Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 18

 

    ఆడు వొకిలి కాడికి వచ్చి, రొండు సేతుల్తోటి గుమ్మం కమ్మీలు పట్టుకొని కసిక్కుని దాన్ని కోరుక్కుతినేట్టు సూశాడు. గుండిల్లో జోరు సల్లబడలేదు. నిసా దిగనూ లేదు. కాళ్ళల్లో సురుకు సన్నబడ లేదు. నరాల్లో గోల సప్పబడలేదు. ఒకిట్టోంచి ఎలపలి కొద్దారనుకున్నాడు. ముంగిటికి వోలాడు కూడా. కూతంతలోనే బిగిసి పోయాడు. కళ్ళు బయంబయంగా యిటూ అటూ పరిగెత్తినాయి. గొంతుకు తడి అరిపోయినాది. గుండి సప్పుడు తగ్గినాది. రాటకానుకుని సురసురా సూత్తన్న సీతమ్మ కనపడ్డం తో ఆడు నిజంగానే దడుసు కున్నాడు. అడుగు ముందికి పడలేదు. సూపు ఎదర నిలుసోలేక పోయింది. సేతులు తలుపుల్ని వొదిలి రాలేక పోయాయి. ఎంకన్న సచ్చినట్టే అయిపోయాడు. సురుక్కుని కొరడా కర్రతో యీపు మీదెవరో కొట్టినట్టే అయిపోయాడు. ఈస్సెర యేరు సూసిన కోడి తాసల్లె ఎనక్కే జంకేశాడు. ఒళ్లు వుండలు సుట్టుకు పోయినాది. కాళ్ళు సల్లబడ్డాయి.

                            *    *    *    *
    బద్రయ్య గాడి సంగతి కొసకంటా తెలిసినోడు ముసలయ్య. ఎంకన్న లాంటోళ్ళనీ, సేందరకాంతం లాటిదాన్ని ఎన్ని పల్టీలు కొట్టించగల్దో , మసిపూసి ఎల్లా మారేడి కాయ సేయ్యగల్దో అంతా ఎరిగున్న వోడు. సేసే పన్లుకీ, సెప్పె మాటలకీ ఎంత తేడా కనిపిత్తాదో తెలుసు. ఆ వొచ్చీ మాటలు ఎంత లోతు నించి వోత్తాయో కూడా సెప్పగల్డు. కడుపులో అలోసన్లు ఎదటోడు కనిపెట్ట లేకుండా ఎన్ని రకాలుగా తిప్పగల్దో , సేవులారా యిన్నదే! ఇలాంటోడ్నీ నమ్ముకున్న ఎంకన్న గాళ్ళు పెళ్ళాన్నీ వూళ్ళనీ యిడిసేసొచ్చి యిక్కడెం పావుకుంటరో?
    తగిన అనబం అయితే కాని, ఎంకన్న దార్లో పడ్డని ముసలయ్య అనుకున్నాడు. అలాంటోళ్ళకి సల్లగా సెబితే బుర్ర కేక్కదు. మోకాలి సిప్పలు సీతకబోడిత్తే కాని తల్లో జేజెమ్మ కిందికి దిగదు. అలాంటోడి తను. బాధపడితే మట్టుక్కి ఏం లాబం? ఇసుగేసు కొచ్చింది ముసలయ్య కి. ఆడి అలోసన్లు ఎప్పుడెల్లాగుంటాయో సీతమ్మ కి తెలుసు. నిజం సెప్పాలంటే ఆణ్ణి సరీగా దార్లో తిప్పగల్ది తనొక్కత్తే నేవో! ఎంకన్న మూలాన్ని తాత ఎంత యిదయ్యాడో కనిపెట్టింది కనక, సల్లగా ఆడికి యీ మాటా ఆ మాటా సెప్పి మనసు మారసా లనుకుంది.
    తాత లాంటోడు , సిలక్కి సేప్పినట్టు సెప్పినా లెక్క సేయ్యనోడు తన మాటింటాడా? అల్లాగని నోరు మూసుక్కూసుంటే ఆళ్ళ కాపర వేవయిపోతాది? ఆడి పెళ్ళాం వుసుర్ని పడిపోదో? బతుకు సితికి పోదో? అయినోడు అందరి నొల్లల్లోనూ పడిపోతే దాని పుట్టుక రచ్చ కేక్కదో? పాపం దానో మొగం సూసయినా ఎంకన్న ని మారసాలి!
    ముసలయ్య యింట్లో లేనప్పుడే సూసి, బద్రయ్య కూడు తిండాని కొచ్చీవోడు. ఆడితో బాటు అప్పుడప్పుడు ఎంకన్న వొచ్చీవోడు. ఆ సనువుతో ఆడు అదును కనిపెట్టి ఒక్కడే వోత్తావుండేవోడు. అప్పుడప్పుడు సీతమ్మ కూడా సోరవ సేసి ఆడితో సల్లసల్లగా మాతాడతావుండీది. రవణయ గాడి కవుర్లూ, పంటల యిసయాలు ఎయేయో అడుగుతా వుండేది. అల్లా సేప్పుకుపోతావుంటే ఆడికి వుసారుగానూ వుంటుండేది. వూసూ బోతుండేది. ఏ సంగతయినా ఆణ్ణి అడగ్గలిగి సనువు తీసుకోడంతో బద్రయ్య కి దొరకని గని తన ఎదటే ఉన్నా దనుకున్నాడు.
    కడకంటా సీతమ్మ తన్ని వోకంట కనిబెడతానే వుంటాదని పాపవు ఎంకన్న కి తెలీలేదు. అది సేప్పీ మాటలు, ఆడీ పరసకాలూ, సేసీ పన్లూ తన మీద మనసుపడే సేత్తావున్నా దనుకున్నాడు.
    రావులమ్మ గోలుసమ్మిన డబ్బుతో ఎంకన్న యాపారం మా జోరుగా సాగుతన్నాది. ఆదర్నించొచ్చీ పడవలోళ్ళకీ, యాపారం కొస వొచ్చీ సావుకార్లకీ, కూలీ నాలీ సేసుకునీ బక్కటోళ్ళకీ రెండో జావు రేతిరెలకి కల్లు ముంతలు పరపరా సెసీ పని ఆడిది. ఏ లంకల్లోనో తయారు సేయించి గడ్డి పడవల్లో దాసిపెట్టే కల్లు కుండలు యీడి కోసం వచ్చి పడుతుండేయి. ఎవుడికి తగ్గ కవీషను ఆడి కిస్తూ వుండీవోడు. తలుపులు గడియేట్టి వోటేల్లో నో, కొబ్బరి కాయి బత్తాల్లాట , సందుల్లోనో, యిరిగిపోయిన పడవొల కంతల్లోనో, అంటి గెల్ల సాటుని గుట్టల్లోనో ముంత లట్టుకుని ఎంతో మంది వొరిగి పోడం తన కళ్ళ ముందే ఆడు సూత్తావుండీ వోడు. తను సేత్తన్న గొప్ప పనికి ఆడికి సెప్పలేనంత వుసారు పుట్టుకొచ్చీది. తనలో తనే మురిసిపోయీ వోడు, ఇంతమంది బతుకులూ తన గుప్పిట్లోనే ముడుసుకో[పోయాయి గందా అని.
    అప్పుడప్పుడు మనుసేసి ఆడూ వోకోముంత తాగుతా వుండీవోడు. కూతంత తాగితే కుతి తీరనప్పుడు బుడ్లికి బుడ్లె ఎక్కించేసీవోడు. నిసాలో నిండిపోయి, వొల్లంతా మైకం కమ్ముకొత్తే నలుగురూ సాయం పట్టి తన్ని పడగ్గదిలో కూలేసిన రోజులూ వున్నాయి. ఇప్పటిక్కాని మజా సేసీ అదురుట్టవు ఆడికి కలగలేదు. రొండు సేతుల్తోటి డబ్బూ గడిత్తన్నాడు. సిటికి లో సెట్టం తోడు అయిపోగల్డు. తన యాపారం లో గొప్పతన వెంటంటే అడుసేసీ పని అసలు రొండో కంటోడి కి -- ఆ తాగీ వొళ్ళకి తప్ప!-- సత్తే తెలీదు. దానవోయి గుంటలో ఆడో అరంతత్తుల మేడ లేపాడంటే అప్పుడంతా కల్లస్ససేప్పి సూత్తారు. పెట్టి పుట్టినోడని తెగ పొగిడేత్తారు!
    ఇంత దయిర్నేవున్నవోడే అయినా, అప్పుడప్పుడు తనలో తెగ గింజుకుంటా వుంటాడు. ఏంటో ఆ బాద? ఎవురికీ నోరిప్పి సెప్పనే లేకపోతాడు! మల్లా యింతట్తోకే, సీతమ్మ వూసు మనసులో ముసరడం తో బోల్డు బలం పోడుసుకొచ్చీది . మొగతన వున్నాననిపించీది!
    ఆడదాన్తో దొరికీ సరదా అంతా తన పెళ్ళాం లోనే వుందనుకునీ రోజుల్లో ఆడొట్టి పల్లిటూరు బుల్లోడు. అదే పట్నవొళ్ళ రకంగా తయారయితే రంబలాంటోళ్ళు కూడా రావులమ్మ ముందర బలాదూరే అనుకునీవోడు. అయితే అది సెబితే యింటేగా? ముచ్చట పడి లైలాను సీర కొంటె సర్రుని తోసేసినాది. పొగడరూ, సున్నోవూ కొంటె సట్టుక్కుని యిసిరేసినాది. అడదాన్లో అట్టడుగుని దాక్కుండిపోయిన సాగుసంతా ఎలపలికి సూసుకుని మురిసి పోదారంటే , ఆ ముచ్చటంతా అదే ముక్కలు సేసినాది. దాంతో, ఆడి మనసంతా యిరిగి పోయినాది. యాపారం కోసరం ఎల్లినోడు పట్నం వొదిలి యింటికి రాడానికే బుద్దయింది కాదు. బద్రయ దరపనా అని, దాపరికం లేని వొయ్యారవంతా సెంద్రకాంతం లోనే సూపాడాడు. కాని లాబవేంటి? మనుసుపడి దరికేడితే బద్రయగాడే అడ్డు తగిలాడు. అలాటప్పుడు దాన్నసలు తనకి సుబిచ్చడ నెందుకో? యిల్లా బాద పెట్టడనెందుకో? గొప్ప కోసవా? అదీ తెలీకుండా వున్నాది! పోనీ అదైతేనేం, ఆణ్ణి అటకాయించలేదో? అసలల్లాంటిదాన్ని తను నమ్మమని ఎవుడు సేప్పెడూ? అప్పటితో ఆడోళ్ళంటేనే సిర్రేత్తు కొచ్చినాది. పట్ననెల్లాగా వొచ్చాడు కనక, లచ్చలు కొద్దీ గడించి గొప్పోడయిపోతే అప్పుడు లచ్చల మంది సెంద్రకాంతలు ఆడి కాళ్ళ కాడికే వొచ్చి పడతారనుకున్నాడు. దేవుడు సేసీ దంతా తన మేలుకే అనుకున్నాడు. ఇంతట్తోకే సీతమ్మ కంటబదినాది. అది కూడా బద్రయ గాడి దరవవే! అయితే మట్టుక్కు? ఆడంటేనే దానికి సుక్కేదురు గందా! నాసావిరంగా , ఒక్క దెబ్బకి రొండు పిట్టలు రాలవో?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS