Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 19


    -ఆ జంటని చూడటం పూర్తయ్యేక బాగా రియాక్టయ్యేడు. అకస్మాత్తుగా సీట్లోంచి లేచేడు.

 

    తండ్రి చేస్తున్న ఫీట్సు శ్రద్ధగా పరిశీలించి తృప్తిగా గాలి పీల్చుకున్నాడు కృష్ణమూర్తి.

 

    -తర్వాత అతను ఎక్కువసేపు రవీంద్రభారతిలో కూచోలేదు. వచ్చిన పని అయిపోయింది. గనక పద్మను తీసుకుని మరో గేటు ద్వారా బయటకు వచ్చేసేడు.

 

    స్కూటర్ని చాలా వేగంగా బాలాజీ కొండ మీదికి ఎక్కించేడు. కొండమీద స్కూటరాపి అటూ ఇటూ చూసి పద్మను గట్టిగా వాటేసుకున్నాడు.

 

    అది అతని మొదటి కౌగిలింత!

 

    అతని వెర్రి చేష్టలకు పద్మ ఖంగారుపడింది. ఏమిటిదని అడిగేలోగా అతను పొయిట్రీని పాట రూపంలో పెట్టి దంచేస్తున్నాడు.

 

    "నీకూ నాకూ పెళ్ళంట..." అవటాని!


                                      *  *  *


    వేడి తగిలిం తర్వాత మనిషన్నవాడు స్థిమితంగా కూచోలేడు. సత్యం విషయంలో అదే జరిగింది.

 

    ఒక పక్క...

 

    డాన్స్ చేస్తున్న చలపతి కూతురు తనకి బాగా నచ్చి, ఆ మాటేదో చలపతికి చెబుదామనుకుంటున్న తరుణంలో...

 

    మరో పక్క...

 

    కృష్ణమూర్తి ఒక ఆడపిల్లను వెంటేసుకు రావడం కనిపించగానే సత్యానికి పిచ్చెక్కినట్టుంది.

 

    స్టడీగా కూచోలేకపోయేడు.

 

    కృష్ణమూర్తి పద్మ రవీంద్రభారతి నుంచి బయటకు రాగానే, సత్యం వాళ్ళని వెంబడించడం ప్రారంభించేడు.

 

    బాలాజీ కొండమీద కృష్ణమూర్తి పాట పూర్తిగా విన్నాడు. ఆపైన వాళ్ళతోపాటు సత్యంకూడా ఆడపిల్లల హాస్టల్ కి వెళ్ళేడు.

 

    పద్మ ప్రయాణ సన్నాహాలకు కృష్ణమూర్తి సాయపడుతున్నప్పుడు సత్యం ఆ హాస్టల్ వార్డెన్ ని కలుసుకోడానికి అడ్రస్సు సేకరించేడు.

 

    ---రైలుస్టేషన్లో పద్మకి వీడ్కోలు చెప్పడానికి వెళ్ళేడు కృష్ణమూర్తి. ఆమె అడ్రస్సు తీసుకున్నాడు. ముహూర్తం పెట్టుకోడానికి తండ్రితోపాటు తానుకూడా బందరు వస్తానని ఆమె చేతిలో చెయ్యివేసి మరీ చెప్పేడు.

 

    ఆమె ఎక్కినా రైలు కదిలింది. కృష్ణమూర్తి చెయ్యి ఊపుతూ ఫ్లాట్ ఫారమ్మీద నిలబడ్డాడు.

 

    "భగవంతుడా! మా పెళ్ళి చెయ్యి!" అని పద్మ మనసారా దేవుడికి నమస్కరించింది.

 

    ---సరిగ్గా అదే సమయానికి సత్యం వార్డెన్ ని కలుసుకున్నాడు. ఆమె ద్వారా పద్మ వివరాలు తెలుసుకున్నాడు.

 

    పద్మ తండ్రిపేరు లక్ష్మీపతి అనీ, అతను బందర్లో పెద్ద కంట్రాక్టరనీ వార్డెన్ చెప్పింది.

 

    ఆ వివరాలు వినగానే షాక్ తిన్నాడు!

 

    సత్యానికి లక్ష్మీపతి బాగానే తెలుసు. కాంట్రాక్టుల సంబంధమైన వ్యవహారాల్లో సత్యం సలహాలకోసం లక్ష్మీపతి చాలాసార్లు హైదరాబాదు వచ్చేడు.

 

    సలహాలైతే ఇవ్వగలిగేడు గానీ లక్ష్మీపతి గుణాన్ని మాత్రం సత్యం ఎప్పుడూ మెచ్చుకోలేదు. ఆ మాటకొస్తే లక్ష్మీపతిలాంటి మనుషులవల్ల వ్యాపార వాణిజ్యాలలో నీతి నిజాయితీ చచ్చిపోయేయని సత్యం స్టేట్ మెంటు ఇవ్వగలడు.

 

    డబ్బే దేవుడనుకునే జాతిమనిషి భూలోకంలో ఎవరయినా వున్నారా అని ఎవరయినా అడిగితే మొదట లక్ష్మీపతి పేరు చెప్పడానికి సత్యం సందేహించాడు!

 

    డబ్బుకోసం లక్ష్మీపతి ఎంత గడ్డితింటాడో సత్యానికి తెలుసు. ఆ మనిషి దగ్గిర ఆత్మీయతా ఆదరణా అనే పదాలకు అర్ధం దొరకదు.

 

    అల్లాంటి మనిషితో వియ్యమొందడమా? అతని కూతుర్ని చేసుకొని కృష్ణమూర్తి సుఖపడగలడా?

 

    మీదు మిక్కిలి...

 

    ఆత్మీయతా ఆదరణా కరువయిన ఆ సంబంధంచేస్తే తాను తన భార్యకిచ్చిన మాట తప్పిన వాడవుతాడు.

 

    ఇప్పుడు తనేం చేయాలి?

 

    కన్నబిడ్డ మనసు కాదని అతని ప్రేమను చంపాలా? భార్యకిచ్చిన మాట తప్పి అతని పెళ్ళి పద్మతోనే చేయాలా?

 

    ఈ సమస్యకు పరిష్కార మార్గమేమిటి?


                                       15


    సత్యం వర్రీ అవుతున్న లక్ష్మీపతి కధ ఇక్కడ చెప్పుకోడం ఎంతయినా అవసరం.

 

    బందరు ఇంగ్లీషుపాలెంలో ఎవర్నడిగినా చెబుతారు లక్ష్మీపతి ఇల్లు!

 

    పాతకాలపు మేడది. ఇంగ్లీషువారి కాలంలో వారి టేస్టుకి అనుగుణంగా కట్టుకున్న మేడ.

 

    బందరులో పాత భవనాలు చాలావరకు ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి వాళ్ళు కట్టినవనే చెప్పాలి. వాళ్ళమీద పేటలుకూడా వున్నాయి. పూర్వకాలంలో ఆ మూడుజాతులూ ఆ ఊళ్ళో కాపరం చేయడం మూలంగా వాళ్ళ గొడవ యిప్పటికీ అంతో ఇంతో బతికేవుంది.

 

    లక్ష్మీపతి మావగారి తండ్రి తెల్లదొర దగ్గిర ఆ మేడ కొన్నాడు. మామగతించేక ఆ మేడ లక్ష్మీపతి మామగారి వశమయ్యింది. మావగారు కూడా గతించేరు గనక యిప్పుడది లక్ష్మీపతి సొంతమైంది.

 

    లక్ష్మీపతి డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు. కానీ పిల్లనిచ్చిన కోదండ రామయ్య పుణ్యమాని ధనవంతుడయ్యాడు.

 

    కోదండరామయ్యగారు కాంట్రాక్టులవీ చేస్తూ ఆ ఫీల్డులో మంచిపేరు తెచ్చుకున్నారు. న్యాయం, ధర్మం వగైరా విషయాల్లో కూడా వారికి చాలా మంచిపేరే వుండేది.

 

    అటు వృత్తిలోనూ ఇటు గుణంలోనూ వారు నిప్పులాగా బ్రతికేరు! నిప్పులాంటి మనిషని బిరుదుకూడా సంపాయించుకున్నారు.

 

    వారికి ఒక్కగానొక్క కూతురు!

 

    ఆ కూతుర్ని లక్ష్మీపతికిచ్చేసి - లక్ష్మీపతిని ఇల్లరికానికి తెచ్చుకున్నారు.

 

    గురిచూసి కొట్టడం లక్ష్మీపతికి చిన్నప్పట్నుంచి అలవాటే. డబ్బు వ్యామోహ మెక్కువ. అదెక్కడుంటే అక్కడ డబ్బుమీద దాసోహమనడానికి వెనుకాడడు.

 

    షావుకారమ్మాయితో పెళ్ళి జరగడం ముఖ్యం.

 

    ఇల్లరికం వల్లకాడు పట్టించుకోలేదు.

 

    వాళ్ళమ్మాయిని చేసుకుని తానుకూడా ధనవంతుల జాబితాలో చేరిపోవాలనే తపన మిగతా వివరాలను ఆలోచింపచేయలేదు.

 

    కోదండరామయ్యగారు బతికున్నంత కాలం వారికి ముఖ్య సేవకుడిగా వ్యవహరించేడు వారొస్తే లేచి నించునేవాడు. వారి ఎదుట చేతులు కట్టుకొని మాట్లాడేవాడు.

 

    వారు కనుమరుగైతే చాలు, పనివాళ్ళమీద విరుచుకుపడేవాడు. వారు దానధర్మాలు విరివిగా చేయటం నచ్చకపోయినా-వారి ఎదుట వారి దయా గుణాన్ని శ్లాఘించేవాడు. భార్య దగ్గిర మాత్రం గొప్ప వర్రీ అయ్యేవాడు.

 

    మావగారి కాంట్రాక్టు వ్యవహారాల్లో అడిగినా అడక్కపోయినా సాయపడుతుండేవారు. అట్లా చేస్తూనే ఆ ఫీల్డులో కొన్ని మెళకువలు తెలుసుకునేవాడు.

 

    అల్లుడిగారి అతి వినయం ఆ మావకి సుతరామూ గిట్టేదికాదు. అప్పుడప్పుడు మొహమ్ముందే విసుక్కునేవాడు కూడాను. గట్టిగా కోప్పడితే కూతురు బతుకు అధ్వాన్నం చేస్తాడేమోనన్న భయంతో అరిచేవాడు కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS