Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 19

 

    'అయితే మీ తలనొప్పి కి సగం కారణం శ్యామల లేకపోవటం అని అంటారు -- అయినా తప్పదు మరి -- బహుశా తను రిజైన్ చేస్తుందనుకుంటా '
    'ఓ -- అర్ధం అయింది -- పెళ్ళి కూతురవుతుందన్న మాట -- అయినా అవసరం మాట అటుంచి తను వుద్యోగం చెయ్యటం అసలు మీకిష్టం లేదా ' సరదాగానే అయినా సురేఖ సూటిగా అలా అడిగేసరికి అతను ఇబ్బందిగా చూపులు తిప్పుకున్నాడు ఒక్క క్షణం 'అల్లాంటి విషయం మీదే మీ సలహా అడుగుదామని వచ్చాను -- మీకు అభ్యంతరం లేకపోతె కాస్సేపలా ఎక్కడి కయినా వెళ్దాం..." ఏమంటారు అన్నట్లు చూశాడు.
    'అలాగే -- ఒక్క అయిదు నిమిషాల్లో వస్తాను ' అని లేచింది.
    'సరిగ్గా అయిదంటే అయిదే నిముషాల్లో వచ్చారే --' చీర మార్చుకు వచ్చిన సురేఖ ని చూసి అన్నాడు -- ఇద్దరూ కారు దగ్గరకి వచ్చారు.
    సురేఖ వెనక తలుపు తెరవబోతుంటే 'లాక్ చేశాను -- ఉండండి ' అంటూ మాధవ్ కారు తాళం తీశాడు.
    ఆమె లోపల కూర్చుని గ్లాసులు దించుకుంటుంటే 'ఎక్కడికి వెళ్దాం ' అన్నాడతను వెనక్కి తిరిగి.
    "మీ ఇష్టం -- ' ఎంత మాములుగా చెప్పాలను కున్నా సురేఖ గొంతు కాస్త వణికింది.
    అదేమీ గమనించనివాడిలా కారు స్టార్టు చేశాడతను.
    'ఈ కారులో కూర్చోటం తనకి కొత్తేమీ కాదు -- అందరూ వున్నప్పుడు ఈ ఊళ్ళో నే కాకుండా పది రోజుల పాటు పోరుగూళ్ళ ల్లో తిరిగి వచ్చింది -- అప్పుడు అది ఏమీ ఎబ్బెట్టుగా అనిపించలేదు -- కాని ఇవాళ ఇలా వంటరిగా అతని కారులో వెళ్ళటం -- తను పొరపాటు చెయ్యలేదు కదా -- తెలిసిన వాళ్ళెవరి కంటయినా పడితే ఎలాంటి కధలు పుట్టుకు వస్తాయో అన్న వూహే వళ్ళు జలదరించేటట్లు చేస్తోంది-- అతను తన స్నేహితురాలికి కాబోయే భర్త. తనకీ బాగా పరిచయం వుంది -- మంచివాడు . ఏదో మాట్లాడాలని వచ్చాడు -- వేడి మండి పోతోందని కాస్త చల్లగాలికి ఎటైనా వెళ్దామని ఆహ్వానించాడు -- తనకీ మనస్సంతా తిక్కగా వుండి ఎవరైనా కాస్త పలకరించే మనిషి, తనతో అభిమానంగా కబుర్లు చెప్పే మనిషి కనిపిస్తే చాలు అన్నట్లు వుండటం వల్ల వెంటనే ఒప్పేసుకుంది-- ఇది ఎలాంటి అపవాదు కైనా దారి తీస్తుందేమో అన్న వూహ కాస్తయినా అప్పుడు వచ్చి వుంటే తలనొప్పి ఎక్కువగా వుంది, రాలెను అని చెప్పేసేదే -- ఛీ తన కసలు బుద్ది లేదు -- రేపు శ్యామల రాగానే ఎవరైనా ఈ సంగతి ఆ అమ్మాయికి చెప్తే -- తన కసలే నోటి దురుసుతనం ఎక్కువ -- ' సురేఖ కి ముళ్ళ మీద కూర్చున్న ట్లుంది.

                             *    *    *    *
    'ఇంక దిగుతారా ,' అని అతననేదాకా సురేఖ గడ్డ కట్టుకు పోయినట్లు కూర్చుండి పోయింది. కారు పబ్లిక్ గార్డెన్స్ లోకి వచ్చింది కూడా గమనించనందుకు సిగ్గుపడి పోతూ దిగింది.
    "ఏమంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? రెండు సార్లు పలకరించినా వినిపించుకోలేదు.' కారు లాక్ చేస్తూ అన్నాడు.
    విస్తుపోయినట్లు చూస్తూ, 'నిజమా ...ఏవో  ఇంటి సంగతులు గుర్తు వచ్చాయి .' తడబడుతూ సమాధానం చెప్పింది.
    'మిమ్మల్నొక సలహా అడగాలని చెప్పాను కదూ,' అట్టే ఎత్తులేని నీళ్ళ కుండి గట్టు మీద కూర్చుని 'కాస్త మీట తిప్పుతే చాలు మా తడాఖా చూపిస్తాం -- ఇలా బంధించి వుంచేస్తే మా అందం ఏం తెలుస్తుంది ,' అంటున్నట్లున్న పౌంటేన్ గొట్టాల వేపు చూస్తూ అన్నాడు.
    దూరంగా కనిపిస్తున్న నాంపల్లి స్టేషన్ని వెనక్కీ ముందుకీ షటిల్ అవుతున్న గూడ్సు బండి నో, దాని వంక చూస్తూ ఫెన్సింగు పట్టుకుని నిలబడిన పిల్లలనీ, చూస్తూ కూర్చుంది సురేఖ ఇబ్బందిగా ముడుచుకుపోయి.
    'అదేనండీ , నా పెళ్ళి విషయం .' ఎంతో అమాయకంగా అడిగినట్లు అతనంటుంటే అ స్థితిలో కూడా సురేఖ కి ఫక్కున నవ్వొచ్చింది.
    'మీకిలాంటి సమస్య వస్తుందని రెండు నెలల క్రితమే నేను గ్రహించాను -- శ్యామలా ? సరోజా ? ఎవరో తేల్చుకోలేక పోతున్నారు కదూ.'
    'చంపారు -- మీకు తెలిసింది వాళ్ళిద్దరే -- మామూడో అక్కయ్య కూతురు వాణీ, నాలుగో అక్కయ్య కూతురు గిరిజా కూడా వున్నారు మరి.'
    'నిజం?'
    'అబద్దం చెప్పాల్సిన అవసరం నాకేం పట్టింది.'
    'సారీ -- నా ఉద్దేశ్యం అది కాదు ...'
    'తెలుసు -- మీరు వింటానంటే నా కధంతా చెప్తాను.'
    'అందుకే కదా వచ్చాను.'
    'మీకు తెలుసుననుకుంటా -- మా నాన్న గారు లేరు.' తను చెప్పబోయే దానికి ఉపోద్ఘాతంలా అతను అడిగిన దానికి 'తెలుసు' అన్నట్టు తల వూపింది సురేఖ.
    'అయన రూపం ఎలా వుంటుందో నాకు తెలియక పోవటమే కాదు -- అయన కూడా నన్ను చూడలేదు -- అయన పోయిన నెల్లాళ్ళ కి నేను పుట్టాను -- నాకు నలుగురు అక్కయ్యలు. నాన్నగారు పోయేసరికి మా పెద్దక్కయ్య కి అంటే మొన్న వచ్చిన శకుంతల కి ఒక్కతి కే పెళ్ళయింది -- మా బావ చలపతి మా బంధువుల్లో అతనే -- నాన్నగారు పోయిన ఖబురు వినగానే వచ్చిన అతను ఎప్పటికీ మా యింట్లోనే వుండి పోవలసి వచ్చింది.
    మాకు ఇద్దరు పిన తండ్రులు , మేనమామలు వున్నారు కాని ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో వుండి పోవటం వల్ల రాకపోకలూ ప్రెమాభిమానాలూ అంతంత మాత్రం గానే వుండేవి. నాన్నగారు పోయిన వారం నాటికి నెమ్మదిగా ఒక్కొక్కరే వచ్చినా బాధ్యత నెత్తి మీద వేసుకోటానికి, వాళ్ళెవరూ సిద్దపడలేదు -- బావకి బొత్తిగా చిన్నతనం -- అయినా పెద్ద వాళ్ళ సలహా తీసుకుంటూ అన్ని విషయాలూ అతనే చూసుకోవాల్సి వచ్చింది -- ఆ పది రోజులు అయిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు.
    ఇంటికి మొగవాడుగా బావని అక్కడే వుండి పొమ్మని అడిగింది అమ్మ. అప్పటికే అతనికి మరో వ్యావృత్తి ఏదైనా వుంటే ఏం జరిగేదో కాని అమ్మ అలా అడిగిందే చాలునన్నట్లుగా వుంది అతని పరిస్థితి -- అప్పటికే అతను ఇంటరు పరీక్ష రెండు సార్లు వ్రాసి అన్ని పార్టులు తప్పి కూర్చున్నాడు -- రెండేళ్ళ చదువూ ఎందుకూ కాకుండా తగలేశాడని నేడో రేపో పెళ్ళాం కాపరానికి రాబోతున్నా పైసా సంపాదన లేదనీ వాళ్ళ నాన్నగారు సూటీ పోటీ మాటలంటుడేవారుట-- అందుకే ఎక్కడయినా ఉద్యోగం సంపాదించుకునే దాకా అక్కయ్యని తీసుకు వెళ్ళదలుచు కోలేదని అంతకు ముందే అన్నాడుట.
    'సరే ఇంక ఇప్పుడు ఇక్కడా అక్కడా ఎందుకు ఆ ఉద్యోగం ఏదో ఈ ఊళ్ళో నే చూసుకో. నాకు ఆసరాగా ఇక్కడే వుండండి ' అని అమ్మ అనటంతో మరి ఎక్కడికీ వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు -- కొద్ది రోజుల్లోనే అక్కడే చిన్న వుద్యోగం దొరికింది.
    'వేరే ఇల్లు అదీ చూసుకోవద్దు -- అద్దె దండగ -- మేం మాత్రం ఏ పదిమంది వున్నాం -- నలుగురం కలిసే వుందాం ' అన్న అమ్మ మాటలకి వాళ్ళు సంబర పడ్డారు.
    పల్లె పట్నం కాని ఆ వూళ్ళో ఓ చిన్న ఇల్లు పదెకరాల పొలం అప్పటికి మాకున్న ఆస్తి.
    ఉన్నదాంట్లో నే గుట్టుగా సంసారం గడుపుకుంటూ ఒక్కో పిల్ల పెళ్ళికి ఎదగగానే ఎరెండేకరాలో అమ్మి పెళ్ళి చెయ్యటం జరుగుతుండేది -- నేను సెకండు ఫారం లో వుండగా ఆఖరి అక్కయ్య పెళ్ళి అయింది -- దాంతో వాళ్ళ బాధ్యతలూ తీరిపోయాయి-- ఆరెకరాల పొలమూ అమ్ముడు పోయింది -- ఆడపిల్లలకి పెళ్ళి చెయ్యగానే బాధ్యత తీరిపోతుందనుకోడం మాట మాత్రమే . పండగలూ, మర్యాదలూ, పురుళ్ళూ బాలసారేలూ అంటూ అక్కయ్య లూ బావలూ రావటం పోవటం ఖర్చు పెరిగింది -- ఇటు ఎకరాలు కరిగి పోవటంతో ఆదాయమూ తరిగింది -- దానికి తోడూ నా కాలేజీ చదువు కూడా వచ్చింది -- ఆ ఇబ్బందులు ప్రతి సంసారం లోనూ వుండేవే అనుకోండి....
    నేను ఎమ్మెస్సీ లో వుండగా ఉషతో పరిచయం అయింది. ఉష నా క్లాసు మేటు. కధల్లో చెప్పినట్లే అ పరిచయం స్నేహంగా , స్నేహం ప్రణయం గా మారి మేం ఇద్దరం పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం.
    కూతురి పట్టుదలని కాదనలేకా, మాకు ఆస్తి అంతగా లేకపోయినా చదువుకున్న వాడిని ఎప్పటి కయినా వృద్ది లోకి వస్తాననే ధైర్యం తోటి వాళ్ళ వాళ్ళు అంగీకరించారు.
    ఇటు మా వాళ్ళకి కూడా అభ్యంతరం ఏమీ లేకపోయింది -- కాని ఎందు చేతనో భగవంతుడి కే అది ఇష్టం లేకపోయింది.
    పరీక్షలవగానే లగ్నాలు పెట్టుకోవాలని రోజులు లెక్క పెట్టు కుంటుండే వాళ్ళం కాని ఆరోజు మాత్రం రాలేదు --
    ఆఖరి ప్రాక్టికల్ చేసి అబ్బ తల పగిలి పోతోంది అంటూ ఇంటికి వచ్చిన ఉషకి మర్నాటి కి జ్వరం రావటం మూడో నాటికి ఒంటి నిండా తెల్లటి పొక్కులు లేవటం, పది రోజులు యమ యాతన పడి శాశ్వతంగా కన్ను మూయటం గుర్తు తెచ్చుకుంటుంటే ఈ క్షణం లో కూడా నా ఒళ్ళు జలదరిస్తుంది -'
    జాలిగా తన వంక చూస్తున్న సురేఖ కళ్ళల్లో పడకుండా చటుక్కున మొహం తిప్పుకున్నాడు. ఆసమయంలో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఎదురుగా వున్న రైలు పట్టాల కేసి చూస్తూ కూర్చుంది. ఫెన్సింగు నానుకుని నిలబడిన పిల్లలు అయిదారేళ్ళ అమ్మాయి, మూడు నాలుగేళ్ళ అబ్బాయి ముద్దుగా వున్నారు-- ఒకరి భుజాల మీద ఒకరు చెయ్యి వేసుకుని గలగలా నవ్వుతూ కబుర్లు చెప్పేసు కుంటున్నారు. అటు నుండి వస్తున్నా గూడ్సు బండి ని చూస్తూ --


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS