ఇద్దరూ రిక్షా దిగుతూ వుండగా "ఓయ్! రిక్షా ఆగండి" అని కేకేశాడు జానకిరాం_
"ఈ వేళ్ళప్పుడెక్కడికిరా?" అంది పార్వతి ఆయాసంగా.
వసారాలో వుంచిన రెండు సూట్ కేసులు బెడ్డింగ్ చూసేసరికి ఆమెకేదో అపశకునంగా అనిపించింది.
ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన తండ్రి పాదాలకి నమస్కరించాడు జానకిరాం. జ్యోతి బొమ్మలా చూస్తుండిపోయింది. పార్వతి విస్తుబోయింది. ఏం జరుగుతుందో ఆమెకే అర్ధం కాలేదు.
"ఏవిట్రా?" అయోమయంగా ప్రశ్నించాడాయన.
"నన్ను క్షమించాలి నాన్నా! నేను మా అత్తారింటికి వెళ్ళిపోతున్నాను. కారణాలు అడక్కండి. జ్యోతి ఈ ఇంట్లో మీ మధ్య యిమడలేదు." అన్నాడు గబగబా ఎవరో వెనుకనుంచి తరుముకు వస్తున్నట్లు.
శాస్త్రిగారు నివ్వెరపోయారు. ఆయనకీ హటాత్నంఘటనని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాలేదు. ఎందుకిలా జరుగుతుందో అని మధన ప్రారంభమైంది మనసులో.
"ఒరే, ఒరే ఏమంటున్నావురా. అత్తారింటికి వెళుతున్నావా? వెళ్ళరా, వెళ్ళు. దూరంగా వుండి వెళ్ళి వస్తున్నంత గౌరవం వుండదురా అత్తారింటి కాపురం. అప్పుడు తెలుస్తుందిరా నీకు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని బ్రతుకులెందుకురా!" ఆవేశంగా అంది పార్వతి.
"పార్వతి నీవు మాట్లాడకు" వారించారాయన.
"ఎంత తేలిగ్గా చెబుతున్నావురా వెళ్ళిపోతున్నానని! నీ పెళ్ళాన్ని ఏం కష్టాలు పెట్టాంరా. అత్తగారు ఆడబిడ్డలు రాచి రంపాన పెడుతున్నారా? ఏం మాటలురా యివి? ఎందుకు పుడుతున్నాయి ఇలాంటి బుద్ధులు మీకు?
తల్లి మాటలకు జానకిరాం సమాధానం ఇవ్వలేదు. నిర్లక్ష్యంగా వూరుకున్నాడు.
పార్వతి మాతృ హృదయం వూరుకోలేదు.
"కన్నతల్లిగా అడుగుతున్నాను. కారణాలు చెప్పి ఇంట్లోంచి కాలు బయటపెట్టు. నిష్కారణంగా మామీద అలిగి వెళ్ళిపోతున్నారు. ఇది మంచిది కాదురా" కొడుకు చేతులు పట్టుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది.
అతడేమీ సమాధానం ఇవ్వలేదు. తల్లి చేతులు విడిపించుకుని సూట్ కేస్ అందుకున్నాడు.
అత్తతోగానీ మావతోగానీ ఒక్కమాటైనా చెప్పకుండా ముందుకు కదిలింది జ్యోతి.
పార్వతికి కళ్ళనీళ్ళు దొర్లాయి. భర్తవైపు దీనంగా చూసింది.
"పార్వతీ! ఎందరు వదిలిపోయినా ఈ నీ ముసలి భర్త మాత్రం నిన్ను వదలడులే వదల్లేనుకూడా. అలాగే నీవు నన్నీ వృద్దాప్యంలో వదిలి వెళ్ళొద్దు_"
"అవేం మాటలండీ, నేనసలే వాడి ప్రవర్తనకి కుమిలిపోతున్నాను" అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ_
"వీళ్ళందరూ పోయినా నాకేం దిగుల్లేదు. మొన్న కోదండం, నిన్న దాశరధ, నేడు జానకి, రేపు అయోధ్య రోజులు గడిస్తే కోసల పట్టాభి కూడా వెళ్ళిపోతారు. ఇక సీతారాం సరేసరి. వాడు దేశానికే అంకితమయ్యాడు. అయినా నాకు దిగుల్లేదు. నీతోడు, నీ చేయి నా చేతిలో వున్నన్నాళ్ళూ ఈ జీవనరంగంలో పోరాడతాను. పడిపోను ఓడిపోను" అన్నారు గంభీరంగా.
పార్వతికి దుఃఖం ఆగలేదు. ఆమె కన్నీళ్ళు తుడిచారాయన.
ఇంకేం మాటాడినా ఆమె గుండె గాయం అవుతుందని మౌనం వహించారు.
ఇద్దరూ ఒంట్లో ఓపిక లేనట్లు ఇంట్లోకి వెళ్ళే సత్తువ కూడా లేనట్లు శూన్యంలోకి చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు.
తల్లి దండ్రీ వచ్చారని, జానకిరాం, జ్యోతి వాళ్ళముందే వెళ్ళిపోయారనీ గ్రహించాడు కోసలరాం. అతనికి వాళ్ళ ఎదురుగా వచ్చి పలకరిచే ధైర్యం కూడా లేకపోయింది.
తన శరీరంలోని ఒక అంగాన్ని ఎవరో బలవంతాన కోసి తీసి వేస్తున్నట్లనిపించింది శాస్త్రిగారికి.
అత్తా మామ రావటం, తోడికోడలు, మరిది వెళ్ళిపోవటం గుర్తించింది స్వాతి. వాళ్ళు లోపలికి వస్తారని ఎదురు చూసి ఎంతసేపటికి రాకపోయేసరికి తనే వసారాలోకి వచ్చింది. బయట ఎండ నిప్పులు చెరుగుతోంది.
"అత్తయ్యా" లాలనగా పిలిచింది.
"చూశావమ్మా! జ్యోతి ఎంతపని చేసిందో?"
"మీరు బాధ పడకండి. ఏదో చిన్నతనం ఆవేశం. ఆమె తన తప్పుని తాను గ్రహించేరోజు తప్పక వస్తుంది. ఆ ఆవేశం చప్పగా చల్లారిపోయాక యదార్ధం ఏమిటో బోధపడుతుంది" అంది అనునయంగా.
"దాని సంపాదనంతా తండ్రికే ఇచ్చుకుంటోంది. కొడుకుతో సమానంగా అది తిరుగుతున్నా నేనేనాడూ ఒక పల్లెత్తుమాట అనలేదు, పని చెప్పలేదు. చెయ్యలేదే...అని బాధపడలేదు. ఇప్పుడేం తక్కువైందని వెళ్ళిపోవాలమ్మా." నలుగురిలో నగుబాటుకాదూ!"
"ఎవరు అన్నా ఆమెనే అంటారు. మిమ్మల్నెవరంటారు? మీ స్వభావం అందరికీ తెలిసిందే_"
"ఎవరం వినొచ్చామమ్మా౧ లోకం ఇష్టంవచ్చినట్లుగా మాట్లాడుతుంది. దానికేం హద్దా? పద్దా?"
"అదంతా ఆలోచించకండి. మన మనస్సాక్షి చాలు మనకి. రండి మామయ్య ఇక అదంతా మరిచిపొండి. భోం చేద్దురుగాని వేళ మించిపోయింది_"
కోడలిఆప్యాయతకి ఇద్దరికీ మనసు బరువెక్కి పోయింది.
ఎక్కువ ఆదరగానీ అనాదరణగానీ కూడా భరించలేదు మనసు...
"కడుపు పూర్తిగా నిండిపోయిందమ్మా" అంది పార్వతి_
