్చి పరిస్థితి చూస్తె నా మూర్ఖత్వానికి నాకే సిగ్గు వేసింది -- అందరి లాగా చదువుకుని తిరిగి వస్తానన్న ఆశ కూడపోయాక ఆవిడ మనోవ్యాధితో మంచం ఎక్కినట్లే అయింది. రాత్రింబవళ్ళు నా ధ్యాసే నా తలంపే -- ఆ స్థితిలోనే చెట్టంత అల్లుడు చచ్చి పోవటం -- కడుపు నిండా తిండి తినటం ఏనాడో మానేసినా తిన్న నాలుగు మెతుకులు కూడా వంట బట్టేవి కావు-- కడుపులో విపరీతంగా నొప్పి వస్తుండేది -- డాక్టర్ల కి చూపించుకునేది కాదు. మందు తీసుకునేది కాదు -- ఇంక అది ఏ ప్రమాదమయిన జబ్బులో నయినా దింపుతుందేమో నని భయపడి నాకు వ్రాశారు.
    నన్ను చూస్తేనే సగం జబ్బు తగ్గిపోయినట్లు అనిపించింది. అయినా అశ్రద్ధ చెయ్యకుండా పెద్ద పెద్ద డాక్టర్ల కి చూపించాను. ఎక్సేరేలు తీయించాను. ఆవిడ వద్దన్నా లక్ష్య పెట్టకుండా నాలుగు నెలలు విశాఖపట్నం లో కాపురం పెట్టి ఆమెకి వైద్యం చేయించి మళ్ళీ మామూలు మనిషిని చేసుకున్నాను. పరిస్థితులన్నీ కుదుట బడ్డాక మళ్ళీ నా పెళ్ళి ప్రస్తావన వచ్చింది-- ఇంక జీవితంలో ఆవిషయం గురించి ఆలోచించ దలుచుకోలేదని చెప్పేశాను. ఆరేళ్ళు గడిచిపోయినా ఉషని మరిచిపోలేని బలహీనత కి విసుక్కుంటూనే ఎప్పటికయినా మనస్సు మార్చుకో అంటూ మరీ మరీ చెప్పి ఆ వుద్యోగానికి పంపించింది. అప్పుడు వచ్చిన మరో ప్రతిపాదన ఏమిటంటే మేనగోదళ్లల్లో ఎవరినో ఒకరిని ఎందుకు చేసుకో కూడదూ అని--
    తమ సంబంధమే కలుపుకోటం ఎంత న్యాయమైనదో సహేతుకంగా నిరూపించుకోటానికి తాపత్రయ పడేవారు నలుగురు అక్కయ్యలూ.
    పొలం కాస్తో కూస్తో వుంటే మాత్రం ఆడది ఒక్కతీ ఏం చూసుకోగలిగేది -- రైతులు సరిగ్గా ఇచ్చేవారా -- ముగ్గురు చెల్లెళ్ళ కీ పెళ్ళిళ్ళు ఆయాయీ అంటే సంబంధాలు వెతకటానికి మీ బావ ఎంత తాపత్రయ పడ్డారో నీకు తెలియదు -- చెల్లాయిలు ఇవాళ మరిచి పోయినా అదంతా వాళ్ళకీ తెలుసు -- అందరిలా మేమూ మా సంసారం అంటూ వేరే వెళ్ళిపోతే మరో చోట మీ బావకి పెద్ద వుద్యోగమూ వచ్చేది. -- తన స్వార్ధం కాస్త కూడా చూసుకోకుండా ఈ ఇంటి బాగోగులు చూస్తూ ఇక్కడే వుండి పోయారు -- ఇదే అమ్మాయికి అత్తవారిల్లు అయితే మాకు ఎంతో సంతోషంగా వుంటుంది -- సరోజ సెవెంతు ఫారం ప్యాసయింది -- పై వూళ్ళకి పంపించటం ఇష్టం లేక కాలేజీ చదువు చెప్పించలేదు- ఇంక దానికి వంకేమిటి?' అంటుంది పెద్దక్కయ్య.
    'వాడు చదివింది పెద్ద చదువు . చేస్తూన్నది పెద్ద వుద్యోగం -- వాడికి చదువుకున్న అమ్మాయిని చెయ్యటం భావ్యం -- మా శ్యామల బియ్యే చదువుతోంది . ఇప్పటి కాలం పిల్లల్లా ఫ్యాషను గా వుంటుంది -- పది మందిలో తిరగటం, మాట, మర్యాద అన్నీ దానికి తెలుసు -- నా పరిస్థితి కూడా నువ్వు కాస్త కనిపెట్టాలి.' అంటుంది చిన్నక్కయ్య. వాళ్ళు మొదట కాస్త వున్నవాళ్ళే కాని మా బావ పేకాట లో ఆస్తి అంతా తగలేశాడు. ఆఖరికి అక్కయ్య వంటి మీది నగలు కూడా అయిపోయాక కాస్త బుద్ది తెచ్చుకుని కుదురు నేర్చుకున్నాడు. వచ్చే రెండు వందల జీతం తప్ప మరే ఆధారం లేదు -- ఎనమండుగురు పిల్లలు-- కట్నం లేకుండా ఓ పిల్ల పెళ్ళి అయిందన్నా అవటమే కదా అని ఆవిడ గొడవ.

                    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS