Previous Page Next Page 
వారుణి పేజి 19


    కానీ సావిత్రికి అది అవమానంగా అనిపించింది. అందరూ కలసికట్టుగా తనని అవమాన పరుస్తున్నట్టుగా అనుకుంది.
    భోజనాల మధ్య కబుర్లు దొర్లాయి. నారాయణ గారికి వూరకే శ్రాద్ధ భోజనంలాగా భోజనం చేయటం సుతరాం గిట్టదు. తమాషాగా నవ్వుతూ కబుర్లు చెబుతూ భోజనం చేయటం ఆయనకిష్టం.
    "నువ్వు ఉద్యోగం చేస్తావామ్మా?"
    చిన్న కోడలని ప్రశ్నించాడు నారాయణ.
    "అవును మామగారూ! చదువు రెండు రకాలు. విద్యాబోధన లేదా చదువుకున్న చదువుని ఆచరణలో పెట్టడం. నాకు మొదటినుంచీ టీచింగ్ యిష్టం. పైగా యీ రోజుల్లో లెక్చరర్ పోస్టు దొరకటం కూడా అంత సులువు కాదు. నేను సర్వీస్ కమీషన్ పాసై, సెలక్టయ్యాను. పోస్టింగ్ వచ్చింది. ఉద్యోగంలో చేరాను. అంతేకాదు మామ్మగారూ! నాకు టీచింగ్ అంటే వున్న యిష్టం వల్ల సీటొచ్చినా, నాన్నగారు ఫోర్స్ చేసినా నేను మెడిసిన్ కి వెళ్ళలేదు."
    రత్నమ్మ భారతం ముఖంలోకి సూటిగానే చూసింది. తన మనస్సులోని అయిష్టతని ఆమె బొత్తిగా దాచుకోదు. ముందు చూపులతో ఆ తర్వాత మాటలతో కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంది.
    కానీ నారాయణ సుబ్బరత్నం అయిష్టతని బొత్తిగా లెక్కించలేదు "మంచిదమ్మా! పెళ్ళయిపోయిందిగా యింకెందుకు ఉద్యోగం అని నువ్వు మానేస్తావేమోనని భయపడ్డాను" అన్నారు నవ్వుతూ.
    "ఊహూఁ తనకి ముందే చెప్పాను నేను రిజైన్ చెయ్యనని. మా డిపార్ట్ మెంట్స్ వేరయినా ఇద్దరికీ ఒకేచోట ఉద్యోగం కదా! ట్రాన్స్ ఫర్స్ గట్రా అంతగా వుండవు. సారధి కూడా అంగీకరించారు" అంది వారుణి తన నిర్ణయం చెబుతోన్నట్టుగా.
    నారాయణ తలాడించేడు.
    "ఊహూఁ  నువ్వు మహారాణిలాగా ఉద్యోగం చేస్తోంటే నేను వంట వుట్టిలా, సప్లయిర్ లా, పనిమనిషిలాగా మీ అందరికీ వండి వారుస్తూ, యిలా మీరంతా దర్జా వెలగబెడుతూ కూర్చుంటే సప్లయి చేస్తూ, చివర్న నేను ఎంగిలి కంచాలు కడగాలా?" అనుకుంది సావిత్రి.
    "అయితే ఉద్యోగం చేస్తుందన్నమాట. మరి నెలనెలా వెయ్యేసి రూపాయలు మన చేతికి యిస్తుందా? ఏమో తీరు చూస్తే అలా లేదు. చూద్దాం" అనుకుంది సుబ్బరత్నమ్మ.
    "జీతం విషయం అడిగి కనుక్కోండి" అన్నట్టుగా పెదాలు కదిల్చి కనులతో సైగ చేసింది ఆమె. కానీ నారాయణ గమనించనట్టే ప్రవర్తించాడు. ఆమె మళ్ళీ భర్త వైపు చూసింది. ఆయన ఆమె వైపే చూళ్ళేదు. నింపాదిగా భోజనం చేయసాగారు కొడుకుతో కబుర్లాడుతూ.
    భోజనాలు ముగిసి ఫణి, నారాయణ,సారధి బయటికి వెళ్ళారు. సుబ్బరత్నమ్మ ప్లేట్లో మామిడి ముక్కలు తరుక్కుని వెళ్ళింది.
    పద్మ తల్లిని అనుసరిస్తూ ఆమె వెంటే వెళ్ళింది. టేబుల్ ని శుభ్రం చెయ్యటానికి వచ్చింది సావిత్రి. ఆమె ముఖం రుసరుసలాడుతూనే వుంది.
    "పని మనిషి లేదా?"
    ఉలిక్కి పడ్డట్టయి చప్పున అటుచూసింది సావిత్రి.
    సింక్ లో చేయి కడుక్కుని వస్తోంది వారుణి.
    ఆ పలుకరింపు, ఆ తీరు పుండుచేసి, ఆపై కొత్త కారం రాచినట్టుగా అనిపించింది సావిత్రికి. దాంతో వళ్ళు మండిపోయింది. ఈ యింట్లో పనిమనిషిని నేనే! అందరికీ అన్ని చాకిర్లూ చేయటానికి నేనీ యింటికి వచ్చాను అంది కఠినంగా. ఆ సమయంలో ఆమె ముఖంలో క్రోధం చిందులు తొక్కుతోంది.
    ఆశని పాతం లాంటి ఆ మాటలకి నివ్వెరపోయింది వారుణి.
    "అక్కా!" దెబ్బతిన్నట్టుగా ఆర్తిగా పిలిచింది వారుణి. సావిత్రి మాటలు లేడి గుండెలో తుపాకి గుండులా దూసుకుపోయాయి.
    "అవునమ్మా! అత్తగారు హోదా ప్రదర్శిస్తారు. ఆడబిడ్డ చదువుకుంటూ యింకా అమ్మకూచిలా గారాలు పోతుంది. ఇక యీ రోజునుంచీ నువ్వొచ్చావు. నువ్వేమో మహారాణిలాగా ఉద్యోగం వెలగబెడతావు. ఇక చదువుకున్నా నేను వంటకి, వంట ఇంటికి అకింతమై పోయింది నేనే కదా! వండి వార్చి, వడ్డించి, ఎంగిలి కంచాలు తీసేసి పని డ్యూటీ-నాదే కదమ్మా! వ్యంగ్యం అంతా మూర్తీభవించినట్టుగా అంది సావిత్రి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS