Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 18

 

                                    9
    రైలు దిగి టాక్సీలో హాస్టల్ కి వచ్చేసరికి ఎనిమిది గంటలయింది -- 'వెధవ రైళ్ళు ఎప్పుడూ లేటే' అనుకుంటూ మీటరు చూసి డబ్బు ఇచ్చేసి సామాను పైకి తెచ్చి పెట్టమని యల్లయ్య కి చెప్పి గబగబా మేడ మీదకి దారి తీసింది సురేఖ.
    దారిలోనే ఎదురయిన నరసమ్మ 'వచ్చావా అమ్మా' అంటూ పలకరించి 'నాలుగు రోజులయింది-- శ్యామలమ్మ వూరి కెళ్ళింది.' అంటూ మరో వార్త కూడా అందించింది.
    'ఎప్పుడొస్తుందో తెలుసా?'
    "పద్దినాలు శలవబెడుతున్నా అని చెప్పి పోయింది.' అనేసి సురేఖ కి కాఫీ అదీ తెచ్చి పెట్టటానికి వెళ్ళిపోయింది.హడావుడి గా పనులన్నీ ముగించుకుని కాలేజీ కి వెళ్ళింది -- రి వోపెనింగు డే నాడు లేక్చారర్లంతా తప్పకుండా వుండాలని రూలే కాని ఆవాళ చాలామంది పిల్లలే రారు -- కొత్తగా కాలేజీ లో చేరేవారు చేరటం పూర్తీ కాదు. ఈ మధ్య రిజల్ట్స్ రావడమే ఆలశ్యం అయిపోతుంటే సగం రోజులు గడిచాక ఎడ్మిషన్స్ జరుగుతున్నాయి -- ఫస్టియరూ , సెకండి యరూ పరీక్షలు వ్రాసిన వాళ్ళు ఫలితంతో నిమిత్తం లేకుండానే పై సంవత్సరం కోర్సు చదవొచ్చు అనే రూలునన్నా రిజల్ట్సికా తెలియలేదు ఏమవుతుందో అని వాళ్ళ గుండెలు బితుకు బితుకు మంటూనే వుంటాయి-- వాళ్ళూ మొదటి రోజు శ్రద్దగా కాలేజీ కి వచ్చేవాళ్ళు తక్కువే -- కాలేజీ అంతా హాలీడే మూడ్ లో వుంది.
    పన్నెండు గంటలకే హాస్టల్ కి వచ్చేసింది సురేఖ. కొత్తగా కొన్న పుస్తకం తెరిచింది అంతే. టైము తెలియలేదు. అది పూర్తీ చేసి తల ఎత్తేసరికి టేబిలు మీది టైం పీసు నాలుగ్గంటల్ని చూపిస్తోంది.
    మొహం కడుక్కుని , ఇంటికి వుత్తరం వ్రాయాలి అనుకుంటూ పుస్తకం టేబిలు మీద పెట్టింది. ఇంతలోనే రంగమ్మ వచ్చింది . 'ఇవాళే వచ్చావా ?' అంటూ.
    ఆవిడ్ని చూడగానే కోపం భగ్గుమన్నా తమాయించుకుని 'రండి' అని కుర్చీ చూపించింది , లేని మర్యాద గొంతులోకి తెచ్చుకుని.    
    'అంతా కులాసాగా వున్నారా -- ఉమకి కొడుకుట కదూ రుక్మిణి వ్రాసింది -- మీ అక్కయ్య కులాసాగా వుందా -- ఊర్మిళకి సంబంధం కుదిరినట్లేనా'' అంటూ ఒక దాని వెంట ఒకటిగా ఆవిడ ప్రశ్నలు వేస్తుంటే , 'అ' 'వూ' తోటే సాధ్యమైనంత సమాధానాలు ఇచ్చి ముభావంగా వుండి పోయింది.
    అ ఆమ్మాయి ధోరణి కనిపెట్ట లేనంత అమాయకురాలు కాదు రంగమ్మ --
    'ఎప్పుడయినా రా ఇంటికి -- శంకర మఠం లో వేదాంత వుపన్యాసాలు ఏవో అవుతున్నాయంటేనూ బయలుదేరాను -- దారే కదా నిన్ను చూసి పోదామని వచ్చాను' అంటూ లేచింది.
    'తల బాగా నొప్పిగా  వుంది.' తన ఉదాసీనత కి ఐ కారణం పడేసి తలుపేసుకుంది సురేఖ.
    ఈ మధ్య తన మనస్సు మరీ గందర గోళంగా వుంటోంది. ఇంటికి వెళ్ళకుండా వున్నా బాగుండి పోను అనిపిస్తుంది అప్పుడప్పుడు -- అక్కడున్న రెండు నెలల్లోనూ తనకీ మరీ గంగ వెర్రులెత్తి పోయే పరిస్థితులు వచ్చాయి -- ఏ రోజుకారోజు ప్రయాణం అయి వచ్చేయాలనిపించేది.
    'అక్కయ్య కి ఆపరేషను చేయాల్సిందేట- ఆస్పత్రి లో ఎన్నాళ్ళు వుండాలో ఏమిటో -- సరే ఉమ పురుడూ హడావుడి కూడా వుంది కదా -- నువ్వుంటే నాక్కాస్త సాయంగా వుంటుంది -- శలవలె కదా అలా తొందరపడతావేమిటి.' అన్న తల్లి మాటలకి ఏమీ సమాధానం చెప్పలేక పోయింది.
    అంతేకాదు -- 'ఆ చదువేదో రేన్నెల్ల తరవాత చదువుకోవచ్చు లెద్దూ-- మళ్ళీ మనం కలుసు కుంటామో లేదో ఈ నాలుగు రోజులూ నా దగ్గిరుండు.'
    'ఛ-- ఏమిటిది -- ఏం భయం లేదని అంత మంది చెప్తున్నా ఇలా ఇదయి పోతున్నావు' అంటూ తనకి ధైర్యం చెప్పి మరి ప్రయాణం సంగతే ఎత్తటం మానేసింది.
    తను వెళ్ళేసరికి అత్తయ్య అక్కడే వుంది -- ఓహ్-- కోడలంటే ఎంత అపురూపమో అంతులేదు -- చేతుల నిండా తొమ్మిది జతల రంగు రంగుల గాజులతో ఉమ బరువుగా ఇటూ అటూ తిరుగుతుంటే చూడటానికి తనకీ ఎంతో ముచ్చటగానే వుండేది.
    తనని చూసి గుర్తు వచ్చినట్లే అత్తయ్య ఓ సంబంధం చెప్పింది -- అతనికి బ్యాంకి లో పనిట. వయస్సు మహా వుంటే ముప్పై అయిదు వుంటుందిట - అతనిలో కాని అతని ప్రవర్తన లో కాని ఎంచటానికి ఏ వంకా లేదుట- కాని ఒక్కటే లోటు మరి. రెండో పెళ్ళి వాడు -- ఇద్దరు పిల్లల్ని కానీ గృహలక్ష్మీ లాంటి భార్య ఆరునెలల క్రిందటే చచ్చిపోయింది --
    అన్నీ చెప్పిన అత్తయ్య తను కాస్త అటు వెళ్ళగానే ఇరవైయ్యారు ఏళ్ళున్నాయి సురేఖకయినా -- నాలుగేళ్ల పిల్లని ఏడాది పిల్లాడిని తన పిల్లల్లాగే అలవాటు చేసుకోవచ్చు అనటమే తన చెవుల్లో సీసం కరిగించి పోసినట్లయింది -- రెండో పెళ్ళి వాడు పిల్లల తండ్రి తప్ప మరీ మొగుడే దొరకడు అని చెప్పటమూ ఆవిడ ఉద్దేశ్యం అనుకుంది.
    అందరూ వున్నప్పుడు అత్తయ్య అనటమే కాని మళ్ళీ అమ్మా నాన్నగారు ఆ విషయం తననేమీ అడగలేదు -- తన మొహం చూసి తన ఉద్దేశ్యం గ్రహించుకుని వూరుకున్నారేమో -- అసలు ఇంకేమయినా సంబంధాలు చూస్తున్నారో లేదో -- 'మీరు చూపించిన సంబంధాలు నాకక్కర్లేదు . అసలు పెళ్ళే వద్దు- నేనీ వుద్యోగంలో స్థిరపడి పోతాను.' అని చెప్పిన తను ఇవాళ వాళ్ళు పెళ్ళి కొడుకుల్ని వెతకటం లేదు అని బాధపడటం ఏమిటి, ' ఈ మనస్సు కసలు బుద్దనేది లేదు. ఎప్పుడు ఎలా అనుకూలంగా వుంటే అలా ఆలోచిస్తుంది.' అనుకుంది.
    నాలుగురోజులు పోయాక అత్తయ్య మరో క్రొత్త వార్త అందించింది -- తన మరిది కొడుకు నాగేశ్వరరావు ఊర్మిళ ని చేసుకుంటానంటున్నాడట వాళ్ళంతా ఆ అమ్మాయిని ఉమ పెళ్ళిలో చూశారు. అబ్బాయికి బెంగుళూరు లో పని. అయిదు వందల జీతం -- కళ్ళ కద్దుకుని మరీ పిల్ల నివ్వవచ్చు అని అత్తయ్య తీర్మానం.

            
    అది విన్నప్పటి నుంచీ ఇంట్లో ఓ విధమైన సంచలనం కలిగింది -- ప్రయత్నించకుండానే పెళ్ళి సంబంధం కుదిరి పోతుంటే వద్దనే వారెవరు -- కాని వాళ్ళందరి కళ్ళకి తనే పెద్ద ప్రతి బంధకంగా కనబడుతోంది. తనకి అందము లేదు. వయస్సు ముదిరిపోయింది -- ఎవరినో ఒకరిని కట్టుకోటానికి అంగీకరించని మొండి తనము వుంది -- అయినా తను వద్దు అంది . అన్న పేరే కాని ఆ కొక్కిరాయి గాళ్ళు మాత్రం సంతోషంగా ఒప్పుకున్నారా -- అదిగో ఆగునుపు చూస్తేనే తనకి చిరాకు.
    'మీరింకేమీ ఆలోచించవద్దు -- ఊర్మిళ పెళ్ళి చేసేయండి ' అని స్పష్టంగా చెప్పేసింది.
    సరిగ్గా ఆ సమయంలోనే పులి మీద పుట్రలా ఈ రంగమ్మత్త వుత్తరం వచ్చింది.
    ఆ కోడలితో తెగతెంపులు అయిపోయినట్లే లేక్కట. కొడుక్కి మళ్ళీ పెళ్ళి చెయ్యాలను కొంటుందిట -- అంతటితో వూరుకోకుండా సురేఖ మా యింటికి రెండు సార్లు వచ్చింది . దానికి అత్తయ్య అన్నా' బావ అన్నా ఎంతో అపేక్ష అంటూ కూడా వ్రాసింది -- ఛ - తన ఖర్మ -- ఆ కామేశ్వర్రావు మీద మోజుకొద్దీ వెళ్ళిందా వాళ్ళింటికి! మొదటిసారి తెలియకా రెండోసారి ఆవిడ బలవంతాన్ని తప్పించుకోలేకనూ వెళ్ళింది- ముళ్ళ మీద కూర్చున్నట్లే కాస్సేపు కూర్చుని చెదు మింగినట్లే కాస్త అన్నం తిని వచ్చేసింది -- అదంతా. ఆవిడకి అర్ధం కాదనా -- పెద్దవాళ్ళు నచ్చచెప్పి పెళ్ళికి ఒప్పిస్తారనుకుంది -- ఆ పెద్ద వాళ్ళు తనకేమీ చెప్పటం మానేశారని తెలియదు కాబోలు --
ఏముంది -- అక్కయ్య ఇప్పుడే ఆస్పత్రి నుంచి వచ్చిందని, ఉమ పచ్చి బాలెంత రాలనీ ఆగారు కాని వచ్చే నెలలో ఊర్మిళ పెళ్ళి కూడా అయిపోతుంది.
    'అసలు ఉద్యోగంలో చేర్పించటమే మనం చేసిన పెద్ద పొరపాటు -- ఆబిగిని సంబందాలు చూస్తె తీరిపోయేది.' అంటుంది అమ్మ అస్తమానూ-- కాని ఇక్కడ తన కెంత తృప్తి గా వుందో వాళ్ళకేం తెలుసు -- చెల్లెళ్ళ తో పోల్చి చూసి తను అందంగా లేదని చెప్పే వాళ్ళేవారూ లేరు- ఉండి ఉండి ఏదో గుర్తు చేస్తూ తనని చూసి జాలిపడి పోయేవాళ్ళూ లేరు- హాయిగా వుంది తన ప్రాణం.....
    'ఛ ఏమిటీ కన్నీళ్ళు' అనుకుంటూ  చంపలు వత్తుకుంది. ఇంక పెళ్ళి గిళ్ళీ తల పెట్టకూడదని ఇదివరకే అనుకున్నానుగా -- ఇలాగే హాయిగా వుండి పోతాను-- గతం గుర్తు కొచ్చినప్పుడు ఇలా బాధపడటం కూడా మర్చిపోవాలి.' అనుకుంది ఆగకుండా స్రవిస్తున్న అశ్రువులని అడ్డుకుంటూ -- 'నేను ఆస్పత్రి నుంచి  రాలేకపోతే నా పెట్టెలో వుత్తరం తీసి చూడు .' ఆస్పత్రి కి వెడుతూ అక్కయ్య కన్నీళ్ళ తో నాతొ చెప్పిన ,మాటలు గుర్తు వస్తే ఆ వుత్తరం లో ఏముందో అర్ధం అయిపోతూనే వుంటుంది. అక్కయ్య ఆరాటం నేను అర్ధం చేసుకోగలను కాని అందరికీ లోకువయిపోయానే అని నా బాధంతా........'
    'అమ్మా, మీ కోసం ఎవరో వచ్చారుట.' నరసమ్మ గొంతు తలుపు వెనక నుంచి పలికింది.
    'మళ్ళీ ఎవరు బాబూ' అనుకుంటూ తలుపు తీసి అక్కడే నిలబడి వున్న నరసమ్మ ని చూడి 'ఎవరు?' అంది.
    'నేను చూడలేదమ్మా -- ఎల్లయ్య చెప్పాడు.' అని తన పని తీరిపోయిందన్నట్లు వెళ్ళిపోయింది.
    హడావుడి గా మొహం తుడుచుకుని క్రిందికి వెళ్ళింది సురేఖ.
    సోఫాలో కూర్చుని పేపరు చూస్తున్న వ్యక్తిని చూడగానే ఆమెలో చిరాకంతా ఎగిరిపోయింది.
    'నమస్కారం .' అంది మర్యాదగా.
    'అదేమిటలా వున్నారు. ఒంట్లో బాగుండలేదా?' తలయెత్తి చూసిన మాధవ్ పరీక్షగా ఆమె కళ్ళల్లో కి చూస్తూ అన్నాడు. ఎంత మొహం తుడుచుకుని పౌడరు రాసుకున్నా ఏడ్చి కన్నీళ్లు ఒడ్చిన కళ్ళు, మొహం , ఆమెని పట్టించ్చేశాయి.
    'కాస్త తలనొప్పిగా వుంది- రాత్రి ప్రయాణం లో సరిగ్గా నిద్ర అదీ లేదు. బిడియంగా సర్ది చెప్పేసింది మరో కుర్చీలో కూర్చుంటూ.
    ఈ ఉదయమే వచ్చారా -- నిన్ననే మీ మాట జ్ఞాపకం వచ్చింది- ముందుగా వస్తారో రారో అనిపించింది ....'
    'నిన్న వచ్చుంటేనే బాగుండేది - ఓరోజు రెస్టు తీసుకోటానికి....'
    'ఇవాళే హెవీ వర్కు వుందంటారా...'
    'లేదనుకోండి....' నవ్వేసింది ' శ్యామల ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒంట్లో ఎలా వున్నా తను ప్రక్కన వుంటే సరదాగా వుండేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS