Previous Page
సురేఖా పరిణయం పేజి 21

 

    మూడో అక్కయ్య మొదటి నుంచీ చాలా నెమ్మదస్తురాలు. వీళ్ళల్లా ఎదుటపడి నాతొ ఏమీ అనలేదు. కాని అమ్మకి చెప్పేది. 'నాకు భగవంతుడే అన్యాయం చేశాడు-- నువ్వయినా కాస్త మంచీ చెడూ ఆలోచించక పొతే ఎలా -- నా ప్రాణాలన్నీ ఆ ఒక్క బిడ్డ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను-- స్వంత తమ్ముడే అల్లుడయితే నేనూ వాళ్ళ దగ్గరే వుంటాను-- నువ్వు తమ్ముడికి నచ్చ చెప్పాలి.' అనేది.
    నాలుగో అక్కయ్య కీ ఒక్కతే కూతురు. బావగారికీ డిల్లీ లో పని. -- మా గిరిజ ఇప్పుడు ఎమ్మే చదువుతోంది -- కారు డ్రైవ్ చెయ్యటం, టెన్నిసు ఆడటం అన్నీ వచ్చు-- నూటికి నూరు పాళ్ళు ఆధునిక యువతి అన్నమాట- నన్ను కూడా డిల్లీ వచ్చేయమనీ ఇంతకన్న మంచిది కాకపోయినా ఈ మాత్రం వుద్యోగం మా బావగారు సంపాదించి పెట్టలేక పోరనీ అంటుంది మా అక్కయ్య-- అసలు నేను పెళ్ళి అంటూ చేసుకోటమే జరిగితే తన కూతురికి మించిన అర్హతలు గల వాళ్ళెవరున్నారూ అన్న ధోరణి ఆవిడది -- అయితే అది స్పష్టంగా పైకి చెప్పదు -- నా అంతట నేను అడగాలని ఆవిడ ఉద్దేశ్యం.
    ఎవరైనా నాకు అభ్యంతరం లేదు. నువ్వో యింటి వాడివి కావటమే నాక్కావాలి అంటుంది అమ్మ.
    ఎప్పటికయినా మనస్సు మార్చుకోక పోతావా అని నాలుగేళ్ళు ఎదురు చూశారు--
    నాకు దగ్గరగా వుండాలనే వుద్దేశ్యం తోనే మా చిన్నక్కయ్య శ్యామల ని ఈ వూరు ఉద్యోగానికి పంపించిందా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కప్పుడు.
    సరే ఎన్నాళ్ళు ఈ ముసుగులో వ్యవహారం అటో ఇటో తేల్చుకుందాం అన్న వుద్దేశ్యంతో వచ్చిందన్న మాట మొన్న మా పెద్దక్కయ్య.
    వాళ్ళ వల్ల ఎంతో ఉపకారం పొంది కూడా నేను కృతజ్ఞత చూపించుకోవటం లేదు అని మీరు అనుకో కూడదు -- మా కుటుంబ బాగోగులు చూడటానికి బావ అక్కడ వుండిపోయిన మాట నిజమే కాని అందువల్ల అతని కేరియరు పాడయి పోయింది ' అంటే నేను ఒప్పుకోను. స్కూలు ఫైనలు ప్యాసయిన వాడికి మరో దగ్గర మాత్రం పెద్ద ఉద్యోగం వస్తుందని ఎలా అనుకుంటాం -- పోనీ ఏ వ్యాపారమో చేసి లక్షలు గడించటానికయినా ఆ చొరవ, చాకచక్యం వున్న మనిషి కాడు....చాలీ చాలని జీతంతో ఇరుకు కొంపల్లో మగ్గిపోతూ ఎక్కడెక్కడో వుండే బదులు హాయిగా స్వంత ఇంట్లో ఉన్నట్లే వుంది -- పొలంలో పండిన ధాన్యమే కదా అనీ, పెరట్లో కాసిన కూరే కదా అనీ అమ్మే సగం ఖర్చు భరించేది. పిల్లల చదువులూ, బట్టలూ పై ఖర్చు తప్ప వాళ్ళకీ ఏమీ ఖర్చే వుండేది కాదు.- బావకి వచ్చిన జీతంతో మరో దగ్గరయితే ఎంత ఇబ్బందయినా పడేవాడు. అలాంటిది ఇక్కడ వాళ్ళకే లోపమూ లేకపోగా నా చదువుకి మూడు వేల రూపాయలు అప్పుగా కూడా ఇవ్వ గలిగారంటే మీరాలోచించండి-- మమ్మల్ని మోసం చేసి వాళ్ళేదో వెనకేసుకున్నారని చెప్పటం కాదు నా ఉద్దేశ్యం -- మా ఇంట్లో వుండి పోయినందు వల్ల మేలే జరిగింది కాని వాళ్ళు నష్టపోయింది ఏమీ లేదని మీరు గ్రహించుకోవాలి-- ఏదో చెప్తానని తీసుకొచ్చి వాళ్ళ యింటి గొడవంతా చెప్తున్నాడేమిటని మీరను కుంటున్నారేమో ...'
    'అవును -- ఎందుకు చెప్తున్నారు' అనాలనుకుని 'అబ్బే అదేం లేదు' అనేసింది సురేఖ.
    'సరే -- ఇంక నాకు అలాంటి ఉద్దేశ్యం కలగదు -- నా మీద ఆశలు పెట్టుకుని కూర్చోకుండా మరో సంబంధం చూసుకోమని చెప్పేశాను.'
    'ఆ మాట మీరు నాలుగేళ్ల క్రితమే చెప్పాల్సింది -- ఇన్నాళ్ళు వీళ్ళంతా ఇన్ని ఆశలు పెంచుకునేలా చేసి...' సురేఖ మాటలని పూర్తీ కానివ్వ లేదతను.
    'వాళ్ళని ఆశలు పెంచుకోమని నేనెప్పుడూ చెప్పలేదు -- నేను ఎంత స్పష్టంగా చెప్పినా వాళ్ళు అర్ధం చేసుకోటానికి ప్రయత్నించక పోగా నాలుగు రోజులు పొతే వాడి మనస్సే మారుతుంది -- అని తేలిగ్గా తీసిపారేశారు -- అందులో నా బాధ్యత ఏమీ లేదు .'
    ఇప్పుడే మంటారు అన్నట్లు ఆమె కళ్ళలోకి చూశాడు-- అనటానికేముంది మీరు చెప్పాలనుకున్నదేదో చెప్పండి అన్నట్లు మౌనంగా వుండిపోయింది సురేఖ.
    అక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేసుకుందేమో -- 'అయిదువేలు కట్నం ఇవ్వాలి పై ఖర్చులు మరో మూడు వేలయినా అవుతాయి - అంత డబ్బు ప్రస్తుతం నా దగ్గర లేదు- అయిదు వేలయినా నువ్వు సర్దు బాటు చెయ్యాలి.' అంటూ పది రోజుల క్రిందటే వుత్తరం వ్రాసింది పెద్దక్కయ్య-- మీకు చెప్పలేదనుకుంటాను సరోజ కి ఇద్దరు అన్నయ్యలు నలుగురు చెల్లెళ్ళూ వున్నారు-- అన్నయ్యలు సామాన్యమైన చదువుతో సరి పుచ్చుకుని చిన్న వుద్యోగాల్లో స్థిర పడ్డారు-- చెల్లెళ్ళు స్కూల్లో చదువుతున్నారు.'
    'డబ్బు అప్పుగా అడిగారా?' అని అడగకుండా వుండలేక పోయింది సురేఖ.
    శుష్కహాసం చేశాడు మాధవ్. 'అప్పుగా అని కాదు-- ఆ మాత్రం సాయం చెయ్యి -- తప్పు లేదు -- అన్నట్లు వ్రాసింది వుత్తరం.' అతని మాటల్లో పదును ఎక్కువై కోపం వ్యక్తం కావటంతో పాటు గొంతు ఆర్ద్రంగా మారిపోయి గాయపడిన మనస్సు కూడా వెల్లడయింది. 'అప్పుడు అక్కయ్య వెళ్ళగానే అమ్మకి పెద్ద వుత్తరం వ్రాశాను-- నా నిర్ణయం మారదనీ ఆ విషయం మిగతా అక్కయ్య లకి కూడా తెలియజేసే బాధ్యత ఆవిడదేననీ -- ఈ మధ్య అమ్మ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుకోగానే నాకెంత కోపం వచ్చిందో మీరు వూహించలేరు-- పెళ్ళాం పిల్లలు అక్కర్లేని వాడు ఈ సంపాదనంతా ఏం చేసుకుంటాడు. వూరి వాళ్ళు పడి తినతమేగా అని వాళ్ళు అనుకుంటుంటే నేను వినలేకుండా వున్నాను బాబూ. ఎల్లాగయినా నీ ఆస్తి వాళ్ళకి చెందవలసిందేనుట- ఇప్పుడే ఇంత పడేస్తే కట్నాలు ఇచ్చి పిల్లలకి పెద్ద సంబంధాలు తెచ్చు కుంటారుట -- ఇంట్లో నేను వున్నాననే ధ్యాసయినా లేకుండా వాళ్ళల్లో వాళ్ళు అలా కుమ్ములాడుకుంటుంటే నేను భరించలేకుండా వున్నాను-- అయినా వాళ్ళ మాటలన్నీ నిజమేనా -- నువ్విలా బ్రహ్మచారిగా వుండి పోవటం నిజమేనా -- కొడుకూ, కోడలూ సంసారం అనేవి ఎప్పటికయినా చూస్తాను అని ఎదురు చూస్తున్న నాకుచివరికి నిరాశే మిగిలి పోతుందా -- నీకు తెలియదు బాబూ,  ఇవాళ అన్నీ వున్ననాడు- వయసు కులుకా అన్నట్లు వంట్లో దారుడ్యం వుండి సంపాదించుకునే శక్తి వున్నప్పుడు మనకే కష్టం తెలియదు. అంతా మనవాళ్ళల్లాగే అనిపిస్తారు.... జవసత్వాలుడిగి కాస్త మంచం మీద నుంచి లేవలేని స్థితి వచ్చిందంటే ఒక్కరూ దగ్గరికి రారు. వచ్చినా నీ డబ్బు మీద వ్యామోహమే తప్ప నీ మీద అభిమానమేమీ వుండదు -- నువ్వు ఎలాంటి స్థితిలో వున్నా కష్టం సుఖం మంచీ, చెడూ అన్ని నీతో పంచుకో గలిగే ఒక వ్యక్తీ కావాలి -- అమ్మ ఏదో చాదస్తంగా చెప్తోంది -- అనుకోకుండా నిదానంగా ఆలోచించు -- ఇంకా సమయం మించి పోలేదు -- ఈ జీవితంలో నాకెవ్వరూ లేరు అనే పరిస్థితి రానివ్వకు-- అక్కయ్య పిల్లల్లో ఒకరిని చేసుకోమని నేను అనను- నీ ఇష్టం -- నీ మనస్సుకి నచ్చిన ఏ వ్యక్తయినా సరే -- నేను సంతోషిస్తాను-- నా ఈ ఒక్క కోరికా తీర్చు' అంటూ బ్రతిమాలుతూ వ్రాసింది .
    నిజంగా ఆ అక్కయ్య లు అలా అంటారా అన్న ఆశ్చర్యంతో పాటు కొద్దిగా అనుమానం లాంటిది కూడా వచ్చింది సురేఖ కి. "ఏమో -- డబ్బు మీది వ్యామోహం మనిషి చేత ఎన్ని ఆటలైనా ఆడిస్తుంది -' అనుకుంది మళ్ళీ.
    'నేనేదో లక్షాధికారినీ, కోటీశ్వరుడిని అనుకుంటున్నారేమో- నాలుగెకరాల పొలం , చిన్న ఇల్లు తప్ప అస్తేమీ లేదు- పన్నెండు వందల పైన జీతం వస్తోందన్న పేరే గాని సగం పైగా ఖర్చే అయిపోతుంది-- సరే ఆ నాలుగెకరాలు నలుగురక్కయ్య లనీ తీసుకోమని వ్రాశాను-- పెద్ద బావ అప్పు అది వరకే తీర్చేశాననుకోండి-- బ్యాంకి లో వున్న డబ్బు లోంచి నలుగురికీ తలో అరువేలూ ఇస్తానని చెప్పాను-- దాంతో వాళ్ళ పిల్లల పెళ్ళే చేసుకుంటారో.......'
    'అసలు మీకు వాళ్ళల్లో ఒక్కరూ నచ్చలేదా -- లేకపోతె ఒక అక్కయ్య ని సంతోషపెట్టి మిగిలిన వాళ్ళని చిన్న బుచ్చటం ఇష్టం లేక మానేశారా ....'
    'బాగా అడిగారు -- వాళ్ళకీ నాకూ పన్నెండేళ్ళ పైనే వార వుంది -- అంత తేడాలో పెళ్ళిళ్ళు  జరగవని కాదు. వాళ్ళు పుట్టేసరికే నాకు బాగా జ్ఞానం వచ్చింది -- ఆ పసివాళ్ళని ఎత్తుకు ఆడించాను -- మరి కాస్త ఎదిగాక వేళ్ళు పట్టుకుని నడిపించుకుంటూ షికారు కి తీసుకు వెళ్ళాను -- వాళ్ళు అల్లరి చేసి అక్కయ్యల చేత దెబ్బలు తిని ఏడుస్తుంటే నేను ఊరుకోబెట్టాను-- చెల్లెళ్ళు లేని నాకు వాళ్ళంతా చిట్టి చెల్లాయిల్లా అనిపించేవారు -- అన్నగారు చెల్లెళ్ళ తో చనువుగా వున్నట్లు -- ఇంకా చెప్పాలంటే ఇప్పుడిప్పుడు తండ్రి పిల్లల పట్ల వాత్సల్యం చూపిస్తున్నట్లు వుంటుంది. వాళ్ళతో మాట్లాడుతుంటే -- నేను అంత ఫ్రీగా వుండటం వాళ్ళు మరోలా అర్ధం చేసుకున్నారూ అంటే అందుకు బాధ్యత నాది కాదు -- నాలుగేళ్ళ క్రిందటే నా అభిప్రాయం తేల్చి చెప్పేశాను కదా అనుకున్నాను కాని నాకు మరో దృష్టే లేకపోయింది -- నలుగురి లో ఎవరిని నేను చేసుకున్నా మిగిలిన ముగ్గురూ డిసప్పాయింటు అవటానికి తయారుగానే వున్నారు కదా ఇప్పుడందరికీ అదే మిగిలింది -- నేను మాత్రం లోకం పోకడని తెలుసుకున్నాను. మా యింటి కోస్తావు మాకేం తెస్తావు -- మీ ఇంటి కోస్తాము, మాకేమిస్తావు అన్న వాళ్ళ ధోరణి అర్ధం చేసుకున్నాను-- చేసుకున్న నిర్ణయమూ మార్చుకున్నాను -- ఏమంటారు ?'
    'మంచిదే .'
    'కాదు మీ ఉద్దేశ్యం చెప్పండి -- నా గురించి అంతా చెప్పాను -- మీ గురించి నాకు కొంత తెలుసు-- అంత కన్న తెలుసుకోవాలనే ఆసక్తి కూడా నాకు లేదు -- మీ అభిప్రాయం చెప్తే అమ్మకీ మీ వాళ్ళకీ కూడా ఉత్తరాలు వ్రాస్తాను.'
    'ఇవాళ సినిమాకి వెళ్దాం , రేపు సాలార్ జంగు మ్యూజియం చూద్దాం' అన్నంత సహజంగా , ఎలాంటి భావాలు మోహంలో వ్యక్తం కాకుండా అతను చెప్తుంటే అసలు అతని భావమేమిటో సురేఖ కి అర్ధం కాలేదు.
    'అంటే?" ఆపైన ఏమడగలో తెలియలేదు--తెల్లటి తెలుపు కాకపోయినా చామన ఛాయ రంగులో ఆజానుబాహువైన విగ్రహం -- అందగాడి లో లెక్కే అనిపించే మాధవ్ కి అలాంటి అభిప్రాయం కలుగుతుందనే- నమ్మకం కలగటం లేదు.  
    'ఇంకా స్పష్టంగా చెప్పమంటారా -- మనం వివాహం చేసుకోవాలని నా కోరిక- చెప్పటం మరిచిపోయాను నా వయస్సు ముప్పై నాలుగేళ్ళు --'
    ఆ స్థితిలో కూడా సురేఖ కి నవ్వు రాబోయింది. 'మీరు -- నన్ను-- నాలో ఏం చూసి ఈ నిర్ణయానికి వచ్చారు .' పెదవి కొరుక్కుంటూ నవ్వాపుకుని మాటలు కూడ బలుక్కున్నది.
    'మీరు ఇలా నిలదీసి అడిగితె చెప్పటానికి నా దగ్గర సమాధానం లేదు -- నిత్యం ఎంతో మందిని చూస్తుంటాం .. కొంతమందితో పరిచయం అవుతుంది -- కొంతమందితో ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. వయస్సులో వున్న స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణే తప్ప స్నేహానికి తావు లేదు అంటే నేను ఒప్పుకోను -- మీతో కూడా అలాగే పరిచయం అయింది. అక్కయ్య ధర్మమా అంటూ మరో పది రోజులు అతి సన్నిహితంగా ఉంటూ ప్రయాణాలు కూడా చేశాం. అయితే నాకప్పుడసలీ ఆలోచనే లేదు -- నా మనస్సు వివాహం పైకి మొగ్గిన క్షణం లో మాత్రం మీరే గుర్తు వచ్చారు -- మన పరిచయం , సరదాగా తిరగడం మిమ్మల్ని నా మనస్సు కి కూడా దగ్గరగా తీసుకు వచ్చాయన్న మాట. కనీసం ఇలాంటి ఆలోచన రావటాని కైనా నాకు అవకాశం వుంది కాని మీకు ఆ ఆస్కారం కూడా లేదు -- నాకు తెలుసు -- అందుకే నేను చెప్పింది  మీకింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది -- మీ దృష్టి లో నేను మీ స్నేహితురాలి కాబోయే భర్తని-- అక్కయ్య వచ్చిం తరువాత ఆ స్నేహిరురాలు ఒక్కతే కాదని మరో అమ్మాయి కూడా వుందని మీ కనిపించి వుండవచ్చు -- ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారుగా -- అలోచించి మీ నిర్ణయం తెలియ జేయ్యండి ...' గొంతులో అనురాగాన్ని నింపుకుని అనునయంగా అతను అడుగు తుంటే సురేఖ రెండు కళ్ళల్లోనూ నీళ్ళు తిరిగాయి.
    'నా నిర్ణయం ఏమని చెప్తాను ?-- 'దీనికింక పెళ్ళి యోగం లేదు -- అల్లుడ్ని వెతికేసరికి ఎన్ని జతల చెప్పులరిగిపోవాలో -- తను మహా అందంగా వున్నాననా అందరికీ అన్ని వంకలు పెడుతోంది -- అమ్మాయి నచ్చలేదు అయినా ఏం చేస్తాం . నెల తిరిగే సరికి మూడు వందలు సంపాదిస్తోంది . అన్నీ కావాలంటే ఎలా వస్తాయి.' లాంటి మాటలన్నీ చెవుల్లో గింగురుమంటున్నాయి.
    తను నచ్చలేదని వెళ్ళిపోయిన పెళ్ళి కొడుకులూ, తను మెచ్చక వదిలేసిన పెళ్ళి కొడుకులూ-- నా పెళ్ళానికి విడాకులిచ్చి నిన్ను చేసుకుంటాను . నాలాంటి వాళ్ళు తప్ప మరెవ్వరూ నీకు దొరకరు అని చెప్తున్నట్లున్న కామేశ్వర్రావు కళ్ళ ముందు మెదిలాడు.
    నన్ను నన్నుగా అభిమానించి నేను కావాలని మనసా కోరే వ్యక్తీ దొరికాడు. ఇంకా ఆలోచనేందుకు.....' తలవంచుకుని ఆలోచిస్తూనే వుంది సురేఖ.
    'చెప్పటం మరిచిపోయాను-- శ్యామల కి పెళ్ళి నిశ్చయం అయింది-- అత్తవారు రాజమండ్రీ -- అందుకే ఉద్యోగం మానేస్తుందేమో అన్నాను-- మరో విషయం . అవసరమా కాదా అన్న సంగతి అటుంచి అసలు ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యటం మీ కిష్టం లేదా అని అడిగారు ఇందాక -- ఆ విషయమై నా కెలాంటి దురభిప్రాయం లేదు -- ఏ పనీ లేకుండా గోళ్ళు గిల్లుకుంటూకూర్చొని అర్ధం పర్ధం లేని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకుండా ఏదో ఓ వ్యాపకంతో కాలాన్ని సద్వినియోగం చేసుకోటం నాకెంతో ఇష్టం -- వివాహం అయినా ఆ విషయంలో నా జోక్యం ఏమీ వుండదు -- అది కూడా మీ ఇష్టా ఇష్టాలకి వదిలేస్తున్నాను.'
    'తన సమాధానం కోసం చూడకుండా అన్నీ అతనే చెప్పేస్తున్నాడు అనుకుంది . అసలు పెళ్ళేవద్దు అని యిటీవల కలిగిన భావం క్రమంగా కరిగి పోతోంది -- అవును ఇతన్ని ఎందుకు చేసుకోకూడదు -- ఆడపిల్లలు వుద్యోగం చెయ్యటం ఏమిటీ అని వెక్కిరించకుండానూ, మనదేశంలో మొగవాళ్ళకి సరిపడినన్ని వుద్యోగాలే లేవు ఆడవాళ్ళు కూడా ఎగబడితే ఎలా అన్న వాదం లేవదీయకుండానూ అందరూ అమ్మాయిలనీ ఉద్యోగాలలో చేర్పించేస్తే పెళ్ళి చూపుల బెడద లేకుండా పెళ్ళిళ్ళు కుదిరిపోతాయేమో -- ఈ మాటే అమ్మతో అంటే ఏమంటుందో-- నీ మొహం -- నీ అదృష్టం బాగుంది కనక అన్ని అలా కలిసి వచ్చాయి అంటుందేమో .....'
    'రాత్రంతా అలోచించి రేపు ఉదయమే నాకు ఫోను చెయ్యండి -- అంటే ఫోను లో అన్నీ మాట్లాడమని కాదు-- అవును, కాదు అని చెప్పండి చాలు.'
    చటుక్కున మొహం తిప్పెసుకుంది సురేఖ.
    'ఇంక ఫోను చెయ్యక్కర్కెదు.' మనోహరంగా నవ్వాడతను.
    'ఏం?' అని అడగబోయింది. కాని, 'ఉహు లాభం లేదు -- ఇప్పటికే ఈ సిగ్గు మాలిన కళ్ళు సిగ్గు దాచుకోలేక పట్టి ఇచ్చేశాయి. ఇంక గొంతు లో అనురాగం చింది మొహం అంతా పులుముకునే బదులు మెదలకుండా ఒప్పేసుకోటం మంచిది' అనుకుంది ఎదలోని పులకరింతని మౌనంగా ఆస్వాదిస్తూ.
    మాటల్లో పడి ఇంతసేపూ వాళ్ళు గమనించనే లేదు. టైమెంతయిందో --
    'ఇంకా ఎంతసేపు కూర్చుంటారు అలాగ?' అన్నట్లు వీళ్ళ వంక చూస్తూ వెళ్తున్న ఓ జంట చేతిలోని ట్రాన్సిస్టర్ లోంచి ఎనౌన్సరు గొంతు పలికింది .. 'ఉషా పరిణయం -- పురాణ కాలక్షేపం -- పౌరాణికులు ....' ఆ తరువాత మాటలు వాళ్ళు వినలేదు.
    'ఇక్కడ సురేఖ పరిణయం అందామా ?' అల్లరిగా అతను అడిగిన దానికి పెళ్ళి కూతురులా తల వంచేసుకుంది సురేఖ .

                         (అయిపొయింది )


 Previous Page

WRITERS
PUBLICATIONS